Tags

, , ,

ఎంకెఆర్‌

    గత ఆదివారం నాడు జపాన్‌ ఎగువ సభకు జరిగిన ఎన్నికలలో పాలక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డిపి) కూటమి మెజారిటీ సీట్లు తెచ్చుకుంది. మూడింట రెండువంతుల మెజారిటీతో చేయాల్సిన సవరణకు సరిపడా సీట్లు సాధించింది. ఎగువ సభలోని 242స్ధానాలలో ప్రతి మూడు సంవత్సరాలకు సగం సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. నియోజకవర్గాల ప్రాతిపదికన 73 దామాషా ఓటింగ్‌ ప్రకారం 48 మంది సభ్యులను ఎన్నుకుంటారు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల తరువాత కమ్యూనిస్టుపార్టీ పదకొండు స్ధానాలను పొందగా ఈ సారి 14కు పెరిగింది. గతం కంటే ఓట్లు పెరగటమే దీనికి కారణం. పాలక ఎల్‌డిపి నాయకత్వం ప్రధాన ప్రతిపక్షంగా వున్న డెమోక్రటిక్‌ పార్టీ(డిపి)తో సమంగా కమ్యూనిస్టులను విమర్శించారు, విమర్శలతో పాటు కమ్యూనిస్టు వ్యతిరేక విషాన్ని చిమ్మారు. అ యినప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని కమ్యూనిస్టుపార్టీ తన బలాన్ని పెంచుకుంది. ఈ ఎన్నికలలో పాలకపార్టీ విజయం సాధించినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత తక్కువ మంది ఓటర్లు పాల్గొన్న (54.7) ఎన్నికలలో ఇది నాలుగవది. ఓటింగ్‌ వయస్సును 20 నుంచి 18కి తగ్గించిన కారణంగా యువ ఓటర్లు వుత్సాహంతో పాల్గొన్నప్పటికీ ఇంత తక్కువ శాతం పోలు కావటం అక్కడి పాలకకూటమిపై అవిశ్వాసం, ప్రతిపక్ష పార్టీలపై విశ్వాసలేమిని సూచిస్తున్నది.

    గత రెండున్నదశాబ్దాలుగా తీవ్ర ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న జపాన్‌ రాజకీయ వ్యవస్ధలో అస్ధిరత్వం అంతర్భాగంగా మారిపోయింది. పాలక, ప్రతిపక్ష పార్టీలలో చీలికలు, కొత్త దుకాణాలు తెరవటం సర్వసాధారణం. సంక్షోభం నుంచి బయట పడేందుకు పాలకవర్గం జపాన్‌ రాజ్యాంగ సవరణకోసం గత కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నది. రెండవ ప్రపంచ యుద్దంలో విజేతగా వున్న అమెరికా పరాజిత జపాన్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవటంతో పాటు జపాన్‌కు మిలిటరీ లేని రాజ్యాంగాన్ని ఆమోదించే విధంగా షరతు విధించింది, జపాన్‌ రక్షణ బాధ్యత తాను తీసుకుంది. దాంతో మిలిటరీ ఖర్చును పరిశోధన, అభివృద్ధికి వుపయోగించి సాంకేతిక రంగంలో అమెరికా, ఇతర ఐరోపా అగ్రదేశాలను అధిగమించి ఆర్ధిక రంగంలో జపనీయులు సవాలు విసిరారు. ప్రపంచ రాజకీయ రంగంలో పోయిన తమ పెత్తనాన్ని పునరుద్దరించుకొనేందుకు జపాన్‌ పాలకవర్గం తిరిగి మిలిటరీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురైన పూర్వరంగంలో అక్కడి జనం తిరిగి మిలిటరీ ఏర్పాటుకు అనుకూలంగా లేరు. అయితే ఒక్క కమ్యూనిస్టుపార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజ్యాంగ సవరణ తద్వారా మిలిటరీ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నాయి. అయితే కమ్యూనిస్టుపార్టీతో పాటు కొన్ని శక్తులు, కొందరు ప్రముఖులు మాత్రం మిలిటరీ రాజ్యాంగ సవరణలను వ్యతిరేకిస్తున్నారు.

