Tags

, , , , , , ,

Massive Dalit rally in Una, Muslims also participate, Dalits vow not to pick dead cows

దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఆగస్టు 15న గుజరాత్‌లోని వునాలో నిర్వహించిన పెద్ద బహిరంగ సభలో ఒక భాగం

సత్య

   చచ్చిన ఆవుల చర్మాలు తీస్తున్న తమపై చేస్తున్న దాడులకు నిరసనగా ఆ వృత్తికి స్వస్తి చెబుతామంటూ కళేబరాలను వదలి వేస్తున్నారు ఒకవైపు దళితులు. మరోవైపు వట్టి పోయిన వాటినే గాక పాలిచ్చే అవులను కూడా అమ్ముకోకుండా చేస్తూ నష్టపరుస్తున్నందుకు నిరసనగా  వట్టిపోయిన ఆవులను అధికార కూటమి ఎంఎల్‌ఏల ఇండ్ల ముందు వదలి వేస్తామని పంజాబ్‌ రైతులు హెచ్చరికలు జారీ చేశారు. ఆవులతో పాటు గో సంరక్షకులకు గుర్తింపు కార్డులివ్వాలని హర్యానా ఆవుల కమిషన్‌ ప్రతిపాదించింది. గోనంరక్షుల ముసుగులో దుకాణాలు తెరిచారని, ఎనభై శాతం వరకు నకిలీలున్నారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్‌ అధినేత ప్రవీణ్‌ తొగాడియా రుసురుసలాడుతున్నారు. ప్రధాని చెప్పిన సమాచారం ఎవరిచ్చారో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. సంరక్షకులను నిరాశపరిచారు, అవమానపరిచారంటూ ధ్వజమెత్తారు. కావాలంటే నా మీద దాడులు చేయండి తప్ప నా దళిత సోదరుల మీద కాదంటూ కొద్ది రోజుల క్రితం గొప్పనటన ప్రదర్శించిన నరేంద్రమోడీ సోమవారం నాడు మరొక అడుగు ముందుకు వేశారు. వేలాది సంవత్సరాల మన నాగరిక చరిత్రలో మహాభారత భీముడి నుంచి భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ వరకు మన సమాజం ఎంతో సుదీర్ఘ ప్రయాణం సాగించిందని ప్రధాని నరేంద్రమోడీ తన ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు.

    సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే దళితుల ఓట్ల వేటలో భాగంగా భీ-భీ ప్రాసకోసం పడిన పాట్లు తప్ప మరొకటి కాదు. మహాభారతం కంటే ముందుదైన రామాయణ కాలంలో నాగరికత లేదా ? ప్రధాని ప్రసంగం రాసిన వారికి ఈ మాత్రం తెలియదా అని ఎవరైనా అనుకోవచ్చు. పోనీ ప్రాసకోసం ఆ పెద్దమనిషి రాస్తే ఇన్నేండ్లుగా రామ భజన చేస్తున్న నరేంద్రమోడీకి ఆమాత్రం తెలియదా, ముందుగానే చదువుకోరా ? సలహాదారులకు కూడా తట్టలేదా ? బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా భాషలో చెప్పాలంటే మేడంటే మేడా కాదూ, రెండంటే రెండూ కాదు అన్నట్లుగా అవసరార్దం చెప్పే అనేక మాటల్లో ఇదొకటి ( జుమ్లా ). మొత్తానికి వచ్చే ఏడాది జరిగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆవులు-దళితులు- ఓట్ల రాజకీయం మహా రంజుగా నడుస్తున్నది. మధ్యలో ప్రవీణ్‌ తొగాడియా తగులుకున్నాడు.

punjab, punjab cows, punjab cow vigilantes, punjab protests, punjab gau rakshaks, punjab protests, ludhiana protests, dairy farmers protest, india news, punjab news

   ఆవు కమిషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లోని లూధియానా జిల్లా జగ్రాన్‌లో ప్రదర్శన జరుపుతుననష్ట్ర& పాడి రైతులు

    పంజాబ్‌ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం గోసేవ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ పాడి రైతుల నాశనానికి వచ్చిందంటూ దానిని రద్దు చేయాలని ప్రోగ్రెస్‌ డెయిరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. పాలిచ్చే ఆవుల వ్యాపారాన్ని కూడా దెబ్బతీసేందుకు గో సంరక్షకులు కుమ్మక్కు కావటంపై కూడా దర్యాప్తు జరపాలని పాల రైతుల అసోసియేషన్‌ అధ్యక్షుడు దల్జిత్‌ సింగ్‌ తన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గోసేవ కమిషన్‌ రూపొందించిన నిబంధనలను చూస్తే ఆవుల అమ్మకం, రవాణా అసాధ్యం అవుతుందని, గోరక్షకుల పేరుతో వున్నవారు వ్యాపారులను భయకంపితులను చేస్తున్నారని తెలిపారు. కమిషన్‌ చర్యల పట్ల నిరసనగా పంజాబ్‌లో అతి పెద్ద మార్కెట్‌ వున్న జగ్రాన్‌ పట్టణంలో వందలాది మంది పాల రైతులు, వ్యాపారులు, రవాణా సిబ్బంది గురువారం నాడు ప్రదర్శన జరిపారు. వట్టిపోయిన ఆవులను స్ధానిక శాసన సభ్యుడు ఎస్‌ ఆర్‌ కెలెర్‌ ఇంటి ముందు కట్టి వేసి వాటిని ఆయనకు బహుమానంగా ఇస్తున్నామని ప్రభుత్వం వసూలు చేస్తున్న ఆవు పన్నుతో వాటి ఆలనా పాలనా చూడాలని కోరుతూ నినాదాలు చేశారు.

