Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ఏమైంది,

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు.

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, నీకు కూడా నేను అదేచేశాను అంది అమ్మ.

ఏమైంది,

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు,

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, మీ అమ్మకు కూడా నేను అదేచేశాను అంది అమ్మమ్మ.

ఏమైంది ?

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు,

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, మీ అమ్మమ్మకు కూడా నేను అదేచేశాను అంది పెద్ద మామ్మ.

తరతరాలుగా ఓదార్పు మాటలు, ఎంతో విశ్వసనీయమైనవి, మీరూ వాటినే వుపయోగించండి !

   ఇవి చదవగానే తరతరాలుగా కొద్ది మార్పులతో వస్తున్న గుడ్‌ వర్డ్‌ గ్రైప్‌ వాటర్‌ వాణిజ్య ప్రకటన గుర్తుకు వచ్చి వుంటుంది.

  ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం-బిజెపి కూటములు నమ్మక ద్రోహానికి పాల్పడటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విచారించటం లేదు, ఏడవటం లేదు, కోపగించుకోవటం లేదు గానీ తామెన్నుకున్న పాలకులు, వాగ్దానాలు చేసిన వారు ఏం చేస్తారా అని వుగ్గపట్టుకు కూర్చున్నారు. ప్రత్యేక హోదా విషయంలో నమ్మక ద్రోహానికి గురయ్యామని తెలిసి కూడా ఎలాంటి అందోళనకు పాల్పడకుండా ఎంతో నిబ్బరంగా వున్నారు. బహుశా ఆంధ్రులు ఆరంభ శూరులు అనే విమర్శను తొలగించుకోవాలంటే ఎక్కడో అక్కడ ప్రారంభించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినపుడు చేసిన ఆందోళన, వెలిబుచ్చిన ఆగ్రహంతో పోల్చుకుంటే ఇప్పుడు తమ భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నా ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా వుండటాన్ని చూస్తే ఆంధ్రులు స్థిత ప్రజ్ఞులైనట్లు నిరూపించుకున్నారని అనుకోవాలి. చంద్రబాబు చెబుతున్న అమరావతి అనే సింగపూర్‌ సిటీ నిర్మాణం జరిగితే గుప్తుల స్వర్ణయుగం మాదిరి చంద్రన్న స్వర్ణయుగం ఆవిర్భవించి ఎవరూ ఏమీ అడగకుండానే అన్నీ సమకూరుతాయనే ధీమా ఏర్పడిందా ? దీని పర్యవసానం ఏమిటి ?

    ఏడాదికి ఒకసారి మాత్రమే కనువిందు చేసే ‘మే ‘పుష్పం మాదిరి ప్రధాని నరేంద్రమోడీని కలిసి బయటకు రాగానే అరుదుగా కనిపించే చంద్రబాబు నాయుడి ముఖంలో నవ్వు వికసించింది. తాము అభిమానించే బాబా నోరు విప్పగానే సమక్షంలో వుండే భక్తులు బాబా మాట్లాడారు, బాబా మాట్లాడారు అని ఆనందంతో కేరింతలు కొట్టినట్లుగా, ఆర్కిమెడిస్‌ తాను కనుగొన్న సూత్రం గురించి యురేకా, యురేకా అంటూ బట్టలు వేసుకోవటం కూడా మరచి స్నానాల తొట్టి నుంచి లేచి వీధులలో పరుగెట్టినట్లుగా చంద్రబాబు నవ్వారని ఆయన భక్తులు మైమరచి పోతున్నారు. రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లు ఆర్ధిక పరమైనదా కాదా అని తేల్చేందుకు లోక్‌సభకు నివేదిస్తామనగానే సంతోషంతో కేరింతలు కొడుతూ బల్లలు చరిచిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాబోయే రోజుల్లో నయానో భయానో సాధిస్తాం తప్ప ప్రత్యేక హోదాపై ఇంకేమాత్రం నిరసనలు తెలుపబోమని విజయవాడలో చెప్పారు. సుజనా చౌదరి అలా బల్లలు చరిచి వుండాల్సింది కాదని చంద్రబాబు నాయుడు సర్ది చెప్పిన విషయం తెలిసిందే. ఇక వారి నేత బాలయ్య బాబు అయితే హోదా ఇవ్వకపోతే కంటి చూపుతో కాల్చేస్తా అన్నట్లుగా మాట్లాడతారు. అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో మాట్లాడుతూ విభజన హామీలు నెరవేరేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతారు. అసలు పోరాటం ఎప్పుడు మొదలు పెట్టారని ఎవరైనా అమాయకంగా లేదా అమాయకులు అడిగితే తెలుగుదేశం నేతలకు పట్టరాని ఆగ్రహం వస్తుందని సదా గమనంలో పెట్టుకోవాలి.జక్కన్న సినిమాలో బాలకృష్ణను అనుకరించి హాస్యం పండించటాన్నే లైట్‌గా తీసుకోలేని బాలకృష్ణ అభిమానులు హాస్యనటుడు ప్రధ్వీరాజ్‌ను బెదిరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఐదు కాదు పది అన్న వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఆ నాడు విభజన బిల్లులో ఎందుకు పెట్టలేదని మన్మోహన్‌ సింగ్‌ను ఇప్పుడు నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదాకు మరోవైపు ఎవరెవరు అభ్యంతరాలు తెలుపుతున్నారో వెంకయ్య నాయుడు మరోసారి గుర్తు చేసి అలాంటి వారిని అప్రమత్తం గావించారు. ప్రజాస్వామ్యం, సహనంపై జనంలో ఇంకా విశ్వాసం వుంది కదా అని ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, వాదించవచ్చు.

