Tags

, , , ,

Netizens see face of communist Aidit, painting removed from Terminal 3

ఎం కోటేశ్వరరావు

   ఒకవైపు కమ్యూనిజం అంతరించి పోయింది, దాన్ని పూర్తిగా ఓడించి విజయం సాధించామని ప్రకటించిన పాతిక సంవత్సరాల తరువాత కమ్యూనిస్టు నేతల ఫొటోలను చూసి కూడా వ్యతిరేకులు ఎంతగా భయపడుతున్నారో, కమ్యూనిస్టు వ్యతిరేకతను తమ రాజకీయ ప్రయోజనానికి ఎలా వుపయోగించుకుంటున్నారో రెండు వుదాహరణలు వెల్లడిస్తున్నాయి.ఒకటి నియంత సుహార్తో హతమార్చిన ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ అధినేత డిఎన్‌ అయిదిత్‌ ఫొటో. రెండవది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా.

    ఇండోనేషియా రాజధాని జకర్తా సమీపంలో కొత్తగా నిర్మించిన సోకర్నో -హట్టా విమానాశ్రయంలోని మూడవ టెర్మినల్‌ 2017లో పూర్తి స్ధాయిలో వినియోగానికి రానుంది. ఇటీవలే పూర్తయి పాక్షికంగా రాకపోకలకు అనుమతించారు. ఆ టెర్మినల్‌ భవనం అలంకరణలో భాగంగా ఇండోనేషియా జాతీయ నాయకులుగా పరిగణించబడుతున్న వారి వందలాది ఫొటోలను ఏర్పాటు చేశారు. వాటిలో యాభై సంవత్సరాల క్రితం అమెరికా మార్గదర్శకత్వంలో జరిగిన సైనిక కుట్రలో హత్యకు గురైన కమ్యూనిస్టు పార్టీ నేత డిఎన్‌ అయిదిత్‌ మాదిరిగా వున్న ఒక చిత్రం కూడా వుంది. దాని కింద క్లుప్తంగా ఇలా రాసి వుంది.’ ఒక రంగస్థలంగా వున్న ఇండోనేషియా చర్చ ద్వారా వాస్తవాలను వెదికేందుకు అచంచలంగా నివేదిస్తోంది. ఒక సూత్రాన్ని రూపొందించేందుకు భావాలు జత కూడుతాయి . అది కేవలం రాజ్యం గురించే కాదు, జాతీయ ఐక్యత అనే ఒక ఆత్మగా రూపొందేందుకు భిన్న భాషలనుంచి భిన్నత్వాన్ని ఎలా రూపొందించాలన్నదాని గురించి కూడా వుంటుంది.’

     దీనికి ఎవరికి వారు తమదైన అర్ధాలు తీసుకున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు ఆ చిత్రాన్ని చూసి ఇంకేముంది ఇండోనేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీకి ప్రాణ ప్రతిష్ట జరిగిందని సామాజిక మీడియాలో గగ్గోలు పెట్టారు. దీనిపై గత శుక్రవారం నాడు విమానాశ్రయ నిర్వాహకులు స్పందించారు. కంపెనీ కార్పొరేట్‌ కార్యదర్శి అగస్‌ హర్యాదీ మాట్లాడుతూ ఆ చిత్రంలో వున్నది అయిదిత్‌ అని నిర్ధారణగా చెప్పలేము. దానిని నిర్ధారించుకొనే పనిలో వున్నాము. ఎందుకంటే కోంపాస్‌ డాట్‌ కాం పేర్కొన్నట్లు తొలి ప్రధాని సుతాన్‌ జహీర్‌ది కూడా కావచ్చు అన్నారు. ఇది చెప్పిన కొద్ది గంటలలోనే కంపెనీ డైరెక్టర& జొకో మూర్తజా మోద్‌జో ఒక ప్రకటన చేస్తూ ఆ చిత్రాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తొలుత దానిపై తెల్లని వస్త్రం కప్పి తరువాత పూర్తిగా తొలగించారు. ఐదు దశాబద్దుాల క్రితం ఇండోనేషియాలో జరిగిన కుట్రలో భాగంగా ఐదులక్షల మంది కమ్యూనిస్టులు, నియంత సుహార్తోను వ్యతిరేకించిన వారిని మిలిటరీ, వారితో చేతులు కలిపిన ఇస్లామిక్‌ సంస్ధల సాయుధులు హతమార్చిన విషయం తెలిసిందే. నాటి ఘటనలకు బాధ్యులైన వారిని శిక్షించాలని, వూచకోతపై క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిన నేపధ్యంలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకులు చెలరేగి పోతున్నారు.

