Tags

, , , , ,

సత్య

     రాజస్థాన్‌లోని హింగోనియా గోశాలలో ఈ ఏడాది జనవరి నుంచి జాలై వరకు బిజెపి వారు చెప్పే 8,122 మంది ‘గోమాతలు ‘ మరణించారు. అధికారికంగా ప్రకటించిన లెక్కలివి. అయితేనేం అక్కడి బిజెపి ప్రభుత్వం ఒక్క అనుమానిత లేదా నిర్లక్ష్య హత్య కేసును కూడా ఎవరి మీదా నమోదు చేయలేదు, కనీసం విచారణ జరపలేదు. ఒక్క దాడి కూడా జరగలేదు కనుక ఏ ఒక్క ‘గో సంరక్షుడి’కీ ఇది పట్టలేదనుకోవాలి. బీహార్‌లో లాలూ ప్రసాద్‌ ప్రసాద్‌ యాదవ్‌ ఏలుబడిలో మాదిరి బిజెపి సర్కారున్న రాజస్థాన్‌లో గోమాత పేరుతో గడ్డి తింటున్నారనే విమర్శలు వచ్చాయి. నాలుగు సంవత్సరాల క్రితం ఈ గోశాలలో నూటికి 7.09 శాతం గోమాతలు మరణిస్తే ఇప్పడు 11.31 శాతానికి పెరిగాయని కూడా ప్రభుత్వం వెల్లడించింది. బిజెపి పాలనలో గోవులకు ఈ గతి పట్టటం ఆశ్చర్యకరమే. ఆవుల మరణానికి కారకులైన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ జైపూర్‌లోని సచివాలయం వద్ద హర్యానాకు చెందిన రాష్ట్రీయ గో సంత్‌ గోపాల్‌ దాస్‌ మహరాజ్‌ నాయకత్వంలో గో రక్షకులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా 144వ సెక్షన్‌ విధించి పోలీసులు లాఠీ చార్జి చేశారని వార్తలు వచ్చాయి. గో సంరక్షణ కూడా దేశ భక్తిగా మారిపోతున్న రోజులు కనుక భవిష్యత్‌లో దీనిని కూడా స్వాతంత్య్ర సమరంతో సమంగా గుర్తిస్తే లాఠీ దెబ్బలు తిన్నవారికి పెన్షన్లు ఇచ్చే అవకాశం వుండొచ్చు. రాబోయే రోజుల్లో బిజెపిలో ముఠా కుమ్ములాటలు తలెత్తితే ఇదే ఆవు చుట్టూ కేంద్రీకృతమయ్యే అవకాశాలుంటాయా ? ఏమో ?

     ఆవు గురించి అసలు సిసలైన ‘హిందూ హృదయ సామ్రాట్‌ ‘గా కీర్తించబడే విడి సావర్కర్‌ చెప్పిన మాటలు గనుక వింటే గో రక్షకులుగా జనం ముందుకు వస్తున్న కాషాయ యోధులు సావర్కర్‌ను సైతం పక్కకు నెట్టేస్తారు. పాకిస్తాన్‌ ఏజంటని ముద్రవేసినా ఆశ్చర్యం లేదు. ‘ఆవు ఒక వుపయోగకరమైన జంతువు మాత్రమే, దేవత కాదని చెప్పిన అసలైన హిందూ హృదయ సామ్రాట్‌’ అనే శీర్షికతో ‘ ద క్వింట్‌ ‘ అనే వెబ్‌ సైట్‌లో అషిష్‌ దీక్షిత్‌ అనే రచయిత ఆగస్టు 13న ఒక విశ్లేషణ రాశారు.అది ఇలా ప్రారంభం అవుతుంది.’ ‘హిందూత్వ’ అనే పదాన్ని వునికిలోకి తెచ్చింది వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అని మీకు తెలుసా ? ఎవరైతే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనేక విషయాలలో ఏకీభవించని సావర్కర్‌ గురించే ,’హిందూ హృదయ సామ్రాట్‌ ‘అని తొలిసారిగా వుపయోగించారని మీకు తెలుసా ? ఆవు ‘ఒక వుపయోగకరమైన జంతువు అవసరమైతే దానిని తినవచ్చు ‘ అని కూడా అతను అన్నాడని మీకు తెలుసా ? ఇరవై ఒకటవ శతాబ్దంలోని జనం దీనిని జీర్ణించుకోలేకపోతే వంద సంవత్సరాల క్రితం వారెలా స్పందించి వుంటారో వూహించుకోండి ! అతని రాజకీయ హిందూత్వ ఆలోచనతో అనుచరులు ప్రభావితులయ్యారు, అయితే వారిలో ఎక్కువ మంది హిందూ మతం గురించి అతని ‘శాస్త్రీయ మరియు పురోగామి ‘ ఆలోచనలతో ఏకీభవించరు. గో సంరక్షణ దేశం ముందున్న అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా కనిపిస్తున్న నేడు హిందుత్వకు చిహ్నంగా వున్న విడి సావర్కర్‌ ఆవును ఆర్ధిక పురోగతికి వినియోగించుకోవాలని చెప్పాడని తెలుసుకోండి. ‘విదన్యాన్‌ -నిషిత నిబంధ ( సైన్సు అనుకూల వ్యాసాలు)లో అవులను రక్షించాల్సింది మానవులకు వుపయోగకరమైనవని తప్ప అవి దైవత్వం కలిగినవని కాదు అని సావర్కర్‌ రాశారు. ఆషిష్‌ దీక్షిత్‌ పేర్కొన్నట్లుగా వేదాలు కూడా ఆవును దేవతగా వర్ణించలేదు. ఏదైనా వుపయోగం, గొప్పది అనుకుంటే దానిని దేవుడిగా పిలవటం హిందువులలో నేడు ఒక ధోరణిగా వుంది.http://www.thequint.com/india/2016/08/13/cow-is-a-useful-animal-not-god-said-original-hindu-hriday-samrat

