Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

    ధరలు పతనమయ్యాయని రైతులు పత్తిని అమ్ముకోకుండా నిలుపుకోగలరా ? రైతు పత్తిని అమ్మలేదు కనుక తమకు ఇవ్వాల్సిన వేతనాలు వాయిదా వేసినా ఫరవాలేదని వ్యవసాయ కార్మికులు తాపీగా వుండగలరా ? కానీ పత్తి ధరలు పెరిగాయి కనుక వారానికి రెండు రోజులు మిల్లులు మూసివేయాలని తెలంగాణా నూలు, వస్త్ర మిల్లుల యజమానులు నిర్ణయించారు. బహుళజాతి గుత్త సంస్థలు అక్రమంగా పత్తి నిల్వలు పెట్టి ధరలు పెంచారని వాపోయారే తప్ప అక్రమ నిల్వలలను వెలికి తీయాలని ప్రభుత్వాన్ని కోరలేదు. దానికి బదులు తమకు వుదారంగా రుణాలు ఇవ్వాలని, వడ్డీ తగ్గించాలని, రుణ వ్యవధిని మూడు నుంచి తొమ్మిది నెలలకు పెంచాలని, ఎగుమతులు చేసిన వారికి మూడుగా వున్న ఎగుమతుల ప్రోత్సాహకాన్ని ఏడున్నరశాతానికి పెంచటం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు ధరలను అదుపు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా వారు సూచించారు. రెండు రోజులు మూత పెట్టినందువలన మిల్లు యంత్రాలు తుప్పుపట్టిపోవు, కార్మికులకు వేతనాలు మాత్రం వుండవు. చేసిన పనికే తగిన వేతనాలు ఇవ్వని వారు అసలు చేయని పనికి ఇస్తారా ?

   ఈ పరిస్థితికి వారు చెబుతున్న కారణాలు ఏమిటి ? బహుళజాతి గుత్త సంస్థలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసి అక్రమ నిల్వలు పెట్టటం. ఆ కంపెనీలకు కారుచౌక వడ్డీకి రుణాలు దొరుకుతుండగా తమకు 14శాతం వరకు పడటం. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులకు ఐరోపా, అమెరికా వంటి చోట్ల పన్నులు తక్కువ లేదా అసలే లేకపోవటం వంటి కారణాలతో తాము నష్టపోతున్నామని యజమానులు చెబుతున్నారు.

   పత్తి గిట్టుబాటు కావటం లేదు కనుక దాని బదులు మరొక పంటలు వేయాలని తెలంగాణా ప్రభుత్వం రైతాంగానికి సలహా ఇచ్చినప్పటికీ రైతులు ఈ ఏడాది కూడా పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నట్లు విత్తనాల కొనుగోలు తీరుతెన్నులు వెల్లడిస్తున్నాయి. రెండవది వాణిజ్య పంటలు రైతాంగానికి జూదంగా మారిపోయిన తరువాత ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు రు.5,800 వరకు వుండటం కూడా వారిని ఆకర్షిస్తుంది. తీరా పసిపిల్లల మాదిరి పంటను సాకి పత్తిని తీసుకొని మార్కెట్లోకి వెళితే 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పిన కేంద్రం విదిల్చిన ముష్టి రు.60లతో కలుపుకొని క్వింటాలు రు.4,160కి లోపుగా తప్ప సిసిఐతో సహా ఏ ఒక్క వ్యాపారీ కొనుగోలు చేయడు. మార్కెట్‌ సీజన్‌లో ధరలను అదుపు చేయటానికి సిసిఐ తన వంతు ‘కృషి ‘చేస్తోంది. మోడీ సర్కార్‌ కృషి కల్యాణ్‌ పేరుతో వసూలు చేస్తున్న అరశాతం సేవాపన్ను రైతులు కూడా చెల్లిస్తారు. కనీసం వారు చెల్లించిన మొత్తమైనా ఏదో ఒక రూపంలో వారి కల్యాణానికి అందుతుందా? అన్నట్లు మరిచాను కెసిఆర్‌ ప్రభుత్వ కల్యాణ లక్ష్మి పధకం వుంది కదా కనీసం దానినైనా రైతాంగ బిడ్డలకు వర్తింప చేస్తారా ?

