Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బిజెపి-తెలుగు దేశం మధ్య ఇంతకాల నడిచిన డ్రామా గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి తేట తెల్లమైంది. ఈ అంశంపై తలెత్తిన పరిస్థితి పర్యవసానాలతో రెండు పార్టీల సంబంధాలు ఎలా వుంటాయి అన్నది ఇప్పుడు సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఆదివారం నాడు తెలుగుదేశ నాయకులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు మరికొంత కాలం గడపటానికి వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తోంది. ఎంతకాలం అన్నది అప్పుడే చెప్పలేము. అభివృద్ధి పేరుతో అధికారాన్ని అంటి పెట్టుకొని వుండేందుకు అలవాటు పడిన శక్తులు ఎన్నికలు ఇంకా చాలా దూరం వుండి, అధికార పక్షానికి సంపూర్ణ మద్దతు వున్న స్థితిలో అంత తేలికగా కేంద్ర అధికారాన్ని వదులు కుంటాయని చెప్పలేము. రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యవహరించిన తీరు ప్రధాని నరేంద్రమోడీకి తెలియదన్నట్లుగా ఒకసారి ఆయనను కూడా కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదంతా రాజకీయం తప్ప మరొకటి కాదు. జనం కోసం తప్ప ఆమాయకులు, అవివేకులు ఎవరూ లేరు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లు గురించి ఎంతో చర్చ జరిగిన విషయాన్ని పట్టించుకోనంతగా నరేంద్రమోడీ ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నారు? అసలు మోడీతో మాట మాత్రం కూడా చర్చించకుండా ఇంతటి ముఖ్యఅంశంపై బిజెపి నేతలు ఆషామాషీగా పార్లమెంట్‌కు వచ్చారనుకుంటే జనం చెవుల్లో పువ్వు పెట్టటమే. అననుకూల పరిస్ధితులను కూడా తమ లబ్దికి వుపయోగించుకోవాలనే తెలుగుదేశం ఎత్తుగడ మాత్రమే దీనిలో కనిపిస్తోంది. ఇంత జరిగాక ప్రధాని మోడీని, ఇతర మంత్రులను కలసి కూడా కొత్తగా ఏ వాదనలు వినిపిస్తారో, ఏం సాధించుకువస్తారో ముందు ముందు జనం చూస్తారు.

   ప్రత్యేక హోదా అంశాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన ప్రధమ పార్టీలుగా తెలుగుదేశం-బిజెపి వున్నాయి. అదే ఇప్పుడు భూతంగా మారి భయపెడుతోంది. జరగబోయే రాజకీయ నష్టాన్ని తగ్గించుకొనేందుకు తెలుగుదేశం, బిజెపిలు ప్రయత్నించినట్లే, ఇతర పార్టీలు రాబోయే రాజకీయ లాభాన్ని పెంచుకొనేందుకు పూనుకుంటాయి. జరిగిన మోసం గురించి ఆంధ్రులు ఎలా స్పందిస్తారు అనేది కూడా రానున్న రోజులలో ఆసక్తి కలిగించే అంశమే. మోసాన్ని తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయి నిర్వేదంతో మౌనంగా వుంటారా ? లేదా గతంలో అనేక సందర్బాలలో మాదిరి తీవ్ర ఆందోళనకు పూనుకుంటారా అన్నది చూడాలి.

    టాటా-బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా మాదిరి తెలుగుదేశం-బిజెపి మధ్య వచ్చిన పవన్‌ కల్యాణ్‌ నుంచి ఎలాంటి పవనాలూ ఇంతవరకు వెలువడలేదు. ఇప్పటి వరకు అనేక మంది పవర్‌ స్టార్‌ను లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య మాదిరి భావిస్తున్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తారా లేదా అన్నది కూడా తేలిపోవటం అనివార్యం. ప్రత్యేక హోదా అంశం గురించి గతంలోనేను ఈ బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి మెచ్చుకున్నవారూ వున్నారు, అవన్నీ వూహాజనితం, అవాస్తవాలని త్వరలో తేలిపోతాయని వివిధ రూపాలలో వ్యతిరేకంగా స్పందించిన వారూ వున్నారు. గుడ్డి అభిమానుల బుర్రలలో లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ అలాగే వుంటే వారిని స్పందింప చేయటం సాధ్యంగాని పని. ప్రత్యేక హోదా రాదని నిర్ధారణ అయినందుకు నాకేమీ సంతోషం లేదు. ఏ ఒక్క పార్టీకి దీని గురించి చిత్తశుద్ధి లేదని తొలి నుంచి భావించిన వారిలో నేనూ ఒకడిని.

    కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన నిబంధనలను మార్చకుండా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజీ ఇవ్వటం సాధ్యం కాదు. రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సమాధానంలో అది తేటతెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అంటే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పించి వాటి నిర్మాణానికి నిధులు ఇవ్వటం లేదా పరిశ్రమలు, సంస్ధల ఏర్పాటు సందర్బాలలో మాత్రమే కేంద్రంలో వున్న పెద్దలను ప్రభావితం చేసేందుకు అవకాశం వుంటుంది. అలాంటి వాటిని కేంద్ర పాలిత పాంతం లేదా ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి. ఒక రాష్ట్రంలో పెట్టదలచుకున్నదానిని మార్చి మరొక చోట పెట్టే విచక్షణ అధికారం వుంటుంది.అంతకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయిని కూడా కోరుకున్న లేదా బతిమిలాడిన, బెదిరించిన రాష్ట్రాలకు ఇవ్వటానికి లేదు. గత పాతిక సంవత్సరాలుగా రక్షణ రంగంలో తప్ప కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రభుత్వ రంగ సంస్ధలలో ఒక్క విద్యుత్‌ రంగంలో తప్ప మిగతా పరిశ్రమలు కొత్తగా పెట్టినవేమీ లేవు, భవిష్యత్‌లో పెట్టాలనే వైఖరి లేదు. విద్యుత్‌ కేంద్రాలను ఎక్కడ పెట్టినా తయారయ్యే విద్యుత్‌లో రాష్ట్రాలకు ఎలాగూ వాటా వుంటుంది. అవి కేంద్ర సంస్ధలు కనుక వుద్యోగాలు కూడా పెట్టిన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా కేటాయించే అవకాశాలూ వుండవు. అందువలన కేంద్రంతో సఖ్యతగా వుండాలి, ఆ పేరుతో రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని ఏ పార్టీ చెప్పినా అది తన రాజకీయ విధానానికి వేసుకొనే ముసుగుతప్ప మరొకటి కాదు. గత రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనినే రుజువు చేసింది.

   విభజన చట్టంలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి కేంద్రం నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి విజన్‌ 2050 నాటికికూడా ప.ూర్తి కాదు. ప్రపంచ స్ధాయి రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేంద్రం ఐదులక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకన్న విషయం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేందుకు ఇదొక చక్కటి వుదాహరణ.అదేదో సినిమాలో ఒక జేబులో ఒక ప్రకటన మరో జేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే పాత్ర మాదిరి బిజెపి వస్తే వంద అడిగితే పది అన్నా ఇవ్వకపోతారా అని గానీ, కాంగ్రెస్‌ వస్తే కోరినంత ఇవ్వలేదన్న దాడి చేయవచ్చన్న ముందుచూపుతో గానీ చంద్రబాబు ఐదులక్షల కోట్లు అడిగారు తప్ప ఇస్తారని నమ్మేంత అమాయకుడు కాదు. తీరా చూస్తే పదిశాతం కాదు కదా కనీసం ఒక శాతం మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. చివరికి పరిస్థితి చులకనగా, ఎంత దయనీయంగా తయారైందంటే బిజెపి గ్రామ స్ధాయి కార్యకర్త కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెబుతారా లేదా అని డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది నెలలుగా అలా డిమాండ్‌ చేస్తున్నా చంద్రబాబు అండ్‌ కో రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని దాని గురించిన వాస్తవాలను, వివరాలు చెప్పలేకపోయింది. కింది స్ధాయిలో తామెంత అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నామో బాగా తెలిసిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు సహజంగానే ఏదో జరగకూడనిది జరిగి వుంటుంది అనే అనుమాన బీజం పడింది.

