Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

    ప్రఖ్యాత లియోనార్డో డావిన్సీ ‘మొనా లిసా ‘ నవ్విందా లేదా అన్నది ఆ చిత్రం గీచిన గత ఐదు వందల సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే వుంది. బహుశా ఏ చిత్రం గురించి అన్ని కధనాలు, విశ్లేషణలు వెలువడి వుండవు. ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పటం గురించి కూడా ఇలాగే అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా గోరక్షకులు-దళితులపై దాడుల గురించి నరేంద్రమోడీ బహిరంగ వేదికలపై నోరు విప్పారు. ఆయన దళితులపై దాడులను ఖండించారా ? లేక గోరక్షకులు పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారా , కావాలంటే నన్ను కాల్చండి అంటూ వారిని వేడుకున్నారు తప్ప అలాంటి వారిపై గట్టిగా చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పలేకపోయారు, ఆ వ్యాఖ్యల ద్వారా ప్రధాని ఎలాంటి సందేశం ఇస్తున్నారు అన్నది చర్చగా మారింది.

    ఎవరి అర్ధం వారు చెబుతున్నారు. ఆవులు-దళితులు- నరేంద్రమోడీ, మధ్యలో మొసలి చేరింది. దళితులపై దాడుల పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. బిఎస్‌పి నాయకురాలు మాయావతి దళితులపై దాడుల గురించి అదే పని చేస్తున్నారని బిజెపి ధ్వజమెత్తింది,గుజరాత్‌లో దళితులపై దాడుల గురించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనవసరగా మొసలి కన్నీరు కార్చవద్దని కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన గురించి కాంగ్రెస్‌ మొసలి కన్నీరు కారుస్తున్నదని వెంకయ్య నాయుడు విమర్శించారు. ఇలా ఎందరో ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు నిజంగా మొసలి కన్నీరు కారుస్తుందా, కారిస్తే ఎందుకు ? అది నరేంద్రమోడీ, బిజెపి నేతలకు వర్తిస్తుందా ?

   మొసలి కన్నీటి గురించి ఆరువందల సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రస్తావన వస్తోంది. దీని గురించి అనేక మంది అనేక విషయాలు చెబుతూనే వున్నారు. మొసలి కన్నీరు కార్చటం తన కోసం తప్ప ఇతరుల కోసం కాదన్నది చాలా మంది ఏకీభవిస్తున్న విషయం. వుభయ చర జీవులలో ఒకటైన మొసలి నీటిలో వున్నపుడు కన్నీరు కారుస్తుందో లేదో తెలియదు. అవసరం కూడా లేదు. బయటకు వచ్చినపుడు మాత్రం తన కళ్లను శుభ్రం చేసుకొనేందుకు కన్నీరు కారుస్తుంది తప్ప తనకు ఆహారంగా మారిన వాటి గురించి కాదని చెబుతారు.కానీ బయటకు చూసే వారికి మాత్రం అది ఎవరిపట్లనో విచారంతో కన్నీరు కారుస్తున్నట్లు కనిపిస్తుంది.స్వభావం, వాస్తవానికి విరుద్దంగా ఇతరులపై పైకి సానుభూతి వచనాలు పలికే వారిని అందుకే మొసలి కన్నీరు కారుస్తున్నారని అంటున్నారు. ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ అయినా మరొకరి గురించి అయినా లేదా సంఘటనల గురించి అయినా వివిధ పార్టీలు చేసే వ్యాఖ్యలను పరిశీలించాల్సి వుంటుంది.

