Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

      ఎదుటి వారి ప్రతికూలతలను తమ అనుకూలతలుగా మార్చుకోవటం లాభార్జనా పరుల నిరంతర ప్రయత్నం. జౌళి రంగంలో అటువంటి అవకాశాలనే తమ లాభాలకు వినియోగించుకోవాలని స్వదేశీ, విదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు తహతహలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న లేదా ప్రచారం చేస్తున్నదాని ప్రకారం రానున్న మూడు సంవత్సరాలలో జౌళి రంగంలో 11 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే ఆ రంగంలో మన ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్లు పెరుగుతాయి. కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష వుపాధి లభిస్తుంది. దీని కోసం ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వటానికి, ఇంకా కొన్నివేల కోట్ల పన్ను, ఇతర పరోక్ష రాయితీలు ఇవ్వటానికి కొత్త ప్రోత్సాహక పధకాన్ని ప్రకటించింది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఇంత తక్కువ ఖర్చుతో అంత పెద్ద మొత్తం ప్రయోజనం కలుగుతుందంటే ఎవరు కాదంటారు? ఈ రంగంలో ఇప్పటికే మన కంటే ఎంతో ముందున్న బంగ్లాదేశ్‌ వంటి దేశాలు ఎంత పేదవైనా వాటి మార్కెట్‌ను నిలబెట్టుకోవటానికి ఇంతకంటే ఎక్కువ రాయితీలు ఇవ్వలేవా అన్నది అర్ధంగాని ప్రశ్న.

      మన ఆత్రాన్ని సొమ్ము చేసుకొనేందుకు, వూరించి ముందుకు దూకించేవారు ఎప్పుడూ వుంటారు. మన కేంద్ర ప్రభుత్వం రానున్ను మూడు సంవత్సరాలలో 17 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 40 దాటిస్తామని చెబుతుంటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా మూడేండ్లలో 40 ఏమిటి పది సంవత్సరాలలో 150 బిలియన్‌ డాలర్ల సత్తా మీకు వుందని మన సిఐఐ(కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) నియమించిన అమెరికా సంస్ధ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బిసిజి) ఒక నివేదిక ఇచ్చింది.దాని ప్రకారం 2025 నాటికి భారత జౌళిరంగం 300 బిలియన్‌ డాలర్ల విలువకు చేరుతుందని, 150 బిలియన్‌ డాలర్ల విదేశీమారక ద్రవ్య ఆర్జనతో పాటు ఐదు కోట్ల మందికి అదనంగా వుపాధి కల్పించవచ్చని, వారిలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది మహిళలు వుంటారని లెక్కలు చెప్పింది. దీనికి గాను అది చెప్పిన ఆధారాలు ఏమిటంటే చైనా యువాను విలువతో పాటు అక్కడ వేతనాలు పెరుగుతున్నాయి కనుక పరిశ్రమలు అక్కడి నుంచి తరలి పోతున్నాయి, అందువలన చైనాతో పాటు అలాంటి ఇతర దేశాల వాటిని భారత్‌ ఆకర్షిస్తే 280 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతుల మార్కెట్‌ను పట్టుకోవచ్చని ఆ నివేదిక మన ముందు ఒక రంగుల కలను సాక్షాత్కరింప చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాలు ముందు పీఠీన వున్నప్పటికీ, ఆఫ్రికాలో ఇథియోపియా వంటి కొత్త కేంద్రాలు వునికిలోకి వస్తున్నప్పటికీ,అమెరికాలో తిరిగి పెద్ద ఎత్తున వుత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ భారత్‌కు ఈ అవకాశాలు వుంటాయని బిసిజి నమ్మబలికింది.

