Tags
ఎం కోటేశ్వరరావు
కొన్ని గంటల్లోనే ఎంత తేడా !’విడాకులివ్వాలని నిర్ణయించుకున్న తరువాత రోషం, పౌరుషం వున్నవాళ్లెవరైనా వెంటనే ఇల్లు వదలి వెళ్లి పోవాలి.ఇక్కడే వుండి మరో నాలుగు నెలల తరువాత నోటీసు పంపుతాను అనటం ఏమిటి? మనం ఏమైనా పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటున్నామా లేక మన మధ్య సన్నిహితమైన ప్రేమ ఏడిచింది గనుకనా ? వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ‘ ఐరోపా యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకున్నట్లు ఓటింగ్ వివరాలు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే యూనియన్ కమిషన్ అధ్యక్షుడు పెరీ మాస్కోవిసీ అన్న మాటల సారాంశమిది. విడిపోవాలనుకున్న తరువాత కొత్త పితలాటకాలు పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్లి పోతే మంచిది అని ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ మార్క్ రాల్ట్ తో సహా అనేక మంది ఐరోపాయూనియన్ విదేశాంగ మంత్రులు బ్రిటన్‌కు సూచించారు. రాజీనామా ప్రకటించిన ప్రధాని కామెరాన్ వెంటనే వైదొలిగితే మంచిది, వైదొలగే ప్రక్రియను సాగదీయ కుండా నిబంధనావళిలోని ఆర్టికల్ 50 అమలును వెంటనే కోరాలని, మిగిలిన వారు పీఠముడి పడిన పరిస్థితిలో వుండకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి బ్రిటన్‌కు సలహా ఇచ్చారు. వెళ్లిపోతామని ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎక్కువ కాలం కొనసాగటం బ్రిటన్‌కు మర్యాద కాదు అని కూడా ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించాడు. అక్టోబరులో తన వారసుడు వచ్చే వరకు వెళ్లి పోయే చర్చలను ప్రారంభించే అవకాశం లేదని కామెరాన్ ప్రకటించిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. నాలుగు నెలల పాటు ఎలుకా-పిల్లి మాదిరి వ్యవహరించటం మంచిది కాదని లక్సెంబర్గ్ మంత్రి, మేం తరువాత పేజీ తిప్పి ముందుకు పోవాలని నెదర్లాండ్స్ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రారంభం నుంచి ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ ధోరణి వేరుగానే వుంది. పీడా విరగడైంది, ఒక తలనొప్పి పోయిందనే భావం మంత్రుల వ్యాఖ్యలలో వెల్లడైంది.
అయితే తిరిగి ఓటింగ్ జరిపి మరోసారి అభిప్రాయం తీసుకోవాలంటూ బ్రిటన్‌లో లక్షల మంది పార్లమెంట్‌కు వినతి పత్రంపై సంతకాలు చేశారు. ఐరోపా యూనియన్ విదేశాంగ మంత్రులు కుర్రకారు మాదిరి బ్రిటన్‌లేని ఐరోపా యూనియన్ గురించి చర్చించాలంటూ విరుచుకుపడితే పెద్దమనిషి మాదిరి జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కుర్రాళ్లూ తొందర పాటు వద్దంటూ బ్రిటన్‌తో సంబంధాలు తెగకుండా దౌత్యానికి తెరతీశారు. విడిపోయిన తరువాత కూడా బ్రిటన్ను సహ సభ్యురాలిగా పరిగణించాలనే ప్రతిపాదన జర్మనీ నుంచి వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. ఫ్రెంచి నేతలు బ్రిటన్‌పై కాలుదువ్వుతున్న నేపధ్యంలో తాము బ్రిటన్‌కు వ్యతిరేకం కాదన్న సందేశం ఈ రూపంలో జర్మనీ పంపిందా అంటే కాదని చెప్పలేము. మొత్తానికి ఐరోపా యూనియన్‌లోని సభ్య దేశాల మధ్య విబేధాల వెల్లడికి, బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల జనం అసంతృప్తికి ఈ పరిణామాలు అద్దం పట్టాయి. బ్రిటన్‌లో అధికార, ప్రతిపక్షాలు రెండింటిలో ఈ పరిణామం ప్రకంపనలు సృష్టిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఒక్కసారిగా వులిక్కిపడింది. మరో తీవ్ర సంక్షోభానికి ఈ పరిణామం నాంది పలికిందా అని భయపడుతున్నది. ఓటింగ్ ఫలితాలు వెల్లడి అయిన తరువాత బ్రిటన్ సాధారణ ప్రజానీకానికి అంతకు ముందు మాదిరే మరో రోజు గడిచిందన్న వార్తలు వచ్చాయి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికార వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు అగ్రదేశంగా వున్న బ్రిటన్ తన వలసలను, మార్కెట్లను, పూర్వ ప్రాభవాన్ని కోల్పోయింది.