Tags

, , , , , , , ,

160614_ID_IlhamAidit-1000.jpg

ఎంకెఆర్‌

   తండ్రి, ఆ నాటికి ప్రపంచంలో మూడవ పెద్ద కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు. అప్పటికి అతని వయస్సు 43 సంవత్సరాలే. కుట్ర చేసి సైనిక నియంతలు, వారి తాబేదార్లు కలిసి ఆయనను హత్యచేసిన సమయంలో కేవలం ఆరు సంవత్సరాల వయస్సున్న పసివాడతను. ఐదులక్షల మందికిపైగా కమ్యూనిస్టులు, అభిమానులుగా అనుమానించిన వారిని హతమార్చి, అంతకంటే ఎక్కువ సంఖ్యలో జైళ్లలో కుక్కిన సమయంలో మిగిలిన ఆ కుటుంబం ఎలాగో తప్పించుకుంది. తరువాత ఆ బాలుడు స్కూలుకు వెళితే ప్రతి రోజూ కమ్యూనిస్టు అంటూ సహాధ్యాయులు తిట్టేవారు. తొలి రోజుల్లో తట్టుకోలేకపోయినా తరువాత చలించలేదు, నా తండ్రిని ఎందుకు చంపారు, ఆయన నమ్మిన కమ్యూనిజాన్ని అంతగా ఎందుకు ద్వేషిస్తున్నారు? అసలు కమ్యూనిజం అంటే ఏమిటి అని ఆ చిన్న వయసులోనే, ఆ చీకటి రోజుల్లోనే అతని మనస్సులో జిజ్ఞాస మొదలైంది.నియంతల చీకటి పాలనలోనే మానవాళికే వెలుగునిచ్చే మార్క్సిజం గురించి తెలుసుకున్నాడు. ఇపుడు యాభై ఆరు సంవత్సరాల వయసులో తాను మార్క్సిస్టును అని సగర్వంగా చెబుతున్నాడు.అతడెవరో కాదు, నిషేధానికి గురైన ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ చివరి అధ్యక్షుడు దీపా నౌసంత్ర అయిదిత్‌ (డిఎన్‌ అయిదిత్‌ గా ప్రపంచానికి సుపరిచితం) కుమారుడు, ఆర్కిటెక్షర్‌గా పనిచేస్తున్న ఇలహమ్‌ అయిదిత్‌.

   యాభై సంవత్సరాల నాడు జరిగిన మారణకాండ గురించి విచారణ జరపాలని, దోషులను శిక్షించాలని, నాటి నిజానిజాలేమిటో వెల్లడించాలన్న డిమాండ్‌ రోజు రోజుకూ పెరిగిపోతోంది.ఈ పూర్వరంగంలో గాయాలను మాన్పే పేరుతో ప్రభుత్వమే రెండు రోజుల పాటు అధికారికంగా ఒక సదస్సు నిర్వహించింది. దానికి పోటీగా నాటి మారణకాండలో పాల్గొన్నవారు, వారి మద్దతుదారులు జూన్‌ ఒకటి రెండు తేదీలలో విచారణకు వ్యతిరేకంగా ఒక సదస్సు జరిపారు. ఈ పూర్వరంగంలో 1965-66 సంవత్సరాలలో జరిపిన మారణ కాండకు ప్రభుత్వం క్షమాపణ చెబుతుందా, దోషులపై విచారణ జరుపుతుందా, బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తుందా అన్నది ప్రస్తుతం ఇండోనేషియాలో చర్చగా వుంది. ఇండోనేషియాలో ప్రస్తుతం పౌరపాలనే నడుస్తున్నప్పటికీ అదెంతో బలహీనంగా వుంది. అధికారంలో వున్నవారి ఆదేశాలను వక్రీకరించి తమ అజెండాను అమలు జరిపేందుకు మిలిటరీ, పోలీసు వ్యవస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికీ కమ్యూనిజంపై నిషేధం కొనసాగటాన్ని అవకాశంగా తీసుకొని అభ్యుదయ లేదా ప్రశ్నించే ప్రతి వారినీ కమ్యూనిస్టు అని చివరకు ఎర్రచొక్కా వేసుకున్న ప్రతివారూ కమ్యూనిస్టులే అని సూత్రీకరించి టీషర్టులను అమ్మేవారిని కూడా కమ్యూనిస్టు ప్రచారకులుగా చిత్రించి అరెస్టు చేసిన విపరీత పరిస్ధితి అక్కడ వుంది. చివరకు అధ్యక్షుడు జోకోవియే స్వయంగా యంత్రాంగం అతిగా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఇప్పటికీ గ్రామాల వరకు మిలిటరీ వ్యవస్ధ వేళ్లూనుకొని వుంది. అయినా వచ్చిన కాస్త వెసులుబాటును వుపయోగించుకొని అభ్యుదయ వాదులు, మానవ హక్కుల కార్యకర్తలు కమ్యూనిస్టు వ్యతిరేక దమనకాండ వాస్తవాలను బయట పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇలహమ్‌ అయిదిత్‌తో రంజాన్‌ మాసం ప్రారంభమైన కొద్ది రోజుల క్రితం బేనార్‌ స్యూస్‌ జరిపిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలేమిటో చదవండి మరి.