     ఇటు తెలంగాణా అటు ఆంధ్రప్రదేశ్‌ మొత్తం భారత రైతాంగాన్ని, అటు మిల్లు యజమానులను, వాటిలో పని చేసే కార్మికులను అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్న వుమ్మడి కారణం ఏమిటి ? రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తాను రెండవసారి పదవి కొనసాగింపు కోరుకోవటం లేదు అని ప్రకటించిన 48 గంటలలోనే కేంద్ర ప్రభుత్వ విదేశీ పెట్టుబడులకు భారత గడీ తలుపులను మరింతగా తెరిచింది. ఇంతకాలం ఈ పనిచేయకపోవటానికి ఆయనే కారణం అని చెప్పకనే చెప్పినట్లు అవటంతో పాటు రాజన్‌ ప్రకటన ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారిన చర్చను పక్కదారి పట్టించే ఎత్తుగడ కూడా కనిపిస్తోంది. పత్తి వ్యాపారంలో బహుళజాతి గుత్త సంస్థలను, విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు మిల్లు యజమానులే చెప్పారు. విదేశీ పెట్టుబడులు వస్తే మన రైతాంగానికి, వినియోగదారులు, అన్ని వర్గాల వారికి స్వర్ణయుగం వస్తుందన్నట్లుగా గతంలో మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. ఇప్పుడు అంతకంటే మరింత గట్టిగా నరేంద్ర మోడీ, చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారంతా చెబుతున్నారు కదా ? మరి పత్తి విషయంలో జరిగిందేమిటి ?

     పత్తి విత్తనాలు మొత్తం మోన్‌శాంటో వంటి బహుళజాతి గుత్త సంస్థల చేతుల్లోకి పోయాయి. పత్తి వేసిన తరువాత వచ్చే కలుపు తీయాలన్నా, క్రిమికీటకాలను చంపాలన్నా మోన్‌శాంటో లేకుండా గడవదు. ఒక్క యూరియా తప్ప మిగతా అన్ని రకాల ఎరువుల ధరలపై కేంద్రం కంట్రోలు ఎత్తివేసింది. వాటిని దిగుమతి చేసుకోవాలన్నా, దేశీయంగా ప్రయివేటురంగంలో తయారు చేయాలన్నా మోన్‌శాంటో లేదా దాని వంటి ఇతర కంపెనీల అనుబంధ సంస్ధలు, భాగస్వాములు తప్ప మరొకరు లేరు. మరి విదేశీ పెట్టుబడులు, కంపెనీలు మనకు వుపయోగపడిందెక్కడ ? గతంలో బ్రిటీష్‌ పాలనలో మన దేశం మగ్గిన సమయంలో మన దేశాన్ని ముడిసరకులు ఎగుమతి చేసే దేశంగా, పారిశ్రామిక సరకుల కొనుగోలు దేశంగా మార్చి మన సంపదలను కొల్లగొడుతున్నారనేగా మన గాంధీ తాత వంటి వారి నాయకత్వాన పోరాడి వారిని తరిమివేసింది. మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి ? మోడీ అంకుల్‌ అంతకంటే ఎక్కువగా మన జీవితాల్లోకి విదేశీ పెట్టుబడులు, కంపెనీలను తీసుకువస్తా అంటూ ఎక్కువ సమయం విదేశాల్లోనే గడుపుతున్నారు కదా ? అవే కంపెనీలు మరింతగా మన దగ్గర నుంచి సంపదను తరలిస్తున్నాయా లేదా ? మన రూపాయి విలువను తగ్గించి మన ప్రభుత్వాలు మన సరకులను విదేశాలకు చౌకగా విక్రయిస్తున్నాయా లేదా ? ఎగుమతులకు ప్రోత్సాహం ఇస్తున్నాయా లేదా ? ఇంకా ఎక్కువ కావాలనే కదా మన తెలంగాణా మిల్లు యజమానులు కోరుతున్నది. ఇక్కడ ఎందరో స్త్రీ,పురుషులు ఏకవస్త్రాలతో కాలం గడుపుతున్న చేదు నిజం, సిగ్గుపడాల్సిన విషయం అందరికీ తెలుసు. విదేశాల వారికి ఇచ్చే రాయితీని మనవారికి ఎందుకు ఇవ్వరు ? గతంలో తెల్లవారు ప్రపంచంలో ఎక్కడ వ్యవసాయం చేస్తే అక్కడికి మన దేశం నుంచి ఆ పొలాల్లో పనిచేసేందుకు రైతులు, వ్యవసాయ కూలీలను తీసుకుపోయారని చరిత్రలో చదువుకున్నాం. అక్కడ పనిచేసే వారు లేకనా ? కానే కాదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తోంది, చౌకగా పని చేయటానికి సిద్ధ పడ్డారు కనుక. ఇప్పుడు వ్యవసాయ కూలీల బదులు ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు అలాంటి చౌక కూలీలుగా ధనిక దేశాలకు వెళుతున్నారా లేదా ?