   సావర్కర్‌ రాజకీయ, ఇతర అభిప్రాయాలతో విబేధించటం లేదా అనుకూలించటం అన్నది ఎవరిష్టం వారిది. నిత్యం సావర్కర్‌ భజన చేస్తూ , అపర దేశ భక్తుడిగా చిత్రించి స్మారక చిహ్నాలను ఏర్పాటు చేస్తూ మతం, హిందూత్వ వంటి తిరోగమన అంశాలతో ఏకీభవించే శక్తులే నేడు ఆవుకు లేని దైవత్వాన్ని ఆపాదించి జనాన్ని తప్పుదారి పట్టించటమే కాకుండా విమర్శించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆవునే కాదు పాలిచ్చే గేదె లేదా బర్రె ఏదైనా ఆర్ధిక ప్రయోజనానికి వుపయోగపడేదే. జైలులో వున్న తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని లేఖ రాసిన ఆ పెద్దమనిషిని స్వాతంత్య్ర సమర యోధుడిగా చిత్రించటాన్ని తప్పు పట్టవచ్చు, అది వేరే విషయం. కానీ అదే సావర్కర్‌ ఆవు గురించి ఈ వాస్తవ వైఖరినే తీసుకున్నారన్నది నిజం. తమ ఇతర అవసరాలకు సావర్కర్‌ను వుపయోగించుకుంటున్న బిజెపి వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార్‌ సంస్ధలు ఆవు విషయంలో పక్కన పెట్టటం జనాన్ని మోసం చేయటం తప్ప నిజాయితీ కనిపించదు.అందువలన ఇది రాజకీయ ప్రయోజనాలకోసం చేస్తున్నది తప్ప మరొకటి కాదు స్పష్టం.