ప్రభుత్వం మీద మీరు విశ్వాసం కోల్పోయారా ?

నేను ఆశావాదిని కాదు, కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఈ అంశంలో జోకోవి( దేశ అధ్యక్షుడు) ప్రభావం చూపవచ్చు, ఆయన ధృడంగా వున్నారు. ఇక తొలి సదస్సు తరువాత అనేక భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. లుహుత్‌ బిన్సర్‌ పాండిజైతన్‌ (ఇండోనేషియా హోం మంత్రి) అగస్‌ విడ్‌జోజో( ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సు అధ్యక్షుడు ) ఎంతో సహనంతో వుండటాన్ని నేను చూశాను. కానీ వాస్తవంలో ఎంతో ప్రతిఘటన వుంది. అందుకే జోకోవి పాత్ర ప్రభావం చూపుతుంది, మారణకాండపై అతను క్షమాపణ చెబుతారా? పునరావాసం కలిగించటం అన్నది అధ్యక్షుడి విచక్షణకు సంబంధించింది.

మీ మాదిరే ఇతర బాధిత కుటుంబాలు, బంధువులు కూడా నిరాశావాదులుగా వున్నారా ?

అంతా అలా లేరు, అయితే ప్రభుత్వం పాలు( సులావెసి ప్రాంతంలోని ఒక పట్టణం)ను అనుసరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ నగర మేయర్‌ చర్య ఆశ్చర్యకరమైనది. పాలులో 1965లో సామూహిక హాత్యాకాండ జరిగిందని వారు గుర్తించారు,సమాధానపరిచారు, స్ధానిక యంత్రాంగం క్షమాపణ చెప్పింది. బాధితులకు పరిహారం చెల్లించనప్పటికీ వారు మాజీ ఖైదీలు జబ్బు పడినపుడు వారికి వుచిత వైద్యంతో పాటు సామాజిక భద్రత కల్పించారు. నేను తప్పుగా అర్ధం చేసుకోకపోతే మూడవ తరంవారి వరకు అవి అందుతాయి. దానిని వుదాహరణగా తీసుకోవాలి, జోకోవి కనీసం ఆ పని చేయగలరు.

జూన్‌ ఒకటి రెండు తేదీలలో వుద్యోగ విరమణ చేసిన సైనిక జనరల్స్‌ ఎందుకు సదస్సు జరిపారంటారు ?

ఆ సదస్సు ఒక ప్రహసనం. సమాధానపరచటమనే ఇతివృత్తంతో దానిని జరిపారు, కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని వారు తీర్మానించారు. అది సమాధానపరచటం కాదు కదా. సైన్యంలో అసంతృప్తి వుందని అది ప్రతిబింబిస్తోంది. అగస్‌ విడ్‌జోజో, హెన్‌డ్రాప్‌రియోనో మరియు లుహుత్‌ బిన్సర్‌ పాండిజైతన్‌ వంటి సంస్కరణవాదులైన జనరల్స్‌ వున్నారు, మానవ హక్కుల వుల్లంఘన జరిగిందని, దానికి సదుద్ధేశ్యంతో కూడిన పరిష్కారం అవసరం అని వారు గుర్తించారు. అది కషాయం వంటిదే అయినా , అవును దానికి సాయుధ బలగాలనే తప్పు పట్టాలని అని కనీసంగా వారు చెప్పవచ్చు, ఎందుకంటే ఆ సమయంలో వారు తప్పు చేసినట్లు రుజువులున్నాయి కనుక… ఇదే సమయంలో సంస్కరణవాద వ్యతిరేక మిలిటరీ వర్గం వుంది. వారిలో రక్షణ మంత్రి రేమిజర్డ్‌ రేకుడు, కివలన్‌ జెన్‌, కివీ శ్యాంకరి వంటి వారంతా దానిలో వున్నారు, వారంతా ఇప్పటికీ సుహార్తో నాయకత్వంలో మాదిరి మిలిటరీ స్వర్ణయుగంలో వున్నామనుకుంటున్నారు.

