Tags

, , , ,

Image result for china healthcare

ఎం కోటేశ్వరరావు

   మన ప్రభుత్వాలు అమలు జరుపుతున్న దారిద్ర నిర్మూలన పధకాలు కాగితాల మీద దరిద్రుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఎంత ఆదాయం వస్తే, ఎంత ఖర్చు చేస్తే దారిద్య్రంతో వున్నట్లు అనే కొలబద్ద నిర్ణయంలోనే తిరకాసు వున్న విషయం తెలిసిందే. లెక్కలు చూపేందుకు పడుతున్న తాపత్రయం దారిద్య్ర నిర్మూలనలో లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే పాలకులు విధానాల కారణంగా అనారోగ్యం పాలైన పేద, మధ్యతరగతి కుటుంబాలన్నీ తట్టుకోలేని ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పుల పాలు కావలసి వస్తోందని ప్రతి కుటుంబ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా 6.3 కోట్ల మంది ఈ అప్పుల వూబిలో దిగుతున్నారు. తాజాగా జూలై 22వ తేదీన ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ, చైనా ప్రభుత్వం హెల్తీ చైనా (ఆరోగ్యవంతమైన చైనా) పేరుతో ఒక పెద్ద విశ్లేషణాత్మక నివేదికను వెల్లడించాయి. దానిలో చైనాలో జరిగిన అభివృద్ధి కారణంగా తలెత్తిన సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలా అనే అంశాలను చర్చించారు. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

  ప్రస్తుతం మొత్తం చైనా ఆరోగ్యఖర్చులో అక్కడి ఆసుపత్రుల వాటా 54శాతం వుండగా, ఓయిసిడి(ఐరోపా ఆర్ధిక, అభివృద్ధి సంస్ధ ) దేశాలలో అది 38 శాతంగా వుంది.

   1980-2000 సంవత్సరాల మధ్య చైనాలో ఆసుపత్రి పడకల సంఖ్య 1.19 నుంచి 2.17 మిలియన్లకు , తరువాత 13 సంవత్సరాలలో 2013 నాటికి 4.58 మిలియన్లకు పెరిగాయి. ఇదే సమయంలో అత్యధిక ఓయిసిడి దేశాలలో పడకలను కుదించారు, కొన్ని దేశాలలో అది 30శాతం వరకు వుంది.

   2002-2013 మధ్య టెరిటరీ, సెకండరీ ఆసుపత్రుల సంఖ్య 82,29శాతం చొప్పున పెరగ్గా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఆరుశాతం తగ్గింది.ఆసుపత్రులలో చేరటం 2003లో 4.7శాతం వుండగా 2013లో 14.1శాతానికి చేరింది.

    ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల నిపుణుల సంఖ్య 36శాతం తక్కువగా వుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలపై విశ్వాసం లేక అన్ని అర్హతలు కలిగిన ఆరోగ్య కార్యకర్తలు లేని కారణంగా గ్రామీణ ప్రాంత రోగులు వాటికి వెళ్లకుండా నేరుగా పై తరగతి ఆసుపత్రులకు వెళ్లటం ఎక్కువైంది.

  వైద్య రంగంలో వేతనాలు ఆకర్షణీయంగా లేని కారణంగా దాదాపు 40శాతం మంది మెడికల్‌ గ్రాడ్యుఏట్లు ఆసుపత్రులలో చేరకుండా ఔషధాలు, వైద్య పరికరాల పరిశ్రమలలో చేరుతున్నారు.

  మెడికల్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 2003-13 మధ్య రెట్టింపైంది. వారిలో నర్సింగ్‌ సిబ్బంది 108శాతం, ఫిజిషియన్స్‌లో 41 శాతం పెరుగుదల కనిపించింది.అయినప్పటికీ నర్సింగ్‌ సిబ్బంది, ఇతరుల కొరత ఇంకా ఎక్కువగానే వుంది.

    అవసరానికి మించి మందులు రాయటం ఒక ప్రధాన సమస్యగా వుంది.సగటున మూడు మందులు రాస్తున్నారు. ఇంజెన్ల రేటు 53శాతం వుంది, ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సిఫార్సు కంటే ఇవి రెండు ఎక్కువే. రాస్తున్న మందులలో యాంటీబయటిక్స్‌ సగం వుంటున్నాయి.

