Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

    ఎగువన వున్న తుంగభద్ర జలాశయమే పూర్తిగా నిండలేదు, అనూహ్యమైన వాతావరణ మార్పులు సంభవిస్తే తప్ప ఈ ఏడాది కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలు నిండటం అనుమానమే. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం పడిన కొద్ది పాటి వర్షాలకే మరో మార్గం కానరాక ఎన్నో ఆశలతో ఈ ఏడాది కూడా పత్తి సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే సీజన్‌కు క్వింటాలుకు పొడవు పింజ పత్తిరకాల మద్దతు ధర మరో అరవై రూపాయలు పెంచి రు.4,160గా ప్రకటించి ఎంతో మేలు చేసినట్లుగా చెప్పుకుంటోంది. ఏవి మోడీ 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేస్తామని మొన్న చేసిన చేసిన వాగ్దానాల అమలు ఎక్కడ అని ఎవరైనా అడిగితే దేశ భక్తులు కాదని ముద్ర వేసే ప్రమాదం లేకపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను అడిగితే ఒకరు వైఎస్‌ఆర్‌సిపి మీద మరొకరు తెలుగుదేశం, కాంగ్రెస్‌ మీద విరుచుకుపడి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు. చంద్రబాబు నాయుడికి నరేంద్రమోడీతో రోజురోజుకూ మరింతగా బిగుస్తున్న స్నేహ ధర్మం అడ్డు వచ్చి, పత్తి వేసుకోవద్దని ముందే సలహా ఇచ్చాం కదా అని చంద్రశేఖరరావు కూడా దీని గురించి పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్‌లో అనధికారికంగా అన్నీ తానే అయినట్లు వ్యహరిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న(ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం వాటిని ఖండించలేదు) లోకేష్‌, తెలంగాణాలో తానే ముఖ్యమంత్రిని అన్నట్లుగా హడావుడి చేస్తున్న మంత్రి కెటిఆర్‌కు గానీ తమ రాష్ట్రాలలో పత్తి ఒక ప్రధాన పంట అనిగానీ రైతాంగంపై దాని ధరలు, మార్కెటింగ్‌ తీవ్ర ప్రభావం చూపుతాయని గానీ అనుకుంటున్నారో లేదో తెలియదు.

   చైనా ప్రస్తావన తేవటం కొంత మందికి ఆగ్రహం తెప్పించవచ్చు. ఏం చేస్తాం, వాస్తవాల మీద ఆధారపడినపుడు ప్రపంచమే చైనాను విస్మరించజాలదు, మన మార్కెట్‌ను కూడా చైనా వస్తువులు ముంచేస్తున్నపుడు మనం దూరంగా ఎలా వుంటాం.నిత్యం చైనాను కట్టడి చేయాలని, దాని వస్తువులను నిషేధించాలని వీరంగం వేస్తున్నవారితో సహా మన పత్తి, నూలును చైనా కొనటం నిలిపివేస్తే ఎవరూ చేసేదేమీ లేదు,పరిస్ధితి మరింత దిగజారుతుంది. అందుకే నరేంద్రమోడీ సర్కార్‌ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్‌ చివరి వారంలో జెంగ్‌జౌ వస్తు మార్కెట్‌లో ఒక్క రోజులోనే 4.1కోట్ల బేళ్ల పత్తి లావాదేవీలు జరిగాయి. ఒక బేలు పత్తితో 215 జతల జీన్స్‌ తయారు చేయవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఆ ఒక్క రోజు అమ్మిన పత్తితో భూమ్మీద ప్రతి ఒక్కరికీ కనీసం ఒక జీన్స్‌ పాంట్స్‌ తయారు చేయటానికి సరిపోతుందని అంచనా.

  వ్యవసాయం గురించి అనుచితంగా మాట్లాడిన చంద్రబాబు పర్యవసానాలతో పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా వుండి, కంగుతిని తరువాత ఓట్ల కోసం సవరించుకున్నారు. ఆచరణలో ఏం చేస్తున్నారు? ప్రధాని నరేంద్రమోడీ, ఇద్దరు తెలుగు చంద్రులు, వారి వారసులు పోటీ పడి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తెస్తున్నట్లు పుంఖాను పుంఖాలుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాటిలో పదిశాతం లేదా ప్రయాణ, ప్రచార ఖర్చులు ఏది ఎక్కువైతే ఆ మొత్తం వాస్తవ రూపం దాల్చినా మంచిదే. ఆ పెట్టుబడులు వందల కొలదీ చేసుకున్నామని చెబుతున్న ఒప్పందాలలో రైతాంగానికి పనికి వచ్చేవి ఎన్ని? పొగాకు అమ్ముడు పోక రైతాంగం దిక్కుతోచకుండా వుంటే కొనటానికి కేంద్రాన్ని ఒప్పించలేని పెద్దలు తల్లికి తిండి పెట్టని కొడుకులు పిన్నికి బంగారు తొడుగులు వేయిస్తామన్నట్లుగా వ్యవసాయం గురించి చెపితే రైతులు చెవులో పూలు పెట్టుకొని నమ్మాలా ? అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గిన కారణంగా దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు తగ్గితే వ్యాపారులు ఆమేరకు తగ్గించకుండా వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, వాటిపై నియంత్రణ వుందా ?

