Tags

, , , , ,

ఎంకెఆర్‌

      నక్సల్స్‌, పోలీసులు జరిపే హింసను ఎలా అర్ధం చేసుకోవాలి? అన్నది ఒక చర్చ. ఇదేమీ కొత్తది కాదు, ఇంతటితో ఆగేది కాదు. అందువలన చర్చ కూడా నిరంతరం జరగాల్సిందే. నక్సల్స్‌ జరిపే హింసను సాధారణానికి భిన్నంగా లేదా మరో కోణం నుంచి అర్ధం చేసుకోవాలి అనే అభిప్రాయం సామాజిక మాధ్యమాలలో కొందరు వ్యక్తం చేస్తున్నారు.ముద్రణ, ఎలక్ట్రానిక్‌ ప్రసార మాధ్యమాలలో కూడా అలాంటి అభిప్రాయం ఎవరైనా వ్యక్తం చేస్తూ వుండవచ్చు.ఏ అంశం గురించి అయినా మంచీ చెడుల చర్చ జరగాలి. ఎవరి వాదనలు వారు వివరించుకోవచ్చు, అంతిమంగా తామే అభిప్రాయం వైపు వుండాలో లేదా చర్చనుంచి తలెత్తిన అంశాలతో తమదైన స్వంత అభిప్రాయం ఏర్పరచుకోవాలా అన్నది పాఠకులకు వున్న స్వేచ్ఛ. ఈ పరిమితుల పూర్వరంగంలో సామాజిక మీడియాలో వెల్లడైన కొన్ని అంశాలపై స్పందనగా దీన్ని పరిగణించాలని మనవి.

    ‘ప్రజాస్వామ్యంలో ఒక కీలక వైఫల్యం ఏమిటంటే సామాన్యుల అవసరాలను తీర్చకపోవటం, ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్ధ కేవలం ధనికులకు మాత్రమే సేవ చేస్తే సాధారణ జనం తిరగబడతారు. అక్రమంలో జరిగే హింసను మనం క్షమించనప్పటికీ ఇలాంటి జనం తమ హక్కుల కోసం తిరుగుబాటు చేయటాన్ని మనం అర్ధం చేసుకోవాలి’ ఇది ఒక అభిప్రాయం. ఇది తరతరాలుగా ఏదో రూపంలో జరుగుతున్నదే. సామూహికంగా జనం తిరగబడి మౌలిక మార్పులకు కారణం అయితేనే అది విప్లవం అవుతుంది. విప్లవం పేరుతో చేసే ప్రతి చర్య విప్లవ చర్య కాదు. చాలా మంది ‘అర్ధం’ చేసుకోవాలనే పేరుతో నక్సల్స్‌ జరిపే హింసను ఏదో ఒక రూపంలో సమర్ధిస్తున్నారు. అది వారిష్టం, దానితో అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. అయితే అదే సమయంలో ఆ చర్యలను విమర్శించే హక్కు ఇతరులకు వుంటుంది అని సమర్ధించేవారు గుర్తించాలి. సమాజంలో సామాన్యులు లేదా జనం పేరుతో చాలా జరుగుతున్నాయి. వాటిలో తాజాగా మనకు కళ్లకు కట్టినట్లు కనిపించేవి పార్టీల ఫిరాయింపులు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే, విరుద్ధ చర్య కూడా అయినా జనం పేరుతో దాన్ని సమర్ధించుకుంటున్నారు. మరోవైపు ప్రజా కోర్టుల పేరుతో సాయుధ ముఠాలు జరిపే దురంతాలు కూడా జనం పేరుతోనే జరుగుతున్నాయి. ఎవరినైనా ఒకరిని చంపి జనాగ్రహానికి బలయ్యాడని ప్రకటిస్తే సరిపోతుందా ? సరిగ్గా ఇదే మాదిరి పోలీసులు కూడా ఎక్కడో ఒకదగ్గర నక్సల్స్‌ను పట్టుకొని ఒక చోటకు తెచ్చి కాల్చి చంపి,ఆ స్థలంలో నాలుగు కమ్యూనిస్టు సాహిత్య పుస్తకాలను పడవేసి ఎన్‌ కౌంటర్‌ అని చెబుతున్నారు. ఇలాంటి వన్నీ దారితప్పిన వారు చేసే సమర్ధనీయం కాని పనులు.

