Tags

, , , , , , ,

A Chinese student (centre) is pummelled by Indonesian youths who stormed the dormitory of a communist Chinese University ...

ఎంకెఆర్‌

     ఇండోనేషియాలో 1965-66 సంవత్సరాలలో ఐదు లక్షల మంది కమ్యూనిస్టుల వూచకోతలో అమెరికాతో పాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా హస్తం కూడా వున్నట్లు నాటి ఘటనలపై విచారణ జరిపిన ప్రజాకోర్టు బుధవారం నాడు (జూలై 20న) విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొన్నది.ఇరవయ్యవ శతాబ్దిలో పేరు మోసిన నియంతగా చరిత్ర కెక్కినఇందోనేషియా సుహార్తో 2008 మరణించిన తరువాత నాటి మారణ కాండ నుంచి తప్పించుకొని సజీవులుగా వున్నవారు, మానవహక్కుల కార్యకర్తలు, కవులు, కళాకారులు తమ గళం ఎత్తి నాటి వుదంతాలపై వాస్తవాలను వెల్లడించాలని, మారణకాండకు పాల్పడిన వారిని శిక్షించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చిన విఫయం తెలిసిందే.నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో 2015 నవంబరులో ప్రజాకోర్టు విచారణ జరిగింది. దాని ముందు హాజరైన వారు, వుదంతానికి సంబంధించి 40 మందికిపైగా పరిశోధకులు అందించిన సమాచారాన్ని విశ్లేషించి అంతిమ నివేదికను విడుదల చేశారు. దీనిలో ఆస్ట్రేలియ, బ్రిటన్‌, అమెరికాకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

    ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ నేతలు, సభ్యుల జాబితాలను అమెరికా అందించినట్లు, వాటి ఆధారంగా హత్య, జైళ్లపాలు చేసినట్లు ప్రజాకోర్టు ముందుకు వచ్చిన సమాచారం వెల్లడించింది.అమెరికా, ఇండోనేషియా మిలిటరీ సృష్టించిన కట్టుకధలను బ్రిటన్‌,ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నిరంతరం ప్రచారంలో పెట్టాయి. విచక్షణారహితంగా మారణకాండ జరిగినట్లు స్పష్టంగా తెలిసిన తరువాత కూడా ఈ ప్రచారాన్ని కొనసాగించినట్లు తేలింది.తమ విచారణకు హాజరై వాదనలను వినిపించాలని చేసిన విజ్ఞప్తిని ఇండోనేషియా, అస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం విచారకరమని ప్రజాకోర్టు వ్యాఖ్యానించింది. జనరల్‌ సుహార్తో కమ్యూనిస్టుల వూచకోతలో నాయకత్వ పాత్ర వహించినట్లు తెలుపుతూ మరణించినవారు, బతికి బయట పడ్డవారికి, వారి కుటుంబాలకు ఇండోనేషియా సర్కార్‌ క్షమాపణ చెప్పాలని, మానవత్వంపైనే జరిపిన నేరాలకు పాల్పడిన వారిపై విచారణ జరపాలని కోర్టు పేర్కొన్నది. ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన అత్యంత దుర్మార్గ వూచకోతలలో ఒకదానిగా దీనిని పరిగణించాలని చెప్పింది.

    న్యాయమూర్తులలో ఒకరైన ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ హెలెన్‌ జార్విస్‌ మాట్లాడుతూ తమ నివేదిక ఇప్పటికే ఇండోనేషియాలో న్యాయం చేయాలని నినదిస్తున్నవారికి అదనపు గళం అవుతుందని, ఇప్పటికే తమ స్వంత మానవహక్కుల సంస్ధలు చేసిన సిఫార్సులు కూడా వున్నందున ఇండోనేషియా ప్రభుత్వం వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని బతికి వున్న బాధితులకు పునరావాసం కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు.ఈ నివేదిక గురించి ఇండోనేసియా న్యాయ, రాజకీయ, భద్రతా వ్యవహారాల సమస్వయ శాఖ మంత్రి లుహుత్‌ పాంజైటన్‌ మాట్లాడుతూ ఇండోనేసియాకు ఒక న్యాయ వ్యవస్ధ వుంది, ఏం చేయాలో ఈ దేశానికి మరొకరు నిర్దేశించాల్సిన అవసరం లేదు, విశ్వవ్యాప్త విలువలతో ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం, దీని గురించి మేము చాలా ధృఢంగా వున్నాం’ అని వ్యాఖ్యానించారు.అయితే నివేదిక తయారీలో ప్రముఖ పాత్ర వహించిన మానవహక్కుల న్యాయవాది టోడంగ్‌ మౌల్య లుబిస్‌ మాట్లాడుతూ తమ అంతిమ నివేదిక క్షమాపణలు, పునరావాసం, నష్టపూర్తి చర్యలకు తలుపులను తెరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది ప్రముఖులు ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. ‘ కమ్యూనిస్టుల నుంచి ముప్పు వచ్చిందని, వారిని చంపటం లేదా వారి చేతిలో చావటమో తేల్చుకోవాలని చెప్పారని’ ముస్లిం సంస్ధ నహదల్‌తుల్‌ వులమా చరిత్రకారుడు ఇమాన్‌ అజీజ్‌ ఇటీవల అన్నారు.అయితే అణచివేయాల్సినంత భయానక పరిస్ధితులు లేవని ప్రజాకోర్టు నివేదిక వెల్లడించిందని మోనాష్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ పుర్దే చెప్పారు. ఇది పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం ఆధారంగా జరిగిందని స్పష్టమైందని ఆమె అన్నారు. కౌసెన్‌దార్‌ అనే 83 ఏండ్ల వృద్ధుడు మాట్లాడుతూ ఎలాంటి విచారణ లేకుండా తనను 14 సంవత్సరాల పాటు బారు దీవిలోని జైలులో పెట్టారు. ఆయన నేరమల్లా ఒక కార్మిక సంఘంలో వున్న స్నేహితులను కలిగి వుండటమే.తన వంటి వారికి జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలా లేదా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు. స్వాధీనం చేసుకున్న మా ఆస్ధులు తిరిగి ఇవ్వాలి, రద్దు చేసిన మా పెన్షన్‌ హక్కులను పునరుద్దరించాలి, దేశం విడిచి పోయేట్లు చేసిన వారిని తిరిగి రప్పించాలి, మా డిమాండ్లేమే సంక్లిష్టమైనవి కాదు’ అన్నారు.

    ప్రజాకోర్టు నేపధ్యం విషయానికి వస్తే నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో నవంబరు 10-13 తేదీల మధ్య విచారణ జరిపింది. పలు వివరాలతో కూడిన ఆరువందల పేజీల నివేదికను తయారు చేసింది. బాధితులుగా వున్నవారు 20 మంది సాక్ష్యాలు చెప్పారు. హత్యలు,జైలు పాలు చేయటం, బానిసలుగా మార్చివేయటం, చిత్ర హింసలు, అత్యా చారాలు, మాయం చేయటం, విద్వేష ప్రచారం, ఇతర దేశాల జోక్యం వంటి అంశాలపై ఈ కోర్టు విచారించింది. నియంత సుహార్తో చచ్చేంత వరకు ఇండోనేషియాలో జరిగిన ఈ దురాగతం గురించి ప్రపంచానికి మిలిటరీ, దానికి మద్దతుగా వున్న అమెరికా తదితర దేశాలు ప్రచారంలో పెట్టిన కమ్యూనిస్టు వ్యతిరేక, ఏకపక్ష కధనాలు తప్ప వాస్తవాలను బయటకు రాకుండా తొక్కి పెట్టారు. ఎవరినీ నోరెత్తనివ్వలేదు, అయితే సుహార్తో చచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత ‘హత్యాకాండ’ పేరుతో 2012లో జాషువా ఓపెన్‌హెయిమర్‌ తీసిన డాక్యుమెంటరీ చిత్రం ఆ నిశ్శబ్దాన్ని తొలుత భగ్నం చేసింది. 2013లో హేగ్‌లో దానిని ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చలో 35 మంది ప్రవాస ఇండోనేషియన్లు పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు, కొంత మంది సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు కూడా హాజరయ్యారు.2012లోనే ఇండోనేషియా మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదికను కూడా అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు.దీంతో ఒక అంతర్జాతీయ ప్రజాకోర్టును ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికి తీయాలని, వాటిపై ఒక నివేదికను రూపొందించాలన్న సూచన కార్యరూపం దాల్చింది. నూర్సియా బానీ కాట్‌జసంగ్‌కానా కన్వీనర్‌గా 2013 మార్చినెలలో తొలుత కొద్ది మందితో సమావేశం జరిపి విచారణ తీరుతెన్నులను చర్చించారు. జకర్తా, నెదర్లాండ్స్‌ (ఇండోనేషియా నెదర్లాండ్స్‌ వలస రాజ్యం అన్న విషయం తెలిసిందే) అంతర్జాతీయ ప్రజాకోర్టు( ఐపిటి) 1965 పేరుతో 2014 మార్చి 18న ఒక న్యాయ సంస్ధను రిజిస్టర్‌ చేసి 2015లో విచారణ జరిపేందుకు ముందుకు వచ్చే న్యాయమూర్తులను సంప్రదించారు.ఈ ప్రక్రియకు వందమందికి పైగా సహకరించారు. అనేక మంది ప్రవాస ఇండోనేషియా విద్యార్ధులు ముందుకు వచ్చారు. వారిని బెదిరింపులకు గురిచేసినప్పటికీ లొంగలేదు.