    మన పత్తికి ఇప్పుడున్నదాని కంటే మంచి ధర రావాలంటే చైనాకు మరిన్ని ఎగుమతులు జరిగితే తప్ప రాదన్నది స్పష్టం. 2015లో మన దేశం నుంచి చైనాకు ఎగుమతి చేసిన నూలు, దానికి వచ్చిన రేటు 12,17శాతం చొప్పున తక్కువగా వున్నాయని తాజా సమాచారం. ముందే చెప్పుకున్నట్లు తన దగ్గర వున్న అపార పత్తి నిల్వలను చైనా మార్కెట్‌కు విడుదల చేస్తోంది. ఈ స్ధితిలో మన పత్తి రైతులకు ధర గతం కంటే ఎలా మెరుగుపడుతుందో తెలియని స్ధితి. మిలియన్ల మంది పత్తి రైతులు, వారి పొలాల్లో పని చేసే వ్యవసాయ కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా పారిశ్రామిక, వ్యాపారాలలో పెట్టుబడుల ఎండమావులు వెంట తిరిగితే ప్రయోజనం వుంటుందా ?

    గతేడాది చైనాకు ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. అయితే వియత్నాం, బంగ్లాదేశ్‌ కొంత మేరకు దిగుమతులు పెంచటంతో పత్తి ధర సీజన్లో మద్దతు ధరకు అటూఇటూగా అయినా వుంది.ఈ ఏడాది వారు కూడా తమకు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన రైతాంగ పరిస్ధితి ఏమిటి ? రైతులు పచ్చగా లేకుండా లోకేష్‌ బాబుతో కలసి చంద్రబాబు అంతర్జాతీయ స్ధాయిలో రాజధాని అమరావతిని నిర్మించినా, చంద్రశేఖరరావు అండ్‌ ఫ్యామిలీ భాగ్యనగరాన్ని మరింతగా అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏమిటి ?

    తమకు నష్టాలు వస్తున్నాయనే పేరుతో నూలు మిల్లులు వారానికి కొన్ని గంటల పాటు వుత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ ఏడాది జూన్‌లో మన దేశం నుంచి పత్తి నూలు 8.2 కోట్ల కిలోలు 74 దేశాలకు ఎగుమతి అయింది. మేనెలతో పోల్చితే కిలోకు ఏడు సెంట్ల ధర పెరిగినా ఏడాది క్రితంతో పోల్చితే 24 సెంట్లు తక్కువ.ఈ స్ధితిలో ఈ ఏడాది నూలు ఎగమతిదారులు ఏ ధైర్యంతో పత్తిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు? గతం కంటే దిగుమతులు తగ్గినప్పటికీ మన పత్తి, నూలు ఎగుమతులు చైనాకే ఎక్కువగా జరుగుతున్నాయి.

     ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖకు కొత్తగా వచ్చిన కమిషనర్‌ తన ప్రత్యేకతను ముఖ్యమంత్రి ముందు ప్రదర్శించుకొనేందుకు లేదా తాము ఎన్ని విజయాలు సాధించినా వాటి సమాచారం జనంలోకి వెళ్లటం లేదన్న ముఖ్యమంత్రి ఆగ్రహం వల్లగానీ సమాచార శాఖ కొత్తగా పరిశోధన అవలోకన( రిసర్చ్‌ రిఫరెన్సు) విభాగాన్ని ఏర్పాటు చేసి పుంఖాను పుంఖాలుగా పొత సమాచారాన్ని కొత్తగా మీడియాకు అందచేస్తున్నది. వాటిలో కొన్ని ఇలా వున్నాయి. 2050 నాటికి అంటే మరో 34 సంవత్సరాల నాటికి అమరావతి నగరంలో 12లక్షల వుద్యోగాలు సేవల రంగంలో మూడు లక్షల వుద్యోగాలు పరిశ్రమల రంగంలోనూ కల్పించేందుకు చంద్రబాబు కృషి. ఇందుకు గాను మౌలిక వసతుల కల్పనలా భాగంగా 3,746 కిలోమీటర్ల జాతీయ రహదారులకు(ఇవి ఇతర ప్రాంతాలలో కూడా వుంటాయనుకోండి) గాను రు.34,732 కోట్లు, అమరావతి రింగురోడ్డు, ఇతర 720 కిలోమీటర్ల రోడ్డకు రు.30వేల కోట్లు,రేవులను కలిపే 419 కిలోమీటర్ల ప్రధాన రహదారులకు రు.4,306 కోట్లు ఇంకా మరికొన్ని రోడ్ల గురించి సమాచార శాఖ తెలిపింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అశోక్‌గజపతి రాజు అర్ధికశాఖ మంత్రిగా వుండగా కూడా ఇలాగే రోడ్ల నిర్మాణం, వాటికి విదేశీ అప్పుల గురించి వాటి ద్వారా జరిగే అభివృద్ధి గురించి వూదరగొట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తిరిగి ఇప్పుడు అదే జరుగుతోంది. రోడ్లు వేస్తే కాంట్రాక్టర్లు వస్తారు, కాంట్రాక్టర్లు వస్తే కొంత మందికి జేబులు నిండుతాయి, జనానికి టోలు ఫీజు రూపంలో జేబులు ఖాళీ అవుతాయి. రోడ్లు వేయటానికి ముందు, తరువాత తమ వుత్పత్తులకు వస్తున్న రేట్లలో తేడా ఏముందో మదనపల్లి టమాటో రైతులు చెప్పాలి. వుల్లి ధరలు పెరిగి వినియోగదారులకు, తగ్గి రైతులకు కన్నీరు తెప్పించిన విషయం కర్నూలులో ఏ రైతును అడిగినా చెబుతారు.పత్తి, పొగాకు ధరల గురించి వేరే చెప్పనవసరం లేదు.

   కొన్ని రోడ్ల నిర్మాణానికే దాదాపు 70వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ రైతులకు ఏం చేస్తోంది? పదిహేడు లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల వుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న ఖర్చు 120 కోట్లు అని సమాచార శాఖ పేర్కొన్నది. పాతిక కిలోమీటర్ల రోడ్డు వేయటానికి అయ్యేఖర్చును కూడా వ్యవసాయంపై పెట్టటానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదా ?