Tags

, , , ,

Image result for brexit media bias

ఎం కోటేశ్వరరావు

   ఇటీవలి కాలంలో మీడియా పాత్ర గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి చోటా ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతోంది. కుక్క మనిషిని కరిస్తే అది సాధారణ ఘటన, అదే మనిషి కుక్కను కరిస్తే సంచలన వార్త. అదే మాదిరి సాధారణ అర్ధంలో మీడియాకు చెప్పిన నిర్వచనం ప్రకారం వ్యవహరిస్తే అది సాధారణం అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అది చర్చ నీయాంశం అవుతుంది. వర్తమానంలో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవాలనే అంశంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ, అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో అక్కడి ప్రధాన రిపబ్లిక్‌, డెమోక్రటిక్‌ పార్టీల తరఫున ఎవరిని అభ్యర్ధిగా నిలపాలనే అంశంలో ఆ రెండు పార్టీలలో పోటీ బడిన వారు పార్టీ సభ్యుల మధ్య జరిపిన ఓటింగ్‌ సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు, లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారంలో వున్న చోట ఆ ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా మీడియా వ్యవహరించటం తీవ్ర చర్చ నీయాంశం అయింది. ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ పరిణామాల గురించి చూద్దాం.

   న్యూ (కొత్తది) అనే ఏక వచన ఆంగ్ల పదానికి బహువచన రూపమే న్యూస్‌(కొత్తవి). సులభంగా చెప్పాలంటే తాజా కూరల గంప. దానిలో రకరకాల కాయలు, ఆకు కూరలు, మసాలాకు వుపయోగించే కరిపేపాకు, కొత్తి మీర వంటి వన్నీ గంప లేక బండిలో ఒకే దగ్గర వుంచి విక్రయించినట్లుగానూ న్యూస్‌ పేపర్లు, పుస్తకాలు, అవే ఎలక్ట్రానిక్‌ రూపంలో రేడియో,టీవీలు మొదలైనవి. కొంత మంది న్యూస్‌లో నాలుగు ఆంగ్ల అక్షరాలు నాలుగు దిక్కులను సూచించే పదాలలోని మొదటి అక్షరాలని అంటే నలుదిక్కులకు సంబంధించి సమాచారమని కూడా కొందరు వ్యాఖ్యానాలు చెప్పి వుండవచ్చు. అలా తీసుకున్నా దాని అర్ధంలో పెద్ద మార్పు వుండదు.

  సమస్య ఎక్కడ వస్తుందంటే నాలుగు దిక్కులకు చెందిన నూతన సమాచారాన్ని ఎలా అందించాలన్న దగ్గర వస్తోంది. మన దేశంలో స్వాతంత్య్రానికి ముందు పత్రికలు ప్రభుత్వానికి చెందిన నిర్ణయాలు, అభిప్రాయాలను, వైఖరులను మాత్రమే అందచేసేవి. అంటే ఆంగ్లేయుల పాలన కొనసాగింపు, ఆంగ్లేయుల కంపెనీల ప్రయోజనాలు, ప్రపంచ పరిణామాలపై బ్రిటన్‌ ప్రభుత్వ, పాలకుల వైఖరిని సమర్ధిస్తూ వార్తలు ఇచ్చేవి. అందుకే రాణిగారి పక్షం అని పిలిచేవారు. ఏకపక్షంగా వార్తలు ఇస్తూ, పాలనలోని లోపాలను, హాని కర విధానాలను విస్మరించటం పాఠకులలో విమర్శలకు కారణం కావటంలో కొన్ని పత్రికలు సున్నితంగా విమర్శలు చేసేవి. రాణిగారి విధానాలు మంచివే గానీ వాటి అమలులో అధికారుల లోపాల కారణంగా సమస్యలు అనే పద్దతిలో వార్తలు ఇస్తే అటు రాణీగారికి ఇబ్బంది లేదు ఇటు పాఠకులను కొంత మేరకు సంతృప్తి పరచవచ్చు. అలా ఇచ్చిన పత్రికలను రాణీగారి ప్రతిపక్షం అని పిలిచారు. ఈ రెండు రకాల పత్రికల ధోరణులకు భిన్నంగా అసలు ఆంగ్ల పాలన, జాతీయ, అంతర్జాతీయంగా బ్రిటన్‌ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేక వైఖరితో స్వాతంత్ర పోరాటానికి అనుకూలంగా వార్తలు ఇచ్చిన పత్రికలు కూడా మన దేశంలో వునికిలోకి వచ్చాయి. ఇవి ఒక తరగతి, స్వాతంత్ర పోరాటంతో పాటు వచ్చే స్వాతంత్య్రం దేశంలోని 99 శాతం మంది ప్రయోజనాలకు అనుగుణంగా వుండాలనే వైఖరితో వార్తలు, వ్యాఖ్యానాలతో వెలువడే పత్రికలు కూడా వచ్చాయి. అందువలన మీడియా అనే సాధనాన్ని ఎవరికి అనుకూలంగా వుపయోగిస్తున్నారనే దానిని బట్టి స్థూలంగా చెప్పాలంటే రెండు రకాలు ప్రతి సందర్భంలోనూ వున్నట్లు మనం గమనించవచ్చు.ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ ప్రజాభిప్రాయం సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు తెన్నులను పరిశీలిద్దాం.

   ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకుంది. ఆ మేరకు జూన్‌ చివరి వారంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్‌లో 52శాతం బయటకు వెళ్లిపోవాలని, మిగిలిన వారు వుండిపోవాలని ఓటు చేశారు.ఈ ప్రక్రియను ఆంగ్లంలో పొట్టిగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. ఓటర్లు మొత్తం పాల్గొని వుండి వుంటే, మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే ఫలితం ఎలా వుండేదో చెప్పలేము. ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి ఆలోచనల చేయకుండా మీడియా వార్తలను చూసి వ్యతిరేకంగా ఓటేశాము అని చెప్పిన వారు వున్నారు. తూచ్‌ మేము ఇలా అనుకోలేదు, తిరిగి ప్రజాభిప్రాయసేకరణ జరపండి అప్పుడు మేము సరైన నిర్ణయం తీసుకుంటామంటూ వ్యతిరేకంగా, అనుకూలంగా ఓటు చేసిన వారు, అసలు ఓటింగ్‌లో పాల్గొనని వారూ లక్షల మంది పార్లమెంట్‌కు నివేదించారు. బ్రిటన్‌ నిర్ణయం ప్రపంచాన్ని కుదిపివేసింది అంటే అతిశయోక్తి కాదు. అంతర్గతంగానే కాదు అంతర్జాతీయంగా కూడా లాభ నష్టాల పర్యవసానాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒక పెద్ద వుపద్రవం సంభవించినపుడు ఎవరికీ ఏమీ నిర్దిష్టంగా తెలియదు, ప్రతి ఒక్కరూ తోటి వారిని వూరడించేందుకో లేక తెలుసుకొనేందుకో, తనకు తెలిసినదానిని చెప్పేందుకో పడే మూక ఆతురత కనిపిస్తోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఎవరైనా యువతీ యువకులు వెంటనే వివాహం చేసుకోవాలనుకుంటే ఏటిఎం ఏదైతేనేం తీసుకోవటానికి మిషన్‌లో డబ్బుందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు పక్కనే వున్న ఆంజనేయ స్వామి గుడి అయినా సరే అర్ధగంటలో ఆ తంతు పూర్తిచేస్తారు, అదే విడాకులు తీసుకోవాలంటే నిర్ణీత వ్యవధి అవసరం అలాగే నిబంధనావళిని పూర్తిగా పాటిస్తే ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది, ఇంకా సాగదీయాలనుకుంటే ఆ తరువాత ఎంత కాలం పడుతుందో తెలియదు. లేదూ ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి ఐరోపా యూనియన్‌లోనే కొనసాగాలని అనుకుంటే అదీ సంభవమే.