    గత లోక్‌సభ ఎన్నికలు, తరువాత జరిగిన బీహార్‌ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతల ప్రసంగాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. గత కొద్ది సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారమే గులాబి విప్లవం లేదా పింక్‌ రివల్యూషన్‌ గురించి ప్రచారం చేసి తమ ఓటు బ్యాంకును పెంచుకొనేందుకు ప్రయత్నించారనేందుకు అనేక దృష్టాంతాలు వున్నాయి. కేంద్రంలో అధికారానికి రాక ముందు చెప్పిన మాటలకు తరువాత ఆచరణే అందుకు సాక్ష్యం. ఆవు మాంసం, ఇతర మాంసాలకు తేడా లేకుండా మొత్తం ఆవు మాంసాన్ని ఎగుమతి చేసేందుకు కాంగ్రెస్‌ అనుమతి ఇచ్చిందంటూ మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. పశుమాంసం గులాబి రంగులో వుంటుంది కనుక గులాబి విప్లవం అని పేరు పెట్టారు. కాంగ్రెస్‌ అజెండాయే గులాబి విప్లవం అన్నారు. వుపన్యాసాలు ఎలా సాగాయో చూడండి ‘ మనం హరిత విప్లవం, శ్వేత విప్లవం(పాల విప్లవం) గురించి విన్నాం కానీ గులాబీ విప్లవం గురించి ఎప్పుడూ వినలేదు.దీని అర్ధం ఏమంటే పశువులను వధించటం, మీరు చూడవచ్చు మాంసం రంగు గులాబీ, వారు దానిని ఎగుమతి చేయటం ద్వారా విప్లవాన్ని తీసుకువచ్చేందుకు పూనుకున్నారు.మన ఆవులను వధిస్తారు లేదా వధించేందుకు విదేశాలకు పంపుతారు. మీరు మాకు ఓటేస్తే మేము ఆవులను చంపేందుకు అనుమతి ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్‌ చెబుతోంది’ అని స్వయంగా నరేంద్రమోడీ వుపన్యాసాలు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కనుక ఢిల్లీలో వుంటే గ్రామాల్లోని ఆవులు అంతరించి పోతాయన్నట్లుగా చిత్రించారు. బీహార్‌ ఎన్నికలలో ఏం చెప్పారు? ములాయం సింగ్‌, లాలూ ప్రసాద్‌ వంటి యదువంశీకులు, యాదవులు కాంగ్రెస్‌తో ఎలా జతకడతారు అని ప్రశ్నిస్తూ ‘ గులాబి విప్లవం తీసుకురావాలని కోరుతున్న వారిని మీరు ఎలా సమర్ధిస్తారు అని నేను వారిని అడగదలచుకున్నాను, ఒక పశువును వధించినపుడు దాని మాంసం గులాబి రంగులో వుంటుంది దాన్నే గులాబి విప్లవం అంటున్నాము. ఒక గ్రామం తరువాత మరొక గ్రామంలో పశు సంపదను వధిస్తూ పోతూ వుంటే పశువులను అపహరించటం, వాటిని బంగ్లాదేశ్‌కు తరలించటం, దేశం మంతటా బడా పశువధ శాలలను తెరిచారు. కాంగ్రెస్‌ ఒక రైతుకు లేదా తన ఆవులను పెంచాలనుకొనే యాదవులకు సబ్సిడీ ఇవ్వదు, కానీ ఎవరైనా ఆవులను చంపేందుకు వధ శాలలు ప్రారంభిస్తే, పశువులను వధిస్తే మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి సబ్సిడీలు ఇస్తుంది’ ఇలా సాగాయి.

     అదే పెద్ద మనిషి ఇప్పుడు ఆవులు ఎక్కువగా చనిపోవటానికి అవి ప్లాస్టిక్‌ తినటమే అని కొత్త పల్లవి అందుకున్నారు. గుజరాత్‌లో చచ్చిన ఆవు చర్మం తీసిన దళితులపై దారుణంగా దాడి చేసిన వుదంతాలతో అక్కడి దళితులలో వెల్లడైన ఆగ్రహం, దాని ప్రభావం దేశమంతటా దళితులపై పడి నిరసన పెరుగుతున్న క్రమంలో నష్టనివారణ చర్యలలో భాగంగా నరేంద్రమోడీ, సంఘపరివార్‌ శక్తులు కొత్త పల్లవి అందుకున్నాయి.

