Tags

, , , , ,

కమ్యూనిస్టు వ్యతిరేకుల వత్తిళ్లకు లొంగవద్దు,

ఎం కోటేశ్వరరావు

స్థలం ఇండోనేషియా రాజధాని జకర్తా నగరం !

సమయం 2016 జూన్‌ రెండవ తేదీ !!

      సందర్భం కమ్యూనిజం నుంచి దేశాన్ని కాపాడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేకుల సభ రెండవ రోజు కొనసాగింపు !!!

    ఆ సభ ప్రాంగణం దగ్గరకు వచ్చారు కొందరు క్రైస్తవ విద్యార్ధులు. కుక్క మనిషిని కరవటం సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే వార్త. ప్రపంచంలో కమ్యూనిస్టుల కార్యకలాపాలు, అందులో భాగంగా సభలు సమావేశాలు సాధారణం. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడండని సభ పెట్టటమే వార్త. ఆ సభకు వచ్చిన క్రైస్తవ యువకులు సభ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో శిలువ గుర్తు కూడా వుంది. ఆ చిహ్నాన్ని వుపయోగించుకోవటం పట్ల తమకు అభ్యంతరం వుందంటూ తమ నిరసనను వారు నిర్వాహకుల ముందు వెల్లడించారు.

     ఇంకేముంది జర్నలిస్టులకు అదొక మిర్చి మసాలా ! మిరప చిన్నదా పెద్దదా అని కాదు అన్నయా అది కారంగా వుందా లేదా అన్నదే పాయింటు అన్నట్లుగా అది చాలా హాట్‌గా వుంటుంది కదా !! మూడుపదులు దాటిన ఒక మహిళా జర్నలిస్టు ఆ విద్యార్ధులను పక్కకు పిలిచి మీ అభ్యంతరం ఏమిటని వారితో మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో తెల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు. దుర్వాసుడికి దూరపు బంధువులా వుంది ముఖం. వస్తూనే ఈమె ఫెబ్రియానా ఫిర్దౌస్‌ , తప్పుడు వార్తలు రాస్తుంటుంది.ఆమెతో మాట్లాడకండి అంటూ వాదులాటకు దిగాడు.ఇంతలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా వున్న మరో తలపాగా వాలా వస్తూనే ఈ వార్త కనుక అచ్చయిందో, నీ ఫొటో, వివరాలన్నీ మా దగ్గర వున్నాయి, జైల్లో తోయిస్తాం జాగ్రత్త అంటూ బెదిరింపులకు దిగాడు. ఇస్లాం రక్షణ సంఘటన, దేశ రక్షణ వుద్యమం పేరుతో వున్న సంస్ధలకు చెందిన వారు ఈ వ్యక్తులు.

    అసలే కోతి, ఆపైన కల్లుతాగింది అన్నట్లుగా రెండు తలపాగాలూ పెద్దగా రంకెలు వేస్తూ వుండటంతో అసలే ఎరుపు భయంతో వున్న సభికులు తాము మట్టుబెట్టిన లక్షలాది మంది కమ్యూనిస్టులలో ఎవరైనా భూతంగా ఆ సభకు వచ్చిందేమో అని భయపడ్డారో లేక భ్రమపడ్డారో గాని అనేక మంది అక్కడకు చేరుకున్నారు. ఇంకే ముంది . ఆ రెండు పత్రికల వార్తలను పట్టించుకోకూడదని వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ పత్రిక, ఛానల్‌ వారు తమ వార్తలను కవర్‌ చేయవద్దని చంద్రబాబు నాయుడు ఆగ్రహించినట్లుగా ఫెబ్రియానా రాసే వార్తలు మాకు అవసరం లేదు, అసలు ఆమెను మేం పిలవలేదు, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు ఆమె మీదకు వెళ్లారు.జాగ్రత్త మన మహిళల్లో కొందరు నకిలీ ముస్లింలు బురఖాలు వేసుకొని వస్తారు, నిజానికి వారు కమ్యూనిస్టు తొత్తులు, బురఖాలతో మోసం చేయవద్దు అంటూ వీరంగం వేశారు. వున్మాదంతో వున్న జనం, విచక్షణ జ్ఞానం వుండదు వారికి వివరించినా ప్రయోజనం శూన్యం అని గ్రహించి ఆ ప్రాంగణం నుంచి ఆమె నిష్క్రమించారు. ఆ తరువాత ఆమె అంతం చూస్తామంటూ సామాజిక మీడియాలో మతశక్తులు బెదిరింపులు ప్రారంభించాయి.

