Tags

, , , , , ,

నేను ప్రపంచీకరణకు అనుకూలమే అయినప్పటికీ ప్రపంచీకరణ వ్యతిరేకులు ముందుకు తెస్తున్న ముఖ్యమైన సమస్యల కారణంగా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి: అమర్త్యసేన్‌

ఎం కోటేశ్వరరావు

   రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తమ లాభాలను కాపాడుకొనేందుకు ముందుకు తెచ్చిన ప్రపంచీకరణకు నూరేళ్లు నిండనున్నాయని కార్పొరేట్లలో ఆందోళన మొదలైందా? గత కొద్ది రోజులుగా పశ్చిమ దేశాల పత్రికలలో వెలువడుతున్న వ్యాఖ్యలు వారి మనోభావాలకు అద్ధం పడుతున్నాయి.జూలై మూడవ వారంలో చైనాలోని చెంగుడులో జరిగిన జి 20 దేశాల ఆర్ధిక మంత్రుల, రిజర్వుబ్యాంకుల గవర్నర్ల సమావేశంలో అనేక మంది ప్రపంచీకరణకు పెరుగుతున్న ప్రతిఘటన గురించి ఆందోళన వెలిబుచ్చారు. ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని ఓటింగ్‌ నిర్వహించిన నెల రోజుల తరువాత జరిగిన ఈ సమావేశంలో సహజంగానే దాని పర్యవసానాల గురించి చర్చ జరిగింది. అభివృద్ధి, ఆర్ధిక సరళతతో కలిగిన లబ్దిని సభ్య దేశాలు, అన్నిదేశాల మధ్య పంపకానికి ఇంకా ఎంతో చేయాలనటంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టినా లాగార్డే వ్యాఖ్యానించగా పశ్చిమ దేశాలలో ప్రపంచీకరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ హెచ్చరించాడు.అయితే ఈ సమావేశంలో ఆ దిశగా ఎలాంటి నిర్ధిష్ట ప్రతిపాదనలు రాలేదు.అమెరికా విత్త మంత్రి జాకబ్‌ జె లీ విలేకర్లతో మాట్లాడుతూ పొదుపు చర్యలపైగాక అభివృద్ధి గురించి ఏకాభిప్రాయం వ్యక్తమైందని అన్నారు. ఈ సమావేశం ఏదైనా ఒక సందేశం అందించిందంటే జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచవ్యాపితంగా ఓటర్లు సంతోషంగా లేరన్నదే అది అని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఎఎంపి కాపిటల్‌ ఇన్వెస్టర్స్‌ అధికారి షేన్‌ ఆలివర్‌ వ్యాఖ్యానించాడు.

   చెంగ్‌డు సమావేశం ముగిసిన కొద్ది సేపటి తరువాత నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైన డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కార్యకలాపాలను వెలుపలి దేశాలకు తరలించిన అమెరికన్‌ కంపెనీల వస్తువులపై పన్నులు వేయాలన్న తన ప్రతిపాదనను అడ్డుకొనేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ప్రయత్నించిందని,ఈ కారణంగా తిరిగి సంప్రదింపులు జరిపేందుకు లేదా దాని నుంచి బయటకు పోవటం గురించి ఆలోచిస్తామని బెదిరించాడు. ఆర్ధిక వ్యవస్ధలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఒక్క జూన్‌ నెలలో చైనా మార్కెట్‌లోకి 244 బిలియన్‌ డాలర్ల విలువగల కొత్త రుణాలను విడుదల చేసింది. దీంతో వినిమయం, సేవల వినియోగాన్ని పెంచటం ద్వారా తగ్గుతున్న ఆదాయాన్ని నిలుపుకొనేందుకు చర్యలు తీసుకుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా, చైనా, జపాన్‌ తరువాత అతి పెద్ద ఆర్ధిక శక్తిగా వున్న దక్షిణ కొరియా వుపాధికి వూతమిచ్చేందుకు 987 కోట్ల డాలర్ల అనుబంధ బడ్జెట్‌ను ప్రతిపాదించగా కెనడా 838 కోట్ల డాలర్ల మేరకు అదనంగా ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ కూడా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని అదుపు చేసే చర్యలలో భాగమే.

   ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటున్నప్పటికీ అవసరమైనదాని కంటే బలహీనంగా వుందని,అనేక సవాళ్లున్నాయని జి 20 ప్రకటన పేర్కొన్నది. వుక్కు వంటి పరిశ్రమలలో అవసరానికి మించిన సామర్ధ్యం వలన కేవలం వాణిజ్యం మాత్రమే గాక కార్మికులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని కూడా ప్రకటన వ్యాఖ్యానించింది.

