Tags

, , , , , ,

ఎంకెఆర్‌

   నయా వుదారవాదం పౌరుల స్ధానంలో వినియోగదారులను, సమాజాలకు బదులు షాపింగ్‌ మాల్స్‌ను తయారు చేస్తుందని ప్రఖ్యాత సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ చెప్పారు. అంతిమ ఫలితం ఏమంటే నైతికంగా దెబ్బతిని,సామాజికంగా శక్తి కోల్పోయిన పనిలేని వ్యక్తులతో కూడిన సమాజంగా మార్చివేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నయా వుదారవాదం ప్రపంచవ్యాపితంగా నిజమైన ప్రజాస్వామ్యానికి తక్షణ శత్రువు అని కూడా చోమ్‌స్కీ చెప్పారు.

     కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 2016-17 సంవత్సర ఖరీఫ్‌ పంటల మద్దతు ధరలపై ఇప్పటికీ నూటికి 70శాతం వరకు వ్యవసాయంపై ఆధారపడుతున్న, గిట్టుబాటు కాని రైతాంగం నుంచి ఎలాంటి స్పందన వెల్లడి కాకపోవటాన్ని బట్టి మన సమాజాన్ని కూడా నయా వుదారవాద భ్రమలు పట్టి పీడిస్తున్నాయా ? నరేంద్రమోడీ, అనుంగు అనుచరులలో ఒకరైన చంద్రబాబు, అవకాశం దొరక్క దూరంగా వున్న కెసిఆర్‌ వంటి వారిమీద కూడా వున్న భ్రమలతో రైతాంగం కనీస మద్దతు ధరలు ఒక లెక్కా అని లేదా గతంలో ప్రకటించిన ధరలతో ఒరిగిన ప్రయోజనం ఏముందనే నిరాశా నిసృహలతో మనం చేయగలిగిందేమీ లేదన్న నిర్వేదంతో గానీ పెద్దగా స్పందించటం లేదా ? వ్యవసాయం గిట్టుబాటు గాని రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతుండటాన్ని బట్టి ప్రభుత్వాలపై వారిలో విశ్వాసం కలగలేదన్నది మాత్రం స్పష్టం.

     2022వ సంవత్సరానికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామని, వుత్పత్తి ఖర్చుపై 50శాతం ప్రతిఫలం చెల్లిస్తామని నరేంద్రమోడీ అండ్‌కో వాగ్దానం చేసిన విషయాన్ని మోడీ ప్రభుత్వ విజయగానాలతో మునిగి తేలుతున్న వారికి ఇష్టం లేకపోయినా ప్రస్తావించక తప్పదు. యుపిఏ ప్రభుత్వం రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత ఏ గ్రేడ్‌ ధాన్యం కనీస మద్దతు ధర 2009-10 సంవత్సరానికి క్వింటాలు ధర రు.1035లు నిర్ణయించింది, ఆ మొత్తాన్ని 2013-14కు 1345కు పెంచింది. అంటే ఐదు సంవత్సరాలలో 310రూపాయలు లేదా 30శాతం పెంచింది. గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ ఆ మొత్తాన్ని 1345 నుంచి1510కి అంటే 165 దీన్ని శాతంలో చెప్పాల్సి వస్తే 12.26 వుంది. కాంగ్రెస్‌ హయాంలో సగటున ఏటా ఆరుశాతం పెంచితే బిజెపి నాలుగు శాతానికి పరిమితం చేసింది. కాంగ్రెస్‌ స్ధాయికి చేరాలంటేనే రాబోయే రెండు సంవత్సరాలలో 18 శాతం పెంచాలి. మరి తాను చెప్పిన 50శాతం పెంపుదల ఎన్నటికి నెరవేరేను ? ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటమేనా ? ఇక్కడ కాంగ్రెస్‌ పేరును ప్రస్తావించటం అదేదో రైతాంగానికి ఒరగబెట్టిందనే ప్రశంశ కాదు. పోలికకు ఏదో ఒక గీటురాయి వుండాలి, లేదా చేసిన వాగ్దానాన్ని ఆచరణతో అయినా పోల్చాలి. మోడీ సర్కార్‌ తన విజయాలను గత కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్వాకాలతోనే పోల్చుకుంటున్నదనే పచ్చినిజం తెలిసిందే.

    రెండు తెలుగు రాష్ట్రాలలో వరి తరువాత వాణిజ్య పంటలలో ప్రధానమైన పత్తి విషయానికి వస్తే పొడవు పింజ రకాల మద్దతు ధర పైన పేర్కొన్న కాంగ్రెస్‌ కాలంలో మూడు నుంచి నాలుగు వేలకు అంటే 33శాతం పెంచగా మోడీ మూడు సంవత్సరాలలో నాలుగువేల నుంచి 4160కి అంటే నాలుగు శాతం మాత్రమే పెంచారు.అయినా సరే చంద్రబాబు నాయుడికి నవనిర్మాణదీక్ష, మహాసంకల్పం పేరుతో జగన్‌ పారాయణం, కెసిఆర్‌ సైన్యానికి కొత్తగా కోడండరాంపై విమర్శలు తప్ప మరేమీ పట్టటం లేదు. పోనీ ప్రతిపక్షాల సంగతి చూస్తే వాటికీ కనీస మద్దతు ధరలు ఒక అంశంగా కనిపించినట్లు లేదు.

   వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రధానమైనవి. ప్రపంచీకరణ పుణ్యమా అని అవన్నీ బహుళజాతి గుత్త సంస్ధల వ్యాపార సరకులుగా మారిపోయి డాలర్ల ప్రాతిపదికన రేట్లు వసూలు చేస్తున్నారు. అందువలన కొద్దిపాటి తేడాలు తప్ప ప్రపంచంలో ఎక్కడైనా రైతాంగానికి వాటి ధరలు దాదాపు ఒకే విధంగా వుంటాయి. పెట్రోలు, డీజిల్‌ వంటి వాటిని దిగుమతి చేసుకున్న ధర కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో పన్నులు ఎక్కువ విధించిన కారణంగా రైతాంగానికి పెట్టుబడి ఖర్చులు ఇంకా ఎక్కువ వుంటాయి. వస్తువులను యంత్రాలతో తయారు చేసుకోవచ్చు తప్ప ఆహార ధాన్యాలను పండించటం ద్వారా తప్ప యంత్రాల నుంచి తయారు చేసుకొనే పద్దతి ఇంకా రాలేదు. అందువలన ప్రతి ప్రభుత్వం రైతాంగానికి ఏదో ఒక రూపంలో రక్షణ కల్పించటం అనివార్యం. కానీ మన దేశంలో వున్న రక్షణలను తొలగిస్తున్నారు, వ్య వసాయరంగంపై ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించివేస్తున్నారు. అనేక దేశాలలో వుత్పాదకతను పెంచటం ద్వారా ఆయా ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవటంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకు ఆహార ధాన్యాలను అందిస్తున్నాయి. మన దేశంలో పరిస్ధితి అందుకు భిన్నంగా వుంది. కనీస మద్దతు ధరల పెంపు వాస్తవానికి అనుగుణంగా లేదని అంగీకరిస్తూనే అంతకంటే ఎక్కువగా వున్న వినియోగదారుల ప్రయోజనాలను గమనంలో వుంచుకోవాలనే వాదన ముందుకు తెస్తూ రైతాంగాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వానికి వినియోగదారుల బాధ్యత కూడా వున్న మాట నిజమే. వుత్పాదకతను పెంచేందుకు అవసరమైన చర్యలు, పెట్టుబడులకు వినియోగదారులు ఏనాడైనా అభ్యంతరం చెప్పారా, వుత్పాదకత పెరిగితే తమకు ఇంకా తక్కువ ధరలకే ఆహార ధాన్యాలకు దొరికితే వారు సంతోషించరా ?

   అమెరికా వ్యవసాయ శాఖ రూపొందించిన నివేదిక ప్రకారం 2015లో వివిధ దేశాలలో వున్నధాన్య దిగుబడులు హెక్టారు(రెండున్నర ఎకరాలు)కు ఇలా వున్నాయి. పత్తి వివరాలు ఇండెక్స్‌ మండీ నుంచి తీసుకున్నవి. పత్తి దిగుబడులలో ఆస్త్రేలియా 1833,ఇజ్రాయెల్‌ 1633, మెక్సికో 1591, టర్కీ 1559 కిలోలతో తొలి నాలుగు స్ధానాలలో వున్నాయి.

దేశం       ధాన్యం టన్నులు     పత్తి కిలోలు

ఈజిప్టు         8.92                 740

అమెరికా       8.37                 862

చైనా           6.89                1524

బ్రెజిల్‌         5.52                1530

బంగ్లాదేశ్‌      4.40                605

శ్రీలంక        3.96                 218

పాకిస్తాన్‌      3.67                 560

భారత్‌         3.61                517

    మన దేశ రైతాంగం ఇంత తక్కువ దిగుబడులు, పెరుగుతున్న ఖర్చులతో ఎలా తట్టుకోగలదు ? అందువలన విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు ఎన్నో రాయితీలు ఇస్తూ ఎర్రతివాచీ పరుస్తున్న ప్రభుత్వాలు మన వ్యవసాయం స్వయం సమృద్ధం కావాలన్నా, ఎగుమతులు చేసి విదేశీ మారక ద్రవ్యం సంపాదించాలన్నా వ్యవసాయానికి మద్దతు,పెట్టుబడులు మినహా మరో మార్గం లేదు.