    ఇంత జరిగినప్పటికీ అసలు వాస్తవాలను ఆంధ్ర జనం ముందు వుంచుతున్నారా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. ఎవరు సమాధానం చెప్పాలి? సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు అనుకూలమే కనుక అవే చెప్పాలి. పార్లమెంట్‌లో మా వాణి వినిపించకుండా చేసి తలుపులు మూసి, చీకటిలో బిల్లును ఆమోదించారని,సక్రమంగా విభజించలేదని తెలుగుదేశం పదే పదే చెబుతోంది. లోపల అంచనాలు, ఆలోచనలు ఏమున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం ముసుగులో విభజనకు అంగీకరించింది. తీరా విభజన అనివార్యం అని తేలిన తరువాత ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళన గమనించి తమ రాజకీయ పునాది ఎక్కడ కదులుతుందో అనే భయంతో అక్కడ వ్యతిరేక ఆందోళనలో ఆ పార్టీ భాగస్వామి అయింది, పరోక్షంగానా, ప్రత్యక్షంగానా అన్నది వేరే విషయం.ఆ కారణంగానే సక్రమంగా విభజించటం లేదనే పేరుతో పార్లమెంట్‌లో ఒక పెద్ద డ్రామాకు తెలుగుదేశం తెరతీసింది. అప్పుడు సక్రమంగానే తమ వారు వ్యవహరించారని ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి నమ్మక ద్రోహం సందర్భంగా సరిగా వ్యవహరించలేదని తమ కేంద్ర మంత్రులు,ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, దానికి కారణం తగిన సమాచారం అందకపోవటమే అని వారు సంజాయిషీ ఇచ్చి, అవసరమయితే రాజీనామాలకు సిద్ధం అని చెప్పినట్లు లీకుల కధనాలు బయటకు వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఒక తోలుబొమ్మలాట కంపెనీ అనుకుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తోలు బొమ్మలు, వాటిని ఆడించే కధకుడు చంద్రబాబు. ప్రదర్శన రక్తి కట్టలేదంటే దానికి కారణం ఆడించేవారిది తప్ప బొమ్మలది కాదు అన్నది వేరే చెప్పనవసరం లేదు.నాడు పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్భంగా తెలుగుదేశం సభ్యులు చేసిన రచ్చను మెచ్చిన జనం నేడు ఇదేమిటంటూ తెగడుతున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా తెలుగుదేశం లీకుల విభాగం చురుకుగా కదలి నాయకుడు సమర్ధుడే మిగిలినవారే తమ పాత్రలను సరిగా పోషించలేదనే ట్టుకధలు వినిపిస్తున్నది. దీన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మేథావులు వుండవచ్చేమోగాని సామాన్య జనం లేరు. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో మేథావుల తరగతిలోని అత్యధిక వర్గం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో తెలియని స్ధితి.

  అంతర్జాతీయంగా తగిలిన ఎదురు దెబ్బలు, బూర్జువా వ్యవస్ధ పార్లమెంటరీ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురయ్యే సమస్యలపై వామపక్ష పార్టీలు తీసుకొన్న వైఖరి, దానికి వున్న పరిమితులు, కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను పూర్తిగా కింది స్ధాయి కార్యకర్తలకు వివరించటంలో కూడా వామపక్షాలు జయప్రదం కాలేకపోయాయి. వామపక్షాలు అధికారంలో వున్న చోట్ల ఒక్క అవినీతి, అక్రమ ఆరోపణలు లేకపోయినా, ఎలాంటి కుంభకోణాలలో ఇరుక్కోకపోయినా, నాయకత్వంలో ఒకరో అరో తప్ప పార్టీలు మారటం వంటి అవకాశ వాద వైఖరి లేకపోయినా సామాన్య జనం ఆ పార్టీలు మంచివే అని భావించినప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపించలేవనే భావనతో ఓటింగ్‌ , ఇతర సందర్బాలలో దూరంగా వుంటున్నారు. జనానికి విశ్వాసం కలిగించటం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు.

     ఇంతకాలం కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మీద ఒంటి కాలితో లేచే పరిస్థితి ఇక ముందు తెలుగు దేశానికి వుండదు. ఎందుంటే కాంగ్రెస్‌ ద్రోహం బహిరంగం. బిజెపితో కుమ్మక్కయి ఆ పార్టీ వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది. ఇప్పుడు బిజెపి నాయకత్వం తెలుగుదేశంతో కుమ్మక్కయి నమ్మక ద్రోహం చేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి తనపై వున్న కేసుల కారణంగా బిజెపి ప్రభుత్వం పట్ల మెతకగా వుంటున్నారనే దాడి ఇక ముందు కుదరదు.ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రం పట్ల ఎలా వున్నప్పటికీ అది రాష్ట్ర అభివృద్దిని ప్రభావితం చేసే పరిస్థితి వుండదు. అధికారంలో వున్న మరొక ప్రాంతీయ పార్టీ కేంద్రంతో సఖ్యతగా వున్నా, రాజకీయంగా భుజం మార్చుకోకుండా కేంద్రంలో వున్న పార్టీని మోసినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా నిరూపించింది. అందువలన రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు కొత్త రూపం సంతరించుకోవటం తధ్యం. కేంద్రంతో సఖ్యతతో వుండే రాష్ట్ర ప్రభుత్వమే సాధించేందేమీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభీష్టం మేరకు అధికారపక్షంలో చేరా అని చెప్పుకొనే జంప్‌ జిలానీల నోరు పడిపోవటం ఖాయం. వారంతా గత ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకొని వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి వాటంగా వుంటే ఆ పార్టీ టిక్కెట్‌, జనం ఓట్లు కొనేందుకు అవసరమైన డబ్బు దండుకొనేందుకు తప్ప నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి అనేది ఒట్టి మాట. గతంలో ప్రతిపక్షంలో వుండి పార్టీ మారిన పెద్దలు నియోజకవర్గాలను చేసిన అభివృద్ది ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ పార్టీలు అధికారంలో లేనపుడు ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే తమ జేబులు నింపుకోవటం, కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాయటం తప్ప జన క్షేమం పట్టదు.