Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

     జపాన్‌-ఇండియా, అక్కడ ధరలను ఎలా పెంచాలా అని తలబద్దలు కొట్టుకుంటుంటే, ఇక్కడ ఎలా తగ్గించాలా అని చూస్తున్నారు. ఇక్కడ వడ్డీరేటు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడ బ్యాంకులో ఎవరైనా డబ్బు దాచుకుంటే వారే 0.10 శాతం ఎదురు చెల్లించాలి. వడ్డీ రేటు ఎక్కువ వుంటే ఆర్ధికాభివృద్ధి వుండదా ? ప్రపంచంలో అత్యధిక వడ్డీ రేటు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనాలో 34.45 శాతం (మే 2016) వుంది. అక్కడ వృద్ధి రేటు గతేడాది 2.1శాతం. పక్కనే వున్న అమెరికాలో వడ్డీ రేటు 0.50 శాతమే అక్కడా వృద్ధి రేటు రెండు శాతం వరకు వుంది. స్వీడన్‌, డెన్మార్క్‌, స్విడ్జర్లాండ్‌లలో ఎవరైనా బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే వారే 0.5,0.65,0.75శాతం చొప్పున బ్యాంకులకు ఎదురు వడ్డీ చెల్లించాలి. మరి అక్కడ అభివృద్ధి లేదా ? అంతెందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌లో వడ్డీ రేటు 5.5శాతం కాగా వృద్ధి రేటు 4.8శాతం వుంది. ఇంకా ఇలాంటి వివరాలను పేర్కొంటే బుర్ర బద్దలు అవుతుంది. ఈ దేశాలన్నీ పెట్టుదారీ విధానాన్ని అనుసరిస్తున్నవే. మరి ఈ వడ్డీ రేట్లేమిటి ? కొన్ని దేశాలలో బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చి జనం డబ్బు ఎందుకు దాచుకుంటున్నారు? వారికి పెట్టుబడి అవకాశాలు లేవా ? అభివృద్ధి రేటులో ఇంత వ్యత్యాసం ఏమిటి ? ఎందుకీ ప్రయాస అంటారా ?

     వడ్డీ రేటు తగ్గింపు, తదితర విధానాలపై విబేధాలు, ఆరోపణలు, అవమానాల కారణంగానే రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అసాధారణరీతిలో తాను పొడిగింపును కోరుకోవటం లేదని, తనపని తాను చూసుకుంటానని బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది.చరిత్రలో అనేక మంది గవర్నర్లు వచ్చారు, పోయారు. బహుశా ఇలాంటి పరిస్ధితి ఎవరి విషయంలోనూ తలెత్తి వుండదు. కొద్ది వారాల ముందు రాజన్‌ ఈ ప్రకటన చేసి వుంటే నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల జాబితాలో దీనిని కూడా చేర్చి వుండేది లేదా సుబ్రమణ్యస్వామి వంటివారి చేత ప్రకటనలు చేయించి వుండేదేమో ? వడ్డీ రేటుకు, అభివృద్ధి రేటుకూ సంబంధం లేదని చెప్పేందుకే పైన అన్ని వివరాలను పేర్కొని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. నరేంద్రమోడీ చెప్పినట్లుగా గుజరాత్‌ మోడల్‌ లేదూ, అభివృద్దీ లేదు దాన్ని అంగీకరించటానికి పాలక కూటమికి ధైర్యమూ లేదు, ఈ రోజు కాకున్నా రేపయినా జనం అడుగుతారు. ఇదిగో రఘురామ్‌ రాజన్‌ కారణంగానే ఇదంతా జరిగింది, దాన్ని సరిదిద్దటానికి మూడు సంవత్సరాలు పట్టింది, మరోసారి మాకు అవకాశం ఇస్తే మాజిక్‌ చూపిస్తాం అని 2019ఎన్నికలలో సాకు చెప్పేందుకే ఇంతా చేశారా ? ఏమో గత 24 సంవత్సరాలలో ప్రతి గవర్నర్‌కూ రెండవ సారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం రాజన్‌ పట్లనే ఇలా ఎందుకు వ్యవహరించింది? దీని వలన ప్రభుత్వానికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటి? సమాధానం లేకపోగా మంచిది కొత్త గవర్నర్‌ను చూస్తాం అని ఆర్ధిక మంత్రి జైట్లీ తాపీగా చెప్పారు.

