Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

     పుష్కర స్నానాల వలన పుణ్యం వస్తుందని బలంగా విశ్వసించటానికి కొంత మందికి ఎలా స్వేచ్ఛ వుందో అదొక మూఢనమ్మకం అని నమ్మేవారికి కూడా అంతే స్వేచ్చ మన దేశంలో వుంది. అందువలన సందర్భం వచ్చినపుడు దాని మంచి చెడ్డలను చర్చించటం తప్పుకాదు. వ్యతిరేక అభి ప్రాయాన్ని వ్యక్తీకరించటం ద్వారా మా మనోభావాన్ని దెబ్బతీశారని ఎవరైనా దెబ్బలాటకు వస్తేనే సమస్య. ప్రపంచంలో ప్రతి మతం, కులం, తెగ ఇలా ఎన్ని తరగతులుంటే అన్నింటికీ సారూప్యత గలిగిన మూఢనమ్మకాలు,ఆచారాలకు కొదవ లేదు. ఆధునిక ప్రవచన కారులు సరికొత్త మూఢనమ్మకాలను ఎక్కిస్తున్నారు. పుష్కరాలనేవి ఒక మతానికి చెందిన నమ్మకం తప్ప వేరు కాదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు రోజుల పాటు పన్నెండు అంశాల మీద రోజుకొకదానిపై చర్చా గోష్టులు, సదస్సులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర ప్రజానీకంలో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించటానికి, ఓట్లు దండుకోవటానికి, చివరకు నమ్మక ద్రోహానికి మారుపేరుగా మారిన రాష్ట్ర ప్రత్యేక హోదా రాకపోతే ఏం చేయాలో, ఇప్పటికే చేయాల్సిందానికంటే ఎక్కువే చేశాం లెక్కలు చెప్పటం లేదంటున్న బిజెపి నేతల ప్రచార వాస్తవ అవాస్తవాలేమిటో ఒక సమగ్ర శ్వేత పత్రం ప్రకటించి పన్నెండు కోణాలలో పన్నెండు రోజులు చర్చలు జరపమని చంద్రబాబు నాయుడు రచ్చ చేసి వుంటే చర్చ సమంజసంగా వుండేది. కనీసం జనానికి వాస్తవాలు ఏమిటో అన్నా తెలిసేవి. కేంద్రం ఇచ్చే ప్రత్యేక నిధులతో ఆర్ధిక లోటు తీర్చి, ప్రత్యేక హోదాతో వచ్చే ఆకర్షణీయ రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర రూపు రేఖలు మార్చివేస్తామని చెప్పిన వారు అసలు ఆ ఆంశాలనే చర్చనీయాంశాల జాబితాలో లేకుండా చేశారు. పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినట్లుగా ప్రత్యేక హోదాకు కూడా అదే చేస్తారా ? చిత్రం ఏమంటే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఒక మూఢనమ్మకం, ఒక మతానికి చెందిన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం జరప తలపెట్టిన చర్చలో సమాజ పురోగతికి అవసరమైన శాస్త్రీయ భావజాలాన్ని చర్చ నీయాంశంగా చేయకపోవటం. అసలు మత క్రతువుల సందర్భంగా ఇలాంటి కిరస్తానీ చర్చలేంటి అనే ‘గురజాడ అగ్నిహోత్ర అవధానులు’ ఎవరైనా వుంటే అది వేరే విషయం.

