Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

    ఎదుటి వారు తొడ కోసుకున్నారని మనం మెడ కోసుకుంటామా ? బుద్ధిలేని తనం అంటారు పెద్దలు ! కొన్ని దేశాలు పెట్టుబడిదారీ విధానం, కొన్ని దేశాలు సోషలిస్టు విధానాన్ని ఎంచుకుంటే మనం మిశ్రమ ఆర్ధిక విధానం ఎంచుకున్నాం. మధ్యేమార్గం అన్నారు ఎందరో ! ప్రపంచ దేశాలన్నీ మనలను చూసి నేర్చుకుంటున్నాయని, మనకు విదేశీ సిద్ధాంతాలు వద్దు, విధానాలు వద్దు అని కొందరు చెబుతున్నారే, వారే వాటికి తూనా బొడ్డు చెప్పి (స్వస్థి) అనుకరిస్తే భారతీయత మట్టి కరిచిపోదా ? సంస్కరణలు అమలు జరిపినంత మాత్రాన చైనా సోషలిస్టు విధానాన్ని వదలి వేసిందా ? అమెరికా, జపాన్‌ వంటి పెట్టుబడిదారీ దేశాలలో సైతం కొన్ని మార్పులు తప్ప వారు నమ్మిన పెట్టుబడిదారీ విధానాన్ని వదులుకోలేదే ? మరి మనం ఎందుకు మన మిశ్రమ ఆర్ధిక విధానం నుంచి దారి తప్పుతున్నాం ?( దానిని కూడా విమర్శించే వారు వున్నారు) ఇక మన దేశ ప్రత్యేకత ఏముంది? ఇది భారతీయతా ? జనానికి మేలు చేయని సంస్కరణలు ఎవరికోసం ? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం.

    వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి వుపాధి కల్పిస్తున్న జౌళి రంగంలో మరిన్ని సంస్కరణలకు తెరతీసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.దేన్నయినా మూసిపెడితే పాచిపోతుందని తెలిసిందే. అలాగే ఎప్పటి కప్పుడు సంస్కరించుకోకపోతే ఏదీ పనికిరాదు. కానీ ఎలా సంస్కరించుకోవాలనేదే సమస్య? దీని గురించి పెద్దగా ఎక్కడా చర్చలు జరపలేదు, పర్యటనకు వచ్చిన ప్రతిసారీ పత్రికా గోష్టి జరిపి గలగలా మాట్లాడేవెంకయ్య నాయుడి వంటి వారు కూడా కనీసం ఆఫ్‌ ది రికార్డుగా కూడా వుప్పందించలేదే ? శత సహస్ర లేఖా రచయిత అవార్డుకు ఏకైక అర్హుడైన బండారు దత్తాత్రేయ కనీసం కార్మికులకు దీని గురించి ఒక్క లేఖయినా రాసినట్లు వినలేదు. మేము భారత మితవాదులం అని సగర్వంగా చెప్పుకొనే స్వరాజ్య పత్రికలో బ్రిజ్‌ మోహనలాల్‌ ముంజాల్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధి శ్రేయాస్‌ భరద్వాజ ఒక వ్యాఖ్యానం రాశాడు. అతను యువ మితవాది అని, తోటి విద్యార్ధులలో మితవాద భావాలను వ్యాపింపచేస్తున్నాడని ఆ పత్రిక అతని గురించి సగర్వంగా పరిచయం చేసింది. కేంద్ర ప్రభుత్వం జూన్‌ 22న ఒక జౌళి పాకేజిని ఆమోదించిందని, దానిలో సబ్సిడీల భాగం అంత ముఖ్యమైనదేమీ కాదు గాని దానిలో కార్మిక సంస్కరణల గురించి ఒక్క ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ తప్ప మీడియా వాటిని పట్టించుకోలేదు అని అతను వ్యాఖ్యానించాడు.