    జపాన్‌కు మిలిటరీ లేకుండా చేయటంలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రధాన పాత్ర వహించిన అమెరికన్లు ఇటీవలి కాలంలో తమ వైఖరిని మార్చుకున్నారు. జపాన్‌ రాజ్యాంగంలో తొమ్మిదవ ఆర్టికల్‌ ప్రకారం జపాన్‌ మిలిటరీని కలిగి వుండటం, యుద్ధాలలో పాల్గొనటం నిషిద్ధం. అయితే అమెరికన్లు వివిధ దేశాలలో జోక్యం చేసుకున్న సందర్భంగా తమ సైనికుల ప్రాణాలు పోవటం, ఆర్ధికంగా పెనుభారంగా మారటంతో పాటు ఒక్క యుద్ధంలో కూడా విజయం సాధించని విషయం తెలిసిందే. దాంతో తమ యుద్ధ భారాన్ని మిత్రదేశాలపై రుద్దేందుకు అమెరికా పూనుకుంది. తన తరఫున దాడులలో పాల్గొనేందుకు జపాన్‌ను ప్రోత్సహిస్తోంది. అందుకు రాజ్యాంగ సవరణ జరపమని సలహా ఇస్తోంది. పాతిక సంవత్సరాల క్రితం సోవియట్‌ రద్దయి పోయి, రష్యా తిరిగి అవతరించటం, చైనా చుట్టూ అమెరికా ఏర్పాటు చేస్తున్న సైనిక వలయంలో జపాన్‌ పాత్ర లేకుండా అమెరికన్లు నేరుగా పాల్గొనటం అంత తేలిక కాదు. తమ దేశాన్ని తిరిగి మిలిటరీ మయం గావించటాన్ని మెజారిటీ జపనీయులు అంగీకరించటం లేదు. రాజ్యాంగసవరణ ప్రతిపాదనలను ముందుకు తెచ్చినపుడల్లా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు, ఇదే సమయంలో తమ దేశంలో ఏర్పాటు చేసిన సైనిక స్ధావరాలలో అమెరికన్లు తిష్ట వేయటాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణ దళం పేరుతో వున్న బలగాలకు జాతీయ రక్షణ బలగాలని నామకరణం చేయటం ద్వారా మిలిటరీకరణకు 2012లో ఒక ప్రతిపాదనను ముందకు తెచ్చారు.దాని ప్రకారం శాంతి పరిరక్షణ పేరుతో విదేశాలలో జపాన్‌ సాయుధశక్తులను నియమించవచ్చు, దానికి తోడు సంయుక్త ఆత్మరక్షణ పేరుతో అమెరికాతో కలసి దాడులలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ప్రధాని సైనిక దళాల ప్రధాన అధికారిగా వుంటారు. ఈ దళాలను అంతర్గతంగా వెల్లడయ్యే వ్యతిరేకతను అణచివేయటానికి కూడా నియోగించవచ్చు. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా అవసరమైన ముసాయిదా సవరణలను కూడా సిద్ధం చేశారు.

     ఈ సవరణ ఆమోదం పొందితే ప్రపంచ రాజకీయాలపై అది ప్రభావం చూపుతుంది.ప్రస్తుతం జపాన్‌ పాలకవర్గం వివిధ కారణాలతో అమెరికన్లకు లోబడి వున్నప్పటికీ అధికారికంగా మిలిటరీ ఏర్పడిన తరువాత కూడా అలాగే వుంటుందన్న గ్యారంటీ లేదు. ఆసియాలో ఒక పెద్ద ఆర్ధిక శక్తిగా చైనా అవతరించటం, దానికి ప్రస్తుతానికి రష్యాతో విబేధాలు లేకపోవటం వంటి కారణాలతో చైనా, రష్యాలను ఎదుర్కొనేందుకు జపాన్‌ అవసరం అది భావిస్తున్నది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్ధానంలో జపాన్‌ పౌరుడిని న్యాయమూర్తిగా నియమించటం, దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుతం చైనా కమాండ్‌లో వున్న కొన్ని దీవులపై చైనాకు హక్కులేదని తాజాగా తీర్పు వెలువరించటంలో అమెరికా హస్తం వుంటుందని వేరే చెప్పనవసరం లేదు.ఈ పూర్వరంగంలో జపాన్‌ ఎన్నికలలో పాలకకూటమి ఎగువ సభలో మూడింట రెండువంతుల మెజారిటీ సాధించటం రానున్న రోజులలో ఎలాంటి పరిణామాలకు నాంది అవుతుందో చూడాల్సి వుంది.