  గ్రామీణ వైద్యులు కేవలం 26శాతం కేసులలో వ్యాధిని సరిగా నిర్ధారిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.అవసరంలేని, హానికరమైన మందుల సిఫార్సు చేయటం 64శాతం కేసులలో కనిపించింది.

    వైద్య సేవలకు ఫీజు చెల్లించే ఏజన్సీ ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఔషధాలపై ఇస్తున్న లాభాల కారణంగా ఆసుపత్రుల రంగంలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. స్థూలజాతీయాదాయం (జిడిపి) పెరుగుదల రేటు కంటే ఆరోగ్య ఖర్చుల పెరుగుదల రేటు ఎక్కువగా వుంది. ఏటా 8.4శాతంగా వుంది.జిడిపిలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు 2015లో 5.6శాతం వుండగా 2035 నాటికి 9.1శాతం పెరగవచ్చని అంచనా.ఇది డాలర్లలో 467.2 మిలియన్ల నుంచి 2.4 బిలియన్లకు పెరుగుతుంది.

   ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం మెరుగైన వ్యాధుల యాజమాన్య పద్దతులను పాటిస్తే ఆరోగ్య ఖర్చు తగ్గి జిడిపిలో మూడు శాతం పొదుపు అవుతుంది. మరింత మెరుగైన ఆరోగ్య వ్యవస్ధ, సంరక్షణ,ఆరోగ్యం సమకూరే విధంగా సంస్కరణలు చైనాలో అమలు జరిగితే ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించినట్లు అవుతుంది.

    జీవితకాలం పెరిగిన కారణంగా ప్రస్తుతం 65 సంవత్సరాల వయసు దాటిన వారు చైనాలో 14 కోట్ల మంది వున్నారు.వీరి సంఖ్య 2030 నాటికి 23 కోట్లకు పెరుగుతుందని అంచనా.

  రెండు దశాబ్దాల క్రితం అప్పుడే అంటు వ్యాధులు, పుట్టిన పిల్లలకు వచ్చే వ్యాధులు, పౌష్టికాహారం,తల్లుల ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన వ్యాధులు 41శాతం వుండేవి. ఇప్పుడు ఓయిసిడి దేశాలలో మాదిరి చైనాలో దీర్ఘకాల, అంటు లక్షణం లేని వ్యాధుల కారణంగా 85 శాతం మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాలలో మూడింట రెండువంతులకు హృదయ, క్యాన్సర్‌ వ్యాధులు కారణం అవుతున్నాయి. పెద్ద వారిలో అధిక బరువు సమస్య 1991-2009 మధ్య మూడు రెట్లు 11.8 నుంచి 29.2శాతానికి పెరిగింది. ఇది పురుషులలో ఎక్కువగా వుంది. నలభై తొమ్మిదిశాతం చైనా పురుషులు రోజూ పొగతాగుతున్నారు. ఇది ఓయిసిడి దేశాలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువ. మద్యం వినియోగం 2000-2010 మధ్య రెట్టింపైంది. సగటున తలకు 5.8లీటర్లు వుంది.

   2009లో చైనా పెద్ద ఎత్తున ఆరోగ్య సంస్కరణలు ప్రారంభించింది.నూట ముప్ఫై కోట్ల మందికి మూడు లక్షల కోట్ల యువాన్లను ఖర్చు చేయాలని తలపెట్టింది. ఫలితంగా దాదాపు నూటికి నూరుశాతం మందికి ఆరోగ్యబీమా సమకూరింది. దశాబ్దకాలంలో ఆరోగ్య సంరక్షణకు జేబులోంచి ఖర్చు చేయాల్సిన మొత్తం 60 నుంచి 30శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ జనాభా మాత్రం మొత్తం ఖర్చులో సగం తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. మెరుగుదల అంతటా సమంగా లేదని ఇది వెల్లడిస్తోంది.