మాజీ రాజు,జమిందారుల మాదిరి పూర్వీకులు సమకూర్చిన అడ్డగోలు సంపాదన మిగిలింది కనుక బెట్టు చేసే మాదిరి దాని పరిస్థితి. రెండు ప్రపంచ యుద్ధాలలో ఏ మాత్రం దెబ్బతినపోగా అటూ ఇటూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా పెట్టుబడిదారీ దేశాలలో అగ్రగామిగా ముందుకు వచ్చి ద్విముఖ వ్యూహం అనుసరించింది. సోవియట్ నాయకత్వంలో ముందుకు వచ్చిన సోషలిస్టు కూటమి దేశాలను దెబ్బకొట్టటం, పెట్టుబడిదారీ కూటమిలోని ఐరోపాలోని సామ్రాజ్యవాద దేశాలు తిరిగి తనకు పోటీగా తయారు కాకుండా చూసుకొనేందుకు నాటో సైనిక కూటమిని రుద్ది వాటి జుట్టుపట్టుకు కూర్చోవటం. ఐరోపా పునరుద్దరణ పేరుతో మార్కెట్లను తనఅదుపులోకి తెచ్చుకోవటం, ఆసియాలో మరో సామ్రాజ్యవాద దేశమైన జపాన్ను తన రక్షణ ఒప్పందంతో కట్టిపడవేయటం వంటి ఎత్తుగడలకు తెరతీసింది. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుసు అన్నట్లుగా అమెరికా దురాలోచన పసిగట్టిన ఐరోపా దేశాలు యుద్ధం ముగిసిన వెంటనే తమలో తాము సహకరించుకొనేందుకు గల అవకాశాలను వెతకటం ప్రారంభించాయి. యుద్ధంలో ఓడిపోయిన కారణంగా మిలిటరీలు రద్దయిన జర్మనీ, జపాన్ మిలిటరీకి ఖర్చు లేదు కనుక ఆ సొమ్మును పరిశోధన, అభివృద్ధికి కేటాయించి అచిర కాలంలోనే తిరిగి పట్టాలెక్కాయి. మార్కెట్లు, వలసలను కోల్పోయిన ఐరోపా దేశాలు దెబ్బలు తగిలిన వారందరూ ఒక చోట చేరి ఒకరి గాయానికి మరొకరు మందు రాసినట్లుగా తమలో తాము సహకరించుకొనే ప్రక్రియ 1948లోనే ప్రారంభమైంది. ఆక్రమంలో అంటీ ముట్టనట్లుగా వుండి పాతిక సంవత్సరాల తరువాత 1973లో బ్రిటన్ ఐరోపా ఆర్ధిక యూనియన్‌లో చేరింది.
1948లో హేగ్‌లో జరిగిన ఐరోపా సదస్సుకు ఆ ఖండం నుంచి ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడాల నుంచి పరిశీలకులు హాజరయ్యారు. ఐరోపాలో రాజకీయ, ఆర్ధిక సహకారానికి ల అవకాశాలను పరిశీలించేందుకు ఆ సదస్సు తీర్మానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిన, గెలిచిన దేశాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్న పూర్వరంగంలో ఈ ఆలోచన వచ్చింది. 1952లో ఐరోపా బొగ్గు, వుక్కు సమాజం ఏర్పాటుతో ప్రారంభమై నేటి ఐరోపా ఆర్ధిక యూనియన్‌గా పెరిగి పెద్దదై 1992లో మాస్ట్రిచ్ ఒప్పందంతో నేటి ఐరోపా యూనియన్ ప్రారంభమైంది.అది ఏర్పడిన మరో పాతిక సంవత్సరాలకు బ్రిటన్ దాని నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ప్రస్తుత యూనియన్‌కు జర్మనీ ఇంజను వంటిదైతే మిగతా సభ్యదేశాలు మోటారు వాహనంలోని ఇతర భాగాల వంటివి.తన పెత్తనం లేని యూనియన్‌లో బ్రిటన్ ప్రారంభం నుంచి ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే వ్యవహరించింది. బహుశా ఈ కారణంగానే ఫ్రెంచి మంత్రి అలాంటి వ్యాఖ్య చేసి వుండవచ్చు. జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, లక్బెంబర్గ్ దేశాల మంత్రులతో సమావేశమైన తరువాత ద్రవ్య, రాజకీయ పరమైన పర్యవసానాలు సంభవించే అవకాశం వున్నందున సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోయే ప్రక్రియను ప్రారంభించాల్సి వుందన్నారు.