   అదేమీ నరేంద్రమోడీ విజయగాధ కాదు కనుక, ఆ వార్తను ప్రముఖంగా ప్రచురిస్తే తమ యజమానులు, వారికి ప్రకటనల ద్వారా అండదండలిచ్చే కార్పొరేట్‌ సంస్ధల యజమానులు, మాకు లేని పోని తలనొప్పి తెచ్చారు అని విమర్శించే పాలకపార్టీ నేతలతో తలనొప్పి ఎందుకు ? రాయకపోతే ఎవరు అడగొచ్చారు అని మీడియా కావాలనే వదలివేసిందని వేరే చెప్పనవసరం లేదు. ఇంతకూ ఏమిటా సంస్కరణలు. మేకను బలి ఇవ్వబోయే ముందు దానికి తిన్నంత తిండి పెడతారు, కడుగుతారు, అలంకరిస్తారని తెలిసిందే. అది మేక కనుక అమాయకంగా తింటుంది. కానీ కార్మికులు అలా కాదు కదా అందుకని వారి నోరు మూయించాలంటే వారిని ఆకర్షించాలి. అందుకుగాను కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవేమంటే,

     నెలకు పదిహేను వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న దుస్తుల పరిశ్రమల కొత్త కార్మికులకు మొదటి మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వమే ప్రావిడెంట్‌ ఫండ్‌ పధకం కింద యజమానుల తరఫున 12శాతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందట. ప్రధాన మంత్రి రోజ్‌గార్‌ ప్రస్థాన్‌ యోజన(పిఎంఆర్‌పివై) పధకం నుంచి ఇప్పటికే చెల్లిస్తున్న 8.33 శాతానికి అదనంగా 3.67శాతాన్ని జౌళి మంత్రిత్వశాఖ ఖాతా నుంచి చెల్లిస్తారట. ఎంత వుదారత్వం ! ఈ మొత్తం రానున్న మూడు సంవత్సరాలలో రు.1170 కోట్లు వుంటుందని అంచనా. పదిహేను వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ పధకంలో చేరాలా లేదా అనే ‘స్వేచ్ఛ’ ఇస్తారట. దీని వలన కార్మికుల చేతిలో మరింత డబ్బు వుండటంతో పాటు సంఘటిత రంగంలో వుపాధిని పెంచటానికి తోడ్పడుతుందట. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) విధానం ప్రకారం వారానికి ఎనిమిది గంటలకు మించి ఓవర్‌టైమ్‌ దాట కూడదు, కొత్త విధానం వలన ఆ గంటలు బాగా పెరుగుతాయి.ఈ పరిశ్రమ స్వభావాన్ని బట్టి దుస్తుల తయారీ రంగంలో నిర్ణీత వ్యవధి వుపాధి విధానాన్ని ప్రవేశపెడతారు, ఆ కార్మికులను ఇతర పర్మనెంటు కార్మికులతో సమంగా చూస్తారు, అంటే పని గంటలు, వేతనాలు, అలవెన్సులు, ఇతర చట్టబద్దంగా వర్తించేవన్నీ వారికి వర్తింప చేస్తారట. సంవత్సరానికి ఆరువేల కోట్ల రూపాయల చొప్పున కేంద్రం కేటాయించే ఈ రాయితీల వలన ప్రస్తుతం 17బిలియన్‌ డాలర్లుగా వున్న మన వస్త్ర ఎగుమతులు మూడు సంవత్సరాలు తిరిగే సరికి 43 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయనీ, ప్రత్యక్ష, పరోక్ష వుపాధితో కోటి మంది లబ్ది పొందుతారని కేంద్ర ప్రభుత్వం ఒక రంగుల కలను మన ముందుంచింది.

   మన ఎగుమతులన్నీ వరుసగా గత ఏడాదిన్నర కాలంగా పడిపోయినట్లు ఒకవైపు అధికారికంగా చెబుతున్నారు. అయినా ఇంత ధైర్యంగా కేంద్రం చెబుతున్నదంటే నరేంద్రమోడీకి ఏ విదేశీ పర్యటనలోనో మన దేశం నుంచి ఎప్పుడో తరలి పోయిన గొప్ప మంత్రదండం లేదా మన పురాణాల్లోని అక్షయపాత్రలు దొరకటమో, ఇతర అద్బుతశక్తులు అయినా ఆవహించి వుండాలి లేదా మన సంస్కృత పండితులు వేదాలు, పురాణాల్లో నిక్షిప్తంగా వున్న వాటిని ఎట్టకేలకు వెలికి తీసి వుండాలి. ఏదో జరగక పోతే ఇలా చెబుతారా ?కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కార్మిక సంస్కరణలంటూ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలను వూరిస్తున్నది.