     సావర్కర్‌ను స్మరిస్తూ రెండు సంవత్సరాల క్రితం ఆయన పుట్టిన గడ్డ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి సర్కార్‌ సావర్కర్‌ అభిప్రాయాలకు భిన్నంగా గోవధతో పాటు ఇతర జంతు మాంసాన్ని కూడా నిషేధించింది. హిందూత్వ వంటి తిరోగమన భావాలను ఒకవైపు కలిగి వుంటూనే హిందువులలో శాస్త్రీయ ఆలోచనలను పెంచాలని చెప్పిన సావర్కర్‌ ఆవును పూజనీయ మాతగా పరిగణించటం వంటి మంచి కంటే చెడు ఎక్కువగా చేసిన పాత సంప్రదాయాలను వదులు కోవాలని కూడా స్పష్టంగా చెప్పాడు. ఇది ఒక విధంగా విమర్శే. ఇదే విషయాన్ని ఇతరులు చెప్పినా, విమర్శించినా హిందూత్వ శక్తులు ఎందుకు సహించటం లేదు? అసలు వారెందుకు పాటించటం లేదు, గోమాత పేరుతో ఎన్నడూ లేని విధంగా ఒక సమస్యగా చేసి ఎందుకు జనం ముందుకు వస్తున్నారు? వారు ఆరాధించే సావర్కర్‌నే అవమానించటం కాదా ? ఎందుకీ ద్వంద్వ స్వభావం లేదా ఆత్మవంచన ? సావర్కర్‌కు అభిప్రాయాలను కలిగే హక్కువుందని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త ఎంజి వైద్య వ్యాఖ్యానించారు. కానీ ఆ సంస్ధకు చెందిన వారు ఇతరులు కూడా భిన్న భావాలను కలిగి వుంటారని, వారికీ హక్కులుంటాయని గుర్తించకుండా దాడులకు దిగటం ఫాసిస్టు స్వభావం తప్ప వేరు కాదు. క్వింట్‌ వ్యాసంలో తన భావాలను వ్యక్తీకరించిన దీక్షిత్‌పై కొందరు విరుచుకుపడ్డారు. అవాస్తవాలను చెబుతున్నారంటూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. సావర్కర్‌ రచనలతో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో, ఆయన పుస్తకాలలోనే అవన్నీ వున్న విషయాన్ని వుద్రేకంలో వారు మరిచిపోయారు.http://www.savarkar.org/en/rationalism/cow-protection-and-cow-worship

   గొడ్డు మాంసం తినటంతో పాటు వ్యాపారంలో ముస్లింలే ఎక్కువ మంది వున్నారనే ఒక దురభిప్రాయాన్ని ఇటీవలి కాలంలో వ్యాపింప చేశారు. అన్ని రకాల పశు మాంసాలను కలిపి బీఫ్‌ అని వ్యవహరిస్తున్నారు. దీంతో ఆవు మినహా మిగిలిన దున్న, బర్రె మాంసం తిన్నా లేదా వాటిని మాంసం కోసం వధించినా ఆవులనే పేరుతో దాడులకు తెగబడుతున్నారు. బీఫ్‌ ఎగుమతులు అంటే ఆవు మాంసమే అనుకొనే అమాయకులు ఎందరో వున్నారు. అది వాస్తవం కాదు. ప్రధానే ఒక సందర్బంగా చెప్పినట్లు బీఫ్‌ వ్యాపారంలో తన జైన్‌ స్నేహితులు కూడా వున్నారని చెప్పారు. గొడ్డు మాంసం తినేవారిలో హిందువులే ఎక్కువగా వున్నట్లుగా బీఫ్‌ ఎగుమతులలో పెద్ద వ్యాపారులందరూ హిందువులే వున్నారు.దేశంలోని ఆరు పెద్ద సంస్ధలలో నాలుగు హిందువులే నడుపుతున్నారు. వాటిలో ఒకటి హైదరాబాదు సమీపంలోని మెదక్‌ జిల్లా రుద్రారంలోని ఆల్‌ కబీర్‌. ఇది ముస్లిం పేరు అయినప్పటికీ కంపెనీ హిందువులదే. అరబ్బు దేశాల మార్కెట్‌కోసం ఆ పేరు పెట్టుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ఈనెల రెండవ వారంలో న్యూఢిల్లీలో సమావేశమైన ముస్లిం సంస్ధ ఇత్తెహాద్‌ ఇ మిలాత్‌ ఏర్పాటు చేసిన ఒక సదస్సు మొత్తంగా బీఫ్‌ ఎగుమతులపై నిషేధం విధించాలని కోరింది. గేదె మాంసాన్ని కూడా ఆవు మాంసంగా చిత్రిస్తూ గొడ్డు మాసం పదాన్ని దుర్వినియోగపరుస్తున్నారని అందువలన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కూడా కోరింది. గోరంక్షకుల ముసుగులో దళితులు, ముస్లింలపై దాడులు చేయటాన్ని ఆ సమావేశం ఖండించింది.దీర్ఘకాలం పాటు మౌనం దాల్చిన ప్రధాని నరేంద్రమోడీ గో సంరక్షుల పేరుతో దాడులు చేయటాన్ని ఎట్టకేలకు విమర్శించారని పేర్కొన్నది.