   మన జనానికి వుపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే. అందుకు తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ ప్రజల, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చేయాలా అన్నదే సమస్య.స్వాతంత్య్రానికి ముందు బ్రిటన్‌ తన గ్లాస్గో (పాత తరం వారికి గ్లాస్గో పంచెలు ఇప్పటికీ గుర్తు వుంటాయి) తదితర నగరాలలో వున్న వస్త్ర కర్మాగారాల కోసం మన దేశాన్ని పత్తి సరఫరా చేసే దేశంగానూ, అక్కడ తయారైన వుత్పత్తులను విక్రయించే మార్కెట్‌గానూ మార్చిందన్నది తెలిసిందే. అప్పుడు దాని వుత్పత్తులకు ప్రపంచంలోని వలస దేశాలన్నింటినీ మార్కెట్‌లుగా మార్చి తన పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చింది. ఇప్పుడు కూడా బ్రిటన్‌ తన కర్మాగారాలకు అవసరమైన పత్తిని ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయదు. ఎందుకంటే అలా దిగుమతి చేసుకొని తన కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇచ్చి వుత్పత్తి చేయిస్తే అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు ఎలా వుంటాయి. అందువలన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చౌకగా శ్రమశక్తి దొరుకుతుందో అక్కడే తనకు కావాల్సిన దుస్తులను తయారు చేయించుకుంటే అదే లాభసాటిగా వుంటోంది కనుక ఏకంగా తన ఫ్యాక్టరీలను ఆయా దేశాలకు తరలించటం లేదా కొత్త ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేయిస్తున్నది.ఇదేదో బ్రిటన్‌ ఒక్కటే చేస్తున్నది కాదు, అన్ని ధనిక దేశాలదీ ఇదే బాట. నీరు పల్లంవైపు, పెట్టుబడిదారుడు లాభాలవైపు పయనిస్తాడు. గతంలో దేశాలను అక్రమించుకుంటే లాభాలు, ఇప్పుడు శ్రమశక్తితో తమకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటే, ఇతర దేశాల దగ్గర లేని ఆధునిక పరిజ్ఞానంతో తన దగ్గర తయారయ్యే వస్తువులకు మార్కెట్లను పట్టుకుంటే సిరులు, అందుకే పద్దతులను మార్చారు.

    అమెరికా వాణిజ్యవేత్తలు, బంగ్లాదేశ్‌, వియత్నాం, చైనాల నుంచి దుస్తులు, బొమ్మలు, ఇతర సామగ్రిని దిగుమతి చేసుకొని, తమ వద్ద పాతబడిపోయిన అణు కర్మాగారాలు, మిలిటరీ ఆయుధాలను మన వంటి దేశాలకు అంట గట్టి లాభాలు పొందుతున్నారు. ఇవేవీ లేకపోతే పెట్టుబడి పెట్టనవసరం లేదు, ఫ్యాక్టరీ కట్టనవసరం లేదు, వ్యాపార దుకాణాలూ తెరవనవసరం లేదు. లాభాల బాటలో వున్న మన వంటి దేశాల కంపెనీల వాటాలను వుదయం కొనుగోలు చేసి సాయంత్రానికి వాటి విలువ పెరిగితే అమ్ముకొనీ లబ్ది పొందుతున్నారు. ఈ పని చేయటానికి సూట్‌ కేసులతో మన ముంబయ్‌ రానవసరం లేదు, సినిమాలలో చూపినట్లు ఏ విలాస కేంద్రంలోనో మందు, మగువలతో కూర్చొని ఇంటర్నెట్‌తో మీటలు నొక్కితే చాలు.

    భారత్‌ను చైనాతో పోల్చితే కొంత మందికి తేళ్లూ జెర్రులు పాకినట్లుంటాయి. అది నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం దానికీ దీనికీ పోలికా అని రంకెలు వేస్తారు. చైనా మాదిరి సంస్కరణలను మన దేశంలో సంస్కరణలు అమలు జరిపితే వ్యతిరేకిస్తారు అని కమ్యూనిస్టుల మీద నిందలు వేసేటపుడు మాత్రం వారికి అప్పుడు చైనా కావాలి. కానీ వారే మరో సందర్భంలో త్వరలో మన దేశం చైనాను అధిగమించబోతోందని లొట్టలు వేసుకుంటూ చెబుతూ తమ జబ్బలను తామే చరుచుకొని శభాష్‌ అని చెప్పుకుంటారు.అంతెందుకు కమ్యూనిస్టులను వ్యతిరేకించే మన వ్యాపారులు గత కొద్ది సంవత్సరాలుగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతోనే వ్యాపారాలు చేసి లాభాలు పోగు చేసుకోవటం లేదా? వారికి అక్కడి కమ్యూనిజం అడ్డం రావటం లేదేం? ఇది అన్యాయం కదా !