    స్వేచ్ఛా వాణిజ్యానికి దాడి ముప్పు వుంది, అయితే అది ఎప్పటి కంటే ఎంతో ప్రాధాన్యత కలిగిందని ఫార్చ్యూన్‌ పత్రిక వ్యాఖ్యాత అలన్‌ మురే పేర్కొన్నారు. దాని సారాంశం ఇలా వుంది. గత అర్ధశతాబ్ది కాలంలో కీలకమైన వాణిజ్య ధోరణిగా వున్న ప్రపంచీకరణ తిరోగమనంలో వుంది. తమ వుద్యోగాలు హరించుకుపోవటానికి ఇదే కారణమని అమెరికా, బ్రిటన్‌లో మిలియన్ల మంది ఓటర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పౌరుల్లో కలిగిన పెద్ద కుదుపు బ్రెక్సిట్‌ రూపంలో వెల్లడైంది. ప్రపంచీకరణను సమర్ధించాలని ఇప్పుడెవరూ కోరుకోవటం లేదని వెల్లడిస్తున్నది. ప్రపంచీకరణ విజయం హరించుకుపోతున్నదని ఫార్చ్యూన్‌ పత్రిక రూపొందించిన ఐదువందల ప్రపంచ కంపెనీల జాబితా వివరాలు నిర్ధారిస్తున్నాయి. 2015లో వాటి అమ్మకాలు 11.5శాతం తగ్గి 27.6లక్షల కోట్ల డాలర్లకు పడిపోయాయి.ఆదే రీతిగా లాభాలు కూడా పడిపోతున్నాయి. ప్రపంచీకరణ విమర్శకులు చెబుతున్నదానికంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా వుందన్నది వాస్తవం.

   మెక్సికో మాజీ మంత్రి, ప్రొఫెసర్‌ జార్జ్‌ జి కాస్టేండా ప్రపంచీకరణ గురించి మరో రూపంలో విమర్శించారు.’అసమర్ధ నాయకత్వం రూపొందించిన పనికిమాలిన ప్రపంచీకరణ’ అనే శీర్షికతో విశ్లేషించారు. దాని సారాంశం ఇలా వుంది. 1950 దశకం నుంచీ ఐరోపా దేశాలు ప్రాంతీయ సమగ్రత వలన కలిగే లాభ నష్టాల గురించి చర్చిస్తున్నాయి. అయితే ప్రపంచకీరణ, స్వేచ్ఛా వాణిజ్యం, వలస వాటి ఆర్ధిక పర్యవసానాల కేంద్ర అంశంగా ఆ చర్చ సాగిందని బ్రెక్సిట్‌తో స్పష్టమైంది.ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని తీర్పు నిచ్చి బ్రిటన్‌ పౌరులు తప్పు చేశారు. విడిపోవాలనే ప్రచారం వెనుక వున్న కారణాన్ని కలసి వుండాలని కోరుకొనే వారు కూడా విస్మరించి తప్పు చేశారు. ఆ ప్రభావశీల కారణాలు ఒక్క బ్రిటన్‌ లేదా ఐరోపా యూనియన్‌ సభ్య దేశాలు, ప్రపంచమంతటా వున్న ప్రజాస్వామిక దేశాలన్నింటా వున్నాయని వారు గుర్తించలేదు. అసమర్ధ రాజకీయ నాయకత్వం ప్రపంచవ్యాపితంగా కొత్త ప్రమాదాలను ప్రేరేపిస్తున్నది. ఐరోపా వాసులను ఒక్కటిగా చేయాలని సాగుతున్న ప్రయత్నం సాకారం కావటం అంత సులభం కాదు. దానితో పాటు అనేక సమస్యలను పరిష్కరించాల్సి వుంది. ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యం, వలస, అసమానత సమస్యలను దీర్ఘకాలంగా అ న్ని చోట్లా ధనిక దేశాలు విస్మరించాయి. 1990దశంలో అమెరికా అధ్యక్షులు జార్జిడబ్లు బుష్‌, బిల్‌క్లింటన్‌ మెక్సికో పాలకుల స్వేచ్ఛా వాణిజ్య మానసిక స్ధితి దాని వలన ప్రతికూలంగా ప్రభావితమయ్యేవారికి పరిహారం అందించటాన్ని రాజకీయంగా వాస్తవంలో అసాధ్యం చేశారు. ఈ విధానం విఫలం చెందిన 20 సంవత్సరాల తరువాత మనస్సు విరిగిన ఓటర్లు రిపబ్లికన్‌ పార్టీ డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ బెర్నీ శాండర్స్‌ వైపు చేరటం ఆశ్చర్యం కాదు. ఆకర్షించే నినాదాలతో ఇద్దరూ వారిని బుట్టలో వేసుకున్నారు. ఇద్దరూ భిన్నమైన నినాదాలు ఇచ్చినప్పటికీ ఓటర్లు ఆకర్షితులు కావటానికి కారణం మాత్రం గత రెండు దశాబ్దాల విఫల విధానాలే. వాటిని సరిచేసేందుకు జరిగే ఏ ప్రయత్నమైనా వాస్తవాల ప్రాతిపదికనే జరగాలి.