     స్వాతంత్య్ర వుద్యమంలో కూడా నక్సల్స్‌ మాదిరి భారతీయులు విప్లవ పద్దతులలో పోరాడారు కనుక నక్సల్స్‌ చర్యలను తప్పు పట్టకూడదు, వారి చర్యల వలన వుపయోగం లేకపోయినప్పటికీ వాటిని వృధా అనకూడదు, ప్రజల కోసం జరుగుతున్న ఒక వుద్యమంగా పరిగణించాలి అని కొందరు భావిస్తున్నారు. అనేక దేశాలలో వలస లేదా దోపిడీదారులకు వ్యతిరేకంగా జనంతో సంబంధం లేకుండా తామే కొన్ని చర్యలు జరపటం లేదా ఆత్మబలిదానం చేయటం ప్రతి దేశంలోనూ జరిగింది.అది ఒక దశ, దాని వివరాలలోకి పోవటం ఇక్కడ సాధ్యం కాదు. వారి త్యాగాన్ని తక్కువ చేయకూడదు. కానీ అలాంటి చర్యలు ఫలితాలను ఇవ్వవు అని కూడా ప్రపంచం పాఠాలు నేర్చుకుంది.1848లో కమ్యూనిస్టు ప్రణాళికను ప్రకటించిన తరువాత ఒక ఏడాది కాలంలోనే నాటి కమ్యూనిస్టు లీగ్‌లో కొందరు వెంటనే తుపాకులు పట్టాలని పిలుపునిచ్చారు. ఒక చోట మంట అంటిస్తే ఐరోపా అంతటా పాకుతుందని చేసిన వాదనను నాడే మార్క్స్‌, ఎంగెల్స్‌ వ్యతిరేకించారు. సన్నాహాలు లేని ఈ దుందుడుకు వాదం కమ్యూనిస్టు లీగ్‌కు ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని, పాలకులు, మితవాద ముఠాలు కమ్యూనిస్టులను తీవ్రంగా అణచివేస్తాయని హెచ్చరించారు. లెనిన్‌ అన్న అలెగ్జాండర్‌ స్వయంగా అలాంటి భావాలున్న వున్నత విద్యావంతుడైన విప్లవకారుడు. జారు చక్రవర్తి మూడవ అలెగ్జాండర్‌ను హతమార్చటం ద్వారా జారు సామ్రాజ్యాన్ని కూల్చివేయవచ్చని భావించి అందుకు పధకం వేసి బాంబులు తయారు చేస్తూ దొరికి పోయారు. జారు చక్రవర్తి ఆయనతో పాటు మరొక ఐదుగురికి మరణ శిక్ష విధించారు. ఆ వార్త విన్న లెనిన్‌ తాపీగా జారు చక్రవర్తిని కూల్చటానికి వేరే మార్గం వుందని వ్యాఖ్యానించారు. తరువాత చరిత్ర ఏమిటో తెలిసిందే. అయినా కొంత మంది దానిని పరిగణనలోకి తీసుకోకుండా అలాంటి పనులకు పాల్పడుతున్నారు.

    వ్యక్తిగత హింసావాద, దుందుడుకు పద్దతులను మార్క్సిజం-లెనినిజం ఎన్నడో తిరస్కరించింది. అది మార్గం కాదని చెప్పింది. స్వాతంత్య్ర వుద్యమంలో అనేక మంది వ్యక్తిగత హింసావాద పద్దతులలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారు తమ అనుభవంలో అది సరైంది కాదని గ్రహించి ప్రజా వుద్యమాల బాట పట్టారు.ఆ అనుభవాన్ని విస్మరించి వారి పద్దతులలోనే నక్సల్స్‌ పోరాడుతున్నారని అంటే అర్ధం లేదు. స్వాతంత్య్ర వుద్యమ పోరాట వీరులు తమ ఆయుధాలను బ్రిటీష్‌ వారికి, లేదా వారితో చేతులు కలిపిన వారికి మాత్రమే వ్యతిరేకంగా ఎక్కు పెట్టారు. నక్సల్స్‌ మాదిరి తమతో విబేధించిన వారందరికీ మితవాదులని ముద్రవేసి, మితవాదులు విప్లవానికి ద్రోహులు కనుక వారిని కూడా హతమార్చాలనే పేరుతో వర్గశత్రువుతో సమంగా ఇతర నక్సల్‌ గ్రూపులు, సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలను కూడా హతమార్చిన వుదంతాలు ఎన్నో. అందువలన స్వాతంత్య్ర వుద్యమకాలంలో వ్యక్తిగత సాయుధ విప్లవకారులతో నక్సల్స్‌ను పోల్చటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు.