   గోసేవ కమిషన్‌ నిర్వాకంతో లక్షాపాతికవేల రూపాయలున్న పశువుల ధర 50-60వేలకు పడిపోయిందని, నిరభ్యంతర పత్రం వుంటే తప్ప పశువులను కొనుగోలు చేసే అవకాశం లేనందున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారెవరూ వుండరని దీంతో రాబోయే రోజుల్లో మరింతగా ధరలు పడిపోతాయని దల్జిత్‌ సింగ్‌ చెప్పారు. గోసేవ కమిషన్‌ అండ చూసుకొని శివసేన, భజరంగదళ్‌, గోరక్షదళాల పేరుతో వున్నవారు వేధింపులకు పాల్పడుతున్నందున అసలు కమిషన్నే ఎత్తివేయాలని కోరుతున్నట్లు చెప్పారు. వేధింపుల గురించి నిర్ధిష్ట ఫిర్యాదులు చేసినా ముఖ్యమంత్రితో సహా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. బయటకు వెళ్లే అవకాశం లేని కారణంగా వట్టిపోయిన ఆవుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. గోరక్షకుల పేరుతో వున్నవారు ఆవుకు రెండు వందలు లేదా లారీకి రెండువేల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి.

     ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చిన మాదిరిగా ఆవులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని హర్యానా బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది.ఆవులతో పాటు వాటి సంరక్షకులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. గోరక్షక దళానికి పోలీసు శాఖ గుర్తింపు కూడా ఇప్పించాలని తలపెట్టినట్లు హర్యానా ఆవుల కమిషన్‌ పేర్కొన్నది. ఇప్పటికే గోరక్షక దళం పేరుతో వున్నవారు తమకు తామే గుర్తింపు కార్డులు ఇచ్చుకున్నారు. వాటికి అధికారిక ముద్ర వేయనున్నారు. హర్యానాలో దళితుల రక్షణకు ప్రత్యేక అధికారి లేరు గానీ గోవుల రక్షణ విభాగానికి ఐజి స్ధాయి అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆవుల సంరక్షణకు 2010లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఒక కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.దానికి ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాం మంగ్లా అధ్యక్షుడిగా వున్నారు. గోవుల రక్షణ విభాగం ఐజి భారతీ అరోరా మాట్లాడుతూ కొందరు దున్నలు, బర్రెల రవాణాను కూడా అడ్డుకొని డబ్బు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. ఎక్కువ మంది అత్యుత్సాహంతో, ఆవేశంతో వున్నారని చెప్పారు. గుర్తింపు కార్డుల గురించి చెబుతూ కొన్ని గోరక్షక దళాలు నిజమైనవే అయినప్పటికీ ఎక్కువభాగం కాదని అందువలన గుర్తింపు కార్డులు ఇవ్వదలచుకుంటే పోలీసు తనిఖీ తరువాత జారీ చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఎలాంటి గుర్తింపు లేకుండానే దాడులకు పాల్పడుతున్న ఈ శక్తులకు నిజంగానే అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వటం మంటే వారు చేస్తున్న బలవంతపు వసూళ్లకు చట్టబద్దత కల్పించటం తప్ప మరొకటి కాజాలదు.

    విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ప్రవీణ్‌ తొగాడియా-నరేంద్రమోడీ గుజరాత్‌లో సంఘపరివార్‌కు జంట నాయకులుగా పని చేసిన చరిత్ర వుంది. గో రక్షకులలో 80శాతం నకిలీలేనని ప్రధాని వ్యాఖ్యానించటం ద్వారా వారిని అవమానించారని, వేధింపులకు గురిచేయటమేనని తొగాడియా ధ్వజమెత్తారు. దళితుల ఓట్లకు దెబ్బతగుల కుండా చూసేందుకు ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి దిగిన నేపధ్యంలో గో రక్షకులందరూ నిజాయితీపరులేనని తొగాడియా కితాబు నివ్వటం గమనించాల్సిన అంశం. ఒకరు పిర్ర గిల్లితే మరొకరు జోల పాడటం అంటే ఇదే. ప్రధాని వ్యాఖ్యలతో సాధు, సంతులు విలపిస్తున్నందున తాను మాట్లాడక తప్పటం లేదని తొగాడియా చెప్పారు.దళితులపై దాడులకు గో సంరక్షణకు ముడి పెట్టటం హిందూ సమాజాన్ని చీల్చేందుకు ఒక కుట్ర అని ఆరోపించారు.