   2008-2009 సంవత్సరాల తీవ్ర మాంద్యం తరువాత అమెరికా వుత్పాదక రంగంలో అనేక కొత్త వుద్యోగాల కల్పన జరిగిందని తెలుసుకుంటే వుభయుల మద్దతుదార్లు ఆశ్చర్యపోతారు. మిలియన్ల కొద్దీ వుత్పాదక వుద్యోగాలను చైనా, మెక్సికో వంటి దేశాలకు బదిలీ చేసిన తరువాత ఈ కల్పన కొంత మేరకు ఆ గండిని పూడ్చిందని, అయితే పోయిన వాటికంటే కొత్తగా ఎక్కువ సృష్టించవచ్చని ఎవరైనా వాదించవచ్చు. వుద్యోగాల బదిలీ తరువాత అమెరికా మరింత పోటీదారుగా తయారైంది, అందుకు చైనాకు కృతజ్ఞతలు చెప్పాలి. వేరే దేశాలకు వుద్యోగాలు తరలి పోయిన తరువాత అమెరికాలో కల్పించిన వుద్యోగాలు ఎలాంటివన్నది ప్రధాన సమస్య. ఆర్ధిక పర్యవసానాలను విధాన నిర్ణేతలు విస్మరించారు. యాభై, అరవయ్యవ పడిలో వున్న కార్మికులు గంటకు 30 డాలర్ల వుద్యోగాలు, ఆరోగ్యసంరక్షణ, పెన్షన్‌ లబ్దులను కోల్పోయి అంతకు ముందు పొందిన వేతనాల కంటే సగానికి, ఇతర లబ్దులేమైనా మిగిలి వుంటే ఆ కొన్నింటిని మాత్రమే పొందటానికి సిద్ద పడ్డారన్నది మరిచిపోకూడదు. విధాన నిర్ణేతలు ప్రపంచీకరణ బాధితుల గురించి పట్టించుకోలేదు, ఎందుకంటే వారిని పట్టించుకోవాలన్న అవసరం వుందని వారు అనుకోలేదు. మార్కెట్టే అన్నింటినీ తనంతట తానే పరిష్కరిస్తుందని భావించారు కానీ జరగలేదు, విధాన నిర్ణేతలకు అది పాఠం నేర్పలేదు. గతేడాది పసిఫిక్‌ దేశాల భాగస్వామ్య ఒప్పందం సానుకూలంగా కుదరింది కానీ అమెరికన్‌ కార్మికుల రక్షణకు చేసిందేమీ లేదు.

   మెక్సికోలో కూడా ఇదేమాదిరి ప్రపంచీకరణ వ్యతిరేకత పెల్లుబికింది. నాఫ్టా గురించి ఎక్కువగా చెప్పారు, ఎక్కువగా విమర్శలకు గురైంది. ఆ ఒప్పందం ఎగుమతులు పెంచుతుందని భావించారు, అలాగే జరిగింది గానీ అమెరికా దిశగా వలసలను తగ్గించలేకపోయింది. అనేక మెక్సికో పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ సంస్ధలు మరింతగా పోటీ పడేవిధంగా తయారయ్యాయి, జిడిపి దామాషాలో చూస్తే చాలా తక్కువగా , తాత్కాలికంగా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. నాఫ్టా వలన మెక్సికో అనేక సంస్కరణల మధ్య చిక్కుకుపోయింది తప్ప వాగ్దానం చేసినట్లుగా అభివృద్ధి జరగలేదు.1994 నుంచీ వృద్ధి చెందుతున్న మార్కెట్‌ ప్రమాణాల ప్రకారం చూస్తే తక్కువగా వార్షిక పెరుగుదల రేటు 2.5శాతం మాత్రమే వుంది. వుత్పాదకత, వుపాధి, వేతనాలు కూడా ఆశాభంగం కలిగించాయి. ఈ ఒప్పందం తరువాత ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావాలను అధిగమించేందుకు అవసరమైన వుత్పాదక రంగ కార్మికులకు వేతన పెంపుదలను ఎన్నడూ అమలు జరపలేదు. యావత్‌ దేశం నేడు మూల్యం చెల్లిస్తున్నది, మెక్సికన్లు అసంతృప్తితో వున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటానికి ఆ ఒప్పందం దోహదం చేసింది, 2018లో జరిగే సాధారణ ఎన్నికల ఫలితాన్ని అది ప్రభావితం చేయగలదు. ఈ నాటి కొత్త విషయం ఏమిటంటే ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలో ప్రజావ్యతిరేకతను గతం కంటే మెరుగ్గా అదుపు చేయగలమని విధాన నిర్ణేతలు విశ్వసించారు.బ్రిటన్‌లో ఓటర్ల తీర్పును చూసిన తరువాత అమెరికా, మెక్సికో ఏ దేశమూ కూడా వాటి నాయకత్వాల తప్పిదాలకు అతీతంగా వుంటుందని చెప్పలేము.