     బ్రిటన్‌లో ఎంత అవివేకులైన ఆధునికులు వున్నారో బ్రెక్సిట్‌ వెల్లడించిందని సత్యజిత్‌ దాస్‌ అనే ప్రవాస సంతతికి చెందిన బ్రిటీష్‌ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. మీడియా తమను తప్పుదారి పట్టించింది అని కొందరు మండి పడుతుంటే జనంలో వున్న వెధవాయత్వం గురించి కొందరు అదే మీడియాలో తప్పుడుతున్నారు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని చెప్పినట్లుగా మీడియా ఎలా అయినా సొమ్ము చేసుకుంటుందా ? ఒక వివాదం లేదా ఒక విధానం గురించి చర్చ, ఓటింగ్‌, నిర్ణయం జరిగే సందర్బాలలో మీడియా ఎలా వ్యవహరించాలి అన్నది మీడియా ప్రారంభం నుంచి ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూనే వుంది.నిష్పక్షపాతంగా, మంచి చెడ్డలను తక్కెట్లో పెట్టి సమంగా తూచినట్లుగా వుండాలని ఎవరైనా కోరుకుంటారు. అలా జరుగుతోందా ?

    సాధారణంగా ఎన్నికలలో ఓడినవారు విచారపడితే గెలిచిన పక్షం విజయం జరుపుకుంటుంది. ఈ బ్రెక్సిట్‌లో అక్కడి టోరీ, లేబర్‌ పార్టీ రెండూ ఓడాయి, రెండూ గెలిచాయి. ఎందుకంటే ఓటింగ్‌ ఫలితం రెండు పార్టీల నాయకత్వాలలో అభిమానులలో చీలిక తెచ్చింది.ఐరోపా యూనియన్‌ శ్రామికుల, మధ్యతరగతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తోందన్న భావన నానాటికీ పెరుగుతోంది కనుక దానికి వ్యతిరేకంగా కొందరు, దీర్ఘకాలంగా దానిలో బ్రిటన్‌ సభ్యురాలిగా వుంది కనుక తమ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసిందని మరికొందరు, మిగతా దేశాలతో మనకు అనవసరం మన దేశం, మన పూర్వవైభం, మన పలుకుబడి, పెత్తనం అనే పెత్తందారీ జాతీయవాదం తలకెక్కించుకున్నవారు ఇలా వివిధ కారణాలతో ఓటు చేశారని చెబుతున్నారు. కొంతమంది చెప్పినట్లు ప్రపంచీకరణ, అక్కడి పాలకవర్గం అనుసరిస్తున్న పొదుపు చర్యలపై రెండు పార్టీల వెనుక వున్న సామాన్యుల ఆగ్రహం అందామా ? ఒక వేళ అదే సరైనది అనుకుంటే బ్రెక్సిట్‌ను మొత్తం మీద మీడియా అంతా బలపరిచింది అంటున్నారు కనుక మీడియా కూడా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మారిందా ? మీడియాను అదుపు చేస్తున్న కార్పొరేట్‌ శక్తులు మారుమనసు పుచ్చుకున్నాయా ? అన్న ప్రశ్నలకు సమాధానం కష్టం. ప్రపంచాధిపత్యంలో పోయిన బ్రిటన్‌ ప్రాభవాన్ని లేదా పెత్తనాన్ని పూర్తిగా పునరుద్దరించలేకపోయినా కనీసం తమ ప్రయోజనాలనైనా రక్షించుకోవాలనే బ్రిటన్‌ కార్పొరేట్‌ (ఆర్ధిక) జాతీయ వాదం వైపు మొగ్గేట్లు జనాన్ని మీడియా ఒకవైపుకు నెట్టిందా ? ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే వర్గ, ఆర్ధిక,విద్య, వయస్సు, నివాసం, జాతి మొదలైన అంశాలన్నీ పని చేసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆ లక్షణాలన్నీ దానిలో వున్నాయి. ఏది ఎక్కువ పని చేసింది ? ఇంకా లోతుగా అధ్యయనాలు వెలువడితే తప్ప నిర్ధారణకు రాలేము. సాంకేతికంగా ఈ ఓటింగ్‌కు ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగటానికి సంబంధం లేదు. ఓటు చేశారు కనుక వెంటనే వెళ్లి పోండి అని మిగతా సభ్య దేశాలు కోరాయి గనుక బ్రిటన్‌ వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. మేం విడిపోవాలనుకున్నాం అని చెప్పినంత మాత్రాన విడాకులు రావు, కోర్టులో తమ వినతిని దాఖలు చేయాలి. అలాగే ఐరోపా యూనియన్‌ నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 ప్రకారం తాము విడిపోయేందుకు క్రమాన్ని ప్రారంభించాలని బ్రిటన్‌ కోరినపుడే ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రధానిగా వున్న కామెరాన్‌ రాజీనామా ప్రకటించారు, కొత్త ప్రధాని ఎన్నికైన తరువాత ఆ క్రమాన్ని ప్రారంభంపై నిర్ణయంతీసుకుంటారని చెప్పారు. బ్రెక్సిట్‌లో మీడియా పాత్ర గురించి చూద్దాం.