    వందల సంవత్సరాలుగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిలో ఎంతో ముందున్న ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అర్ధికంగా,రాజకీయ, సైనిక రంగాలలో ఎంతో ముందున్నా మొత్తం జనానికి ఆరోగ్యబీమా కల్పించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికీ మూడు కోట్ల మందికిపైగా (2014) 10.4 శాతం జనానికి ఆరోగ్యబీమా లేదు. వారికి జబ్బు చేస్తే మన దేశంలో సామాన్య, మధ్యతరగతి మాదిరి అప్పులపాలు కావాల్సిందే. బీమా లేని వారి సంఖ్య ఏటా ఏడుశాతం పెరుగుతున్నదని ఒకవైపు సర్వేలు తెలుపుతున్నాయి.2018 నాటికి బీమా సౌకర్యం లేనివారి సంఖ్యను 2.4కోట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆ సమస్య మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. వలస వచ్చిన వారిలో నమోదు కాని వారికి బీమా సౌకర్యం వర్తించదు, వారి సంఖ్య దీనికి అదనం. ఎంతన్నది అమెరికా ఎన్నడూ చెప్పదు. మన దేశంలో బీమా సౌకర్యం గురించి చెప్పుకోనవసరం లేదు. ప్రభుత్వ వుద్యోగులు, కొందరు ప్రయివేటు వుద్యోగులకు మినహా మిగతా సామాన్య జనంలో చాలా పరిమితంగానే బీమా పధకాలలో వున్నారు. వైద్యానికి జేబులోంచి ఖర్చు చేసే మొత్తం 85శాతం వరకు వుంటోంది.

   ఇక్కడ ఒక సమస్య గురించి ప్రస్తావించక తప్పదు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటాం. పీల్చటానికి కావాల్సినంత కాలుష్య గాలి, తాగటానికి తగినన్ని కాలుష్య జలాలు వుచితం తప్ప వాటి కారణంగా వచ్చే రోగాల బారిన పడితే అంతే సంగతులు. గాలి, నీటి కాలుష్యానికి పాల్పడేవారిని కాపాడటం తప్ప వారి బారిన పడేవారిని ఆదుకొనేందుకు ముందుకు రాని ప్రజాస్వామ్యం ! డబ్బు లేక కాదు సుమా, డబ్బు లేకపోతే ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‌ సంస్ధలు, ధనికుల వజ్రవైఢూర్యాల దిగుమతులకు పన్ను రాయితీలివ్వటం ఎలా సాధ్యం? అడిగితే జవాబు చెప్పరు. మరి అత్యంత సంపద్వంతమైన భూతల స్వర్గం అమెరికాలో కూడా అందరికీ వైద్యం అందుబాటులో ఎందుకు లేకపోయింది ?

  మొత్తం 130 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సౌకర్యం అందించే స్ధితికి ఇంకా చైనా చేరుకోకపోయినప్పటికీ రోగాల కారణంగా జనం అప్పుల పాలు కావటం అక్కడ లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బీమా ప్రతి ఒక్కరికీ వుంది.రెండువందల యాభై సంవత్సరాల స్వాతంత్య్రం, అభివృద్దిలో అమెరికా సాధించలేని విజయాన్ని చైనా అందులో నాలుగో వంతు కాలంలోనే సాధించటం ఎలా సాధ్యమైంది ? మనం ఆ బాటలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వుంది. చైనా నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామ్యం అన్న జవాబు వెంటనే సిద్దంగా వుంటుంది.చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడటం ముఖ్యం అన్నారు. అలాగే మంచి గాలి కోసం కిటికీ తెరిస్తే గాలితో పాటు ఈగలూ,దోమలూ కూడా వస్తాయి, వాటిని అరికట్టగలం అన్నారు. సంస్కరణలు అంటే విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానానికి చైనా మార్కెట్‌ను తెరవటం. అది జరిగింది. అభివృద్ధితో పాటు అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలూ పుష్కలంగానే ప్రవేశించినట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దానిని చైనీయులేమీ దాచుకోవటం లేదు.