    ఒకటి మాత్రం స్పష్టం. వచ్చే రిజర్వుబ్యాంకు గవర్నర్‌ తమకు తాన తందానా పలకాలన్న సందేశాన్ని మోడీ సర్కార్‌ స్పష్టంగా పలికింది. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలన్నింటినీ తన పార్టీ కార్యకర్తలతో నింపుతోంది. టీవీ సీరియల్స్‌లో గుడ్డి పాత్రల వంటి చిన్నా చితకా అనుభవ తప్ప పెద్ద అనుభవం లేని గజేంద్ర చౌహాన్‌ను ప్రతిష్టాత్మక పూనా ఫిల్మ్‌ఇనిస్టిట్యూట్‌కు అధిపతిగా చేసిన విషయం తెలిసిందే. అదే బాటలో మరో చౌహాన్‌ రంగం మీదకు వచ్చారు. ఈయనకు ఆ పరిమిత అనుభం కూడా లేదు. తాజాగా జాతీయ ఫ్యాషన్‌ టెక్నాలజీ సంస్ధ అధిపతిగా 68 సంవత్సరాల మాజీ క్రికెటర్‌ చేతన చౌహాన్‌ను నియమించింది. ఈ సంస్థ అధిపతులుగా సుప్రసిద్ద విద్యావేత్త, శాస్త్రవేత్త, సాంకేతికవేత్త, ప్రొఫెషనల్‌ను నియమించాలని చట్టంలో స్పష్టంగా వుంది.దాన్ని పక్కన పెట్టి పార్టీ కార్యకర్తను అందలమెక్కించారు.దీనిపై సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ చర్యను పరిహసిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో అధిపతిగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను వేస్తారేమో అన్నది వాటిలో ఒకటి. ఇవన్నీ చూస్తే రేపు ఏ బిజెపి కార్యకర్తనో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా నియమించినా చేసేదేమీ లేదు. ఎందుకంటే ఆర్ధికవేత్త సుబ్రమణ్య స్వామి ఎలాగూ మార్గదర్శనం చేసేందుకు వున్నారు కదా !

    ప్రతి దేశ రిజర్వు బ్యాంకు నెలా లేదా రెండు నెలలు, లేదో ఒక నిర్ణీత వ్యవధిలో తన విధాన సమీక్ష చేసుకొని వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాల ప్రకారం ద్రవ్యోల్బణ రేటు వస్తువులు, సేవల ధరల పెరుగుదల తీరుతెన్నులను ప్రతిబింబిస్తుంది. సాధారణ సూత్రం ప్రకారం వడ్డీరేటు తక్కువ వుంటే ఎక్కువ మంది అప్పుచేస్తారు, ఆ సొమ్ముతో వస్తువులను కొంటారు, అది ఆర్ధికవ్యవస్ధ పురోగతికి దారితీస్తుంది.ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మనదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం వరకు వాయిదాల మీద ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనే వారికి వడ్దీ రాయితీ గురించి వల విసిరే వారు. ఇప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా వస్తువుల కొనుగోలుకు అప్పులిస్తున్నారు. అంటే కంపెనీలే వస్తువు ధరలో వడ్డీని కూడా కలుపుతాయి అది వేరే విషయం. వడ్డీ రేట్లు పెరిగితే జనం తమ సొమ్మును పొదుపు చేసుకోవటం ఎక్కువ చేసి వస్తు కొనుగోలు తగ్గిస్తారు.అది ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే కాదు, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అందువలన వడ్డీరేటు తగ్గింపు, పెంపుదల అనేది ఆర్ధిక వ్యవస్థను సమతూకంలో వుంచే సాము గరిడీ వంటిది.

    టీవీ సీరియల్స్‌లో బ్రేక్‌ మాదిరి ఇక్కడొక చిన్న పిట్ట కధ చెప్పాలి. ఒక పెద్దమనిషి కారణాలేమైనా ఇద్దరిని వివాహం చేసుకున్నాడట. పెద్ద భార్య జుట్టు నెరిసింది, భర్త జుట్టులో నలుపు తెలుపూ రెండూ వున్నాయి. అందుకని ఆమె నల్ల వెంట్రుకలను పీకివేసేదట. చిన్న భార్య తన జుట్టు నలుపు కనుక తన భర్త జుట్టులో వున్న తెల్ల వెంట్రుకలను నిర్ధాక్షిణ్యంగా తీసివేసేదట. చివరికి ఏమైందో చెప్పక్కర లేదు. ఆర్ధిక వ్యవస్థలో కూడా విరుద్ధ శక్తులు విధానాన్ని తమవైపు వుండేట్లు చూసుకుంటాయి. కరెన్సీ విలువనే చూడండి. విలువ ఎక్కువగా వుంటే దిగుమతి చేసుకొనే వస్తువులు చౌకగా వస్తాయి.తక్కువగా వుంటే మన వస్తువుల ధరలు అంతర్జాతీయ విపణితో తక్కువగా వుండి ఎగుమతులు పెరుగుతాయి. అందువలన ఒకరు మన రూపాయి విలువ తగ్గించాలని కోరితే, మరొకరు పెంచాలని కోరతారు. వడ్డీ రేటు కూడా ఇంతే.