     చర్చ చేయండని చంద్రబాబు చెప్పిన పన్నెండు అంశాలు విజన్‌ 2050లో పేర్కొన్నవాటికి మించి సామాన్యజనానికి ఆసక్తి కలిగించేవి కొత్తగా ఏమన్నా వుంటే వాటి గురించి చర్చించవచ్చు. అన్నింటికీ మించి విచారకరమైన అంశం ఏమంటే రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితేమీ లేకున్నా, నమ్మక ద్రోహం జరిగిందని యావత్‌ ప్రజానీకం భావిస్తున్న స్ధితిలో గతాన్ని గోతిలో పారవేసి ఏం చేసినా పొత్తు పెట్టుకున్నోళ్లతో సర్దుకు పోక తప్పదన్న వైఖరి తీసుకోవటం ఒక విషాదం. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి విషయాలలో తాను రాజకీయాలు చేయనని, అందుకు ఇతర సందర్భాలుంటాయని చంద్రబాబు అనేకసార్లు చెప్పి పెద్ద రాజనీతిజ్ఞుడిగా అనేక మంది ప్రశంసలు పొందారు. ఇప్పుడు రాజ్యసభలో బిజెపి తప్ప అన్ని పార్టీలు ప్రత్యేక హోదా గురించి ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో పరిణితితో అన్ని పార్టీలను ఏకత్రాటిపై నడిపించి కేంద్రంపై వత్తిడి పెంచాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా తాను, తన సైనికుల ద్వారా రాజకీయాలు మాట్లాడించి నిజమైన రాజనీతిజ్ఞుడు, రాష్ట్రంకోసం నిజాయితీగా పని చేస్తున్నారు అనే పేరు తెచ్చుకొనే అవకాశాన్ని జారవిడుచుకున్నారు.ప్రత్యేక హోదా విషయంలో మిగతా పార్టీలను కలుపుకుంటే దాని ద్వారా పొందే రాజకీయలబ్ది తగ్గుతుందనుకున్నారా ? తద్విరుద్ధంగా ప్రవర్తించి బిజెపిని ఒక్క మాట కూడా అనకుండా మొదటికే మోసం తెచ్చుకొనేందుకు పునాది వేసుకున్నారా ? గోదావరి పుష్కరాలలో మునిగి పుణ్యం పొంది ప్రత్యేక హోదా, కనీసం లోటు పూడ్చుకొనేందుకు నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఆ పుణ్యం ఏమైనట్లు ?

     ఇక్కడ మరొక అంశాన్ని ప్రస్తావించటం సందర్భ సహితం అని భావిస్తున్నాను.ముస్లిం లేదా ఇస్లాం హాజ్‌ సబ్సిడీలను 2022 నాటికి రద్దు చేయాలని ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అదే సమయంలో హిందు క్రతువులకు ప్రజల సొమ్మును ఖర్చు చేయటం విపరీతంగా పెరిగిపోతోంది. అవి పుష్కరాలు, కుంభమేళాలు, మానస సరోవర, చార్‌ధామ్‌ వంటి యాత్రలు ఏవైనా కావచ్చు. వాటి సందర్భంగా పెడుతున్న ఖర్చు హాజ్‌ సబ్సిడీల కంటే ఎంతో ఎక్కువగా వుంటోందా లేదా ? హాజ్‌ మాదిరి నగదు సబ్సిడీ ఇవ్వకపోవచ్చు, అందుకోసం ఏర్పాట్ల పేరుతో చేసే ప్రజాధనం ఖర్చు సంగతేమిటి ? ప్రతి సేవకూ రుసుము చెల్లించాల్సిందే ఏదీ వుచితం కాదు అని చెబుతున్న ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాల సందర్బంగా చేసే ఖర్చులకు ఒక ఖాతాను తెరిచి అందుకయిన ఖర్చును, వాటిలో పాల్గొన్నవారి నుంచి రాబడితే అది విమర్శలకు తావుండదు. అలా చేయటం లేదే ! పుష్కర యాత్రీకులను ఘాట్ల వద్దకు చేర్చేందుకు వుచితంగా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. అసలే ఆర్టీసి నష్టాల్లో వుందని చెబుతూ ఇలా చేయటాన్ని ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లు ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు ?