   రెండు తెలుగు రాష్ట్రాలలోని పత్రికలు అసాధారణరీతిలో ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని పాఠకులకు అందించాయి.సామాన్య జనం కంటే మధ్యతరగతి, ధనికులు, కార్పొరేట్‌ శక్తులకు ఆసక్తికలిగించే అంశం నుక అంత ప్రాధాన్యత ఇచ్చాయని వేరే చెప్పనవసరం లేదు. బ్రిటన్‌ జాతీయ పత్రికలన్నీ దాదాపుగా బ్రెక్సిట్‌కు మద్దతు ఇచ్చాయి. అయితే కొన్ని పత్రికలు పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొలది తామూహించినట్లు జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత లేకపోవటాన్ని గమనించిగానీ లేదా తాము ప్రచారం చేసిన దానికి భిన్నంగా ఫలితం వస్తే తమ విస్వసనీయత దెబ్బతింటుందని భయపడి గానీ చివరి క్షణంలో వైఖరి మార్చుకున్నాయి. బ్రెక్సిట్‌కు అనుకూలంగా వ్యవహరించినవి కొన్ని అనుకూల రాగాలాపన చేశాయి. డేవిడ్‌ కామెరాన్‌, ఐరోపా అనుకూల శిబిరానికి దెబ్బ అంటూ తొలిపేజీలో ఒక పెద్ద వార్తను దాదాపు రెండు నెలల ముందుగానే ‘అబ్జర్వర్‌ ‘ ప్రచురించింది.నలభైమూడు శాతం విడిపోవటానికి, 39శాతం వుండిపోవటానికి అనుకూలంగా వున్నారని 18శాతం మంది నిర్ణయించుకోలేదని అది పేర్కొన్నది. నల్లడబ్బు అక్రమంగా దాచుకున్నవారి గురించి పనామా పత్రాలు వెల్లడి అయిన రోజు కూడా బ్రిటన్‌ పత్రికలు విడాకుల వార్తలకే ప్రాధాన్యత ఇచ్చాయి. జూన్‌ 23వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచీ ఐరోపాకు వస్తున్న వలస జనాభాకు, ఐరోపా యూనియన్‌కు లంకె పెట్టి వ్యాఖ్యాతలు, సంపాదకులు తమ రచనలను నింపివేశారు.త్వరలో వెల్లడి కానున్న బ్రిటన్‌కు వలస వచ్చిన వారి వివరాల సమాచారమంటూ నెల రోజుల ముందే డెయిలీ మెయిల్‌ తొలి పేజీలో డెయిలీ మెయిల్‌, సన్‌ పత్రికలు రెండవ పేజీలో వార్తలను ప్రచురించాయి. విడిపోవాలన్న వైఖరి తమకు ఒక పెద్ద విజయమని డెయిలీ మెయిల్‌ ముందే ప్రకటించుకుంది. బ్రెక్సిట్‌ తరువాత బ్రిటన్‌ వృద్ధి చెందుతుందని పేర్కొనటమే గాక, వేర్పాటుకు ఓటు వేయాలని కోరుతూ ఇంధనశాఖ మంత్రి ఆండ్రియా లీడ్సమ్‌ రాసిన వ్యాసాన్ని కూడా అది ప్రచురించింది.అపరిమితంగా వస్తున్న వలసజనంతో ఇప్పటికే స్కూళ్లు, ఆసుపత్రులు, వుద్యోగాలు, ఇండ్లపై ఎంతో వత్తిడి పెరిగిందని ఆమె పేర్కొటాన్ని ఆ పత్రిక ప్రశంసించింది. పదమూడు లక్షల బ్రెక్సిట్‌ బాంబు పేలబోతున్నదని సన్‌ శీర్షిక పెట్టింది. తాను ప్రధానిగా వున్నానని, మనల్ని పరిపాలించాలనే విషయాన్ని కూడా మరచిపోయి డేవిడ్‌ కామెరాన్‌ మనల్ని ఐరోపా యూనియన్‌లో వుంచేందుకు పూర్తిగా నిమగ్నమయ్యారని సన్‌ సంపాదకీయం ఎత్తిపొడిచింది.