   ఇక రఘురామ రాజన్‌ విషయానికి వస్తే ఆయన పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు తప్ప వ్యతిరేకించే ఆర్ధికవేత్త కాదు. అందువలన ఆయన కొనసాగితే సామాన్య జనానికి ఏదో మేలు జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు, జరగాల్సిన కీడు ఇప్పటికే జరిగింది కనుక జనానికి పెద్దగా నొప్పి కూడా వుండదు. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తమ ప్రభుత్వం పాలన ముగిసిన తరువాత ఎన్నికలలో దేశం వెలిగిపోతోంది అని ప్రచారం చేసుకుంది. నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ ప్రధాని కనుక పాలన చేపట్టిన మరుసటి రోజు నుంచే వెలిగి పోతోందని ప్రచారం ప్రారంభించారు. మన రిజర్వుబ్యాంకు గవర్నర్లలో రాజన్‌ పిన్న వయస్కుడు. నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావం వుందని చెబుతారు. అమెరికాలో వుండి వచ్చారు కనుక అక్కడి మాదిరి ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు అనుకున్నారేమో. నరేంద్రమోడీ సర్కార్‌ అతిశయోక్తులను భరించలేక అంధుల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అని పరోక్షంగా చురక అంటించారని అంటున్నారు.దాని మీద ఎవరు ఎలా విరుచుకుపడిందీ దేశం చూసింది. అప్పుడే రాజన్‌కు మరొక అవకాశం రాదని చాలా మంది అనుకున్నారు. ఆ తరువాతే శిఖండి మాదిరి నోటి తుత్తర సుబ్రమణ్య స్వామిని రంగంలోకి దించారు. ఇదంతా పొమ్మనకుండా పొగబెట్టటం అని తెలియనంత అమాయకంగా రాజన్‌ లేరు కనుక ఆయన కూడా అసాధారణ రీతిలో పదవీ విరమణకు 80 రోజుల ముందుగానే ఒక బహిరంగ లేఖ రాసి తానేమిటో ప్రదర్శించుకున్నారు. ఇదంతా లేకుండా ఎలాంటి వివాదాలు లేకుండా రాజన్‌ తప్పుకునే అవకాశాన్ని మోడీ సర్కార్‌ సృష్టించి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. అలా జరిగితే సలహాదారులకు పనేముంటుంది?

    ఇప్పుడు ప్రభుత్వ పరిస్ధితి ఒకరకంగా ఇరకాటంలో పడింది.ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో ప్రారంభమైన ఇప్పడప్పుడే పరిష్కారమయ్యే సూచనలు కనిపించటం లేదు. ఈ స్ధితిలో మోడీ జనంలో ఎన్నో ఆశలు కల్పించారు. దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ రోజులు గడిపి తానేదో అద్బుతదీపాన్ని తెస్తున్నట్లు హడావుడి చేశారు. రాబోయే రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌ ప్రతి చర్యను రాజన్‌ హయాంతో పోల్చుతారు. రాజన్‌ అయినా మరొకరైనా మన జీవనాడులను చేజిక్కించుకున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గీచిన పరిధులలో మాత్రమే పనిచేయాల్సి వుంటుంది. దానికి భిన్నంగా వెళ్లే అవకాశం లేదు.

     ప్రపంచీకరణలో భాగంగా మన ఆర్థిక వ్యవస్థను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులకు తెరిచారు. ఫోర్టుపోలియో పెట్టుబడులు అంటే వడ్డీ వ్యాపారుల వంటి వారు. మన ప్రభుత్వం తీసుకొనే రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా వుంటే మన రుణపత్రాలు(బాండ్లు) కొంటారు. లేకపోతే ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడకు వెళ్లిపోతారు. మనకు ఆ రూపంలో విదేశీ మారక ద్రవ్యం రాకపోతే మన విదేశీ చెల్లింపులు ప్రమాదంలో పడతాయి, బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన రోజులు వస్తాయి. అందువలన రిజర్వు బ్యాంకు గవర్నరు లేదా వడ్డీ రేటు విధానం గురించి మోడీ సర్కార్‌ ఎంతగా వివాదం లేదా ప్రచారం చేస్తే అంతగా జనం దృష్టి వాటిమీద పడుతుంది. పర్యవసానాలపై స్పందన కూడా ఎక్కువగానే వుంటుంది.

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు గత రెండు సంవత్సరాల కాలంలో పెరిగారు, అలాంటివారిపై చర్యలకు వాణిజ్యబ్యాంకులను రాజన్‌ కదిలించారని కొందరు చెబుతున్నారు. అదే నిజమైతే కావూరి సాంబశివరావు వంటి ఎందరో బిజెపిలో చేరిన రుణ ఎగవేతదారుల వత్తిడి కూడా నరేంద్రమోడీ మీద వుందా ? రాబోయే రోజుల్లో ఇలాంటి అంశాలన్నీ అజెండాలోకి వస్తాయి. పశ్చిమ దేశాల పరిణామాలను చూస్తే ఆర్ధిక సంక్షోభ భారాలను సామాన్య జనం మీద నెట్టటం కనిపిస్తోంది. దానికి అయా దేశాలలో వున్న రిజర్వుబ్యాంకులు సాధనాలుగా పనిచేస్తున్నాయి. అందువలన మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు మరింతగా కట్టబెట్టాలన్నా, జనంపై భారాలు మోపాలన్నా రిజర్వుబ్యాంకు విధానాలు ముఖ్యం. అందువలన కొత్త గవర్నర్‌గా ఎవరిని తెస్తారు ? ఇప్పటి కంటే మౌలిక మార్పులు ఏం చేస్తారు ?