   గతంలో జరిగినదానిని తవ్వటం గాయాలను కెలకటం తప్ప మరొక ప్రయోజనం వుండదని అందువలన వాటి గురించి మాట్లాడ కూడదని రిటైర్డ్‌ జనరల్‌ కికి శ్యాంకరీ వంటి వారు కమ్యూనిస్టు వ్యతిరేక గళం విప్పుతున్నారు. జాతీయ భావమైన పంచశీలకు విరుద్ధంగా దేశంలో తిరిగి కమ్యూనిజం, ఇతర భావజాలాలను వ్యాపింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జూన్‌లో జరిగిన ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సదస్సులో కికీ ఆరోపించాడు. ఒక మార్క్సిస్టు తప్పకుండా ఒక నాస్తికుడు అయి వుంటాడని, భూమిని దేవుడు సృష్టించలేదని చెప్పిన అరిస్టాటిల్‌, ప్లాటోల తత్వశాస్త్రం మార్క్సిజం వెనుక వున్నదని, కాబట్టి వారు దేవుడిని నమ్మరంటూ అరిగిపోయిన రికార్డును తిరిగి వినిపించాడు. కికీ రోత వాదనలను తత్వవేత్త, క్రైస్తవ పూజారి అయిన ఫ్రాంజ్‌ మెగ్నిస్‌ సుసేనో తిరస్కరించారు. కారల్‌ మార్క్స్‌ భావాలు అరిస్టోటిల్‌తో సంబంధం లేనివి,అరిస్టోటిల్‌ భావాలు నాస్తికత్వంతో నిమిత్తం లేనివి అన్నారు. మార్క్స్‌ పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించారని, దాన్ని కూలదోయాలని చెప్పాడన్నారు. తరువాత రష్యా నాయకుడు లెనిన్‌ ఆ పని చేసేందుకు ఒక విప్లవ పార్టీ అవసరాన్ని గురించి చెప్పారని అన్నారు. ‘మార్క్స్‌ విప్లవ పార్టీ గురించి మాట్లాడలేదు, కానీ లెనిన్‌ పార్టీపై కేంద్రీకరించారు, కేవలం సిద్ధాంతం మీదే కాదు విప్లవనిర్వణ గురించి కూడా చెప్పారు.కనుకనే అతను విప్లవకారులను తయారు చేశాడు, వారిని కమ్యూనిస్టులని పిలిచారు, కాబట్టి కమ్యూనిజం అంటే మార్క్‌, లెనిన్‌ సిద్దాంతాల కలయిక ‘ అని ఫ్రాంజ్‌ జకర్తాపోస్టుతో చెప్పారు. కికీ వక్రీకరణలను జర్నలిస్టు ఫెబ్రియానా ఫిర్దౌస్‌ తన ఫేస్‌ బుక్‌లో పోస్టు చేయటంతో అనేక మంది మాజీ జనరల్‌ కికీ కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నాడంటూ వ్యంగ్యంగా తీవ్ర విమర్శలు చేశారు. దాంతో మతశక్తులు ఫెబ్రియానాపై దాడికి దిగిన విషయం తెలిసిందే.

   రెండవ విషయం డోనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి గురించిన ప్రచారం. ట్రంప్‌ భార్య ఒక కమ్యూనిస్టా అంటూ అదొక పెద్ద రహస్యాన్ని బయట పెట్టినట్లుగా ఆదివారం నాడు ఒక వ్యాఖ్యాత ఏకంగా పెద్ద వ్యాసమే రాశాడు. మార్నింగ్‌ లెడ్జర్‌ అనే డాట్‌కామ్‌లో సౌనక్‌ ముఖోపాధ్యాయ అనే పెద్ద మనిషి ఆ పని చేశాడు.ఆమె కమ్యూనిస్టు అయి వుండటానికి పేర్కొన్న కారణాలు ఇలా వున్నాయి. ఆమె ఐరోపాలోని యుగోస్లావియాలో పుట్టింది.ఆ సమయంలో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం వుంది, కనుక తప్పకుండా ఆమె మ్యూనిస్టు భావజాలాన్ని అభిమానించి వుంటుంది కనుక కమ్యూనిస్టే అయి వుంటుందన్నది తర్కం. ఒక వేళ ట్రంప్‌ గనుక గెలిస్తే ఒక కమ్యూనిస్టు దేశంలో పుట్టిన మహిళ అమెరికాలో ప్రధమ మహిళగా తొలిసారిగా రికార్డుల కెక్కుతారట. ట్రంప్‌ కమ్యూనిస్టు పార్టీ పాలనలో వున్న చైనా అంటే సానుకూల వైఖరి వుండటం మరొక కారణమట. మోకాలికీ బోడి గుండుకు ముడిపెడుతూ రాసే మతిలేని రాతలు తప్ప మరొకటి కాదు. ట్రంప్‌ భార్య మెలినియా యుగోస్లావియాలో పుట్టినప్పటికీ మోడలింగ్‌ వృత్తి కోసం అమెరికా వచ్చింది.అక్కడే ఒక ఫ్రెంచి పత్రికకు నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత ఒక ఫ్యాషన్‌ షో సందర్భంగా పరిచయమైన ట్రంప్‌ను వివాహం చేసుకుంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీకి దిగటంతో ఆయన ప్రత్యర్ధులు ఆ పొటోలను ఈనెలలో తిరిగి ప్రచురింప చేయించి, ఇలాంటి ఆమెను ప్రధమ పౌరురాలిగా ఎలా అంగీకరిస్తామంటూ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఆమె తండ్రి కమ్యూనిస్టు కనుక ఆమె కూడా కమ్యూనిజాన్ని అభిమానించి వుంటుందంటూ ట్రంప్‌ను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టు వ్యతిరేకతను కూడా వాడుకోవటం దీని లక్ష్య ంగా వుంది.