ఈ సమయంలో చట్టబద్దమైన పరిష్కారాన్ని మీరు ఎందుకు అంగీకరించటలేదు ?

ఒక పాత సమస్యకు న్యాయేతర పరిష్కార మార్గం సరైనదని అనుకుంటున్నాను. అందుకు బలమైన సాక్ష్యం వుంది. మంచి సర్దుబాటు, రాజీకి నాలుగు షరతులు వున్నాయి. ఒకటి, సామూహిక హత్యలు జరిగాయి. రెండు, ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించాలి, మూడు, నిజం చెప్పాలి, ఆ తరువాత దాన్ని యధాతధంగా స్కూలు పుస్తకాలలో వివరించటంతో పాటు దాని ప్రభావం ఎలా పడిందో కూడా వివరించాలి. నాలుగు, పరిస్థితిని చక్కపరచటం, దానితో ముడిపడివున్న పరిహారం, పునరావాసం, క్షమాభిక్ష.

కానీ లుహుత్‌ క్షమాపణ చెప్పటం కుదరదని చెప్పారు, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మీరు ఇప్పటికీ అనుకుంటున్నారా ?

నేను తగ్గుతున్నాను, ఎందుకంటే బహుశా విచార ప్రకటనకు మాత్రమే అవకాశం వుంటుందని లుహుత్‌ చెప్పారు. కానీ విచార ప్రకటనకు, క్షమాపణకు మధ్య వున్న తేడా మీకు తెలుసు, మొదటిది కేవలం సానుభూతి మాత్రమే. అది కూడా జరగదేమోనని నేను ఇప్పుడు ఆందోళనపడుతున్నాను. వాస్తవాలను వెల్లడి చేయకుండా పునరావాసం కలిగించటం అసాధారణం అవుతుంది, అది వికారమైన తర్కం అవుతుంది. డిఎన్‌ఎ(డిఎన్‌ అయిదిత్‌ ) ఎన్నడూ విచారణను ఎదుర్కొనలేదు, ఆయన నేరం చేసి వుంటే విచారణ జరిపి వుండాల్సింది. తప్పుంటే వురి శిక్ష విధించినా సమస్య వుండేది కాదు, కానీ న్యాయ విచారణ జరగాలి కదా !

   అధ్యక్షులుగా పనిచేసిన వారు అనేకమంది మారారు, కానీ 1965-66లో జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక వూచకోత సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు, దశాబ్దాల పాటు సాగదీయటానికి కారణం ఏమిటి ?

అధ్యక్షుడు సుహార్తో నాయకత్వంలో నూతన వ్యవస్ధ పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎంతో మంది జనం బుర్రల్లో అది నిలిచిపోయింది. దాని గురించి ఏమీ తెలియని వారిలో కూడా అది వ్యతిరేకతను కలిగించింది, ఇప్పటికీ వున్నది. అందుకే అలాంటి వ్యతిరేకత ప్రబలి వున్నది. మరోవైపు ఈ సమస్యను పరిష్కరించకూడదు అని చెప్పేవారు కూడా వున్నారు, వారు నేరం చేసినట్లు అది స్పష్టం చేస్తున్నది.

దీనిని ఎవరు చేస్తున్నారు ?

మిలిటరీ నూతన వ్యవస్ధ ప్రాభవాన్ని కాంక్షిస్తున్న కొంత మంది జనరల్స్‌ వున్నారు, ఈ సమస్య ద్వారా మరోసారి దానికోసం మార్గం వెతికేందుకు ప్రయత్నించారు. ఏదో ఒక సమస్య సాకు కోసం మాట్లాడటం అందరికీ తెలిసిందే. అదృష్టం కొద్దీ జనం ఎంతో చురుకుగా వున్నారు. కానీ ఇప్పటికీ కమ్యూనిస్టు ముప్పు వుందని వారు ఆలోచించటం అసాధారణంగా వుంది. ప్రపంచంలో మనది తీవ్రంగా భయపడుతున్న దేశంగా వుంది. కమ్యూనిజం పునరుద్ధరణ గురించి ఇండోనేషియా తప్ప ఏ దేశమూ భయపడటం లేదు.తీవ్రవాదులైన ఐఎస్‌ లేదా ఆల్‌ ఖైదా నుంచి నిజమైన ముప్పు వస్తున్నందున దాని గురించి వారు భయపడాలి.కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ సమస్య, వారికి ఎవరు నిధులు ఇస్తారు ? కమ్యూనిజాన్ని నిషేధించినట్లు అందరికీ తెలుసు.