      న్యూఢిల్లీలో జరిపిన టౌన్‌హాల్‌ సమావేశ ఆహ్వానితుల ఇష్టా గోష్టిలో మాట్లాడిన ప్రధాని వధశాలల్లో కంటే ఎక్కువగా ఆవులు ప్లాస్టిక్‌ తిని మరణిస్తున్నట్లు ఆవుల కాపలాదారులు గుర్తించాలని చెప్పారు. ‘నాకు నిజంగా కోపం తెప్పిస్తున్నదేమంటే కొందరు గో సంరక్షణ పేరుతో దుకాణాలు తెరిచారు. కొంత మంది పగలు గోరక్షణ అంటారు రాత్రుళ్లు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారు. డెబ్బయి నుంచి ఎనభై శాతం వరకు తప్పుడు పనులు చేస్తున్నట్లు తేలింది.సమాజం దీనిని అంగీకరించదు, తమ తప్పుడు పనులను కప్పిపుచ్చుకొనేందుకు వారు గోసంరక్షణ ముసుగు వేసుకుంటారు’ అన్నారు. స్వయం సేవకులు వున్నది సామాజిక సేవ చేయటానికి తప్ప జనాన్ని భయపెట్టటానికి, దుర్మార్గాన్ని ప్రదర్శించటానికి కాదు. వధశాలలలో కంటే ఆవులు ఎక్కువగా ప్లాస్టిక్‌ తిని మరణిస్తున్నాయి. పశు సేవ చేయదలచుకున్న వారు ఆవులను ప్లాస్టిక్‌ తినకుండా నిరోధించేందుకు ప్రయత్నించండి అని మోడీ సలహా ఇచ్చారు. హైదరాబాదు బిజెపి సభలో మాట్లాడుతూ ‘కావాలంటే నాపై దాడి చేయండి, నన్ను కాల్చండి అంతే కాని దళితులపై దాడులు చేయవద్దు. బిజెపి చేస్తున్న మంచి పనులను వారు గ్రహిస్తున్న విషయాన్ని గమనించి వారు తమ అదుపులో వున్నారని భావిస్తున్న కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని ఎన్నికలు, ఓటుబ్యాంకు భాష మాట్లాడారు.

    అసలు వాస్తవం ఏమిటి ? కాంగ్రెస్‌ విధానాలు దివాళాకోరు, ప్రజావ్యతిరేకమైనవి అనటంలో ఎలాంటి సందేహం లేదు. అదే మాదిరి బిజెపి వాజ్‌పేయి నాయకత్వంలో వెలగబెట్టిన పాలనలో, ఇప్పుడు మోడీ హయాంలో కూడా ఆ విధానాల కొనసాగింపు తప్ప ప్రత్యామ్నాయ విధానాలు కాదు. అందువలన దొందూ దొందే. ప్రతి దాని నుంచి తన రాజకీయ విభాగం బిజెపికి ఓట్లు సంపాదించాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ నిరంతర లక్ష్యం, కృషి అన్నది అనేక మంది అభిప్రాయం. గొడ్డు మాంసం నుంచి కూడా ఓట్లు కొల్ల గొట్టేందుకు బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది. ‘గోమాత వధను ప్రోత్సహించే గులాబి విప్లవాన్ని తిరస్కరించాల్సిన సమసయం ఆసన్నమైంది’ అనే శీర్షికతో 2012 అగస్టు 9న నరేంద్రమోడీ కృష్ణుడి పుట్టిన రోజు జన్మాష్టమి సందర్భంగా తన బ్లాగులో ఒక సందేశమిచ్చారు. దానిలో కూడా గులాబి విప్లవాన్ని ప్రోత్సహించేందుకు యుపిఏ ప్రభుత్వం ఆవుల వధను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. గుజరాత్‌లో గోమాత రక్షణకు సకల చర్యలూ తీసుకున్నామని దానిలో భాగంగానే చివరకు గోవుల కళ్ల అపరేషన్లు కూడా చేయించామని పేర్కొన్నారు. అనుమానం వున్నవారు దిగువ లింక్‌ను చూడవచ్చు.http://www.narendramodi.in/janmashtami-%E2%80%93-the-protector-of-cows-lord-krishna%E2%80%99s-birthday-3070

   అలాంటి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏం జరుగుతోందో దిగువ లింక్‌లోని నివేదిక చూడండి. http://www.ers.usda.gov/media/2106598/ldpm-264-01.pdf

    మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో గొడ్డు మాంస ఎగుమతుల్లో మిగతా దేశాలను అధిగమించి అగ్రస్థానానికి చేరింది. మన మాంసం ధర తక్కువ, ఇతర కారణాలు అందుకు దోహదం చేస్తున్నాయి. దేశంలో అన్ని రకాల బీఫ్‌(గొడ్డు మాంసం) వుత్పత్తి 2012లో 3,491 వేల టన్నుల నుంచి నరేంద్రమోడీ పాలనలో 2015 నాటికి 4,200 వేల టన్నులకు పెరిగింది. ఇదే సమయంలో మన అంతర్గత వినియోగం 2080 నుంచి 2200 వేల టన్నులకు, ఎగుమతులు 1411 నుంచి 2000 వేల టన్నులకు పెరిగాయి. ఎగుమతి చేసిందంతా దున్నలు, బర్రె మాంసమే. వుత్పత్తిలో దీని వాటా ఈ కాలంలోనే 77 నుంచి 82శాతానికి పెరిగింది. అందువలన ఆవులను వధిస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు అనే ప్రచారం మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవటానికి తప్ప వేరు కాదు. గులాబీ విప్లవం నరేంద్రమోడీ హయాంలో పెరగటమే కాదు, రానున్న రోజులలో ‘మేకిన్‌ ఇండియా ‘ వూపుతో ఇంకా అభివృద్ధి చెందనుంది. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఆ నివేదికను రూపొందించింది కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్‌ పార్టీ కాదు, పక్కా అమెరికా, మోడీకి బ్రహ్మరధం పడుతున్నదేశం. దాని ప్రకారం మోడీ పదవి నుంచి దిగిపోయే 2019 నాటికి బీఫ్‌ ఎగుమతులు 2,408 వేల టన్నులకు, 2025 నాటికి 2,826 వేల టన్నులకు పెరుగుతాయని అంచనా వేసింది. అంటే మోడీ సర్కార్‌ కూడా సబ్సిడీలను కొనసాగిస్తుందనే అనుకోవాలి. పత్తి ఎగుమతి చేస్తే పన్నులు, మటన్‌,బీఫ్‌ ఎగుమతి చేస్తే సబ్సిడీలు ఇస్తున్న కాంగ్రెస్‌ అంటూ 2012లో ధ్వజమెత్తిన నరేంద్రమోడీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా అదిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎగుమతులు, వుత్పత్తి ఎందుకు పెరగనిచ్చినట్లు ? బీఫ్‌ ఎగుమతుల సబ్సిడీని రద్దు చేసి పత్తి ఎగుమతులకు సబ్సిడీ ఇచ్చి రైతులకు మెరుగైన ధరలు ఎందుకు ఇప్పించలేకపోయారు?

     https://youtu.be/Mj0_jYfGWTc  ఈ లింక్‌ ద్వారా నరేంద్రమోడీ నాలుగేండ్ల నాడు ఏం చెప్పారో చూడండి.

    తమ పండుగల సందర్బంగా మటన్‌, బీఫ్‌ను నిషేధించాలని గతేడాది జైన సంఘాలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. తాము నడిచే నేల మీద కంటికి కనపడని జీవులు కూడా తమ పాదాల కింద నలిగి చనిపోకూడదని జైనులు నేలను వూడుస్తూ నడవటం తెలిసిందే.తన కున్న జైన స్నేహితులలో కొందరు బీఫ్‌ ఎగుమతి వ్యాపారంలో వున్నట్లు రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ స్వయంగా ఏబిపి టీవీతో చెప్పారు.

     ఇక ఆవులు ప్లాస్టిక్‌ తినటం గురించి ‘ప్లాస్టిక్‌ కౌ ‘ పేరుతో 2012లోనే కునాల్‌ ఓహ్రా కరుణా సొసైటీ కోసం ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసి ఆ సమస్యను వెలుగులోకి తెచ్చారు. ‘దేశంలో ఆవును సంరక్షించాలంటూ ఇటీవల టీవీ చర్చలు, పత్రికలలో వార్తలు రాసేవారి ఆత్మవంచన చూస్తే నవ్వు వస్తున్నదని ఆ డాక్యుమెంటరీ నిర్మాణంలో భాగస్వామి అయిన రుక్మిణీ శేఖర్‌ గతేడాది వ్యాఖ్యానించారు.ఎవరూ గో రక్షణకు చర్యలు తీసుకోవటం లేదని మీడియా చర్చలలో అదొక పావుగా మారిపోయిందని అన్నారు. నిజంగా నరేంద్రమోడీకి, సంఘపరివార్‌ స్వయం సేవకులు లేదా గో రక్షకులుగా రంగంలోకి వచ్చిన వారు వీధులలో తిరుగాడే గోవులు ప్లాస్టిక్‌ తినకుండా వాటి వెంట తిరుగుతున్నట్లు మనక్కెక్కడా కనిపించరు? అది గోరక్షణ కాదా ? అసలు ఇంతకాలం దాని గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? చర్యలు తీసుకున్నారా ? పోనీ ప్లాస్టిక్‌ నిషేధాన్ని అయినా సక్రమంగా అమలు జరిపించారా లేదే !

