Tags

, , ,

పప్పులో నీళ్లు కలిపి తినమంటున్న రామ్‌దేవ్‌

ఎం కోటేశ్వరరావు

     ఈ శీర్షికను చూసి ప్రధాని నరేంద్రమోడీ వీర భక్తులు, కాషాయ దేశభక్తులు కోపం తెచ్చుకోవద్దని మనవి.అంధుల రాజ్యంలో ఒంటి కన్నువాడు మహారాజు అని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఏ చిత్తంతో అన్నారో గానీ మోడీగారి పాలన రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సలహాలు ఇచ్చేవారు కూడా అపూర్వ మేథాసంపన్నులుగా వున్నట్లున్నారు. పప్పుల ధరలు చుక్కలు చూపిస్తున్న ఈ రోజుల్లో మా కాలంలోనే పప్పులతో ముఖం కడుక్కొని పప్పులతో స్నానం చేసి పప్పులలోనే నిద్రపోయే వారం అని పిల్లలకు రాత్రి పూట పిట్ట కధలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందా ? ఏమో ! ‘పప్పుల ధరల అదుపుకు మోడీ ఆఫ్రికా దేశాల పర్యటన’ ఇది ఒక ఆంగ్ల వార్త శీర్షిక.http://indiatoday.intoday.in/story/modi-to-visit-african-countries-to-check-racing-pulse-prices/1/695912.html

       మేకిండియా పిలుపును అమలు చేసేందుకే మా ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం విదేశీ పర్యటనలు చేస్తున్నారని భజన బృందం చెబుతుంటే కామోసనుకున్నాం. ఇప్పుడు పెట్టుబడుల కోసమే కాదు, పప్పుల కోసం వెళుతున్నారని మనం చెవులప్పగించి వినాలి కాబోలు.కోరి తలమీద పెట్టుకున్నాం కనుక తప్పదేమో మరి ! పట్టణాలలో కొన్ని పప్పుల ధరలు గరిష్టంగా 180 నుంచి 200 రూపాయల వరకు వున్నాయి.గ్రామాలలో అందునా మారు మూల గ్రామాలలో ఇంకా ఎక్కువ వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. మంచి రోజులు రానున్నాయని చెప్పటానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు తప్ప పప్పులుడికేందుకు చర్యలు లేవు. ప్రధాని నరేంద్రమోడీ జూలై తొలి వారంలో ఆఫ్రికా దేశాల పర్యటన జరుపుతున్నారు.ఆయనతో పాటు సీనియర్‌ అధికారుల బృందం వెళ్లి ఆఫ్రికా ఖండ దేశాలలో ప్రయివేటు వారితో కాంట్రాక్టు సాగు పద్దతిలో పప్పులు పండించేందుకు, పప్పులను దిగుమతి చేసుకొనేందుకు గల అవకాశాలను పరిశీలించి వస్తారని అధికారులే చెప్పినట్లు వార్తలు. పెట్టుబడుల కోసం మోడీయే విదేశాలు తిరిగి, పప్పుల కోసమూ ఆయనే వెళ్లాల్సి రావటం అంటే అధికారులు మోడీ మెప్పు పొందేందుకు, ఆయనను మెప్పించేందుకు ఇలా చేస్తున్నారా లేక సంబంధిత మంత్రులు వుత్సవిగ్రహాలా ?

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు తామరతంపరగా పుట్టుకు వస్తున్నారు, వారిపై నిఘావేయటానికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి), ఐబి, రెవెన్యూ ఇంటెలిజన్సు విభాగాలకు సిబ్బంది చాలని పరిస్థితులో పప్పులపై ఒక కన్నేసి వుంచమని కూడా ప్రభుత్వం చెప్పిందట. మన దేశంలో ఏటా పదిలక్షల టన్నుల పప్పుల వినియోగం పెరుగుతున్నదని అంచనా, ప్రస్తుతం ఏటా 24మిలియన్‌ టన్నులు అవసరం కాగా నాలుగు లక్షల టన్నుల వరకు దిగుమతులు చేసుకుంటున్నాం.

   ప్రపంచ పప్పుల సంవత్సరంగా 2016ను ప్రకటించారు. మన వినియోగదారులకు పప్పుల షాక్‌ కూడా ఈ సంవత్సరమే తగలటం విశేషం. పప్పుల వినియోగం, కొరత గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఏం చేసిందన్నది ఒక ప్రశ్న. (వుత్పత్తి, దిగుమతి మిలియన్‌ టన్నులలో, ఖర్చు కోట్ల రూపాయలలో, వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా )

సంవత్సరం    వుత్పత్తి       దిగుమతి       దిగుమతి ఖర్చు

2012-13       18.34          4.02             13,357

2013-14        19.27         3.18             11,038

2014-15        17.15         4.00             14,396

2015-16        17.33         5.50             24,198

     పై అంకెలను చూసినపుడు ఏటేటా పెరుగుతున్న వినియోగం, తగ్గుతున్న వుత్పత్తికి అనుగుణంగా దిగుమతులు లేవన్నది స్పష్టం. 2015-16 సంవత్సరానికి సంబంధించి వుత్పత్తి అంకెలు అంచనా మాత్రమే. దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాభావం, కరవు కారణంగా వుత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని మనకు కనిపిస్తున్నా ప్రభుత్వం గొప్పకోసం వుత్పత్తి పెరుగుదల అంచనా చూపింది. రెండవది 2012-13 సంవత్సరాలలో టన్ను రు 33వేల చొప్పున దిగుమతి చేసుకుంటే గతేడాది 43వేలకు పెరిగింది. మన పప్పుల వుత్పత్తి తగ్గిపోయిన విషయం గమనంలో వున్న కేంద్రం లేదా రాష్ట్రాలు గానీ అవసరమైన దిగుమతులను చేసుకోని కారణంగానే, అనేక చోట్ల నిల్వలన్నీ అయిపోవటాన్ని అవకాశం తీసుకున్న వాణిజ్యశక్తులు ధరలను అనూహ్యంగా పెంచివేశాయి. వారిని అదుపు చేసేందుకు, దొంగ నిల్వలను పట్టుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ కనపడదు.