    2012,13 సంవత్సరాలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ధాన్యం క్వింటాలు రు. 1900పైగా పలికిన సమయంలో మన ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రు.1080 మాత్రమే. ఎగుడుదు దిగుడులు వున్నప్పటికీ అంతర్జాతీయ ధరలు మన కనీస మద్దతు ధరల కంటే ఎప్పుడూ ఎక్కువే వుంటున్నాయి. ఎగుమతులు చేయాలంటే మనతో పోటీ పడే వారికంటే తక్కువ ధరకు అమ్మాలి కను మద్దతు ధరలను తక్కువగా వుంచుతున్నారు. అందుకోసం మన రైతాంగాన్ని బలిపెట్టాల్సిన అవసరం ఏముంది?

     ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించకుండా మన వ్యవసాయ ఖర్చుల, ధరల కమిషన్‌ కొన్ని చిట్కాలను రైతుల ముందుంచుతున్నది. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మరింత యాంత్రీకరణ చేయమని చెబుతున్నది. మన దేశంలో ఏటేటా యంత్రాల వినియోగం పెరుగుతూనే వుంది. అదే సమయంలో ప్రతి ఏటా మద్దతు ధరలు, మార్కెట్‌ ధరలు రైతాంగానికి న్యాయం చేయటం లేదన్న సంగతి తెలిసిందే. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో మన కంటే ఎంతో ఎక్కువగా యంత్రాలను ప్రవేశపెట్టినా రైతాంగానికి గిట్టుబాటు గాక అనేక రాయితీలు కల్పిస్తున్న విషయాన్ని గమనించాలి. రెండవది సామాజిక కోణం వైపు నుంచి చూసినపుడు వ్యవసాయంలో యంత్రాలు ప్రవేశ పెట్టటం అంటే వ్యవసాయ కార్మికులకు దొరుకుతున్న పని రోజుల సంఖ్య తగ్గిపోవటమే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో వుపాధి హామీ పనులకు డిమాండ్‌ పెరిగింది. ఈ పధకం వచ్చినప్పటి నుంచి తమకు చౌక ధరలకు దొరికే కూలీలు కరువుయ్యారని భూస్వాములు, ధనిక రైతులు దానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయం తెలిసిందే. వారి వత్తిడి మేరకు అనేక చోట్ల ఆ పధకంలో ఇప్పుడు యంత్రాలను అనుమతిస్తూ గ్రామీణ ప్రాంతాలలో యంత్రాల యజమానుల లాభాల, ఆదాయ హామీ పధకంగా మార్చివేశారు.

     పత్తి రైతులు మన దేశంలో ఎంత దుస్థితిలో వున్నారో తెలిసిందే. చైనా ఎలా ఆదుకుంటున్నదో చూద్దాం. అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ(ఐసిఎసి) 2015 డిసెంబరులో ప్రకటించిన నివేదిక ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. దిగుమతి మొత్తాలు, విలువలను అదుపు చేయటం ద్వారా చైనా పత్తి వుత్పత్తిదారులకు మద్దతు ఇస్తున్నది. దిగుమతి కోటా పరిధిలోని పత్తి దిగుమతులపై 40శాతం పన్నులు విధిస్తున్నది.దీనికి తోడు పెద్ద ఎత్తున నిల్వలను నిర్వహిస్తున్నది. 2011-14 సంవత్సరాలలో చైనా అనుసరించిన పత్తి విధానం ప్రకారం కనీస మద్దతు ధరలను చెల్లించి పత్తి కొనుగోలు చేసింది.2013-14లో మద్దతు సేకరణ సగటున టన్ను 20,400 యువాన్లు లేదా పౌను అరకిలో దూది ధర 151 సెంట్ల చొప్పున 63లక్షల టన్నులు కొనుగోలు చేసింది. తరువాత విధానాన్ని మార్చింది. 2014-15లో టన్ను ధర లక్ష్యంగా 19,800 యువాన్లు లేదా పౌను 146 సెంట్లుగా నిర్ణయించింది. రైతులు ఇంతకంటే తక్కువకు అమ్ముకున్నట్లయితే ప్రభుత్వం ఆ తేడా మొత్తాన్ని రైతులకు నేరుగా చెల్లించే ఏర్పాటు చేసింది. పిల్లి నల్లదా తెల్లదా అని గాక అది ఎలుకను పడుతుందా లేదా అని చూడాలన్న సామెత మాదిరి పద్దతులు ఎన్ని మార్చినా అవి రైతాంగానికి ఏమేరకు వుపయోగపడ్డాయన్నది ముఖ్యం. ఆ విధంగా చూసినపుడు 2014-15లో గరిష్టంగా 8.2 బిలియన్‌ డాలర్ల మేరకు రైతులకు పలు రూపాలలో సబ్సిడీ అందించింది. అంతకు ముందు సంవత్సరం కంటే రెండు బిలియన్‌ డాలర్లు ఎక్కువ. మరి మన దేశంలో ఏం జరుగుతోంది. ఏదో ఒక పేరుతో ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంటోంది. సబ్సిడీలను ఎత్తివేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో వాగ్దానం చేసి వచ్చింది. రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామంటే నమ్మేదెలా ?