   బ్రెక్సిట్‌ సందర్బంగా బ్రిటన్‌ కార్పొరేట్‌లు స్ధూలంగా రెండుగా చీలిపోయారన్నది స్పష్టం. ఒకటి యూనియన్‌లోనే వుండి లబ్ది పొందాలని చూడగా విడిపోయి ఎవరికి వారం తేల్చుకుందామనే వైఖరిని మరొకటి తీసుకుంది. దున్న, ఎద్దు కాడి మాదిరి. ఎండ ముదరగా ఎద్దు నీడ వైపు లాగితే దున్న ఎండవైపుకు మొగ్గుతుందన్నట్లుగా పెట్టుబడిదారీ వ్యవస్ధలో, అందునా అవసరాలకు మించి వుత్పత్తులు జరుగుతున్నపుడు వుత్పాదక రంగంలో ఎగుమతులపై ఆధారపడిన వారి వైఖరి ఒక విధంగానూ దిగుమతులపై ఆధారపడిన వారి వైఖరి మరొక విధంగానూ వుండటం అని వార్యం.

    వుదాహరణకు ఈ విరుద్ధ ప్రయోజనాల మధ్య కరెన్సీ విలువ పైకీ కిందికీ లాగబడుతోంది.బలమైన డాలరు కారణంగా తమ ఆదాయం, లాభాలపై సంవత్సరాల తరబడి ప్రతికూల ప్రభావం పడటంపై విచారించిన అమెరికన్‌ కార్పొరేట్లు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. దాని ప్రభావం ఈఏడాది తొలి త్రైమాసికంలో డాలరు విలువ ఐదునెలల కనిష్టానికి పడిపోయింది. బలహీనపడిన డాలరు అమెరికా ఎగుమతులు పెరగటానికి దోహదపడింది.ఈ ఏడాది తమ లాభాలు పెరగటానికి ఇదొక కారణమని ఔషధ రంగంలోని ఫైజర్‌,ఎలీలిలీ, డ్యూపాంట్‌ కంపెనీలు పేర్కొన్నాయి. హోటల్‌ రూములలో చేరేవారి సంఖ్య పెరిగింది, టూరిజం లాభపడింది, న్యూయార్క్‌ నగరానికి ఐరోపా యాత్రికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇదే విధంగా మరికొంత కాలం డాలరు విలువ తక్కువగా వుంటే పెట్టుబడులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డాలరు విలువ ఎక్కువగా వున్న కారణంగా గతేడాది కార్పొరేట్‌ కంపెనీలు 112 బిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోయాయి.డాలర్లు ఆవిరైంది.

   ప్రపంచీకరణ కార్మికులకు ఎంత నష్టదాయకమో కొన్ని కార్పొరేట్‌ సంస్ధలకు కూడా అదే పరిస్ధితిని సృష్టిస్తోంది. అందువలన కార్పొరేట్‌ సంస్ధల మధ్య కూడా మిత్ర వైరుధ్యం పెరగటం అనివార్యం. అది శతృవైరుధ్యంగా మారినపుడు పరిణామాలు ఎలా వుంటాయనేది ఇపుడే వూహించలేము. అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ప్రపంచీకరణ స్ధూలంగా కార్పొరేట్లకు లాభదాయకం-కార్మికవర్గానికి నష్టదాయకం అన్నది ఇటీవలి కాలంలో మరింత స్పష్టమైంది. ఇప్పటి వరకు ప్రపంచీకరణ అమలుకు ఒక సాధనంగా వుపయోగపడిన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల అధిపతులే వారు రానున్న రోజులలో ప్రపంచీకరణకు మరింత వ్యతిరేకత వ్యక్తం కానుందని ముందస్తు హెచ్చరికలు చేయటమే కొత్త విషయం.