   ప్లాస్టిక్‌ కౌ డాక్యుమెంటరీ నిర్మించిన కరుణ సొసైటీ వారు 2012లోనే సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్లాస్టిక్‌ సంచులను నిషేధించి ఆవులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.గతనెలలోనే సుప్రీం కోర్టు ఆ కేసు విచారణ ముగించింది. పరిస్థితి తీవ్రంగా వుందని, ప్లాస్టిక్‌ వినియోగ నిషేధానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. దీని గురించి నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్లాస్టిక్‌ ఒక్క ఆవులకే కాదు, అన్ని రకాల పశువులు, అన్నింటి కంటే మించి పర్యావరణానికి తద్వారా మనుషులకూ హాని కలిగిస్తున్న విషయం తెలిసికూడా ఎలాంటి చర్యలూ గత రెండు సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? అసలు దీన్నొక ప్రాధాన్యత గల సమస్యగా భావించటం లేదా ? బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆవు సంరక్షణ పేరుతో ఇతర చర్యలకు ప్రాధాన్యత ఇచ్చాయి తప్ప మోడీ చెప్పి ఆవుల మరణానికి ఎక్కువగా కారణం అవుతున్న ప్లాస్టిక్‌ నిషేధానికి తీసుకున్న చర్యలేమిటి ?

    దళితులు గణనీయంగా వున్న వుత్తర ప్రదేశ్‌, పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలతో పాటు, గుజరాత్‌లో అడుగు జారుతున్నట్లు గతేడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో దళితులకు ఎక్కువ వుద్యోగాలు ఇవ్వటం కూడా దళిత ఓట్లను దండుకొనేందుకే అనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ దళితులపై దాడులు, వెల్లడైన నిరసన కమలనాధుల్లో కలవరం రేపాయి. కావాలంటే నాపై దాడి చేయండి అని నరేంద్రమోడీ గొంతు చించుకుంటున్న హైదరాబాదు సభలో గుజరాత్‌ దళితులపై దాడిని బహిరంగంగా సమర్ధించి బిజెపి ఎంఎల్‌ఏ రాజా సింగ్‌ కూడా అక్కడే వున్న విషయం మోడీ కావాలనే విస్మరించారా ? ఇప్పటి వరకు గో సంరక్షకుల పేరుతో జరిగిన దాడులలో ఎక్కువ భాగం బిజెపి పాలిత రాష్ట్రాలలోనే, వారంతా ఎవరు ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా లెక్కలేనన్ని దాని అనుబంధ సంస్ధలకు చెందిన వారు తప్ప మరొకరు కాదన్నది జగమెరిగిన సత్యం. ఈ పూర్వరంగంలో గో రక్షకుల మంటూ దుకాణాలు తెరిచారని, కావాలంటే తనపై దాడి జరపమనే కబుర్లు, కడవల కొద్దీ దళితులపై కన్నీరు కార్చారు తప్ప అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరలేదు. నూటికి 70-80శాతం తప్పుడు పనులు చేసే వారని చెప్పిన నరేంద్రమోడీ తమ పార్టీ పాలిత రాష్ట్రాలలో అలాంటివారు ఎందరిపై చర్యలు తీసుకున్నారు, ఎన్ని దుకాణాలను మూయించారు అన్నది చెప్పి వుంటే ఆయన మాటలకు విలువ వుంటుంది.అవి లేవు కనుకనే దళితులపై దాడుల గురించి మొసలి కన్నీరు కార్చారనే విమర్శలు వచ్చాయి.