     నరేంద్రమోడీ మాట్లాడేందుకు సిద్దపడితే ఢిల్లీ వెళతానని చెప్పిన చంద్రబాబు ఎలాగైతేనేం ఢిల్లీ వెళ్లారూ, తిరిగి రానూ వచ్చారు. మోడీ గారి వేద గణితం మాదిరి చంద్రబాబు లెక్కల్లో ఇది 31వ సారి అనుకోవాలి. లేదా మోడీతో ప్రత్యేక హోదాపై మాట్లాడటంతో కొంత మంది భ్రమింప చేస్తున్నట్లుగా ఆవిర్భవించిన నూతన శకంలో తొలి పర్యటనగా అయినా లెక్కించుకోవాలి. ఢిల్లీ వెళ్లారా లేదా అని కాదు అన్నయా ఏం సాధించుకువచ్చారని చిలక నవ్వులు నవ్వినట్లు అన్నట్లు చంద్రబాబు సాధించిందేమిటి ? కలలో కూడా నెరవేరని గట్టి హామీ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి తమకు అభ్యంతరం లేదని, తమ రాష్ట్రాలకూ దాన్ని ఇవ్వాలని కోరుతున్న ముఖ్య మంత్రులను బుజ్జగింప చేసి ఆంధ్రప్రదేశ్‌కు ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని నరేంద్రమోడీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. నరేంద్రమోడీ-చంద్రబాబు భేటీ సందర్భంగా తాను పక్కనే వున్నట్లుగా ‘ఏపినీ అదుకొనే బాధ్యత నాది, మీరు నిశ్చింతగా వుండండి అని చంద్రబాబును వుద్ధేశించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారంటే ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని భావించవచ్చు. ప్రతిపక్షాలు కోరుతున్నట్లు ప్రత్యేక హోదా మాత్రమే ఇచ్చి సరిపెట్టుకోకుండా ఆర్ధికంగా ఇబ్బందులు వున్న రాష్ట్రాన్ని ఆదుకోవటానికి ఇతోధికంగా సాయం చేయటంతో పాటు పన్ను రాయితీలు కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించటం శుభసూచకం’ అని వ్యాఖ్యాత పేర్కొన్నారు.నిజంగా అదే జరిగితే అంతకంటే కావాల్సిందేముంది. అలాంటి చిత్తమే వుంటే ఇంత రచ్చ జరగటానికి అవకాశం ఎందుకు ఇచ్చినట్లు ? ప్రతిపక్షాలు కోరుతున్నట్లు అన్నారు, తెలుగుదేశం కోరటం లేదనేనా ? తమకు లేని హోదా, రాయితీలు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు అంగీకరించి తమ రాజకీయ పునాదిని తామే కూల్చుకునేంత అమాయకంగా మమతాబెనర్జీ,నవీన్‌ పట్నాయక్‌, జయలలిత వున్నారా ? పోనీ వారు ముగ్గుర్ని ఒప్పిస్తే మిగతావారి సంగతేమిటి? భారతంలో ద్రౌపది తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అన్న సందేహం లేవనెత్తినట్లుగా ఆ వ్యాఖ్యాత తాను నమ్మి జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారా లేక జనాన్ని మాత్రమే నమ్మించేందుకు పూనుకున్నారా ?