వివాహం అంటే అనుకున్నతరువాత ఆగలేని వారు చివరికి ఆంజనేయ స్వామి గుడిలో అయినా 24 గంటల లోపే చేసుకోవచ్చు. కానీ విడాకులు అలా కాదు. చట్ట ప్రకారమే కనీస వ్యవధి, పెద్ద తతంగం వుంటుంది. అలాగే ఐరోపా యూనియన్ నుంచి ఏ సభ్య దేశమైనా విడిపోవాలన్నా అన్నీ సక్రమంగా జరిగితే అనే షరతుకు లోబడి లావాదేవీల పరిష్కారానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. అవసరమనుకుంటే ఆ వ్యవధిని ఇంకా పొడిగించుకోవచ్చు. లేదూ ఏదో తొందర పడి విడిపోవాలనుకున్నాం, ఇంకా నోటీసు ఇవ్వలేదు కనుక కొనసాగే అవకాశం ఇవ్వాలని అని బ్రిటన్ కోరుతుందా ? ఇంతవరకు ఏ దేశమూ అలా అడిగిన దాఖలా లేదు కనుక అటువంటి పరిస్థితే వస్తే ఏం చేస్తారో చూడాల్సి వుంది. విడిపోవాలి, కలసి వుండాలి అని ఓటు చేసిన వారి మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే.ఫలితాలు వెల్లడైన తరువాత అనేక మంది తాము ఆలోచించకుండానే ఓట్లు వేశామని గగ్గోలు పెడుతున్నారు. ఐదు ప్రాంతాలలో ఇంగ్లండ్, వేల్స్లో మెజారిటీ విడిపోవటానికి ఓటు వేయగా లండన్, స్కాట్లండ్, వుత్తర ఐర్లండ్ ప్రాంతాల వారు అత్యధికులు కలసి వుండటానికి మొగ్గు చూపారు.అయితే మొత్తం జనాభాలో ఇంగ్లండ్‌లోనే 53శాతం వున్నందున అక్కడి వారు స్వల్ప మెజారిటీతో విడిపోవటానికి మొగ్గు చూపినా మొత్తం ఫలితాన్ని వారే నిర్ణయించారు. విడిపోవాలనే నిర్ణయ పర్యవసానాల గురించి గగ్గోలు పెడుతున్న జనం తిరిగి ఓటింగ్ జరపాలని ప్రభుత్వానికి విన్న వించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం లక్ష మంది ఏదైన ఒక పిటీషన్‌పై సంతకం చేస్తే దానిపై పార్లమెంట్లో చర్చ జరగాలి. అలాంటిది పిటీషన్‌పై సంతకాలు ప్రారంభమైన కొన్ని గంటలలోనే పన్నెండు లక్షల మంది సంతకాలు చేయటానికి ఒకేసారి పూనుకోవటంతో అధికారిక వెబ్సైట్ కుప్పకూలింది.