AJI Condemns Intimidation against Journalist

     ఫెబ్రియానా ఫిర్దౌస్‌ గురించి ఇంక పరిచయం అవసరం లేదేమో ! ఇండోనేషియాలో వున్న తాజా పరిస్థితికి ఆ వుదంతం అద్దం పట్టింది. ఇంతకూ ఆమె చేసిన అపరాధం ఏమిటి ? నియంత సుహార్తో నాయకత్వంలో అమెరికా కుట్ర ప్రకారం మిలిటరీ, పారా మిలిటరీ, రజాకార్ల వంటి మతోన్మాద గూండాలను తయారు చేసి దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను హతమార్చిన దారుణ మారణం కాండ గురించి ఆ నియంత మరణించిన వచ్చిన కొద్దిపాటి వెసులు బాటును వుపయోగించుకొని బుద్ధి జీవులు ఆ దారుణాల గురించి మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు. అది క్రమంగా వూపందుకొని ఆ దారుణాలపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని, ప్రభుత్వం హత్యాకాండపట్ల క్షమాపణ చెప్పాలని తదితర డిమాండ్లు ముందుకు వచ్చాయి. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు తాము ప్రజాస్వామ్యయుతంగా వున్నామని జనం ముందు ప్రదర్శించుకోవాలి కదా ? కొంత మంది అభిప్రాయం ప్రకారం పాలకులకు ఇష్టం లేకపోయినా పెరుగుతున్న వత్తిడిని తట్టుకోలేక, ఏదో ఒక పేరుతో ఆ చర్చకు తెరదించాలనే లక్ష్యంతో కొద్ది వారాల క్రితం ఇండోనేషియా ప్రభుత్వం 1965నాటి వూచకోతపై ఒక సెమినార్‌ను ఏర్పాటు చేసింది. ఆచరణలో గతంలో మాదిరే ప్రస్తుత ప్రభుత్వం కూడా కమ్యూనిస్టు భావజాలం, పదజాలం వున్న కళారూపాలు, డాక్యుమెంటరీలు, పాటలను కూడా నిషేధించారు.కేసులను నమోదు చేశారు. అంతకు ముందున్న పరిస్ధితికి వర్తమానానికి తేడా లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

    అయినప్పటికీ దేశంలోని నిరంకుశ, మతశక్తులు గగ్గోలు ప్రారంభించాయి.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని తిరిగి ఇండోనేషియాలో వ్యాపింప చేయాలనే వారు ప్రభుత్వ సదస్సు వెనుక వున్నారని కొందరు, అసలు ప్రభుత్వంలోనే కమ్యూనిస్టులున్నారని మరి కొందరు, ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందని, వచ్చే ఏడాది లాంఛనంగా ప్రకటన చేయనున్నారని ఇలా రకరకాల ప్రచారాలు ప్రారంభించారు. వీటిలో వాస్తవాలు ఎంత వరకు అన్నది చెప్పలేము గాని 1965 మారణకాండ గురించి జనానికి నిజాలు చెప్పాలన్న ప్రజాతంత్ర డిమాండ్‌ మాత్రం నానాటికీ అక్కడ పెరుగుతోందన్నది స్పష్టం.

     ఈ పూర్వరంగంలోనే కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు, నాటి మారణకాండలో భాగస్వామ్యులైన మాజీ సైనికాధికారులు, వారితో చేతులు కలిపిన మతోన్మాద శక్తులు, సంస్ధలు, కమ్యూనిస్టు వ్యతిరేకులు కలిసి ప్రభుత్వం పెట్టినదానికి పోటీ సదస్సును పెట్టి కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని, గతంలో జరిగినదానిపై ఎలాంటి క్షమాపణ చెప్పటం, విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ తీర్మానించారు. దాని గురించి విమర్శనాత్మకంగా వార్తలు,వ్యాఖ్యలు రాయటమే ఫెబ్రియానా చేసిన పని. అంతకు ముందు కూడా కమ్యూ నిస్టులు, సానుభూతిపరులు అన్న అనుమానం వున్న కళాకారులు, రచయితల సభలు,సమావేవాలపై కూడా ప్రస్తుత ప్రభుత్వ అధికార యంత్రాంగం తీసుకున్న నిషేధ చర్యలు మొదలైన వాటి గురించి కూడా ఆమె విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె పేరు ఎత్తితేనే కమ్యూ నిస్టు వ్యతిరేకులు, మతశక్తులు మండి పడుతున్నాయి. భౌతిక దాడులకు ప్రయత్నించటంతో ఆమె ప్రస్తుతం అజ్ఞాతవాసంలో వున్నట్లు వార్తలు వచ్చాయి.

     ఒక్క ఫెబ్రియానా గురించే కాదు, ఇండోనేషియాలో పత్రికా స్వాతంత్య్రం గురించి అనేక మంది తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నిస్తున్నారు. ఫెబ్రియానాకు బెదిరింపుల గురించి జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.జర్నలిస్టుల విధి నిర్వహణను అడ్డుకొనే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా అక్కడి కరెన్సీలో 50 కోట్ల రుపయాల( 34,500 డాలర్లకు సమానం) జరిమానా విధించవచ్చు.తమ జర్నలిస్టును సభ నుంచి గెంటివేయటం అక్రమం అని ఫెబ్రియానా ఒక సంపాదకురాలిగా పనిచేస్తున్న రాప్లర్‌ డాట్‌ కాం యాజమాన్యం ఒక ప్రకటనలో ఖండించింది.ఆగ్నేయాసియా ప్రెస్‌ అలయన్స్‌ ఇండోనేషియా ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాసింది.ఇండోనేషియా ఇండిపెండెంట్‌ జర్నలిస్టు అలయన్స్‌ ఫెబ్రియానా రక్షణకు చర్యలు తీసుకుంది.ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించింది.