Tags

, , , ,

 నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన అనధికార బిల్లు అందరూ వూహించినట్లుగానే రెండవ సారి కూడా చర్చకు రాకుండా పోయింది. అలాంటి బిల్లులను చర్చకు రానివ్వరని ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా ఎంతో శాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులు గ్రహించటం మంచిది. రజనీకాంత్‌ ఒక సినిమాలో సినిమాలో చెప్పినట్లు అతిగా ఆశపడవద్దు. నరేంద్రమోడీ, చంద్రబాబు మంత్రదండాలు, అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలు, లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య వంటి పవన్‌ కల్యాణ్‌ ప్రకటనల కోసం ఎదురు చూసే ఆనందం ఎంతైనా ప్రత్యేక హోదాతో రాదు కదా !

    ఆ బిల్లు చర్చకు వస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు చెప్పిన తీరును చూసినపుడే రాదన్న గట్టి ధీమా వారిలో వుందని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల తరువాత ఒక ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని అంగీకరిద్దాం. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు, అలాగే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం కూడా అలాంటిదే. రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అన్యాయం చేశారనే శాశ్వత విమర్శను కొనసాగించాలన్నా , ఆ పేరుతో మరికొంత కాలం ఓట్లు దండుకోవాలన్నా దానిని ఇవ్వకుండా, అలాంటి బిల్లులను చర్చకు రాకుండా చేయటం బిజెపి, తెలుగుదేశం పార్టీలకు అవసరం అని శుక్రవారం నాటి పరిణామాలు నిరూపించాయని కూడా అనుకోకతప్పదు మరి. రాష్ట్రాన్ని విభజించి అసెంబ్లీ చరిత్రలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగి కావచ్చు లేదా చేసిన తప్పును దిద్దుకోవాలంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న లోకోక్తి ప్రకారం గానీ ఏదైనేం రెండు సంవత్సరాలకు ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

   నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు బిజెపి నేత అవునో కాదో తెలియని మా గుంటూరు గొరిజవోలు చిన్న సినీ హీరో శివాజీ దానిని 14వ అంశంగా పెట్టారని శరభ శరభ దశ్శరభ శరభ అంటున్నాడు. బిల్లు చర్చకు రావాలని, ఆమోదం పొందాలని తెలుగుదేశం పార్టీ నిజంగా కోరుకుంటే , హోదా రాకపోతే ఆంధ్రప్రజలు ఆగ్రహిస్తారని అనుకొని వుంటే చర్చకు రాకుండా పోయిన తరువాత దాని మీద ఆ పార్టీ నేతలు, చివరికి నిన్నటి వరకు కాంగ్రెస్‌లో వుండి తెలుగుదేశంలో రాజ్యసభ సీటుకొనుక్కున్నారని విమర్శలు ఎదుర్కొన్న టిజి వెంకటేష్‌తో సహా అలాంటి వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు.

   ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎంపీ పార్లమెంట్‌ ప్రాంగణాన్ని వీడియో తీసి దానిని సామాజిక మీడియాలో పెట్టారని అది నిబంధనలకు వ్యతిరేకం కనుక అతగాడిపై చర్య తీసుకోవాలని బిజెపి అభ్యంతరం తెలిపింది. ఓకే, అదే వాస్తవమైతే నిబంధనల ప్రకారం స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు, రుజువైతే చర్య తీసుకోవచ్చు, ఎవరు అడ్డుపడ్డారు. వుభయ సభలలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల సభ్యులు కూడా చర్య తీసుకోవాలనే కోరారు తప్ప వ్యతిరేకించలేదు. అన్నింటికీ మించి సదరు సభ్యుడు క్షమాపణ చెప్పాడు. అయినా సరే అతని ప్రవర్తన అభ్యంతరకరం అనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా మాదిరి బిజెపి వ్యూహకర్తల మేకిట్‌ ఎన్‌ ఇష్యూ (దాన్నొక సమస్యగా చేయండి ) కాకపోతే ఆ పేరుతో లోక్‌సభ, రాజ్యసభలను ఒక రోజంతా పనిచేయకుండా వాయిదా పడేట్లు అధికారపక్షమే అడ్డుకోవాల్సినంత తీవ్ర విషయమా అది.

   రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి పార్లమెంట్‌ భద్రతా విషయాన్ని చర్చించాలన్న అధికార పక్ష సభ్యురాలి డిమాండ్‌ను కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదించలేదు. ప్రశ్నోత్తరాల తరువాత దాని గురించి చర్చించవచ్చని చెప్పారు.అయినా సరే బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు తమ పట్టువీడకుండా గొడవ చేయటంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా అనధికార బిల్లులు చర్చకు రాకుండా పోయాయి. కాంగ్రెస్‌ సభ్యులు ముందే చర్చకు అంగీకరించి వుంటే బిల్లు చర్చకు వచ్చేదని నెపాన్ని కాంగ్రెస్‌ మీద నెట్టేందుకు తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు ప్రయత్నించటాన్ని చూస్తే జరిగిందేమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రజానీకం వుందని భావిస్తున్నారా ? లేక తామేం చెప్పినా నిజమే నిజమే అని తలలూపుతారనుకుంటున్నారా ? అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు కోసం పట్టుబట్టి హైదరాబాదులోనే కూర్చుంటామా అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే అన్ని పార్టీలనీ గుడ్డిగా నమ్మి (సిపిఎం తప్ప) అన్నీ వదులుకున్న ఆంధ్రులు రాని ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టి కూర్చుంటారా ?

      తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారికి ఏమైందో తెలియదు. శుక్రవారం రాత్రి తన సిబ్బంది ద్వారా ఒక అధికారిక ప్రకటన పంపారు. దాని పూర్తి పాఠం ఇలా వుంది.’రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్  అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము అని స్పష్టము గా చెప్పాను. టీడీపీ కృషి , ఒత్తిడి వలనే కేంద్రము క్రమము గా అన్ని పథకాలకు నిధులు కేటాయించటం జరిగింది . ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహ ధర్మాన్నే పాటిస్తాము కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయము లో రాజీ పడే పరిస్థితి లేదు . రాజకీయ ఎదుగుదల కోసము కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలని తెలివైన ఆంధ్రులు తేలికగా అర్థము చేసుకుంటారు . ‘.

ఇక్కడ సామాన్యులకు అర్ధం కాని విషయం ఏమంటే కాంగ్రెస్‌ మీద అంత సానుభూతి ఎందుకు? తెలుగు దేశం పార్టీ కృషి, వత్తిడి వల్లనే కేంద్రం అన్ని పధకాలకు నిధులు ఇచ్చిందన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఇలా చెప్పటం నిజంగా ఆశ్చర్యంలోనే ఆశ్చర్యం. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుస్తుందా లేక వత్తిడి ద్వారా పని చేస్తుందా ? మీరు చెప్పినట్లు స్నేహంగా వున్నంత కాలం నిధులు విడుదల చేయని కారణంగానే వత్తిడి తెచ్చారని అనుకోవాలా ? వత్తిడి కారణంగా అదనంగా వచ్చిన నిధులేమిటో జనానికి తెలియ చేస్తే సంతోషిస్తారు. బిజెపి-తెలుగు దేశం మధ్య వున్నది అనుభూతికి అందని అపూర్వ స్నేహంగా కనిపిస్తోంది. మీరు తెచ్చే వత్తిడికి నిజంగా అంత సత్తా వుంటే ప్రత్యేక హోదా సంగతి ఇంతకాలం ఎందుకు తేల్చలేకపోయారు అని జనం అడుగుతున్నారు. పార్లమెంట్‌లో మీరే ఎందుకు వత్తిడి తేలేదు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు సభలో గందర గోళం, వెల్‌లోకి దూసుకుపోవటం వంటివి చేస్తారు. కానీ మీ మిత్రపక్షం అధికారంలో వుండి ఆ పని చేస్తోంది. అంటే ప్రజాస్వామ్యాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవాలా ?

    కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు, బుద్ది రాదు అనుకుందాం . బిజెపి, తెలుగుదేశం పార్టీల వద్ద శుద్ది,బుద్ది టన్నుల కొద్దీ వున్నాయి కదా ! ఇప్పటికైనా ఎలాంటి రాజకీయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది కోసం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ ఏదో ఒకటి చేసి చూపండి, ఏమీ చేయకుండానే మూడో ఏడాదిలో ప్రవేశించారు. లేదా ఏదీ అవేమీ వుండవు అనైనా చెప్పండి ! సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!