Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

      పది సంవత్సరాలు అధికారంలో వున్న మన్మోహన్‌ సింగ్‌ పెద్ద మౌన మునిగా బిజెపి తదితరులతో పిలిపించుకున్నారు. కొద్ది వారాల క్రితమే రెండు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న చిన్న మౌన ముని నరేంద్రమోడీ తొలిసారిగా ఒక ప్రయివేటు టీవీ ఛానల్‌తో సంభాషించారు. తాము పూజించే లేదా అభిమానించే బాబాలు, మునులు ఎప్పుడు నోరు తెరుస్తారా మధుర భాషణం ఎప్పుడు విందామా అని ఎదురు చూసే భక్తులు, అభిమానులు ఆ క్షణంలో ఎంత తన్మయులౌతారో మోడీ భక్తుల పరిస్థితి కూడా అలాగే వుండి వుండాలి.

    నరేంద్రమోడీ నోరు తెరవటం ప్రపంచంలోని ఏడు వింతలలో చేరితే ఆయనను ఇంటర్వ్యూ చేసిన టైమ్స్‌ నౌ సంపాదకుడు ఆర్నాబ్‌ గోస్వామి పిల్లిలా మాట్లాడటం కూడా మరొకటిగా చేరటం మరొక విశేషం. మోడీ ఇంటర్వ్యూ చూసిన లేదా పత్రికలలో చదివిన వారు విమర్శనాత్మకంగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మోడీ అభిమానులు వారిని సహించరని వేరే చెప్పనవసరం లేదు. అయితే అంతర్గతంగా ఎలాగూ మాట్లాడటం లేదనే విమర్శలు మూటగట్టుకున్నారు, ఇంతకంటే పోయేదేముంది మాట్లాడి అనవసరంగా విమర్శల పాలయ్యారని తలపట్టుకోవచ్చు. ఇంటర్య్యూలోని మచ్చుకు కొన్ని అంశాలు ఎలా వున్నాయో చూడబోయే ముందు ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చూడటం అవసరం.

     ఆర్నాబ్‌ గోస్వామి గురించి సల్మాన్‌ ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌ కొన్ని వ్యంగ్యోక్తులు సంధించారు. అత్యాచారానికి గురైన మహిళ స్ధితి గురించి సల్మాన్‌ ఖాన్‌ నోరు పారవేసుకోవటం, మీడియా, సామాజిక మీడియా, ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించటం, దాని మీద సలీంఖాన్‌ క్షమాపణ చెప్పటం ఇవన్నీ తెలిసిందే. అయినా రేటింగ్‌ల కోసం మీడియాలో గోస్వామి వంటి వారు సల్మాన్‌ ఖాన్‌ గురించి చేసిన హడావుడి నష్టనివారణకు దోహదం చేయలేదు. నరేంద్రమోడీ ఇంటర్వ్యూను టీవీలో చూసిన సలీమ్‌ ఖాన్‌ మోడీ మాటల కంటే ఆర్నాబ్‌ గోస్వామి ప్రశ్నించే తీరునే గమనించినట్లున్నారు. అందుకే పెద్ద ఖాన్‌ చేసిన ట్వీట్స్‌లోని అంశాలు ఇలా వున్నాయి.

       ‘ ఏమిటీ ? మీరు ఇప్పుడు టమ్స్‌ నౌ(ఛానల్‌) మాత్రమే చూడండి, అది కూడా ఆర్నాబ్‌ కోసం, సల్మాన్‌ ఖాన్‌ మీద అతని అవ్యాజ ప్రేమానురాగాలను చూడటానికి కాదు, వైద్య కారణాలతో దానిని చూడటం అంటే ఎంతో వున్నత గౌరవం వుంది. వైద్య కారణాలు ఏమిటంటారా ? అవును, ఎందుకంటే నేను రెండు చెవులూ నలభై శాతం వినికిడి లోపంతో వున్నాను. ప్రతి మాటనూ ఆ ఛానల్‌లో మాత్రమే వినగలను. కానీ గత రాత్రి ప్రధాన మంత్రిని ఆర్నాబ్‌ ఇంటర్వ్యూ చెయ్యటాన్ని చూడటానికి గరిష్ట స్థాయిలో శ్రుతిని(సౌండ్‌) పెంచినా నాకు ఒక్క మాటా వినిపించలేదు. ఆర్నాబ్‌ అంత మృదువుగా వ్యవహరించటాన్ని నేను చూడలేదు. ప్రధాని సమాధానాల కోసం ఎలా ప్రశ్నించారో వూహించుకోవచ్చు. అతను రంకెలు మాత్రమే వేస్తాడు లేదా ఎవరికీ భయపడడు అని చెప్పే నాలి ముచ్చులు ఎక్కడ ?’