    ఆదాయమున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని ఒక విధాన పరంగానే నిలిపివేసింది.నిధులు అంతగా లేని రాష్ట్రాలు కూడా అదేబాటలో నడుస్తున్నాయి. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించారు, దానికి రాజధాని కూడా లేదు నుక ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వటానికి వుదారంగా అంగీకరించండని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనధికారికంగానే అడిగారనుకోండి. విభజన సమయంలో మా అభిప్రాయం అడగలేదెందుకుని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు ? ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ముందుగా తాను అధికారంలో వున్న రాష్ట్రాలకు అలాంటి అభ్యంతరం లేదని ప్రకటింపచేసి మిగతావారిని అడిగితే నిజాయితీగా, నిజమైన రాజనీతిజ్ఞురాలిగా బిజెపిని పరిగణిస్తారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎక్కడకు తరలించాలా అని చూసిన టాటా నానో కార్ల కంపెనీకి రాయితీలు ఇచ్చే శక్తి లేక అనేక రాష్ట్రాలు ఆ పోటీలో వెనుకబడగా జనం సొమ్మును కార్పొరేట్లకు కట్టపెట్టటంలో ముందున్న గుజరాత్‌ దానిని దక్కించుకుంది. అటువంటపుడు ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్రానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రత్యేక రాయితీలు ఇవ్వటానికి ఎలా ఒప్పుకుంటుంది? ఒక రాష్ట్రానికి వుదారంగా నిధులు సాధ్యం కాదని సాక్షాత్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌ట్లీ రాజ్యసభలో ప్రత్యేక హోదా అనధికార బిల్లుపై చర్చ సందర్భంగా చెప్పిన చారిత్రాత్మక సమాధానంలో స్పష్టం చేసిన విషయాన్ని అప్పుడే ఎలా మరిపోగలం ? ప్రత్యేక హోదా సినిమా చివరికి ఎలా ముగుస్తుందో తెలియదు గాని కధ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం అమోఘంగా వుందనే విధంగా ప్రచారం హోరెత్తుతోంది.

     ప్రత్యేక హోదా రాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిర్ణయించుకున్న తరువాత వాటిని ఇవ్వకూడదని నిర్ణయించుకున్న బిజెపి, ఇవ్వకపోయినా గట్టిగా అడగకూడదు, ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయాలని చూస్తున్న తెలుగు దేశం పార్టీలపై జనంలో తలెత్తిన చిరు అసంతృప్తి లేదా ఆగ్రహాన్ని కూడా వుపశమింపచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వాటిని చూస్తుంటే కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. మొరటు సామెత మాదిరి వుపస్థ మినహా గర్భాదాన అన్నట్లు కీలకమైన అంశాలు లేకుండా తూతూ మంత్రంగా ప్రత్యేక హోదా కల్పించేందుకు ఏదైనా పధక రచన చేస్తున్నారా ? అన్నది వాటిలో ఒకటి. అదే అయితే వ్యతిరేకించే రాష్ట్రాలేవీ వుండవు. పన్నులు విధించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి హరించి కేంద్రం తీసుకొనేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం పొందటం లాంఛనమే కను ప్రత్యేక హోదా ప్రకటించిన రాష్ట్రాలలోని పరిశ్రమలు, వ్యాపారాలకు పన్నులను మినహాయించాల్సింది కూడా కేంద్రమే అవుతుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో ఏర్పాటయ్యే వాటికి మినహాయింపులు ఇవ్వటం ద్వారా ఖజానాకు వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తుందా? అన్ని రాష్ట్రాలు భరించాలా? పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు రాయితీలు ఇవ్వటాన్ని నిరుత్సాహపరచాలని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని వెనుకబడిన రాష్ట్రాల నుంచి ఒకవైపు డిమాండ్‌ పెరుగుతున్నది, అలాంటపుడు ముందుబడినట్టు చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపులు ఎలా ఇస్తారు ? వస్తు, సేవల పన్ను విధానాన్ని అమలు జరపటమే ఒక సవాలుగా మారనుందని విశ్లేషణలు వెలువడుతున్న తరుణంలో ఈ సమస్యలన్నీ మరింతగా ముందుకు వస్తాయా రావా ?