    బ్రిటీష్‌ వారి కాలంలో రాణీగారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాజ్‌ సబ్సిడీ స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగించారు. స్వాతంత్య్రపోరాట కాలంలో ముస్లింలను పోరుబాట నుంచి వేరు చేయటానికి తెల్లవారు అనేక ఎత్తుగడలు వేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. విమానాలు రాక ముందు ఓడలే ప్రయాణ సాధనాలు కనుక బ్రిటీష్‌ ప్రభుత్వం తమ దేశ ఓడల కంపెనీ ఓడ ఎక్కి సౌదీ వెళ్లిన వారికే సబ్సిడీ అని కూడా నిబంధన విధించినందున దానిలో కూడా షిప్పింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దాగి వుంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తెల్లవారిని తరిమేసి వారి స్ధానంలో అధికారానికి వచ్చిన నల్లవారు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా దానిని కొనసాగించారని చేసే విమర్శలో వాస్తవం లేకపోలేదు. చేసిన మార్పేమిటంటే ఓడల రాయితీని విమానాలకు వర్తింప చేశారు. అది కూడా ప్రభుత్వ రంగ విమానాలకే వర్తిస్తుంది. ఇది లౌకిక వాదానికి విరుద్ధం అంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దానిని విచారించిన సుప్రీం కోర్టు 2012లో ఒక తీర్పు ఇస్తూ 2022 నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించింది. ఈ సబ్సిడీని హిందూత్వ శక్తులు మతకారణంతో వ్యతిరేకిస్తే, మాకు సబ్సిడీ ఇచ్చే పేరుతో ఎయిరిండియాను బతికించేందుకు ప్రభుత్వం దానికి మాత్రమే ఇచ్చిందని, ఇతర కంపెనీల రేట్ల కంటే ఎయిరిండియా రేట్లు ఎక్కువని విమర్శించే ముస్లింలు కూడా లేకపోలేదు.

    పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి.ఒక మత పుష్కరాలను రాష్ట్ర వేడుకగా నిర్ణయించటం లౌకిక వ్యవస్ధకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమా, అనుకూలమా ? గతేడాది గోదావరి, ఈ ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెడుతున్న ఖర్చు, చేస్తున్న హడావుడి గతంలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు.ఎన్నడూ లేని కొత్త కొత్త పద్దతులను ప్రవేశపెడుతున్నారు. నిజంగా పుష్కరుడు వుండి వుంటే గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన దానికి నిరసనగా కృష్ణా పుష్కర బహిష్కరణ జరిగేదేమో? పుష్కరాల కంటే ముఖ్యమంత్రుల కీర్తి కండూతిని పెంచుకోవటం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దేశ విదేశాల్లో వున్న వారికి, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నవారికి , షరా మామూలుగా గ్రామాలు, పట్టణాలలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంతకంతో కూడిన ఆహ్వానాలు పంపటం ప్రచార ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. వాటి కాంట్రాక్టు పుచ్చుకున్న ముద్రణా సంస్ధలకు తప్ప వాటిని అందుకున్నవారికి, అందుకయ్యే అనవసర ఖర్చు భరించే జనానికి ఒక్క పైసా ప్రయోజనం వుంటుందా? హాజ్‌ సబ్సిడీని రద్దు చేస్తూ అందుకు చేసే ఖర్చును కావాలంటే మైనారిటీల సామాజిక, విద్యా అభివృద్ధికి ఖర్చు చేయవచ్చని సుప్రీం కోర్టు చెప్పిన సలహా ఇతర సందర్భాలకు వర్తించదా ?

   రెండు సంవత్సరాలు గడిచినా చేసిన ప్రధాన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు జరపని స్ధితి.కొంతకాలం రాజధాని భూ సేకరణ, మరికొంత కాలం రాజధాని ఎలా వుండాలి, మరి కొంత కాలం తాత్కాలిక రాజధాని నిర్మాణం, మరి కొంత కాలం శాశ్వత రాజధాని ఎలా నిర్మించాలి, దానికి అప్పు ఎలా తేవాలి ఇలా ఆవు వ్యాసం రాసిన మాదిరి కాలక్షేపం చేయటం, ప్రతి సందర్భాన్ని అతిశయోక్తులతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల దృష్టి మళ్లించటం తప్ప మరొకటి కనిపించటం లేదు. ఇలాంటి వాటికి బుట్టలో పడేంత ఆమాయకంగా ఆంధ్రులు వున్నారా ? ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు పెద్దలు. అతిగా ప్రచారంలో జనాన్ని ముంచితే తామూ దానిలోనే మునుగుతారని గ్రహించటం అవసరం.