Tags

, , , ,

Image result for journalist Neha Dixit

మేథావులు, జర్నలిస్టులు, ఇతరుల ఖండన

    జర్నలిస్టు నేహా దీక్షిత్‌ మరియు అవుట్‌ లుక్‌ పత్రికపై ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలు మరియు వ్యక్తులు ప్రారంభించిన బరితెగింపు దాడిని దిగువ సంతకం చేసిన జర్నలిస్టులు, అకడమీషియన్లు, కార్యకర్తలము తీవ్రంగా ఖండిస్తున్నాము. మూడు నెలలపాటు సమగ్రమైన పరిశోధన చేసి నేహా దీక్షిత్‌ తయారు చేసిన నివేదికపై ఈ దాడి జరుగుతోంది. అసోంలోని గిరిజన ప్రాంతాల నుంచి పంజాబ్‌, గుజరాత్‌లకు సంఘపరివార్‌కు చెందిన వివిధ సంస్ధలు గిరిజన బాలికలను ఎలా అక్రమంగా తరలించుకుపోయిందీ ఈ నివేదిక వెల్లడించింది.ఆ బాలికలను తిరిగి అసోంకు తీసుకు రావలసిందిగా అసోం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌, పిల్లల సంక్షేమ కమిటీ(కోక్రాఝార్‌), రాష్ట్ర పిల్లల సంరక్షణ సొసైటీ, మరియు చైల్డ్‌లైన్‌ (ఢిల్లీ మరియు పాటియాలా)లు ఆ సంస్ధలకు ఆదేశాలు జారీ చేశాయి. గుజరాత్‌,పంజాబ్‌ ప్రభుత్వాల అండదండలతో సంఘపరివార్‌ నడుపుతున్న సంస్ధలు తప్పించుకొని వాటిని వుల్లంఘించాయి. ఆవుట్‌లుక్‌ పత్రిక ఈ నివేదికను ప్రచురించటాన్ని అవకాశంగా తీసుకొని మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారంటూ లతాసిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాఖలైన ఒక ఫిర్యాదు ఆధారంగా ఇంద్రనీల్‌ రాయ్‌ (పబ్లిషర్‌), కృష్ణ ప్రసాద్‌ (సంపాదకుడు), రిపోర్టర్‌ నేహా దీక్షిత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఫిర్యాదు చేసిన వారు విజన్‌ మహాజన్‌(బిజెపి అధికార ప్రతినిధి మరియు గౌహతి హైకోర్టు అడ్వకేట్‌), మొమైనుల్‌ అవ్వాల్‌ (బిజెపి మైనారిటీ విభాగం), సుభాష్‌ చంద్ర కాయల్‌ (అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌).

   బాలికల అక్రమతరలింపుపై దర్యాప్తును ప్రారంభించాల్సిన పోలీసులు పనికిమాలిన మరియు దురుద్ధేశ్యపూర్వకంగా చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని ఆ నేరాన్ని బహిర్గతం చేసిన వారిపై చర్యకు వుపక్రమించారు. బాలికలను అక్రమంగా తరలించిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము.

   ఇంతేగాక తమ పరువుకు భంగం కలిగించారంటూ నేహా దీక్షిత్‌ మరియు అవుట్‌లుక్‌ పత్రికపై సామాజిక మాధ్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలు ప్రచారం ప్రారంభించాయి. మరిన్ని పోలీసు ఫిర్యాదులు, చట్టపరమైన జోక్యాలు కూడా వుంటాయని మేము భావిస్తున్నాము. తరచుగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనే ఈ హిందూత్వ శక్తులు ప్రస్తుత ప్రభుత్వమిచ్చే ధైర్యంతో హింసాకాండకు పాల్పడతాయని కూడా మాకు తెలుసు.

    మతపూరితమైన హింస మరియు విద్వేషాన్ని రెచ్చగొట్టే వాటి ఎత్తుగడలు, చర్యలను బహిర్గతం చేసినపుడు భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకొనేందుకు ‘మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారనే ‘ చట్టపరమైన సెక్షన్ను ముందుకు తెచ్చి ఎంఎఫ్‌ హుస్సేన్‌ నుంచి అషిష్‌ నంది వరకు చిత్రకారులు, మేథావులను వేధించేందుకు ఆర్‌ఎసెస్‌ మరియు వ్యక్తులు దీర్ఘకాలంగా చట్టం మరియు పోలీసు యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. మైనారిటీలపై దాడులు, గిరిజనులను హిందూత్వకరించే ఎత్తుగడలు, ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్దల ప్రయత్నాలను తమ పరిశోధనాత్మక రిపోర్టుల ద్వారా బయట పెట్టే ప్రత్యేకించి జర్నలిస్టులను ‘మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారనే’ పేరుతో లక్ష్యంగా చేసుకొంటారు.

    ఆర్‌ఎస్‌ఎస్‌ యంత్రాంగానికి బాగా అలవాటైన, గర్హనీయమైన ఈ ఎత్తుగడలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ఈ శక్తులు కోర్టులు, న్యాయ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం గురించి మన చట్టపరమైన న్యాయవ్యవస్ధ ఆప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. క్షుణ్ణంగా పరిశోధన చేసి ప్రచురించే ఇలాంటి ప్రజాప్రయోజనకరమైన పత్రికా స్వేచ్ఛపై అసహనదాడిగా పరిగణిస్తూ నేహా దీక్షిత్‌ మరియు అవుట్‌లుక్‌పై అన్ని నేరపూరిత చర్యలను ఎత్తివేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నాం.

గమనిక స్ధలాభావం రీత్యా ఈ ప్రకటనపై పెద్ద సంఖ్యలో సంతకాలు చేసిన, ఈ ప్రకటనను ఆమోదిస్తూ ప్రకటించిన వారి పేర్లు ఇవ్వలేకపోతున్నాం. ఆసక్తి కలవారు దిగువ వెబ్‌సైట్‌లో వాటి గురించి తెలుసుకోవచ్చు.

Statement against RSS attack on journalist Neha Dixit and press freedom