    రాష్ట్ర విభజనకు పూర్తిగా కాంగ్రెస్‌దే బాధ్యత అని నిత్యం దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో వుంది కనుక, అందుకు చొరవ తీసుకుంది కనుక దానిదే బాధ్యత అనటంలో సందేహం లేదు. కానీ మిగతా పార్టీలు ఎలా తప్పుకుంటాయి. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన బిజెపి, రెండు కళ్ల సిద్దాంతం పేరుతో విభజనకు అంగీకరించిన తెలుగుదేశం పార్టీ సంగతేమిటి ? అందువలన ముందుగా బిజెపి తన పాలిత రాష్ట్రాల అభిప్రాయాన్ని వెల్లడించి తన నిజాయితీ ఏమిటో జనం ముందు ప్రదర్శించాలి.

      గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు రాజకీయ పార్టీల ఆలోచనలు, గోత్రాలు వాటికి దగ్గరగా వుండే వారికే బాగా తెలుస్తాయి. అలాంటి వారిలో జిగిని జర్నలిస్టు తెగ ఒకటి.ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా సాధించిందేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తమకు రెండు వందల స్ధానాలకు మించి రావని, అప్పుడు ఇతర పార్టీల మద్దతు కూడగట్టటం అవసరం అని బిజెపి పెద్దలు లెక్కవేస్తున్నారని అలాంటి ఒక జర్నలిస్టు విశ్లేషించారు. అంటే మోడీ గాలి పోవటం ప్రారంభమైందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై వున్న కేసులలో ఆయనకు శిక్ష పడితే , ఆ పార్టీ వెనుక వున్న జనం తిరిగి కాంగ్రెస్‌వైపే చేరతారని దాంతో కాంగ్రెస్‌ ఎన్నో కొన్ని సీట్లు పొందే అవకాశం వుంది కాబట్టి ప్రస్తుతానికి జగన్మోహన్‌రెడ్డి జోలికి పోగూడదన్నది బిజెపి ఆలోచనగా వుందట.వైసిపిని దెబ్బతీయటానికి సహకరిస్తే రాష్ట్రంలోని 25కు గాను 20 సీట్లు గెలుస్తామని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటుందట. అంటే అలా చేస్తే జన్మజన్మల బంధం మాదిరి వచ్చే సారి కూడా మద్దతు ఇచ్చి ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ ముందస్తు ఆశ చూపుతోందా? అవినీతిని అంతం చేస్తామని, అక్రమార్జన పరుల తాటతీస్తామని తమ పార్టీ రూటే సపరేటని చెప్పుకున్న బిజెపి పత్రికల్లో రాసేంతగా తమ అధికార దాహ ఆలోచనలను వెల్లడిస్తోందా ? ఏ పార్టీలో గెలిచినా అమ్ముడు పోయే ఎంపీలు, ఎంఎల్‌ఏలు తామర తంపరగా పెరిగి పోతున్న ఈ రోజుల్లో వారిని కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బుండి, సైద్ధాంతిక, నైతిక బాదర బందీలేని బిజెపి,తెలుగుదేశం వంటి పార్టీలు రాబోయే అధికారం గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తే వారు ఇంక ప్రజల గురించేమి పట్టించుకుంటారు ?