    ‘ఆసియా బ్రీఫింగ్‌’ అనే ఒక పత్రిక వుంది. అదేమీ కమ్యూనిస్టు, వామపక్ష పత్రిక కాదు. పెట్టుబడిదారుల సేవలో వుంటుంది. మూడు సంవత్సరాల క్రితం ఒక విశ్లేషణలో రెండు దేశాలలో వున్న కనీస వేతనాల గురించి ఒక పోలికను ఇచ్చింది.http://www.asiabriefing.com/news/2013/07/comparison-minimum-wages-in-china-and-india/ దానిలో రెండు దేశాలలోని కొన్ని ప్రధాన నగరాలలో కనీస వేతనాలు ఎలా వున్నాయో తెలిపింది. వాటిని దిగువ చూడవచ్చు.2013 జూలై 18న ప్రచురించిన ఆ వ్యాసంలో నాడు డాలరు విలువ రు.59.42గానూ, యువాన్లు 6.14గానూ వున్నాయి.

పట్టణం              నెలవేతనం స్ధానిక కరెన్సీ          అమెరికా డాలర్లలో

ఢిల్లీ                        6,448                                110

హైదరాబాదు              4,940                                  83

ముంబై                    4,940                                  83

జైపూర్‌                     4,030                                 68

అహమ్మదాబాదు         3,900                                 65

చెన్నయ్‌                  3,041                                51

షాంఘై                    1,620                                264

గ్వాంగ్‌జు                  1,550                                253

హాంగ్‌జౌ                   1,470                                240

టియాన్‌జిన్‌               1,500                                245

బీజింగ్‌                     1,400                                228

దలియన్‌                   1,300                               212

     కనీస వేతనాలపై కార్మికుల సంక్షేమ చర్యలకు గాను యజమానులు అదనంగా సగటున 30 నుంచి 50శాతం వరకు చెల్లించాలని, అదే భారత్‌లో గరిష్టంగా పదిశాతానికి మించి లేదని కూడా ఆ పత్రిక విశ్లేషణ పేర్కొన్నది. చైనాలో కనీస వేతనాలు, సంక్షేమ చర్యలకు యాజమాన్యాలు చెల్లించాల్సిన మొత్తాలు ఏటికేడు పెరుగుతున్నాయి తప్ప ఏదో ఒకసాకుతో కోత పెట్టటం లేదు. అందుకనే విదేశీ ప్రయివేటు యజమానులు చైనాలో తమకు గిట్టుబాటు కావటం లేదని సణగటం మొదలు పెట్టటమే కాదు, ఎక్కువ లాభాలు వచ్చే ప్రాంతాలకు వలసపోవటం ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ ఆదేశాలను అమలు జరపకపోయినా లేక కోత పెట్టినా అక్కడ కార్మికులు ప్రతిఘటించటమే కాదు, అవసరమైతే సమ్మెలకు కూడా దిగుతున్నారు. కనీస వేతనాల పోలిక చేసిన ఆసియా బ్రీఫింగ్‌ పత్రిక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల కార్యకలాపాల ప్రారంభానికి భారత్‌ కీలకం అని మూడు సంవత్సరాల నాడే తన వ్యాఖ్యలో పేర్కొన్నది. అంటే ఘనత వహించిన నరేంద్రమోడీ అధికారానికి రాక ముందే అని వేరే చెప్పనవసరం లేదు.ఎఫ్‌డిఐలు ఎక్కడ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో ప్రపంచ పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చేందుకు 1992లో ఏర్పాటయిన డిజాన్‌ షిరా అండ్‌ అసోసియేట్స్‌ స్థాపకుడు క్రిస్‌ డేవన్‌ షైర్‌ విల్స్‌ రాసిన వ్యాసంలో పై వివరాలు పేర్కొన్నారు.