బ్రిటన్ సామాన్య జనం ఎటువైపు మొగ్గారు ?ప్రాధమిక విశ్లేషణలను బట్టి అక్కడి వెనుక బడిన ప్రాంతాల జనం ఎక్కువ మంది విడిపోవటానికి ఓటు వేశారు. పరిశ్రమలు మూతపడటం తప్ప తెరవని, కొత్త పెట్టుబడులను నోచుకోని ప్రాంతాలు, ఐరోపా యూనియన్ నిబంధనల పేరుతో అమలు జరుపుతున్న పొదుపు చర్యలకు ఎక్కువగా ప్రభావితులైన వారు, ఇక్కడ వున్నవారే దారిద్రరేఖకు దిగువకు దిగిపోతుంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేవారిని అనుమతిస్తారా అంటూ అసంతృప్తికి గురైన వారు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతికూల పర్యవసానాలకు ప్రభావితులైన వారందరూ విడిపోవటానికే మొగ్గు చూపారు. దీని పర్యవసానాల గురించి అనేక వ్యాఖ్యానాలు పరస్పర విరుద్దంగా వెలువడుతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరి అనిపించినప్పటికీ సంక్షిప్తంగా ఎలా వున్నాయో చూద్దాం.
విడిపోయేందుకు మొగ్గు చూపారనగానే ప్రపంచ వ్యాపితంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. తరువాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ వెంటనే అనిశ్చితి తొలగలేదు. తక్షణమే అతిగా స్పందించినట్లు కొందరు భావించారు. ఐరోపా చీకట్లోకి పోనుంది, ఐరోపా నాయకులు అసలు సమస్యలపై దృష్టి సారించకపోతే 1933 నాటి ఆర్ధిక సంక్షోభానికి దారి తీయవచ్చు. ఐరోపా తిరిగి అభివృద్ధి బాట పడుతుంది. ఐదు సంవత్సరాలలో బ్రిటన్ సమాఖ్యగా వుండజాలదు. స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా మారి ఐరోపా యూనియన్‌లో చేరుతుంది. ఐర్లండ్‌లో వుత్తర ఐర్లండ్ విలీనం అవుతుంది. బ్రిటన్ తిరిగి పూర్వ వైభవం పొందుతుంది. అనేక దేశాలు ఐరోపా యూనియన్ నుంచి విడిపోతాయి. అమెరికా-బ్రిటన్ మధ్య ప్రత్యేక అనుబంధం మరింత గట్టి పడవచ్చు, అమెరికా సాయంతో తన పలుకుబడి పెంచుకొనేందుకు బ్రిటన్ ప్రయత్నిస్తుంది. నాటోను సాధనంగా చేసుకుంటుంది. అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకుంటుంది. బ్రిటన్ రానున్న ఐదు నెలల కాలంలో మాంద్యంలోకి జారిపోతుంది. అనేక దేశాలను అది ప్రభావితం చేస్తుంది. ఐరోపా అంతటా ప్రజాకర్షక నినాదాల పార్టీలకు ఆదరణ పెరుగుతుంది. జర్మనీ మరింత పలుకుబడి కలిగిన దేశంగా మారుతుంది. మిగతా దేశాలు కూడా పలుకుబడి పెంచుకొనేందుకు ప్రయత్నిస్తాయి.ఐరోపా యూనియన్ పెత్తనాన్ని తగ్గించేందుకు పూనుకుంటాయి. ఐదు సంవత్సరాలలో ఐరోపా ప్రపంచ శక్తి స్ధానాన్ని కోల్పోతుంది. ఐరోపా ఐక్యత దెబ్బతిని రష్యా పలుకుబడి పెరగవచ్చు. పుతిన్ మరింత బలపడతారు .ఈ పరిణామం అమెరికా నాయకత్వంలోని నాటోను మరింత పటిష్ట పరచవచ్చు. ఐరోపా యూనియన్ మరిన్ని రక్షణ చర్యలను తీసుకోవచ్చు. జనం పొదుపు చర్యలను తగ్గించమని డిమాండ్ చేస్తారు. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ వామపక్షం వైపు వెళ్ల వచ్చు. డాలరు బలపడి, వాణిజ్యలోటు, జాతీయ వాదాలు పెరగవచ్చు.
బ్రిటన్ నిర్ణయ ప్రభావం భారత్‌పై ఎలా పడుతుందనేది కూడా మిశ్రమ స్పందనగా వుంది. దీని గురించి రానున్న రోజుల్లో మరింత స్పష్టత రావచ్చు. సోమవారం నాడు జరిగే ఐరోపా యూనియన్ సమావేశం తరువాత అనేక అంశాలపై మరింత వివరణ, విశ్లేషణలు వెలువడతాయి. ఇప్పుడు చేసే వన్నీ కూడా అయితే గియితే అన్న అంచనాలపైనే వుంటాయి.