     అబ్జర్వర్‌ పత్రిక సర్వే ప్రకారం వేర్పాటు కోరుకొనేవారు నాలుగుశాతం మెజారిటీగా వున్నారని, పెద్ద వారి కంటే వారి కుటుంబాలలోని యువతరం ఐరోపా యూనియన్లో కొనసాగేందుకు ఎక్కువగా కట్టుబడి వుందని, వ్యతిరేకంగా ఎందుకు ఓటెయ్యాలో వారికి చెప్పండని డెయిలీ ఎక్స్‌ప్రెస్‌ తన సంపాదకీయంలో పెద్దలకు సలహా ఇచ్చింది. ఈ వేసవిలో గ్రీసు నుంచి టర్కీకి వలస జనాన్ని తరలించే పధకం కనుక విఫలమైతే సంక్షోభం మరింత తీవ్ర అవుతుందని డెయిలీ టెలిగ్రాఫ్‌ పేర్కొన్నది. ఐరోపా యూనియన్‌ వ్యతిరేకి బోరిస్‌ జాన్సన్‌ రాసిన వ్యాసాలకు ఆ పత్రిక పెద్ద పీట వేసింది.’ ప్రతి సందర్భంలోనూ మనకు ఐరోపా యూనియన్‌ సమస్యగా మారుతోంది.మన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, ప్రభుత్వం చేసే సాయాలన్నింటికీ యూనియన్‌ అభ్యంతరం చెబుతోంది,చివరికి మన ఇంట్లో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవటాన్ని కూడా అది ప్రశ్నిస్తోంది, అర్ధమయ్యేట్లు చెప్పాలంటే మిగతా దేశాలతో సమంగా మన ఇంధన ఖర్చును తగ్గించుకోవటానికి కూడా అదే ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. వేలాది వుద్యోగాలకు ముప్పు వచ్చినప్పటికీ మనమేమీ చేయలేం, ప్రజాభిప్రాయ సేకరణ ప్రచారం ప్రారంభమైనపుడు కీలక సమస్య మన సార్వభౌమత్వం అని నేను చెప్పాను, జనం నా వైపు జాలి చూపులు చూడటం నాకు గుర్తు వస్తోంది, సార్వభౌమత్వం గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని వారు చెప్పారు.అని బోరిస్‌ జాన్సన్‌ రెచ్చగొట్టాడు. మీడియా మొఘల్‌గా పేరు తెచ్చుకున్న రూపర్ట్‌ మర్డోచ్‌ పత్రికలైన సన్‌, టైమ్స్‌ రెండు వైపుల నుంచి వెలువడిన వాదనలను ప్రముఖంగా ఇచ్చాయి, మొగ్గు మాత్రం విడిపోయేవైపే వుంది. గార్డియన్‌ పత్రిక మాత్రం బ్రెక్సిట్‌ను వ్యతిరేకించింది. పోలింగ్‌ దగ్గర పడుతున్న సమయంలో మెయిల్‌ పత్రిక ఆశ్చర్యకరంగా కొనసాగాలనే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది. బ్రిటన్‌ శాంతి, సంపదలను ఫణంగా పెట్టే సమయం కాదిది అని పేర్కొన్నది. ఏ లెక్కన చూసుకున్నప్పటికీ బ్రిటన్‌ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతే అధిక పన్నులు, ద్రవ్య మార్కెట్లలో గందరగోళం, అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. ఐరోపా యూనియన్‌ వెలుపల బ్రిటన్‌ సిరిసంపదలను పొందుతుందని చెప్పేవారు ప్రమాదకరమైన భ్ర మను కలిగించేందుకు పూనుకున్నారని రెండు పేజీల పెద్ద సంపాదకీయం రాసింది. సండే టెలిగ్రాఫ్‌, సండే టైమ్స్‌ మాత్రం వ్యతిరేకంగా ముందుకు వచ్చాయి. తొలుత బ్రెక్సిట్‌కు అనుకూలంగా వున్న అబ్జర్వర్‌ పత్రిక కూడా చివరికి ‘ఎన్ని లోపాలు వున్నప్పటికీ ఐరోపా యూనియన్‌ మంచికే శక్తి నిస్తుందన్నదానిని ప్రశ్నించలేము’ అని పేర్కొన్నది. మొత్తం మీద మీడియా వ్యవహరించిన తీరు తొలి రోజుల్లో తటస్థంగా వున్నవారిని బ్రెక్సిట్‌ వైపు మొగ్గేట్లు చేసిన కారణంగానే ఫలితాలు అలా వెలువడ్డాయని చెప్పవచ్చు. ఒకసారి ఓటరు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత చివరి క్షణంలో మీడియా వైఖరిలో వచ్చిన మార్పు పెద్దగా ప్రభావితం చేయదని చెప్పవచ్చు.

