Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

    తగినంత మంది న్యాయమూర్తులను నియమించకపోవటంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌ న్యూఢిల్లీలో జరిగిన ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్య మంత్రుల సమావేశంలో సాక్షాత్తూ ప్రధాని సమక్షంలో తన ఆవేదనను ఆపుకోలేక కంటతడి పెట్టిన విషయం చాలా మందికి గుర్తుండే వుంటుంది. అనూహ్యమైన ఆ పరిణామంతో కంగుతిన్న ప్రధాన మంత్రి న్యాయమూర్తుల నియామకం గురించి చర్యలు తీసుకొనే విషయం ప్రధాన న్యాయమూర్తి, ఇతరులతో మాట్లాడతానని ప్రకటించినట్లు వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అలాంటి ప్రధాని ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటం పట్ల తాను ఆశాభంగం చెందినట్లు అదే ప్రధాన న్యాయమూర్తి ప్రధాన మంత్రిని బహిరంగంగా ప్రశ్నించి మరో సంచలనానికి కారకులయ్యారు. మీడియా దీని గురించి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకంటే వేలు ప్రధాని వైపు చూపుతుంది, అది ఆయనకు ఆగ్రహం తెప్పిస్తుంది కనుక అని వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్రదినోత్సవం రోజున సుప్రీం కోర్టు వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు.

   ‘మీరు బహుళ ప్రజాదరణ పొందిన మరియు జాతీయ వాది ప్రధాన మంత్రి ఒకటిన్నర గంటల పాటు చేసిన ప్రసంగం విన్నారు. మీరు కేంద్ర న్యాయ శాఖ మంత్రి మాట్లాడింది కూడా విన్నారు. వుపన్యాసంలో న్యాయప్రస్తావన చో టు చేసుకుంటుందేమోనని నేను కూడా ఆశించాను. న్యాయమూర్తుల నియామకం గురించి మాట్లాడతారనుకున్నాను. నేను ఈ వేదిక మీద ఒక్కటే చెప్పదలచుకున్నాను. మీరు (వేదికపై వున్న న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ను వుద్ధేశించి) దారిద్య్రాన్ని తొలగించండి, జనానికి వుపాధి కల్పించండి, జాతిని ఐక్యంగా వుంచండి మరియు పెద్ద పధకాలన్నింటినీ రూపొందించండి కానీ మన దేశ ప్రజలకు న్యాయం చేయటం గురించి కూడా ఆలోచనకు చోటివ్వండి.’ అన్నారు. ‘మీరు ఇతరుల మీద పండ్లూ, పూలూ చల్లారు, అదే విధంగా నేను కూడా వాటికోసం ఇక్కడ వేచి చూస్తున్నాను’ అంటూ ఒక వుర్దూ కవితను చదివారు.’ నా వైఖరి ఏమిటో అందరికీ స్పష్టం, కోర్టు వెలుపలా లేదా బయట అయినా నేను నా మనసులో వున్నదానిని మాట్లాడతాను. నేను ఒక వున్నత స్ధాయికి వచ్చాను, సాధించగలిగింది సాధించాను. నేను ఇంతకు మించి వున్నతికి పోయేదేమీ వుండదు. అందువలన నా మనసులో వున్నదాని గురించి నేను మాట్లాడేప్పుడు ఇతరుల గురించి ఆలోచించను, సంకోచించను. నేను ఒక మంచి మాట చెబితే అది ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది, అదే నా బలం. బ్రిటీష్‌ వారి పాలనలో ఒక కేసును ఖరారు చేయటానికి పది సంవత్సరాలు పట్టేది, ఇప్పుడు అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పుడు కేసులు, వివాదాలు ఎక్కువయ్యాయి. ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయి. ఇదంతా మాకు కష్టంగా మారుతోంది అందుకే ఈ సమస్యల గురించి పట్టించుకొమ్మని పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’ అని చెప్పారు.