    ఆఫ్రికా ఖండంలో పప్పులను పండించి దిగుమతి చేసుకొని ధరలను తగ్గిస్తామని కేంద్రం చెబుతుంటే దానికి గట్టి మద్దతుదారుగా స్వయం ప్రకటిత బాబా రామదేవ్‌ ఏ చిట్కా చెప్పారో తెలుసా. న్యూఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాదులో యోగా శిక్షణలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ పప్పుల ధరల పెరుగులకు నరేంద్రమోడీని విమర్శించకూడదని సెలవిచ్చారు. పోనీ అంతటితో ఆగితే ఫరవాలేదు, ఈ సమస్యను అధిగమించటానికి పప్పులో నీళ్లెక్కువ పోసుకొని తింటే పొదుపు చేసి ఖర్చుకు ఖర్చు, పెంచుకున్న ఒళ్లు తగ్గి ఆరోగ్యానికి ఆరోగ్యమూ అని కూడా వుద్భోదించారు. అంటే కోడిగుడ్డంత బంగారం లేనివారెవరూ ఈదేశంలో లేరన్నట్లుగా పప్పులు ఎక్కువగా తిని జనమంతా వూబకాయాలను పెంచుకున్నారని గౌరవనీయులైన రామదేవ్‌ బాబా అనుకుంటున్నారా ? ప్రపంచ ఆరోగ్య సంస్ధ సిఫార్సు ప్రకారం మన దేశంలో ప్రతి ఒక్కరూ రోజుకు సగటున 80గ్రాముల పప్పులు తినాల్సి వుంది. మనదేశంలో సగటు లభ్యతే 40 గ్రాముల లోపు వుంది. అసలు పప్పుల ముఖం చూడనివారు కూడా వున్నారంటే ఆశ్చర్యం లేదు.

     రామ్‌దేవ్‌ ఇలా సెలవిస్తే మన కేంద్ర ఆహార మంత్రి మాననీయ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ గారు ధరల పెరుగుదల గురించి ఆశ్చర్యపోతున్నారట. పప్పులను పండించేందుకు లేదా దీర్ఘకాలిక దిగుమతులు చేసుకొనేందుకు గాను మయన్మార్‌,మొజాంబిక్‌ దేశాలకు ప్రతినిధులను పంపుతున్నామని చెప్పారు.ఇదెలా వుందంటే దాహంతో చస్తున్నామయ్యా అంటే దేశంలో అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నాం అని చెప్పినట్లు వుంది.పరిస్థితి ఇంత తీవ్రంగా మారుతున్నపుడు పర్యవేక్షణ చేసే యంత్రాంగం, వారిని నడిపించాల్సిన మంత్రులు ఇంతకాలంగా ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? దేశంలో టమోటాలు, బంగాళాదుంపలు, వుల్లిపాయల వుత్పత్తి గణనీయంగా పెరిగింది, వినియోగంలో మార్పు లేదు అయినా ధరలు పెరిగాయంటే దీనికి పుకార్లే కారణం అని కూడా పాశ్వాన్‌ సెలవిచ్చారు. పుకార్లను తొలగించటానికి ప్రభుత్వ యంత్రాంగం నమో భజనలో వందోవంతైనా ప్రచారంలో స్ధానంలో కల్పించలేదేం?

     మన పొరుగు దేశం పాకిస్థాన్‌ మంత్రి మరొక మహత్తర సలహా ఇచ్చారు. పప్పుల కంటే కోడి మాంసం ధర తక్కువగా వుంది కనుక దాన్ని తినండన్నారు. అక్కడ కిలో పప్పులు రు.260 వుంటే కోడి మాంసం రు.200లకే దొరుకుతోందట. ఇవేమి ధరలయ్యా బాబూ అని అక్కడి ప్రతిపక్షాల వారు అడిగితే ఈ సలహా ఇచ్చారు.

     మన దేశంలో ఎకరానికి 750కిలోల పప్పుల దిగుబడి వుంటే అభివృద్ధి చెందిన దేశాలలో 1200 నుంచి 1800 కిలోల వరకు వుంది. దీనికి తోడు గత రెండు సంవత్సరాలలో రూపాయి విలువను దిగజార్చిన ప్రభుత్వ విధానాల కారణంగా దిగుమతి చేసుకొనే పప్పుల ధరలు కూడా పెరుగుతున్నాయి. కేంద్రమంత్రులతో కుమ్మక్కయిన వ్యాపారుల సిండికేట్లు ఆఫ్రికా నుంచి కిలో 55 రూపాయలకు పప్పులను దిగుమతి చేసుకొని మన దేశంలో 175 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకొన్నట్లు, దానిలో మోడీకి ఎల్లవేళలా అండదండలుగా వుండే అదానీ వంటి వారు వున్నట్లు వచ్చిన వార్తలను ఇంతవరకు ప్రభుత్వం ఖంచించినట్లు మనకు తెలియదు.పప్పుల దిగుమతికి అదానీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది.http://www.indiasamvad.co.in/investigation/inside-story-how-rs-55-per-kilo-african-dal-was-sold-in-india-for-rs-175-7853 అదానీ రేవులలో దిగుమతి చేసుకున్న పప్పులను నిలవ చేసి దాచివేశారని కూడా ఆరోపణలు వున్నాయి.