    ఇలా అయితే మన దేశంలో ఆవులు అంతరిస్తాయని బీహార్‌కు చెందిన 92 ఏండ్ల మహిళ అన్నారని, మీరు మౌనంగా ఎందుకున్నారని లాయర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్ల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ప్రశ్నించారని తొగాడియా చెప్పారు. ‘మీకు(ప్రధాన మంత్రి) ఎనభైశాతం మంది గోరక్షకులు నేరగాళ్లు, మోసగాళ్లు మరియు పాపులు ఎందుకంటే వారంతా హిందువులు కనుక ‘ అని తొగాడియా వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ ‘ ప్రధాన మంత్రి గారూ మీరు గో సంరక్షకుల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. దానికి ఆధారం ఎక్కడ ? మీ దగ్గర వుంటే దయచేసి బయట పెట్టండి, ఆవులు కటిక వారి చేతిలో వధ అవుతున్నాయి మీరు ఎక్కువ భాగం ప్లాస్టిక్‌ తిన్న కారణంగా మరణిస్తున్నట్లు చెప్పారు. కటిక వారి తీవ్రమైన నేరాన్ని మాఫీ చేశారు, ప్రధాన మంత్రి అబద్దాలు చెబుతున్నారని చెప్పాలని నేను కోరుకోవటం లేదు, ఎందుకంటే ఆయన నాకూ ప్రధానే, అయితే ఆయన ప్రసంగం తరువాత నేను అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాను, వారిలో ఏ ఒక్కరూ కూడా అలాంటి సమాచారం ఆయనకు ఇచ్చామని నాకు చెప్పలేదు. కాబట్టి ఆయనకున్న సమాచార వనరు ఏమిటో బయట పెట్టాల్సిన బాధ్యత ప్రధానిదే ‘అన్నారు. ప్రధాని ప్రకటనను ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధించిన తరువాత మీరు ఇలా మాట్లాడటం ఏమిటి అన్న ప్రశ్నకు ‘నేను ఎంతో బాధ్యతా యుతంగా మాట్లాడానని ‘ అని మాత్రమే జవాబిచ్చిన తొగాడియా నరేంద్రమోడీ తన బాల్య స్నేహితుడు అని కూడా వెల్లడించారు. (అయితే ఇద్దరూ కలిసి టీ అమ్మారా అని అడగకండి, మోడీ కంటే ఆరు సంవత్సరాలు చిన్న అయిన తొగాడియా క్యాన్సర్‌ వైద్య నిపుణుడు) ఆవుల వధ, దొంగరవాణా నిరోధం, గొడ్డు మాంస ఎగుమతుల నిరోధం గురిచి ప్రధాని కార్యాలయంలో రోజంతా పనిచేసే సహాయ కేంద్రాన్ని ప్రారంభించినపుడు తాను చేసిన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్రమోడీ వుపసంహరించుకోవాలని కూడా తొగాడియా డిమాండ్‌ చేశారు.దేశమంతటా గోవధను నిషేధిస్తానని వాగ్దానం చేసిన ప్రధాని దానిని నిలుపుకోకుండా గోరక్షకులపై విరుచుకుపడి లక్షలాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచారు. బగోవధను ఆపమని ఒక సలహా ఇస్తారని అనుకున్నాం కానీ ప్రధానీ మీరు హృదయాలను గాయపరిచారు… మన గోవులను మనం రక్షించుకోలేకపోతే ఇంక ఆత్మహత్యలు చేసుకోవటం మంచిది, ఇంతటి అవమానం గతంలో ఎన్నడూ జరగలేదని గోరక్షకులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారికి మద్దతుగా గోరక్షకులు, వారి కుటుంబాలు నిలబడాలని తొగాడియా పిలుపునిచ్చారు.

     నిజానికి తొగాడియా విమర్శలు, నరేంద్రమోడీ హెచ్చరికలు రెండూ కూడా లాలూచీ కుస్తీ తప్ప వేరు కాదు. ఎందుకంటే అటు దళితులు ఓట్లతో పాటు వెర్రెక్కిన మతశక్తులు కూడా వారికి అవసరమే కదా ! ఈ కారణంగానే తొగాడియా వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. బిజెపి జాతీయ ప్రతినిధి సిద్ధార్ధ నాధ్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రధాని ఏం చెప్పారో దేశం దాన్నే అనుసరించాలి అని ముక్తసరిగా వ్యాఖ్యానించారు. సంఘపరివార్‌లో ప్రవీణ్‌ తొగాడియా సాదా సీదా కార్యకర్తేమీ కాదు, ఆయన చేసిన తీవ్ర విమర్శలకు నరేంద్రమోడీ లేదా ఆయన అంతరంగంగా పరిగణించబడే నాయకులైనా స్పందింకపోతే నరేంద్రమోడీ అబద్దాల కోరుగా మిగిలిపోతారు.