      అర్నాబ్‌ గోస్వామి టీవీలో చర్చలు నిర్వహించటాన్ని తొలిసారి ఎవరైనా వీక్షిస్తే పాల్గొన్నవారి మీద వేసే రంకెలు, హావభావాలను చూసి మీదపడి కొడతారా ఏమిటి అన్నట్లుగా వుంటాయి. ప్రధానితో చేసిన ఇంటర్యూ చూసి ఆయన అభిమానులు ఆశాభంగం చెంది వుంటారు, ఇతర నేతలతో చేసిన ఇంటర్వ్యూలను పోల్చి మోడీతో ఒక పరిణితి చెందిన టీవీ జర్నలిస్టు మాదిరి గాక ఒక టీచర్‌-విద్యార్ధి సంభాషణగా వుంది అని ఒకరు వ్యాఖ్యానించారు. ఒక ప్రధాని తొలిసారి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినపుడు ఆ సంభాషణ ద్వారా కొత్త విషయాలు రాబట్టే ప్రయత్నం, తీరు కనపడలేదని, చూసేవారికి కొత్తేదేముంది అన్నట్లుగా వుంది. ఆ కార్యక్రమం మోడీ ప్రదర్శన కాదు, మోడీని ఒక మూలకు నెట్టే మల్లయోధుడి పిడిగుద్దుల మాదిరి గాక పిల్లలు తాతయ్యలను చిరుకోపంతో ముట్టుకునే మాదిరి సాగింది, ఏ మల్లయోధుడైనా ఎదుటి వారిని ముష్టిఘాతాలతో ఆడుకోవటానికి గాక వర్తులం చుట్టూ వూరికే తిరుగుతారా అని ఎద్దేవా చేశారు.

     తనపై వచ్చిన విమర్శలకు తట్టుకోలేకపోయిన ఆర్నాబ్‌ తన కార్యక్రమాల గురించి చర్చించటం తప్ప మరొక పనిలేని గుంపు ఒకటి వుంది. వారు ఎంతో విధేయతతో వుత్సాహంతో వాటిని చూస్తున్నందుకు వారికి కృతజ్ఞుడనై వుంటాను అని వుక్రోషంతో సమాధానమిచ్చాడు. ఇంటర్వ్యూ సమయంలో అసాధారణరీతిలో మీరు మౌనంగా వున్నారు ఎందువలన అని ఒక జర్నలిస్టు ఆర్నాబ్‌ను అడిగినపుడు ఇలా చెప్పాడు.’ కొంతమంది ఇంటర్వ్యూను చూస్తున్నారనుకోండి వారికి వార్తా విశేషాలు ఎంతో ముఖ్యం.పాకిస్థాన్‌లో మిలిటరీ-పౌర విభజన ఏర్పడే అవకాశం గురించి ప్రధాని సూచన ప్రాయంగా చెప్పారు. ఎన్‌ఎస్‌జి గురించి స్పందన వార్తాంశం ముఖ్యం అని నేను ఆలోచించాను. రఘురాం రాజన్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన(మోడీ) సమాధానమిచ్చిన తీరు సూటిగా వున్న వార్తాంశమని నేను అనుకున్నాను. ఈ వార్తాంశాలతో నా విధేయులైన వీక్షక బృందాన్ని, మీడియాను కూడా నిరాశపరిచాను’

    ఇంటర్వ్యూలో వున్న ఆ గొప్ప వార్తాంశమేమిటా అని అనేక మంది జర్నలిస్టులు చూశారు.తన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరైనా అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకపోతే ఆర్నాబ్‌ ఎలా రెచ్చిపోతారో చూసినవారికే అర్ధం అవుతుంది. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రాజన్‌ గురించి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి నేరుగా ప్రధానికి లేఖ రాశారు, బహిరంగంగా ఎంత రచ్చ చేసిందీ తెలిసిందే. రాజన్‌ గురించి ఆర్నాబ్‌ అడిగిన దానికి మోడీ చెప్పిన సమాధానం ఎంత సూటిగా వుందో చూడండి.’ ఎవరైనా, మా పార్టీ వారు కావచ్చు కాకపోవచ్చు, అటువంటి పనులు తగవు. అలాంటి ప్రచారం జిమ్మిక్కులతో దేశం బాగుపడదు. అటువంటి పనులు చేసే వారు మరింత బాధ్యతాయుతంగా వుండాలి. వ్యవస్థకంటే తాము పెద్ద వారమని ఎవరైనా భావిస్తే అది తప్పు’ అని మాత్రమే అన్నారు.ఇలాంటి సమాధానాలు ఇతరులు చెప్పి వుంటే ఆర్నాబ్‌ వారిని చీల్చి చెండాడి పేరు చెప్పేంతవరకు వదలి పెట్టరు.

    ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, ప్రధాని సమాధానం చెప్పిన తీరు మీద కూడా అనేక స్పందనలు వచ్చాయి. విషయం ఏమీ చెప్పకుండానే , సూటిగా మాట్లాడ కుండా ఎలా సమాధానాలు ఇవ్వవచ్చో నేర్పే విధంగా వున్నాయన్నది వాటిలో ఒకటి. పిల్లలు ఆవు, చెట్ల వలన వుపయోగాల గురించి రాసే వ్యాసాల మాదిరి వున్నాయంటే అతిశయోక్తి కాదు. అనేక అంశాలపై నరేంద్ర మోడీ మౌనం పాటిస్తారనే విమర్శ వుంది. దీంతో అది మరింత స్పష్టమైంది. ముఖ్య అంశాలపై మాట్లాడినప్పటికీ సూటిగా సమాధానాలు లేవు. అన్నింటికీ మించి విలేకర్ల గోష్టి కాకుండా తనకు మద్దతునిచ్చే ఒక ఛానల్‌తో మాట్లాడటాన్ని ప్రచార కార్యక్రమంలో భాగంగా కొందరు భావించారు. మీడియాను ఎదుర్కొనే స్ధితిలో ప్రధాని లేరనేది స్పష్టమైందన్న అభిప్రాయమూ వుంది.

     ప్రధాన మంత్రి తరచూ విదేశీ ప్రయాణాలు, ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారన్న విమర్శలు వచ్చినపుడు అనేక మంది మంత్రులు, బిజెపి నేతలు విదేశీ పెట్టుబడుల కోసం జరుపుతున్నట్లు చెప్పారు. కానీ మోడీ సమాధానం అందుకు భిన్నంగా వుంది.’ ప్రపంచానికి నా గురించి తెలియదు. ఒక దేశానికి ఎవరు సారధిగా వున్నారు అని తెలుసుకోవాలని ప్రపంచం అనుకుంటుంది. ఎవరైనా మీడియా ద్వారా మోడీ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, అలాంటి వారు అసలైన మోడీ ఎవరు అని తికమక పడే అవకాశం వుంది. అది జరిగితే దేశానికి నష్టం. భారత్‌పై విశ్వాసం కలగటానికి మోడీ వ్యక్తిత్వం ఆటంకం కాకూడదు, అందువలన నేను అందరు నాయకులను కలుసుకోవాలి, ముఖాముఖీ మాట్లాడాలి, నేను నిర్మొహమాటంగా మాట్లాడకపోతే వారికి భారత సారధి గురించి తెలియదు. అందువలన ఇది నాకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. ఇంతకు ముందు ప్రపంచ నాయకులను కలుసుకొనే అవకాశం రాలేదు.’

    నల్లధనాన్ని వెనక్కు తెచ్చి పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పారన్న ప్రశ్నకు ‘ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్య అది, వారికి మాట్లాడటానికి ఏదో ఒక సమస్య వుండాలి కదా ‘ అన్నారు. ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ ‘ గత ప్రభుత్వ హయాంలో ధరలు వేగంగా పెరగటాన్ని మీరు చూడవచ్చు, నేడు వేగం బాగా తగ్గింది. మీరు అంకెలను చూడవచ్చు.రెండవది వరుసగా రెండు సంవత్సరాలు కరవు వుంది.కూరగాయలు, ఆహారం, పప్పుల ధరలపై కరవు ప్రభావం ప్రత్యక్షంగా వుంటుంది, ఎందుకంటే అవన్నీ భూమిలో పండుతాయి. అంత పెద్ద కరవు వున్నపుడు ఎవరి చేతుల్లో ఏమీ వుండదు. ఇటువంటి పరిస్థితులలో దిగుమతులు చేసుకోవటం రెండవ అవకాశం. కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంది. మూడవది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంయుక్త బాధ్యత అది.’

