ఎంకెఆర్
ప్రధాని నరేంద్రమోడీ మరో వాగ్దానానికి తిలోదకాలిచ్చారు. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అనే వాగ్దానానికి తూనా బొడ్డు అని చెప్పారు. గరిష్ట మంత్రులు-కనిష్ట పాలనకు తెరతీశారు. మంగళవారం నాడు ఐదుగురు మంత్రుల వుద్యోగాలు పీకివేసి 19మందికి కొత్తగా ఇచ్చారు. సంతుష్టీకరణ పనులు చేయబోమని గొప్పలు చెప్పుకొనే బిజెపి అదే బాటలో నడిచి జంబో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 78 మంది వుంటే మందగా ఎద్దేవా చేసి చూడండి మేము 45 మందితో ఏర్పాటు చేస్తున్నామని గొప్పగా చెప్పారు. మంత్రివర్గ ఏర్పాటులో అసాధారణం, సానుకూల మార్పు అని స్వయంగా నరేంద్రమోడీ తన అభిమానులకు ట్వీట్లు పంచారు. దానినే పెద్ద సంస్కరణగా వూరూ వాడా టాంటాం వేసుకున్నారు, వంది మాగధుల పొగడ్తలు అందుకున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్, అదే మన్మోహన్ సింగ్ బూట్లలో కాళ్లు దూర్చారు.పని చేయని మంత్రులుగా పేరు తెచ్చుకున్న వారిని కొనసాగించారు. నిబంధనావళి ప్రకారం 82 మంది వరకు మంత్రులు వుండవచ్చు. అంటే మరో నలుగురికి చోటు కల్పించేందుకు అవకాశం వుంది.
డెబ్బయి అయిదు సంవత్సరాలు దాటిన ముసలి వారిని మంత్రులుగా తీసుకోకూడదన్నది విధాన నిర్ణయంగా నరేంద్రమోడీ ప్రకటించినపుడు అద్వానీ అండ్ కోను వదలించుకొనేందుకే అని కొందరు గొణిగినప్పటికీ వహ్వా వహ్వా అంటూ ఎందరో అభినందనలు చెప్పారు. ముసలివారిని తొలగిస్తారని వూహాగానాలు చేసిన, రాసిన వారందరూ నజ్మా హెప్తుల్లా, కల్రాజ్ మిశ్రాల కొనసాగింపును చూసి అవాక్కయ్యారు. ఎన్పిఏ(పని చేయని) మంత్రిగా పేరు తెచ్చుకున్న సదానంద గౌడతో సహా మరికొందరిని పని చేసేందుకు కొనసాగనిచ్చారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరిని కొనసాగించటం ద్వారా ‘మై హూనా ‘ అంటూ భరోసా ఇచ్చినట్లయింది.
ఇప్పటికే 13 మంది మంత్రులున్న వుత్తర ప్రదేశ్‌కు మరి కొంత మందిని తోడు చేయటం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసమే అంటే కోపగించుకోకూడదు. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఆచరణలో అబ్బే అలాంటిదేమీ లేదని రుజువు చేసుకుంటున్నది. మోడీ మంత్రి వర్గ విస్తరణ పాలనతో సంబంధం లేదు ఎన్నికలు అధికారంపై తన మరియు ఆర్ఎస్ఎస్ పట్టు నిలుపుకొనే రాజకీయ చర్య అని ప్రముఖ లాయర్ ప్రశాంత భూషణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని తరచూ మన్‌కీ బాత్ అంటూ మాట్లాడతారు తప్ప కామ్‌కీ బాత్‌ను పట్టించుకోరని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.