Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

     పది సంవత్సరాల తరువాత జూలై 17న న్యూఢిల్లీలో సాదాసీదాగా అంతరాష్ట్ర మండలి సమావేశం జరిగింది. కేంద్రం-రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా నిధులు, విధుల బదలాయింపులు, రాష్ట్రాల హక్కుల గురించి చర్చ జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం ఎలా వ్యవహరిస్తున్నదో దశాబ్దకాలం పాటు అసలు సమావేశం జరగపోవటమే తేటతెల్లం చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్‌-బిజెపి దొందూ దొందే. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పంఛి అధ్యక్షతన 2007 ఏప్రిల్‌ 27న బాధ్యతలు స్వీకరించిన కమిషన్‌ 2010 మార్చి 30 కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా తన పని తాను చేసిన కమిషన్‌గా ఇది పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ కమిషన్‌ నివేదికకు కాంగ్రెస్‌ హయాంలో నాలుగు సంవత్సరాలు, బిజెపి ఏలుబడిలో రెండు సంవత్సరాలు దుమ్ము పేరుకు పోయింది.దీనిలోని సిఫార్సులను ఏకాభిప్రాయంతోనే కేంద్రం అమలు జరుపుతుందని ముక్తాయింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర అంతరాష్ట్ర మండలి సమావేశ ముగింపులో చెప్పారు. అంటే దీని సిఫార్సులు ఎప్పుడు ఆమోదం పొందుతాయో తెలియని స్ధితి.

    తెల్లవారే సరికి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్ధానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టగలిగిన బిజెపికి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఆసక్తి, అన్నింటికీ మించి నిజాయితీ వుంటే ఈ నివేదికపై సమావేశం జరపటానికి రెండు సంవత్సరాల వ్యవధి తీసుకోవాల్సిన అవసరం లేదు. సమాఖ్య స్పూర్తిని, రాజ్యాంగ నిబంధనలను దెబ్బతీయటంలో కాంగ్రెస్‌ రికార్డును తిరగరాసేందుకు బిజెపి పూనుకుందని వుత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చేసిన పనులను బట్టి స్పష్టమైంది. తమది భిన్నమైన పార్టీ అని స్వంత డబ్బా కొట్టుకొని ఇతరులను విమర్శించే నైతిక హక్కును అది కోల్పోయింది. పూంఛీ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా అది వ్యవహరించింది.తమది పనిచేసే ప్రభుత్వమని, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని చెప్పుకున్న పార్టీ, ప్రభుత్వం ఈ సమావేశ ఏర్పాటుకు ముందే కమిషన్‌ చేసిన సిఫార్సులలో వేటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో వేటిని తిరస్కరించిందో, వేటిపై చర్చ జరగాలని కోరుకుంటోందో ఒక వైఖరిని తీసుకొని రాష్ట్రాల ముందు వుంచితే వాటి మంచి చెడ్డలపై మధనం జరిగి, ఒక కొలిక్కి వచ్చేందుకు దారి చూపేది. అదేమీ లేకుండా మొక్కుబడిగా సాగదీసేందుకు పూనుకుంది.

    ఇప్పటికే కేంద్రం-రాష్ట్రాల మధ్య వున్న సంబంధాలు, సత్సంప్రదాయాలు, వివిధ సమస్యలపై కోర్టులు వెలువరించిన అభిప్రాయాలతో కమిషన్‌ తాను వుచితం అనుకున్న సమస్యలన్నింటిపైన అభిప్రాయాలు తెలిపే విధంగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాల కాంగ్రెస్‌, మధ్యలో అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే వున్న జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలుగానీ గతంలో వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను తుచ తప్ప కుండా లేదా వాటి స్ఫూర్తిని గానీ అమలు జరిపిన పాపాన పోలేదు. అందువలన కమిషన్లు అంటే సాగదీయటానికి, రిటైరైన న్యాయమూర్తులు, వున్నతాధికారులకు వుపాధి కల్పన అంశాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు, దాంతో జనానికి వాటిమీద విశ్వాసం పోయింది.పూంఛీ కమిషన్‌ సిఫార్సులు కూడా గత కమిషన్ల జాబితాలో చేరతాయా ?