     సంస్కరణల పేరుతో మనం అనుసరిస్తున్న విధానాలు అంతిమంగా ఏ ఫలితాలు ఇస్తాయన్నది గీటు రాయిగా వుండాలి. చైనా కూడా సంస్కరణలు అమలు జరుపుతున్నది.మనకంటే వెనుకగా స్వాతంత్య్రం పొందింది. మన పెద్దలు కొందరు చెప్పినట్లు వారు నల్లమందు భాయిలుగా వున్నపుడు మనం ఎంతో తెలివితేటలతో వున్నాం. ఇప్పుటి పరిస్ధితి ఏమిటి? జపాన్‌ను పక్కకు తోసి అమెరికాతో ఒకటవ నంబర్‌ స్థానానికి నువ్వా నేనా అని పోటీ బడుతున్నారు వారు. మన వారు నల్ల మందులేకుండానే మత్తులో జోగుతున్నారా ? పత్తి విషయాన్నే తీసుకుందాం. చైనా విధానం ప్రకారం దేశీయంగా పండిన పత్తితో పాటు దిగుమతులను కూడా ప్రభుత్వ సంస్ధలే చేపడతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వున్న ధరల కంటే ఎక్కువే అక్కడి రైతులకు చెల్లిస్తున్నారన్నది చైనా అంటే ఇష్టం లేనివారు కూడా అంగీకరిస్తున్న సత్యం. అదే ప్రభుత్వం పత్తిని సేకరించి మిల్లులకు కూడా విక్రయిస్తున్నది. దానితో వస్త్రాలు,దుస్తులు తయారు చేసిన కంపెనీలు ఇతర దేశాలకంటే చౌకగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు విక్రయిస్తున్నాయని మన వారే గగ్గోలు పెడుతున్నారు కదా ? మన కంటే రైతులకు రెట్టింపు మద్దతు ధర ఇచ్చి మిల్లులకు సరసమైన ధరలకు పత్తిని విక్రయించటం అక్కడ ఎలా సాధ్యమైంది? ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు.

     గతేడాది నుంచి చైనా ప్రభుత్వం పత్తి దిగుమతులను నిలిపివేసింది, తన వద్ద వున్న నిల్వలలో కొంత భాగాన్ని వేలం పద్దతిలో ప్రతినెలా విక్రయిస్తోంది. దాంతో ప్రపంచ వ్యాపితంగా పత్తి ధరలు పడిపోయాయి.అయినా రైతాంగానికి ఎలాంటి నష్టమూ రాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం పత్తి ధరలు ప్రపంచ మార్కెట్లో పౌను ధర 140-150 సెంట్ల వరకు పలికింది. గతేడాది న్యూయార్క్‌ మార్కెట్‌లో ధరు 66-70 సెంట్ల మధ్యనే కదలాడింది. అయినప్పటికీ చైనా రైతులు అంతకు మించి 85 సెంట్లకు పైగా పొందారు. ఏ ఒక్క పత్తి రైతూ నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నవార్తలు మనం వినలేదు. పత్తి ధరలు ప్రపంచ మార్కెట్‌ కంటే ఎక్కువగా వుండి మిల్లులు మూసి వేసిన యజమానులూ లేరు ? అందరికీ ప్రయోజనం కలిగించే విధానాన్ని, సంస్కరణలను మన ప్రభుత్వాలు ఎందుకు అనుసరించవు ? వాటికి ఎవరు అడ్డం పడ్డారు, మనది ప్రజాస్వామ్యం కదా హాని కలిగించే విధానాల గురించి ఎందుకు మనం చర్చ జరపటం లేదు?