    శ్రేయాస్‌ భరద్వాజ తన వ్యాఖ్యానంలో ఒక విషయం చెప్పాడు. యజమానుల చిత్తం వచ్చినట్లు కార్మికులను తొలగించటానికి, పెట్టుకోవటానికి అవకాశం ఇచ్చే, రాత్రి పూట కూడా మహిళలను పనిచేయటానికి అనుమతించటం, 24 గంటలూ దుకాణాలు తెరిచి వుంచటం వంటి సంస్కరణలను పార్లమెంట్‌లో ప్రతిపాదించాలని కేంద్రానికి వుత్సాహం వున్నప్పటికీ ‘ వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలు, రాజ్యసభలో తగిన మెజారిటీ లేకపోవటం వలన సంస్కరణలకు బ్రేక్‌ వేయాలని మంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్న అరుణ్‌ జెట్లీ కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కోరారని, అయితే పరోక్ష మార్గంలో లక్షిత రంగాలలో సబ్సిడీ పాకేజీలతో కలిపి ప్రవేశ పెడుతున్నారని ‘ యువ మితవాద భరద్వాజ వ్యాఖ్యానించాడు. నరేంద్రమోడీ సర్కార్‌ ఎత్తుగడను చక్కగా ప్రతిబింబించాడు.

   భారత మాతాకీ జై మార్కు దేశ భక్తులు, ఇతరులూ తరచూ లేవనెత్తే ప్రశ్నల గురించి కూడా చెప్పుకోవాలి. గత ఏడు దశాబ్దాల విధానాలు మన దేశాన్ని ముందుకు తీసుకుపోనపుడు మనం సంస్కరణలు అమలు జరపనవసరం లేదా ? కమ్యూనిస్టు చైనాలో సంస్కరణలను సమర్ధిస్తారు, అదే భారత్‌లో వ్యతిరేకిస్తారెందుకు మోడీపై గుడ్డి వ్యతిరేకత కాదా ? ఇంకా అటూ ఇటూ తిప్పి ఇంకా ఇలాంటివే అనేక మంది లేవనెత్తుతున్నారు.ప్రారంభంలోనే కొన్ని అంశాలను ప్రస్తావించాను.

     సంస్కరణలు అంటే ఏమిటి ? పదునైన కత్తితో మగవారు గడ్డం గీసుకోవచ్చు, స్త్రీ,పురుషులు కూరగాయలు తరగవచ్చు, మామిడి కాయలు కోసుకోవచ్చు, గూండాలు ప్రాణాలు తీయవచ్చు, అసహాయులు ఆత్మరక్షణకు వుపయోగించుకోవచ్చు. సంస్కరణలు కూడా అలాంటివే. ఎవరు అమలు చేస్తున్నారనేదానిని బట్టి వాటి ప్రయోజనం, ఫలాలు, పర్యవసానాలు వుంటాయి. అణు పరిజ్ఞానాన్ని బాంబుల తయారీకి వినియోగించి వాటిని జపాన్‌పై ప్రయోగించి అమెరికా ప్రపంచాన్ని భయపెట్టింది. అణుబాంబులను మరోసారి ప్రయోగించం అని చెప్పటానికి అమెరికా ఇప్పటికీ నిరాకరిస్తోంది. అదే అణుశక్తిని ప్రాన్స్‌ వంటి దేశాలు బాంబుల తయారీతో పాటు విద్యుత్‌ తయారీకి కూడా వినియోగిస్తున్నాయి. అణు సంస్కరణలలో భాగంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్‌పిటి) కొన్ని దేశాలు ప్రతిపాదించాయి. అనేక దేశాలు సంతకాలు చేశాయి, భారత్‌ తిరస్కరించింది. ఈ సంస్కరణ లేదా ఒప్పందం తనకు నష్టదాయకం కనుకనే భారత్‌ తిరస్కరించింది. అణురంగంలో ఎంతో ముందున్న దేశాలు ఇతర దేశాలు ఆ పరిజ్ఞానాన్ని సముపార్జించకుండా చేసేందుకే ఎన్‌పిటి అస్త్రాన్ని వాడుతున్నాయి. సంస్కరణలు కూడా ఇలాంటివే. వాటి వలన లబ్ది పొందే శక్తులు అమలు జరపాలని కోరతాయి, నష్టపోయే శక్తులు వ్యతిరేకిస్తాయి. దుస్తుల తయారీ కంపెనీల వారు కారు చౌకగా తయారు చేసి విదేశాలకు చౌకగా ఎగుమతి చేసి లాభాలు పోగు చేసుకోవాలని చూస్తారు. అమెరికా, ఐరోపా దేశాల వారు దారిద్య్రం తాండవించే బంగ్లాదేశ్‌లో తమ ఫ్యాక్టరీలను పెట్టి చౌకగా దుస్తులు తయారు చేయించి వారే దిగుమతి చేసుకుంటున్నారు. అందుకే వాటిపై పన్నులు మినహాయింపు ఇచ్చారు. తాజాగా వస్తున్న వార్తలను బట్టి చైనాలో వేతనాలు పెరుగుతున్నందున విదేశీ కంపెనీలు ఇతర దేశాలకు తమ కార్యకలాపాలను తరలిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకోవాలని భారత పెట్టుబడిదారులు ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది.అందుకే నరేంద్రమోడీ సర్కార్‌ రాయితీల ప్రకటనతో పాటు కార్మిక సంస్కరణలనూ జమిలిగా అమలు జరిపేందుకు నిర్ణయించింది.