    ప్రయివేటు మీడియా తీరుతెన్నులు ఒక ఎత్తయితే ప్రభుత్వ నిధులతో స్వతంత్రంగా నడుస్తుందని చెప్పబడే బిబిసి ఏ విధంగా వ్యవహరించిందనేది కూడా ఆసక్తి కలిగించే అంశమే. బ్రెక్సిట్‌ ప్రచారం, ఎన్నికల సందర్భంగా బిబిసి ‘పిరికిగా’ వ్యవహరించిందనే శీర్షికతో ఒక పత్రిక వ్యాఖ్యానించింది. మీడియా శైలిలో అతి పెద్ద సవాలును అది ఎదుర్కొన్నదని పేర్కొన్నారు. రెండు వైపుల నుంచీ వినిపించే వాదనలకు సమ ప్రాధాన్యత ఇవ్వలేదని, మొత్తం మీద మొగ్గు ఐరోపాయూనియన్‌లోనే వుండి పోవాలనే వైఖరి వైపు వున్నదని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. బ్రిటన్‌ కార్పొరేట్‌ శక్తులలో వ్యతిరేక, అనుకూల వైఖరి వెల్లడైంది. విడిపోయి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తే ఎక్కువ లాభం అని భావించే వారు మెజారిటీగా వున్నప్పటికీ యూనియన్‌లోనే వుండి లబ్ది పొందాలని చూసే వారు కూడా గణనీయంగా వున్నారు.ఈ శిబిరాలు చేసిన వాదనలతో జనం ఒక విధంగా గందరగోళపడ్డారంటే అతిశయోక్తి కాదు. ఐరోపా యూనియన్‌ ఏర్పాటు అన్నది అమెరికా, జపాన్‌ పోటీని ఐక్యంగా ఎదుర్కొనేందుకే అని చెప్పినప్పటికీ ఆక్రమంలో కార్పొరేట్ల లాభాలను కాపాడేందుకు పొదుపు చర్యల పేరుతో కార్మిక వ్యతిరేక వైఖరిని ఐరోపా యూనియన్‌ తీసుకున్నది. పర్యవసానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టటం, ఎత్తివేయటమో చేస్తున్నారు. దీంతో సహజంగానే ఆ విధానాలకు కార్మికవర్గంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ అసంతృప్తిని సొమ్ము చేసుకొని వారి పేరుతో తమ ప్రయోజనాలను సాధించుకొనేందుకు కార్పొరేట్‌ శక్తులు ప్రయత్నించాయి. మీడియా వాటికి వంత పాడటం తప్ప కార్మికవర్గ ప్రయోజన కోణం నుంచి గతంలో ఆలోచించలేదు, బ్రెక్సిట్‌ సందర్భంగానూ అదే వైఖరిని అనుసరించింది.

గమనిక :ఈ వ్యాసం వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి జూలై నెల సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది.