ఎంకెఆర్
చిలీలోని ఒక చిన్న నగర మేయర్గా వున్న ఒక కమ్యూనిస్టు చూపిన చొరవ, చేసిన ప్రయోగం ఇప్పుడు దేశం అంతటా అమలు జరుగుతోంది. చిలీ రాజధాని శాంటియాగో శివార్లలో శ్రామికులు ఎక్కువగా వున్న లక్షన్నర జనాభాగల రికొలేటా పట్టణానికి మేయర్గా వున్న డేనియల్ జాడు 49 సంవత్సరాల వయస్సున్న ఓ కమ్యూనిస్టు. నాలుగు సంవత్సరాల క్రితం మేయర్గా ఎన్నికయ్యాడు. విశ్వవిద్యాలయంలో స్ధానిక సంస్ధల వ్యవహారాలను అధ్యయనం చేసిన చదువును ఆచరణలో జనానికి వినియోగించటమే ఆయన చేసిన ఒక ప్రయోగం. చిలీలో ఔషధాల విక్రయాలలో 90శాతం కేవలం మూడు సంస్ధల చేతులలో నడుస్తున్నాయి. అవి రోగులను పీల్చిపిప్పి చేసేందుకు ఔషధ ధరలను నియంత్రిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. ప్రతిదానికీ వెల నిర్ణయంచే నయా వుదారవాద విధానాల ప్రయోగశాల లాటిన్ అమెరికా అయితే ఆ విధానాలను నియంతల పాలనలో బలవంతంగా రుద్దిన దేశాలలో చిలీ ప్రధమ స్ధానంలో వుంది. చిలీ అనగానే ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన కమ్యూనిస్టు సాల్వెడార్ అలెండీ, ఆయనను హత్య చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిన సైనిక నియంత పినోచెట్ గుర్తుకు రాకమానరు.
మేయర్ డేనియల్ ఇతర దుకాణాలతో పోల్చితే 78శాతం వరకు ధరలపై రాయితీ ఇచ్చే ఔషధాలు, వైద్య పరికరాలను కార్మికులకు అందుబాటులోకి తెచ్చారు. నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలో దుకాణాలను ఏర్పాటు చేశాడు.అది విజయవంతం కావటంతో 58 మున్సిపాలిటీలు వాటిని తెరిచాయని, మరికొన్ని అదేబాటలో వున్నాయని ఆయన చెప్పారు. ధనికులు నివసించే ప్రాంతాలలోని వారు ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తారు. అలాంటిది కార్మికులతో పాటు ధనికులు కూడా ఈ ఔషధాల కోసం వస్తుండటంతో దేశమంతటా వాటికి డిమాండ్ పెరుగుతోంది. ప్రయివేటు ఔషధ దుకాణాలు పౌరుల క్షేమం కంటే తమ లాభాలకు తొలి ప్రాధాన్యత ఇస్తాయి, అదే మా మున్సిపల్ దుకాణాలు చిలీ ఔషధదుకాణాల తీరు తెన్నులనే మార్చివేస్తున్నాయని మేయర్ వెల్లడించారు.1995,2012లో కోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకొని ఔషధదుకాణాల కంపెనీలు ధరలను పెంచివేశాయి. దాంతో చౌక ధరల దుకాణాల ఆలోచన తలెత్తింది. చిలియన్లు 53శాతం వైద్య ఖర్చులను తమ జేబులు లేదా బీమా ద్వారా చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది.
మొత్తం జనజీవనాన్ని ప్రయివేటు రంగమే శాసిస్తున్న చిలీలో మున్సిపాలిటీలు దుకాణాలు తెరవటం ఒక పెద్ద ముందడుగు.ఈ దుకాణాలు కంపెనీల నుంచి నేరుగా, ప్రభుత్వ వ్యవస్ధ ద్వారా జనరిక్, బ్రాండెడ్ ఔషధాలను కొనుగోలు చేసి లాభాపేక్షలేకుండా వినియోగదారులకు రాయితీలకు అందచేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం పరిష్కరించలేని సమస్యలను స్ధానిక సంస్ధలు పరిష్కరించటంతో దేశమంతటా వీటి గురించి చర్చ ప్రారంభమైందని డేనియల్ అన్నారు. ప్రస్తుతం పరిమితంగా వున్న మున్సిపల్ దుకాణాలు తమకు పోటీనిస్తాయని కార్పొరేట్ సంస్ధలు భావించటం లేదు. అయితే వచ్చే ఏడాదిలోగా మొత్తం అన్ని మున్సిపాలిటీలు దుకాణాలను తెరిచేందుకు ముందుకు సాగుతున్నాయి. మరింతగా విస్తరిస్తే గుత్త సంస్ధలు వూరుకుంటాయా ? తొలుత చిన్న దుకాణాలపై ఈ ప్రభావం వుంటుందని, తరువాతే తమ వంతు అని అవి భావిస్తున్నాయి.
కమ్యూనిస్టు మేయర్ ఒక్క ఔషధ దుకాణాల ప్రారంభమే కాదు, ఇతర అనేక సమస్యలను పరిష్కరించేందుకు పూనుకున్న క్రమంలో ఎన్నో అటంకాలు, అపవాదులు, కోర్టులలో సవాళ్లు ఎదురవుతున్నాయి. గత నలభై సంవత్సరాలుగా పార్కింగ్ ఫీజులతో జనాన్ని బెంబేలెత్తిస్తున్న సంస్ధ నుంచి ఆ కాంట్రాక్టును రద్దు చేసి ఫీజులను తగ్గించారు. డేనియల్ జాడు తీసుకున్న చర్యలు ప్రజామోదంతో పాటు వారికి ఎంతో భారాన్ని తగ్గిస్తున్నట్లు అనేక మంది తమ అనుభవాలను తెలుపుతున్నారు. నలభై తొమ్మిది సంవత్సరాల ఈ కమ్యూనిస్టు మేయర్ పాలస్తీనా నుంచి వలస వచ్చిన ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన వారు. ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్గా పనిచేశారు. పట్టణ ప్రణాళిక కోర్సులో సామాజిక గృహనిర్మాణరంగం ప్రత్యేక సబ్జక్టుగా విశ్వవిద్యాలయంలో పట్టా పొందారు.పదిహేను సంవత్సరాల పాటు సామాజిక యాజమాన్య పద్దతులపై పనిచేశారు.విద్యార్ధిగా వున్న సమయంలో రహస్య పాలస్తీనా విమోచనా సంస్ధ (పిఎల్ఓ) చిలీ విభాగం విద్యార్ధి సంఘం అధ్యక్షుడిగా, తరువాత లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత పాలస్తీనియన్ యువజన సంఘాల సమన్వయ కర్తగా పనిచేశారు. ఆ క్రమంలో ఏర్పడిన పరిచయాలతో 1993లో చిలీ కమ్యూనిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో చేరారు. సాధారణ పరిస్ధితులు ఏర్పడిన తరువాత రెండు సార్లు పార్లమెంట్, మూడు సార్లు మేయర్ ఎన్నికలలో పోటీ చేశారు. మూడవసారి 2012లో మేయర్గా ఎన్నికయ్యారు.