     కొందరు కేంద్ర మంత్రులు మతవుద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనల చేయటం గురించి అడిగిన ప్రశ్నకు ‘ అటువంటి వ్యాఖ్యలు చేసేవారిని వాటి ద్వారా హీరోలుగా మార్చవద్దని నేను చెప్పదలచుకున్నాను.వారిని హీరోలను చేయకండి, వారే మానుకుంటారు.’ అన్నారు. ఇక వుపాధి గురించి చిరంజీవి సినిమాను గుర్తుకు తెచ్చేలా చెప్పారు. ‘ మొదటి విషయం మన దేశంలో 35 సంవత్సరాల లోపు వారు 80కోట్ల మంది వున్నారు. వుద్యోగాల కోసం పెద్ద డిమాండ్‌ వున్న విషయాన్ని మనం అంగీకరించాలి.కానీ వారెక్కడ వుపాధి పొందుతారు ? పెట్టుబడులు రావాలి. వాటిని మౌలిక సదుపాయాలు, వుత్పాదక, సేవా రంగాలలో వుపయోగించాలి. ఇప్పుడు మనం చొరవ తీసుకున్నాము, ముద్రా యోజన ప్రారంభించాము. రజకులు, క్షురకులు,పాలవారు, వార్తాపత్రికలు అమ్మేవారు, బండ్ల మీద అమ్మేవారందరూ కలసి దేశంలో మూడు కోట్ల మంది వున్నారు. వారి పనిని విస్తరించేందుకు ఎలాంటి హామీతో పనిలేకుండా దాదాపు 1.25లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చాము. ఒకరు ప్రస్తుతం ఒకరికి పని కల్పిస్తున్నారనుకుందాం, దానిని విస్తరిస్తే అతనికి ఇద్దరు కావాలి. అదే ఇద్దరు వుంటే ముగ్గురు కావాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మూడు కోట్ల మంది ఈ చిన్న వ్యాపారులకు రుణం అందుబాటులోకి వచ్చిందనుకోండి వారు తమ పనిని విస్తరించక తప్పదు. మేం మరొక చిన్న నిర్ణయాన్ని తీసుకున్నాం. దేశంలో పెద్ద దుకాణాలు 365 రోజులూ నడుస్తాయి, కానీ చిన్న దుకాణాలను సెలవు రోజుల్లో మూసివేయాలి.చిన్న దుకాణాలను కూడా పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులు తెరవ వచ్చని మేము బడ్జెట్‌లో ప్రకటించాము. పెద్ద దుకాణాలకు లేని ఆంక్షలు చిన్న దుకాణాల వారికి ఎందుకు వర్తింపచేయాలి? కాబట్టి పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులూ తెరిచేందుకు అవకాశం వుంది కనుక గతంలో ఒకరిని వుద్యోగానికి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఇద్దరిని పెట్టుకోవాలి, దీని వలన వుపాధి పెరగదా ? 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు వుండాలని చెబుతున్నాము.ఈ రంగం ఎంతో మందికి వుపాధి కల్పిస్తుంది.’

    కొంత మంది మంత్రులు, నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం గురించి ప్రస్తావించి మతం పేరుతో రాజకీయాలు చేయకూడదు కదా, వారిని అదుపు చేయాల్సిన అవసరం లేదా అని ఆర్నాబ్‌ ప్రశ్నించారు.’ మొదటిది, అభివృద్ధి వైపు జాతి పురోగమించాలని గట్టిగా విశ్వాసం వున్న వాడిని, అది అవసరం కూడా, అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని హీరోలుగా చేయవద్దని నేను మీడియాను కోరుతున్నాను.’

      కానీ వారు వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు కదా ?’ వారిని హీరోలను చేయవద్దు వారే ఆగిపోతారు.’

    మేం వారిని హీరోలను చేయలేదు, విలన్లుగా చేశాము ‘ కానీ మీరు వారిని ఎందుకు అంత పెద్దగా చేస్తున్నారు. అలాంటి ప్రకటనలు చేయటాన్ని నేను టీవీలలో చూశాను, వారి ముఖాలు కూడా నేను చూడలేదు, చివరికి వారు టీవీలో అధికార ప్రతినిధులుగా మారుతున్నారు.’

  తమకు తామే ప్రతినిధులుగా ప్రదర్శించుకుంటున్నారు ‘ అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు ‘

    మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వారి గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలివి. ఒక ప్రధాని స్ధాయిలో వున్న వ్యక్తి అనేక ముఖ్యాంశాల గురించి మాట్లాడిన తీరుతో అనేక మంది విస్తుపోతున్నారు. అభిమానులు ఎలాగూ వేరే అర్ధాలు తీస్తారన్నది తెలిసిందే.