    వుపయోగం లేకపోయినా నక్సల్స్‌ వుద్యమం కూడా ప్రజా వుద్యమమే కదా. సమర్ధిస్తే తప్పేమిటి అని వాదించే వారికి చెప్పేదేమీ లేదు. మార్క్సిజం-లెనినిజం పిడివాదం కాదు, సంస్కరించటానికి వీల్లేని మనువాదమూ కాదు.అదొక శాస్త్రం. మారిన పరిస్థితులకు అనుగుణంగా దానిని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సి వుంది. ప్రపంచంలో అనేక దేశాలలో తుపాకులు పట్టి విప్లవకారులమని ప్రకటించుకున్న వారిచర్యల నుంచి తుపాకి గొట్టం నుంచి పొగతప్ప ఎక్కడా విప్లవం రాలేదు. నేపాల్‌లో కూడా ఆయుధాలు పట్టిన మావోయిస్టులు వాటిని వదలి పెట్టి ఓట్లతో అధికారానికి వచ్చారు తప్ప తుపాకులతో కాదు. ఐదు దశాబ్దాల విఫల అనుభవం తరువాత కూడా మేం పద్దతి మార్చుకోం అంటే దాని వలన ప్రజా వుద్యమాలకు నష్టం. అందువలన వుపయోగం లేని నక్సల్స్‌ చర్యలను సమర్ధించటం అంటే వారిని మరింతగా చెడగొట్టటం, మరోరకంగా ప్రజావుద్యమాలకు నష్టం కలిగించటం తప్ప మరొకటి కాదు.

   ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది, ఓకే నక్సల్స్‌ విఫలమయ్యారు, ఇతర కమ్యూనిస్టులు ఎందుకు ముందుకు పోలేకపోతున్నారు? వున్న పునాదిని కూడా ఎందుకు పోగొట్టుకుంటున్నారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలు వేసే వారు స్థూలంగా రెండు రకాలు. ఒకటి కమ్యూనిస్టు వ్యతిరే తరగతి. వారు గత పాతిక సంవత్సరాలుగా విందులు చేసుకుంటున్నారు. రెండు కమ్యూనిస్టు వుద్యమ వెనుకపట్టు పట్టటం గురించి ఆవేదన చెందేవారు. ఇవేమీ సమాధానం చెప్పలేని అపూర్వ చింతామణి ప్రశ్నలు కావు. కమ్యూనిస్టులు పుట్టక ముందే సమాజంలో దోపిడీ, అన్యాయాల గురించి అనేక మంది చెప్పారా లేదా ? చెప్పారు. కమ్యూనిస్టులు పుట్టిన తరువాత కూడా దోపిడీ గురించి వారితో పాటు ఇతరులు కూడా చెబుతున్నారా లేదా ? చెబుతున్నారు. తత్వవేత్తలు ప్రపంచం గురించి కేవలం భాష్యాలు మాత్రమే చెప్పారు, సమస్య దాన్ని మార్చటం ఎలా అన్నదే అనే ప్రశ్న లేవనెత్తిన కారల్‌ మార్క్స్‌ అంతటితో వూరుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రతిపాదించారు.ప్రపంచ చరిత్ర, దోపిడీదారుల చరిత్ర, అనుభవాలతో పోల్చితే కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా బాల్యంలోనే వున్నట్లు. నడక నేర్చుకొనే క్రమంలో కొన్ని తప్పటడుగులు వేయటం సహజం. ఇప్పుడు అదే పరిస్థితిలో వుంది. కమ్యూనిస్టు సిద్దాంతం వెలుగులోకి వచ్చిన వెంటనే కార్మికవర్గం దానిని తమ పాలిట వరంగా భావించి వెంటనే ఆదరించలేదు. కానీ పెట్టుబడిదారులు మాత్రం కంసుడి మాదిరి పుట్టిన వెంటనే నలిపి చంపివేయటానికి ప్రయత్నించారు. అందుకే మార్క్స్‌ జర్మనీ వదలి ప్రవాసం వెళ్లాల్సి వచ్చింది. లండన్‌లో వున్న సమయంలో మారు పేర్లతో గడపాల్సి వచ్చింది. చివరికి ఏ దేశ పౌరసత్వం లేకుండా మరణించాల్సి వచ్చింది. ఆయన అంత్యక్రియలకు వచ్చిన వారు ఎంగెల్స్‌తో కలిపి పది, పదకొండు మంది మాత్రమే.

     వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే కమ్యూనిస్టులు ఒక్కరంటే ఒక్కరు వున్నా ఇలాగే చెబుతారు అని కొట్టి పారవేస్తారు. అలాంటి వారికి ఒకటే సూటి ప్రశ్న. దోపిడీ అనేది పోవాలా వద్దా, సమానత్వం రావాలా వద్దా? రావాలంటే కమ్యూనిజం కంటే మెరుగైన మార్గం ఏమిటో చెప్పండి. దానిలో లోపాలుంటే విమర్శించండి లేదూ అంతకంటే మెరుగైన సిద్దాంతాన్ని ముందుకు తెచ్చి జనం చేత ఆమోదింపచేయండి. లేదూ అలాంటిది ఇంకా తయారు కాలేదు అంటే అప్పటి వరకు కమ్యూనిస్టు సిద్దాంతం,ఆచరణను మెరుగు పరచి ముందుకు తీసుకుపోవటం తప్ప మరొక మార్గం ఏదైనా వుందా ? అవన్నీ మాకు తెలియదు కమ్యూనిజం పనికిరాదు అంతే అని మొండిగా వాదిస్తే చేసేదేమీ లేదు.

    ఈ రోజు ప్రపంచంలో సోషలిస్టులు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు, ప్రజాతంత్రవాదులు, మానవతా వాదులు అందరికీ ముంచుకు వస్తున్న ముప్పు నయావుదారవాదం.ఈ పరిణామానికి తోడు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవ్యస్ధలను కూల్చివేయటంలో సామ్రాజ్యవాదం జయప్రదమైంది. కమ్యూనిజానికి కాలం చెల్లిందనే ఒక సైద్దాంతిక దాడి పెద్ద ఎత్తున జరుగుతున్నది. ప్రఖ్యాత సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ చెప్పినట్లు నయా వుదారవాదం పౌరుల స్ధానంలో వినియోగదారులను, సమాజాలకు బదులు షాపింగ్‌ మాల్స్‌ను తయారు చేస్తున్నది. అంతిమ ఫలితం ఏమంటే నైతికంగా దెబ్బతిని,సామాజికంగా శక్తి కోల్పోయిన పనిలేని వ్యక్తులతో కూడిన సమాజంగా మార్చివేస్తున్నది. అలాంటి సమాజానికి నేడు కమ్యూనిజం ఆకర్షణీయంగా కనిపించదు. పెట్టుబడిదారీ విధానంలోనే అంతర్గత వైరుధ్యాలు వున్నాయి. అది దోపిడీతో పాటు తనను నాశనం చేసే సైన్యాన్ని కూడా తయారు చేస్తుంది.కాకపోతే సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానం రూపం మార్చుకొని ద్రవ్య పెట్టుబడిదారీ విధానంగా తయారైంది. దానితో పాటు దోపిడీ తీవ్రత కూడా పెరిగింది. శతకోటీశ్వరుల సంఖ్య ప్రతి దేశంలో శరవేగంగా పెరగటమే అందుకు నిదర్శనం. ప్రపంచంలో వలస వాదానికి వ్యతిరేకంగా వుద్యమాలు వూపందుకోవటానికి వందల సంవత్సరాలు పట్టింది. అలాంటిది నయావుదారవాదం అనే సరికొత్త వలస వాదాన్ని ఎదుర్కొవటానికి అంత సమయం అవసరం లేదు. అందువలన దోపిడీని వ్యతిరేకించే, దోపిడీ లేని ప్రత్నాయమ్నాయ సమాజం కోరుకొనే వారెవరైనా ఎవరి సైద్దాంతిక భావాలను వారు వుంచుకొని నయా వుదారవాదానికి వ్యతిరేకంగా పోరాడటం అవసరం.వలస వాదానికి ఏ దేశానికి ఆదేశంలో వుద్యమాలు నడిస్తే సరిపోయింది. నయా వుదారవాదం ప్రపంచీకరణతో దాడి చేస్తోంది. అందువలన దానిపై పోరాటం కూడా ప్రపంచ స్ధాయిలో జరగాల్సిందే.