ఈ సమస్యను ఇంకా సాగదీయటం గురించి మీరేమనుకుంటున్నారు?

దాన్ని మీరు వూహించుకోవచ్చు, యువతరం మంచి వుదాహరణను చూడజాలదు. రాజ్యం క్షమాపణ చెప్పినట్లు మీరు వూహించుకోండి, వారిని మీరు గౌరవించరా ? గౌరవ ప్రదమైన చర్యను యువతరం అనుసరిస్తుంది, ఇప్పటికీ నిందలపాలు అవుతున్న బాధితులు కూడా క్షమిస్తాము అని చెప్పటానికి వీలుకలుగుతుంది.

మీకు కమ్యూనిజం గురించి ఎలా తెలిసింది?

ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ అధ్య క్షుడిగా నా తండ్రి పనిచేశారని నేను తెలుసుకున్నాను. అదంతా నా మనస్సులో వుంది. వారు రైతులు, మత్స్యకారులు, ఇతర జనాన్ని సమర్ధించారు, కానీ నేను హైస్కూలులో వుండగా కమ్యూనిజం గురించి చదవాలన్న ఆసక్తి ఏర్పడింది. మార్క్సిజం దానికి పునాది అని తెలుసుకున్నాను.

కమ్యూనిజం గురించి తెలుసుకోవాలని మీకు ఆసక్తి కలిగించినది ఏమిటి ?

నా తండ్రి చేసిన తప్పిదం ఏమిటి అన్న కుతూహలమే ప్రధానంగా నన్ను ప్రేరేపించింది.నేను హైస్కూలులో వుండగా కొన్ని విశ్లేషణ మెళకువలను తెలుసుకోవటం ప్రారంభించాను.ఈ ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు వున్నాయని తెలుసుకున్నాను. డబ్బుకు అనుకూలమైన సిద్ధాంతం ఒకటుంది, జనం తాము ఎక్కడ పుట్టాలో ఎంచుకోలేరు కనుక ఈ ప్రపంచంలోని సంపదనంతటినీ జనమంతటికీ సమానంగా పంచాలన్న సిద్ధాంతం ఒకటి వుంది. కమ్యూనిస్టు భావన గురించి నేను ఒక స్కూలు స్నేహితుడిద్వారా చదివాను. అతని తండ్రి కమ్యూనిస్టు కాకపోయినా వారి వద్ద ఎంతో సాహిత్యం వుంది. వుదాహరణకు గాంధీ ఒక హిందువు అయినా ఆయనను మీరు అభిమానించవచ్చు, ఆయన గురించి పుస్తకాలు కలిగి వుండవచ్చు. నేను ఆ విధంగా చదువుకున్నాను.

కమ్యూనిస్టుగా మారటమంటే అర్ధం మీరు నాస్తికులా ?

కమ్యూనిస్టుగా వుండటమంటే అర్ధం నాస్తికుడని కాదు….మా తండ్రి వుపవాసాలు వున్నారు, రంజాన్‌ పండుగ చేసుకున్నారు. కానీ ఆయన నూతన ప్రపంచాన్ని సృష్టించాలని అనుకున్నారు. సామాజిక తరగతులు లేకుండా చేయాలనుకున్నారు.దానికీ దేవుడికీ సంబంధం లేదు.నాస్తికుడని ముద్రవేశారు, అది సుహార్తో హయాంలో జరిగిన ప్రచారం, అది పని చేసింది. భౌతిక సంపదలను సమంగా పంచినపుడే ప్రపంచం సుఖంగా వుంటుందని మార్క్స్‌ చెప్పారు.ఆ సూత్రంతో నేను ఏకీభవిస్తాను.మనల్ని పెట్టుబడిదారులు పాలించటాన్ని అనుమతించకూడదు.

అయితే మీరు ఒక కమ్యూనిస్టు ?

నేను కమ్యూనిస్టు అనే దాని కంటే ఎక్కువగా మార్క్సిస్టును అని చెప్పగలను

మీరు నాస్తికులా ?

నేను ఇప్పుడు వుపవాసం వుంటున్నాను, నేను మతపరమైన మార్క్సిస్టును అందులో గందరగోళం లేదు కదా ?