    కౌలుగడువు తీరి వాటిని తనలో విలీనం చేసుకొనే సందర్భంగా హాంకాంగ్‌, మకావో దీవులలో 2050 వరకు పెట్టుబడిదారీ విధానాన్ని అనుమతిస్తామని  చైనా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అంటే దాని ప్రకారం బిలియనీర్లను అనుమతించటంతో పాటు వారు పెరగటానికి కూడా కమ్యూనిస్టుపార్టీ అంగీకరించినట్లే. ఈ కారణంగానే 2050 వరకు తమ పెట్టుబడులకు ఎలాంటి ఢోకాలేదనే ధీమాతో చైనాలో పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పెట్టటానికి ధైర్యంగా ముందుకు వచ్చి డబ్బు కుమ్మరించారు. దీనిని చూసి కొంత మంది చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదు, అది కమ్యూనిజం బాటలో పయనించటం లేదు అని విమర్శిస్తున్నారు. చైనా ప్రభుత్వ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి, బిలియనీర్లు తయారయ్యేందుకు వీలు కల్పిస్తోంది కనుక అధికారిక పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశం అని వర్ణిస్తున్నవారూ లేకపోలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల కంటే భిన్నంగా చైనాలో జీవన ప్రమాణాలు, ఆదాయాలూ పెరుగుతున్నాయా లేదా అంటే పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ దేశం అయితే అది ఎలా సాధ్యం ? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరోపాలోని ధనిక దేశాలు కూడా కొన్ని సంక్షేమ చర్యలు అమలు జరిపినంత మాత్రాన వాటిని సోషలిస్టు దేశాలు అనటం లేదు అలాగే అమలు జరుపుతున్న చైనాను మాత్రం సోషలిస్టు దేశంగా ఎలా అంగీకరిస్తాం అనే వారు లేకపోలేదు. సోషలిజం, కమ్యూనిజం భావనల వ్యాప్తిని అడ్డుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపాలోని ధనిక దేశాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపాయి. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా 2008 సంక్షోభం ప్రారంభమైన తరువాత వాటన్నింటినీ ఒక్కటొక్కటిగా రద్దు లేదా కోత పెడుతున్నాయి. ఇదే సమయంలో చైనాలో సంక్షేమ చర్యలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్నట్లు సమాచారం లేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్న ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలన్నీ సంక్షోభం లేదా ఒకటి రెండు శాతం అభివృద్ధి రేటుతో మాత్రమే ముందుకు పోతుండగా చైనాలో గతంతో పోలిస్తే కొంత మేరకు తగ్గినా ఎనిమిదిశాతం వరకు అభివృద్ధి వుంది, ఇలా ఎందుకు జరుగుతోంది ?

    చివరిగా ఒక్క విషయం. మన కంటే సాగు భూమి తక్కువ, జనాభా ఎక్కువ వున్న దేశం చైనా. మనదేశంలో 65 ఏండ్లు దాటిన వృద్ధులు జనాభాలో 5.8 శాతం వుంటే అక్కడ 9.6 శాతం వున్నారు. అ ంటే వృద్దాప్య పెన్షన్లు, వారి సంక్షేమ ఖర్చూ ఎక్కువే. మన సగటు జీవన కాలం 67.8 అయితే అక్కడ 75.15 వుంది. మన పట్టణ జనాభా 31శాతం అయితే అక్కడ 50శాతం దాటింది.మన దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆసుపత్రి పడక వుంటే చైనాలో 3.8 వున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాతో పోల్చితే మనకు అనుకూలమైనవీ, ప్రతికూలమైన పరిస్ధితులూ వున్నాయి. చైనాలో అమలు జరుపుతున్న సంస్కరణలు అక్కడ సామాన్య జనజీవితాలను మెరుగు పరచటంతో పాటు ధనికులనూ పెంచుతున్నాయి.మన దేశంలో కేవలం ధనికులను మాత్రమే పెంచుతున్నాయి.

   చైనా తనదైన ప్రత్యేక శైలిలో సోషలిజాన్ని నిర్మిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతోంది. సోషలిజాన్ని ఫలానా మార్గంలో సాధించాలని లేదా ఫలానా విధంగానే నిర్మించాలని మార్క్సిస్టు మహోపాధ్యులెవరూ నిర్ధేశించలేదు. కొన్ని అంచనాలు, జోశ్యాలు, ఊహలు మాత్రమే చేశారు. అత్యంత వెనుకబడిన ఆఫ్రికా దేశాలలో, ఎంతో పురోగతి సాధించిన అమెరికా ఖండ దేశాలలో భౌతిక పరిస్ధితులు భిన్నంగా వున్నపుడు రెండు చోట్లా ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధను సాధించటం ఎలా సాధ్యం. దేని మార్గం దానిదే. అందువలన చైనాలో జరుగుతున్నదానిని చూసి కొన్ని నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదు, చైనా అయినా మరొక కమ్యూనిస్టుపార్టీ గురించి అయినా విమర్శనాత్మక దృష్టితో చూడటం, సద్విమర్శలు చేయటంలో తప్పులేదు. ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన స్ధితిలో కమ్యూనిజాన్ని తెగనాడితే లబ్దిపొందేది కమ్యూనిస్టు వ్యతిరేకులు మాత్రమే.