      పిల్లి నల్లదయినా ఎలుకలను పడితే ఎవరికీ ఇబ్బంది లేదు. అమలులో వున్న కార్మిక చట్టాలనే యాజమాన్యాలు పట్టించుకోవటం లేదు, అమలు జరిపే యంత్రాంగమే లేదు. ఈ స్ధితిలో వున్నవాటిని ఇంకా నీరుగారిస్తే చీకటి రోజుల్లోకి కార్మికులు నెట్టబడతారు. అందుకే ఇక్కడ కార్మికులు సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు.అది కాంగ్రెస్‌ పార్టీ అయినా బిజెపి అయినా తెలుగు దేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నా డిఎంకె ఏదైనా కావచ్చు. ఎవరు అధికారంలో వుంటే వారిని వ్యతిరేకిస్తారు. అందువలన నరేంద్రమోడీ కనుక వ్యతిరేకిస్తున్నారు అనేది తప్పుడు ప్రచారం, ఎదురుదాడి మాత్రమే. కార్మికులు లేదా వారికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు సంస్కరణలను వ్యతిరేకించటం లేదు. ప్రజా వ్యతిరేక అంశాలనే ప్రతిఘటిస్తున్నాయి. అది తగినంత లేని కారణంగా ఫలితాలు కనిపించటం లేదు, పాలకులు మరిన్ని దారుణమైన చట్టాలను రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ రేటు విషయంలో వామపక్షాలు, కార్మిక సంఘాలతో నిమిత్తం లేకుండానే ఎక్కడిక్కడ కార్మికుల్లో తలెత్తిన నిరసనకు భయపడే ఎన్‌డిఏ సర్కార్‌ వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. అంతెందుకు రాజకీయంగా బిజెపిని సమర్ధించే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘమైన బిఎంఎస్‌ కార్మిక సంస్కరణలను, అనేక ప్రభుత్వ నిర్ణయాలను మాట మాత్రంగా అయినా వ్యతిరేకించకపోతే మనుగడ సాగించలేని స్ధితికి నెట్టబడిందా లేదా ? అంటే వ్యతిరేకించే వారిది గుడ్డి వ్యతిరేకత కాదన్నది స్పష్టం. అది గోబెల్స్‌ ప్రచారమే. కమ్యూనిస్టు చైనాలో సంస్కరణలను ఆమోదించి, ఇక్కడ వ్యతిరేకిస్తారెందుకు ? దీనికి సమాధానం పెద్ద కష్టమేమీ కాదు. మరొక వ్యాసంలో దాని గురించి చర్చిద్దాం. ఇక్కడ ఒక ప్రశ్న. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగమైన బిజెపి ప్రతిపాదిస్తున్న లేదా అమలు జరుపుతున్న సంస్కరణలను ఇతర విభాగాలైన బిఎంఎస్‌,స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఒక కుటుంబంలోని కొంత మంది సభ్యులే వ్యతిరేకిస్తున్నపుడు బయటివారి వ్యతిరేకత గురించి వేలెత్తి చూపే హక్కు వుందా ? చైనాలో సంస్కరణల గురించి చెప్పేవారు వాటితో పాటు అక్కడ కార్మికులకు ఇచ్చిన హక్కులు, ఇతర సౌకర్యాల గురించి మాట్లాడరేమి ?