Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

    అమెరికాలో సాధారణం కంటే ఎక్కువగా సాగు చేశారన్న అక్కడి వ్యవసాయశాఖ అంచనాతో ప్రపంచ మార్కెట్‌లో మొక్క జొన్నల ధరలు పడిపోయాయి. మన దేశంలో పత్తి సాగును తగ్గించిన రైతాంగం మొక్కజొన్న వైపు మొగ్గిందనే వార్తలతో తన విత్తన వ్యాపారం మూడు జొన్న కర్రలు ఆరు పొత్తులుగా పెరుగుతుందని మోన్‌శాంటో కంపెనీ లాభాల లెక్కలు వేసుకొంటోంది. గత రెండు సంవత్సరాలుగా వుత్పత్తి తగ్గిన కారణంగా దొంగ నిల్వదారుల చర్యలను వమ్ము చేసేందుకు, ధరలను తగ్గించేందుంటూ మొక్కజొన్నల దిగుమతికి అనుమతిస్తూ నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకోవటంతో టన్ను పద్దెనిమిదివేలు వున్న ధర అమాంతం పద్నాలుగు వేలకు పడిపోయింది.అనేక రికార్డులను బద్దలు చేస్తున్న మోడీ సర్కార్‌ పాతిక సంవత్సరాల క్రితం గరిష్టంగా వున్న రెండున్నరలక్షల టన్నుల దిగుమతి రికార్డును బద్దలు కొడుతూ ఐదు లక్షల టన్నులకు అనుమతించింది. వాటిపై దిగుమతి పన్నుకు పూర్తి మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయ పర్యవసానాలు ఎవరికి మేలు చేస్తాయి, ఎవరికి కీడు చేస్తాయి ?

     మొక్క జొన్నలు ప్రధానంగా కోళ్ల, పశుదాణా, గంజి పౌడరు తయారీకి వినియోగిస్తారు. ధరలు ఎక్కువగా వున్నాయి కనుక ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతులకు అనుమతివ్వాలని వ్యాపారులు చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గిందా? లేక తమ వద్ద పేరుకుపోతున్న నిల్వలను తగ్గించుకొనేందుకు అమెరికా సర్కార్‌ చేసిన వత్తిడికి మోడీ సర్కార్‌ లొంగి పోయిందా ? ప్రభుత్వం అంటే సమాజంలో అన్ని తరగతులకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత కలిగినది. గత నాలుగు సంవత్సరాలుగా పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చుకుంటే మొక్కజొన్నలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తక్కువే. క్వింటాలుకు రు.1310 నుంచి 1365కు మాత్రమే పెంచింది.అంటే ఏడాదికి సగటున 14 రూపాయలకు లోపు, ఇదే సమయంలో గుడ్డు ధరలు ఎంత పెరిగాయి? రైతులకు హైదరాబాదులో 2013 జూలైలో ఒక గుడ్డుకు సగటున 306.7పైసలు లభిస్తే అదే 2016 జూలైలో 360 పైసలకు పెరిగింది. ఇక వినియోగదారుల విషయానికి వస్తే 311 నుంచి 414.80పైసలకు పెరిగింది. ఇవి జాతీయ గుడ్ల సమన్వయ కమిటి ప్రకటించిన రేట్లు, చిల్లర దుకాణాలలో హైదరాబాదులో గత కొద్ది వారాలుగా ఐదు రూపాయలు అమ్ముతున్నారు. ఒక గుడ్డుకే ఇంత ధర పెరిగితే మొక్క జొన్నలకు క్వింటాలకు నాలుగు సంవత్సరాలలో 55 రూపాయలు పెరచటాన్ని ఏమనాలి? టోల్‌ టాక్సు పెంపుదలకు ద్రవ్యోల్బణం, వుద్యోగులు, కార్మికుల వేతనాలు, కరవు భత్యం పెంపుదలకు ఇలా ప్రతి దాని ధరల పెంపుదలకు ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్న సర్కార్‌ మొక్కజొన్నల మద్దతు ధరల పెంపుదలకు దానిని ఎందుకు వర్తింపచేయటం లేదు ? వరుసగా 2012 నుంచి 2015 వరకు వినియోగదారుల (సిపిఐ) ద్రవ్యోల్బణం 11.17,9.13,5.86,6.32 శాతం చొప్పున పెరిగింది. ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి మొక్క జొన్నలకు ప్రకటించిన మద్దతు ధర రు.1310. అంతకు ముందు 2012 (డిసెంబరు నుంచి డిసెంబరు) ద్రవ్యోల్బణం రేటు 11.17శాతం అంటే 2012-13 సంవత్సరానికి గాను క్రితపు ఏడాది ప్రకటించిన రు.1175 మీద రు.131 పెంచాల్సి వుండగా నాలుగు రూపాయలు కలిపి 1310 చేశారు. మరుసటి ఏడాది ద్రవ్యోల్బణం రేటు 9.17 శాతానికి గాను 2014-15లో 119 రూపాయలు కలిపి రు.1429కి పెంచాల్సి వుండగా రు.1310నే కొనసాగించారు. 2015-16కు గాను మరో 83పెంచి రు.1512 కు బదులు 1325, 2016-17కు 95 రూపాయలు పెంచి రు1607 బదులు రు.1365గా మాత్రమే నిర్ణయించారు. సీజన్‌లో ప్రభుత్వ మద్దతు ధరలకు అటూ ఇటుగా మాత్రమే బహిరంగ మార్కెట్‌లో రైతాంగానికి దక్కుతున్న విషయం తెలిసిందే.

    తెలంగాణాలో దాదాపు ఎనిమిది లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో రెండున్న లక్షల హెక్టార్లలో మొక్క జొన్న సాగు అవుతోంది. తెలంగాణాలో ఇదే మూడవ పెద్ద పంటగా వుంది. అందువలన అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పులు తెలంగాణా రైతాంగంపై ప్రధానంగా ప్రభావం చూపుతాయని వేరే చెప్పనవసరం లేదు. చైనా నుంచి డిమాండ్‌ తగ్గటం కారణంగా ప్రపంచ మార్కెట్లో గణనీయంగా ధరలు పడిపోయాయి. దీనికి తోడు అమెరికాలో పెద్ద ఎత్తున నిల్వలు వుండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున మొక్క జొన్నలు దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించిందంటే భారీ మొత్తంలో ఎగుమతి సబ్సిడీలు పొందే అమెరికా వ్యాపారులు ముందుగా లబ్ది పొందుతారు.మన దేశంలో సాధారణ వినియోగం ఏటా 20మిలియన్‌ టన్నులు వుంది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మన దేశంలో మొక్క జొన్నల వుత్పత్తి 2015-16లో 23.67 నుంచి 21.02 మిలియన్‌ టన్నులకు పడిపోయినట్లు అంచనా. ఇది సాధారణ వినియోగం కంటే స్వల్పంగా ఎక్కువే. అంతకు ముందు 17 మిలియన్‌ టన్నులకు పడిపోయిన సందర్బాలలో కూడా మనం దిగుమతులు చేసుకోలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి లేకున్నా దిగుమతులకు నిర్ణయించటం గమనించాల్సిన అంశం. మన దేశంలో ఆహార వినియోగం 17-20శాతం కాగా, దాణాగా 60-62శాతం, మిగిలింది విత్తనాలు, పారిశ్రామిక వినియోగంలో వున్నట్లు ఫిక్కీ నివేదిక పేర్కొన్నది.మాంసానికి పెంచే బ్రాయిలర్‌ కోడికి ఐదు వారాలలో 3.6 నుంచి 4 కిలోలు, గుడ్లు పెట్టే కోడికి ఏటా 42-47కిలోలను దాణా వేస్తారు. ఇది ప్రధానంగా మొక్కజొన్నలతో తయారు చేస్తారు. మొక్క జొన్నలకు ప్రత్యామ్నాయంగా వున్న జొన్నల లభ్యత సమస్యగా వుండటంతో మొక్కజొన్నలపైనే ప్రధానంగా పరిశ్రమ ఆధారపడుతోంది.

     వర్షాభావం కారణంగా రెండు సంవత్సరాలుగా వుత్పత్తి తగ్గినప్పటికీ ఈ ఏడాది సాగు 20-30శాతం వరకు పెరగవచ్చని, పత్తిసాగు తగ్గుతుందని కన్సెల్టెన్సీలు తమ ఖాతాదార్లకు సమాచారం పంపాయి. ఈ కారణంగానే మోన్‌శాంటో పెద్ద ఎత్తున విత్తనాలను రంగంలోకి దించి లాభాలను పెంచుకోవచ్చని అంచనా వేసుకున్నది.దానికి అనుగుణంగానే స్టాక్‌ ఎక్సేంజ్‌లలో దాని షేరు విలువ కూడా పెరిగింది.

     మార్కెట్‌ మాయాజాలం విషయానికి వస్తే 2011-12లో అమెరికాలో టన్ను మొక్కజొన్న ధర 295-300డాలర్ల మధ్య వుండగా మన దేశ కనీస మద్దతు ధర నాటి రూపాయి విలువలో 9800, డాలర్లలో 211 వుంది. 2014-15లో అమెరికా ధర 170-175 డాలర్లకు పడిపోగా మన దేశంలో 13,100 రూపాయలకు, 215 డాలర్లకు పెరిగింది. అందువలన దిగుమతులు చౌకగా మారాయి. ఈ కారణంగా మన ప్రభుత్వ దిగుమతులపై పన్ను విధించి దిగుమతులను నిరుత్సాహపరచింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో జూలై 14న రోజువారీ మండీ ధర 164 డాలర్లు కాగా జూలై 16వ తేదీ ముందస్తు మార్కెట్‌ ధర 142 డాలర్లు వుంది.మన రూపాయి విలువ తగ్గిన కారణంగా పన్నెండు వేల రూపాయలకే టన్ను మొక్కజొన్నలు వస్తాయి. జూలై 16న తెలంగాణాలోని వివిధ మార్కెట్లలో క్వింటాలు ధర 1100 నుంచి 1680, ఆంధ్రప్రదేశ్‌లో 1310-1500 మధ్య వుంది. గతేడాది పత్తి రైతుల అనుభవం చూస్తే వారు పూర్తిగా అమ్ముకున్న తరువాత క్వింటాలు ఆరువేల రూపాయల వరకు పెరిగింది, దానితో విదేశీ కంపెనీలు లాభపడ్డాయని తాము నష్టపోయామని నూలు మిల్లుల యజమానులు గగ్గోలు పెట్టటంతో కొద్ది రోజుల పాటు మిల్లులను మూసివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మొక్క జొన్నల విషయంలో పంట చేతికి వచ్చే తరుణానికి దిగుమతుల కారణంగా గతేడాది కంటే ధరలు తగ్గితే అందుకు బాధ్యత కేంద్రానిది, కేంద్ర చర్యలపై నోరు మెదపని రాష్ట్రాలది అవుతుంది.