    పూంఛీ కమిషన్‌ చేసిన ప్రధాన సిఫార్సుల సారాంశం ఇలా వుంది.కల్లోలం సంభవించిన నిర్దిష్ట ప్రాంతాలను పరిమిత కాలం పాటు కేంద్రం తన పాలన కిందకు తెచ్చుకొనేందుకు ఆర్టికల్‌ 355,356ను సవరించాలి. ఒక జిల్లా లేదా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో స్ధానిక అత్యవసర పరిస్ధితిని ప్రకటించేందుకు కేంద్రానికి అధికారం ఇచ్చే విధంగా 355,356 ఆర్టికల్స్‌ను సవరించాలి. అయితే అలాంటి అత్యవసర పరిస్థితి వ్యవధి మూడునెలలకు మించి వుండకూడదు. మత హింసాకాండ తలెత్తినపుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా స్వల్పకాలం పాటు కేంద్ర దళాలను దించేందుకు కేంద్రానికి అనుమతిచ్చే విధంగా మత హింసాకాండ బిల్లుకు సవరణ చేయాలి. సాయుధ దళాలను దించేందుకు రాష్ట్రాల అనుమతి ఆటంకంగా మారకుండా సవరణ చేయాలి.అయితే బలగాల మోహరింపు ఒక వారానికి మాత్రమే పరిమితం చేయాలి. అంతకు మించి వుండేందుకు రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి.ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఎన్నికలకు ముందు వున్న ఎన్నికల కూటమిని ఒక రాజకీయ పక్షంగా పరిగణిస్తూ స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో గవర్నర్లు ఏ పద్దతిని పాటించాలో కూడా స్పష్టం చేయాలి.ఎన్నికలకు ముందు వున్న కూటములలో ఎక్కువ సంఖ్య వున్నదానిని ఆహ్వానించాలి.ఎన్నికల అనంతరం ఏర్పడే కూటములలోని పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరే విధంగా నిర్దేశించాలి. ఒక మంత్రిపై చర్య తీసుకోకూడదని మంత్రివర్గం చేసిన సిఫార్సును తోసిపుచ్చి చర్యకు అనుమతి మంజూరు చేసే అధికారం గవర్నర్లకు వుండాలి. గవర్నర్లను విశ్వవిద్యాలయాల చాన్సలర్లుగా చేసే సాంప్రదాయాన్ని రద్దు చేయాలి. గవర్నర్లుగా నియమితులయ్యే వారు స్ధానిక స్ధాయిలలో కూడా నియామకానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుండాలి. గవర్నరు సంబంధిత రాష్ట్రానికి చెందకూడదు, ప్రముఖ వ్యక్తి అయివుండాలి. గవర్నర్లను నిరంకుశంగా తొలగించకూడదు, గవర్నర్లను రాజకీయ ఫుట్‌బాల్‌ మాదిరి పరిగణించటాన్ని నిలిపివేయాలి.గవర్నర్లను ఐదేళ్ల కాలానికి నియమించాలి, మధ్యలో వారిని తొలగించాలంటే అసెంబ్లీ అభిశంసన ద్వారా మాత్రమే జరగాలి. తొలగింపునకు కారణం బాధ్యతల నిర్వహణకు సంబంధించినదై వుండాలి. గవర్నర్‌ నియామకంలో ముఖ్యమంత్రి పాత్ర వుండాలి. గవర్నర్ల నియామకానికి ప్రధాని, హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్‌, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి.ఈ క్రమంలో వుపరాష్ట్రపతికి కూడా ప్రమేయం కల్పించవచ్చు.ఈ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అంతరాష్ట్ర మండలి సమావేశాలు ఏడాదికి మూడు సార్లు జరపాలి. జాతీయ సమగ్రతా మండలిని కనీసం ఏడాదికి ఒకసారి సమావేశ పరచాలి. ఎక్కడైనా మతపరమైన సమస్య తలెత్తినపుడు వెంటనే మండలిలోని ఐదుగురు సభ్యులను అక్కడికి పంపి నివేదిక తెప్పించుకోవాలి. రాష్ట్రాలపై ఏకాభిప్రాయ బాధ్యతను పెట్టబోయే ముందు కేంద్రం తన వైఖరి ఏమిటో తెలపాలి. నరేంద్రమోడీ అధికారానికి రాకముందే ఈ సిఫార్సులను చేశారు. ఒక వేళ వాటిని బిజెపి లేదా ఎన్‌డిఏ ఆమోదిస్తున్నట్లయితే వాటి స్ఫూర్తితో నిర్ణయాలు చేసి వుండవచ్చు. ఆచరణలో గవర్నర్ల విషయంలో సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించటాన్ని మనం చూశాము.

   నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా కేంద్రం మొక్కుబడిగా నిర్వహించిన ఈ సమావేశం సందర్భంగా కొందరు ముఖ్యమంత్రులు, పార్టీలు కూడా అదే విధంగా వ్యవహరించాయి. అంతరాష్ట్ర మండలి సమావేశ ప్రారంభంలో ప్రధాని ప్రసంగిస్తూ పన్నుల వాటాను 32 నుంచి 42కు పెంచామని, 2014-15తో పోలిస్తే రాష్ట్రాలకు మరుసటి ఏడాది 21శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. మరోవైపు వాస్తవాలు అంకెలు వేరే సందేశాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రాలకు ఇస్తున్న గ్రాంట్లలో గణనీయమైన కోత పెడుతున్నది కేంద్రం. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో ఒక ముఖ్యమైన అంశం. కేంద్రం గొప్పగా చెబుతున్న 32 నుంచి 42 శాతం పన్నుల బదిలీ 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం జరుగుతుంది. బదిలీ 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో జరపాలి. అంటే ఐదేండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ పోయి ఐదవ ఏట నుంచి ప్రతి ఏటా పదిశాతం నిధుల బదిలీ జరుపుతారు.దీనికి అనుగుణంగా 2015-16లో రాష్ట్రాలకు జిడిపిలో 6.3శాతం నిధులను బదలాయించాలని ప్రతిపాదించారు.సవరించిన అంచనాల ప్రకారం అది 6.1శాతానికి తగ్గింది. వాస్తవ బదిలి తరువాత గానీ తెలియదు.కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెండు రకాలుగా బదిలీ జరుగుతుంది. ఒకటి పన్నుల బదిలీ. దానికేమీ షరతులు వుండవు.రెండవది గ్రాంట్లు. వీటికి సవాలక్ష షరతులు విధిస్తారు. ఇది కూడా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో వివాదాస్పద అంశమే. గతేడాది జిడిపిలో 3.4శాతం పన్నులను రాష్ట్రాలకు బడ్జెట్‌లో చూపారు. అది సవరించిన అంచనాలలో 3.7శాతానికి పెరిగింది. చూశారా మేం ఎంత వుదారంగా వున్నామో కేంద్రం గొప్పలు చెప్పుకోవచ్చు. పన్నులలో వాటాను పెంచినప్పటికీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది సర్‌చార్జీలు, సెస్‌ల రూపంలో వసూలు చేసి కేంద్ర ఖజానాకు చేర్చిన మొత్తం పన్ను ఆదాయంలో 6.1 నుంచి 8.1 శాతానికి పెరిగింది.ఈ మొత్తంలో రాష్ట్రాలకు వాటా వుండదు. గ్రాంట్లుగా రాష్ట్రాలకు బడ్జెట్‌లో 2.9శాతం చూపి సవరించిన దానిలో 2.4కు తగ్గించారు.వర్తమాన సంవత్సరంలో ఈ కేటాయింపులు ఎలా అమలు జరుగుతాయో చూడాల్సి వుంది. అందువలన ఆర్ధిక మంత్రి, నరేంద్రమోడీ ఏం చెప్పినప్పటికీ ఆచరణ ఏమిటన్నదే గీటురాయి. సేవా, రైతుల పేరుతో వసూలు చేసే సెస్సులన్నీ కేంద్ర ఖాతాకే పోతాయి అంటే కేంద్రానికి చేరే నిధుల శాతం మరింతగా పెరుగుతుంది.