    కార్మికులకే కాదు, రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వటంలోనూ, సగటు దిగుబడులను పెంచే వంగడాలు, ఇతర పెట్టుబడులను సమకూర్చటంలోనూ అక్కడి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటున్నది. పత్తికి ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని ధరలను ఇవ్వటమే కాదు, వుత్పత్తి కేంద్రాలనుంచి కొనుగోలు కేంద్రాలకు చేర్చే రవాణా ఖర్చులను కూడా భరిస్తున్నది. ఇదంతా రెండు దేశాలలో సంస్కరణలు అమలు జరిగిన తరువాత తలెత్తిన పరిస్థితి. అందువలన ఏ సంస్కరణలను వ్యతిరేకించాలి? వేటిని సమర్ధించాలి ? కావాలంటే జనానికి మేలు చేసే సంస్కరణలకు ముందు తగిలిస్తున్నట్లు ప్రధాని పేరు తగిలించి అమలు జరపండి ఇబ్బంది లేదు. అవేమీ లేకుండా కార్మికులు కడుపుకట్టుకొని పెట్టుబడిదారులు,వ్యాపారులకు లాభాలు చేకూర్చాలని చూస్తే జనమే కాదు, దేశం కూడా నష్టపోతుంది.

   విచక్షణా రహితంగా విదేశీ కంపెనీలను, దిగుమతులను అనుమతిస్తే దేశీయ పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతింటాయి.అందుకే ఇక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రక్షణ చర్యలు కోరుతున్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలలో ఎక్కడ లాభసాటిగా అక్కడకు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. జపాన్‌ తన సామాన్యుల కారు మారుతీ తయారీని భారత్‌లో ప్రారంభిస్తే విలాసవంతమైన జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ కార్ల ఫ్యాక్టరీని మన టాటా మోటార్స్‌ చైనాలోని చాంగుషులో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఇక్కడ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోమని చెబుతున్నారు.చైనా కూడా అదే పని చేసింది. అదే సమయంలో తన అంతర్గత వినియోగాన్ని కూడా పెంచే క్రమంలో తన పౌరుల ఆదాయాలను గణనీయంగా పెంచింది. అందుకే ప్రపంచ ధనిక దేశాలలో తీవ్ర మాంద్యంతో ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ దాని ఆర్ధిక వ్యవస్ధపై పెద్ద ప్రభావం పడలేదు. అటువంటి పరిస్థితి మన దేశంలో వుందా ? విధానాలు అందుకు అనుగుణంగా వున్నాయా ? గౌరవంగా బతికేందుకు అవసరమైన వేతనాలు పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గటం, స్వల్పవేతన వుద్యోగులు, కార్మికుల సంఖ్య పెరగటం దేనికి సూచిక ?

     సులభంగా వ్యాపారం చేసేందుకు అవకాశాల పేరుతో ప్రతి ఏడాదీ ప్రపంచబ్యాంకు ఒక సూచికను తయారు చేస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ప్రపంచంలోని 189 దేశాలలో భారత్‌ 134వ స్థానంలో వుంది, దానిని 50లోపుకు చేరుస్తానని ప్రపంచ పెట్టుబడిదారులకు మోడీ హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల తరువాత అది 130 స్థానంలో వుంది. ఆ యావలో మోడీ కార్మికులకు, సామాన్య జనానికి, దేశం మొత్తానికి హాని కలిగించే విధంగా మన ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా బార్లా తెరిచేందుకు పూనుకున్నారు. బ్రిటీష్‌ వ్యాపారులు స్ధానిక రాజులు, రంగప్పలను లోబరుచుకొని మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు స్వతంత్ర పాలనలో ఏకంగా ప్రభుత్వమే జనం పేరుతో అన్ని దేశాల వారికి దేశాన్ని అప్పగించేందుకు పూనుకుంది. ఏడుపదుల స్వాతంత్య్రం వెనక్కు పోతోందా? ముందుకు పోతోందా ? ఏది దేశ భక్తి? ఏది దేశద్రోహం, ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?