    కేంద్ర పధకాల పేరుతో రాష్ట్రాలపై మోపుతున్న భారాల గురించి తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వంటి వారు ప్రముఖంగా తమ వైఖరిలో వెల్లడించారు.కేంద్ర ప్రాయోజిత పధకాలన్నీంటికీ గ్రాంట్ల రూపంలో తొలుత కేంద్రం నిధులు కేటాయిస్తుంది. తరువాత అసలు కధ మొదలౌతుంది. నరేంద్రమోడీ చెప్పినట్లు పన్నుల వాటా ఖరారు గాక ముందు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు బదిలీ అయ్యాయి. పన్నుల వాటాను 42శాతానికి పెంచేందుకు అంగీకరించిన కేంద్రం,ఆ వెంటనే ఎలక్ట్రానిక్‌ పాలన, మోడల్‌ స్కూళ్ల వంటి ఎనిమిది పధకాలకు అంతకు ముందు వున్న 60:40 దామాషాలో వున్న నిధుల కేటాయింపులో కేంద్ర వాటాను తగ్గించింది. మిగతా పధకాలకు నిధుల విడుదలకు షరతులను కఠినతరం గావించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్మే నిధుల మొత్తం పెరిగిన తరువాత రాష్ట్రాల రుణ భారం, ఆర్దిక వత్తిడి తగ్గాలి. అయితే బడ్జెట్లలో చూపిన దానికంటే 16 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నట్లు జపాన్‌ సంస్ధ నోమురా నివేదిక తెలిపింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటాన్ని కేరళ ముఖ్యమంత్రి తప్పుపట్టారు. పూంఛీ కమిటీ సిఫార్సులపై చర్చకు ఒక స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

     తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చేసిన ప్రసంగ పూర్తి పాఠాలను మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు తన రీతికి తగినట్లుగా 13పేజీల ప్రసంగం చేస్తే చంద్రశేఖరరావు ఏడు పేజీలకే పరిమితం అయ్యారు. అందువలన వారిద్దరూ ఏం చెప్పారనే అంశాన్ని పరిశీలించుదాం. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రసంగ సారాంశం ఇలా వుంది. జాతీయ రహదారులకు కేంద్రం కేటాయింపులు పెంచటం మంచిదే అదే సమయంలో సాగునీరు, విద్య, ఆరోగ్య రంగానికి కూడా నిధులు పెంచాలి. సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పధకానికి కేంద్రం నిధులు ఇవ్వాలి.వుమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి కేంద్రం ఏదైనా నూతన చట్టం లేదా వున్న వాటికి సవరణలు తీసుకురాదలిస్తే ప్రతి సందర్భంలోనూ రాష్ట్రాల ఆమోదం తీసుకోవాలి. ఒక వేళ ఆర్ధికంగా భారం మోపేదైతే కేంద్రమే పూర్తిగా చెల్లించాలి. వుదాహరణకు విద్యాహక్కు చట్టాన్ని అమలు జరపాలంటే ఏటా తెలంగాణా ఒక్కదానికే 300 కోట్ల రూపాయలు అవసరం. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మోడల్‌ స్కూళ్ల వంటి వాటికి ఇప్పుడు నిధులు పూర్తిగా నిలిపివేశారు, వేతనాలు, ఇతర ఖర్చులు రాష్ట్రాలకు భారం అవుతున్నాయి. కేంద్రం ప్రకటించే ఏ పధకానికైనా మధ్యలో నిధులు నిలిపివేయటం గాక దాని నిర్వహణకు అయ్యే పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరించాలి. వుమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఏకపక్ష అదుపును నివారించాలి. వుదాహరణకు విశ్వవిద్యాలయాలు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వకుండా కాలేజీలకు ఏఐసిటిఇ అనుమతులు ఇవ్వరాదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సమాయానికి ఈ సంస్ధ అనుమతులు ఇచ్చిన ఇంజనీరింగ్‌ కాలేజీలు 356వరకు వున్నాయి.తగిన వసతులు లేని కారణంగా విశ్వవిద్యాలయాలు అనుబంధాలను రద్దు చేసిన కారణంగా వాటి సంఖ్య 172కు పడిపోయాయి. కొద్ది సంఖ్యలో వున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు యుజిసి నిధులలో 65శాతం, మిగతావాటన్నింటికీ కలిపి 35శాతం నిధులు ఖర్చు చేయటం అన్యాయం.గవర్నర్ల ఎంపికలో రాష్ట్రాలను సంప్రదించాలి. ఏదైనా ఒక బిల్లును నిరవధికంగా నిలిపివుంచే విచక్షణాధికారం గవర్నర్లకు వుండకూడదు, ఒక కాలపరిమితి నిర్ణయించాలి. విశ్వవిద్యాలయాలకు గవర్నర్లను ఛాన్సలర్లుగా చేయరాదన్న పూంఛీ కమిషన్‌ సిఫార్సుకు మద్దతు ఇస్తున్నాం, దానిని ఇప్పటికే అమలు జరిపాము. అంతరాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలి, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలి.

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రసంగ సారాంశం ఇలా వుంది. సర్కారియా, ప్రస్తుత పుంఛీ కమిషన్‌ సిఫార్సులకు విరుద్దంగా ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేశారు. అది అశాస్త్రీయంగా వుండటమే గాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులను కలిగించింది.అందరికీ వర్తించేదిగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్న ప్రమాణాలను పాటించారు. వుదాహరణకు జనాభాలో 58శాతం వున్న రాష్ట్రానికి వుమ్మడి రాష్ట్ర ఆదాయంలో 46శాతమే కేటాయించారు. అప్పులను జనాభా ప్రాతిపదికన, ఆస్థులను మాత్రం ఎక్కడివి అక్కడే అన్న పద్దతిలో పంచారు. విద్యుత్‌ రంగంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. రాష్ట్ర దుస్థితిని తగ్గించేందుకు ప్రధాన మంత్రి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేందుకు కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ధికంగానూ ఎంతో సాయం చేయాల్సి వుంది.రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రధాన మంత్రి చేసిన హామీలన్నింటినీ అమలు జరిపేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేక రాష్ట్ర తరగతి హోదా, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి పూర్తి చేయటం, విశాఖ రైల్వే జోన్‌ మంజూరు, పరిశ్రమలకు పన్నుల రాయితీలు కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక పధకం, వనరుల లోటు పూడ్చేందుకు అవసరమైన గ్రాంటు మంజూరు చేయాలి. చివరి రాష్ట్రంగా వున్నందున ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నది, గోదావరి, కృష్ణ బోర్డులను ఈ రోజు వరకు వేయలేదు.

     గవర్నరన్లు ఐదేండ్ల వ్యవధికి నియమించాలన్న పూంఛీ సిఫార్సుల వంటికి కొన్ని ఆచరణ సాధ్యం కాదు, తగిన విధంగా లేవు.గవర్నర్ల అభిశంసనకు అనుసరించాల్సిన పద్దతిపై సిఫార్సు అంగీకారం కాదు. బిల్లుల ఆమోదం, సూచనలకు ఆరునెలల వ్యవధి అవసరం లేదు, ఒక నెల చాలు. స్ధానికంగా అత్యవసర పరిస్ధితి విధింపునకు 355,356 ఆర్టికల్‌ను సవరించకూడదు. అది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అతిక్రమించటమే. ఆర్ధిక మంత్రుల సాధికార కమిటీ పనితీరును చూసిన తరువాత ఇతర రంగాలకు అలాంటి సాధికార కమిటీలను వేయటం సరైంది కాదు. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే పెద్ద రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం. కేంద్ర బలగాలను ఏకపక్షంగా నియమించటం ఫెడరలిజం సూత్రానికే విరుద్దం.జల వివాదాలపై ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై అప్పీలుకు సుప్రీం కోర్టుకు వెళ్లాలనటం సరైంది కాదు, రాజ్యాంగ బద్దంగా అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.

    ఇద్దరు ముఖ్య మంత్రులు చేసిన ప్రసంగ పాఠాలను చూసినపుడు చంద్రశేఖరరావు ఆర్ధికాంశాలపై ఎక్కువగా కేంద్రీకరించారు.చంద్రబాబు నాయుడు వాటిని దాదాపుగా విస్మరించారు. ఎవడబ్బ సొమ్మంటూ కేంద్రంపై ధ్వజమెత్తిన ఎన్‌టిరామారావు వారసులమని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఏపీకి ఇస్తామన్న నిధుల గురించి అడిగారు తప్ప రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు, విధుల గురించి విస్మరించటం విస్మయం గొలుపుతోంది. మాకు మా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలు ఇంకేమీ లేదు, బంగారు తెలంగాణాగా మార్చుకుంటాం అని వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చిన చంద్రశేఖరరావుకు కేంద్ర పధకాల భారపు సెగతగలటం, తెలంగాణాను బంగారంగా మార్చటం సాధ్యం కాదని అర్ధమైందేమో అనివార్యంగా నిధుల గురించి నిర్మొహమాటంగా చెప్పాల్సి వచ్చింది.