  సుప్రీం కోర్టులో పతాకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జండా ఎగురవేసేందుకు ప్రయత్నించగా జండా ముడి విడిపోలేదు. తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ మనం కూడా లబ్దిదారులమే,మనల్ని కూడా అడుగుతారు కానీ రవిశంకర్‌ ప్రసాద్‌గారూ ఈ ముడులను తీవ్రంగా పరిగణించండి.నేను పతాకావిష్కరణ చేయబోయినపుడు జరగాల్సిన విధంగా ముడులు విడిపో లేదు, అయినప్పటికీ ఇక్కడున్నవారందరికీ నేను ఒకటి చెప్పాలి. ఆ ముడుల గురించి ఆయన ధృఢంగా వుంటే మేము కూడా అలాగే వుంటాం. ఈ రోజు ఇక్కడ జండా ఎగుర వేయటానికి మేము ఇనుప రాడ్డును తీసి తిరిగి జండాను ఎలా అమార్చామో అంతా మీరు చూశారు’ అని కూడా పరోక్షంగా ప్రభుత్వ తీరును విమర్శించారు.

    ఈ రోజు భారత జనాభా 125 కోట్లు, దాదాపు 40శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన వున్నారు. మీరు గీచిన గీత ప్రకారం గ్రామాలలో రోజుకు రు 26, పట్టణాలలో రు.32లపైన సంపాదించిన వారంతా దారిద్య్రరేఖకు ఎగువున వున్నట్లే. కాబట్టి 70 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా మనం దారిద్య్రాన్ని నిర్మూలించగలమా లేదా అన్నది సవాలుగా వుంది.సుప్రీం కోర్టులో ఒక గుమస్తా వుద్యోగానికి కూడా ఒక పోస్టు గ్య్రాడ్యుయేట్‌ దరఖాస్తు చేస్తాడు. మనం దారిద్య్రం, దోపిడీ నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామో అదే నిజమైన స్వాతంత్య్రం అని ఠాకూర్‌ చెప్పారు.

    గత శుక్రవారం నాడు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్బంగా జస్టిస్‌ ఠాకూర్‌ జడ్జీల నియామకం గురించి ప్రభుత్వంపై అపనమ్మక భావం కలుగుతోందని, ఈ ప్రతిష్టంభన తొలగింపునకు అవసరమైతే కోర్టు జోక్యం చేసుకొనే స్ధితికి తీసుకు వెళ్ల వద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు.’ వ్యవస్ధ స్థంభించేవరకు తీసుకురాకండి, న్యాయమూర్తుల నియామకంలో ఆటంకాలను మేము సహించజాలం, అది కోర్టు పనిని ఆటంకపరుస్తోంది. జవాబుదారీతనాన్ని ఇప్పుడు వేగవంతం చేస్తాం, ఎందుకీ అపనమ్మకం, ఈ ఆటంకం ఇలాగే కొనసాగేట్లయితే న్యాయపరంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కొలీజియం మీకు పంపిన ప్రతి ఫైలు కోసం మేము అడగాల్సి వుంది అని చెప్పారు.

   న్యాయమూర్తుల కొరత కారణంగా దేశంలోని వివిధ కోర్టులలో మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయి. మూడు దశాబ్దాల క్రితమే కనీసం నలభైవేల మంది న్యాయమూర్తులు అవసరమని లా కమిషన్‌ సిఫార్సు చేయగా ప్రస్తుతం 21వేల మంది మాత్రమే వున్నారు. దేశంలోని 24 హైకోర్టులలో 38లక్షలు, సుప్రీం కోర్టులో 60వేల కేసులు పెండింగ్‌లో వున్నాయి. జస్టిస్‌ వివి రావు ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి మాట్లాడుతూ వివిధ కోర్టులలో వున్న 3.128 కోట్ల కేసుల విచారణ పూర్తి కావాలంటే 320 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. గత మూడు దశాబ్దాలలో న్యాయమూర్తుల సంఖ్యదేశంలో ఆరు రెట్లు పెరిగితే కేసులు పన్నెండు రెట్లు పెరిగాయి.రానున్న మూడు దశాబ్దాలలో కేసులు 15 కోట్లకు చేరితే వాటి పరిష్కారానికి 75వేల మంది న్యాయమూర్తుల అవసరం వుంటుందని ఒక అంచనా. ప్రతి పదిలక్షల మంది జనాభాకు 50 మంది న్యాయమూర్తుల అవసరం వుందని 1987లోనే లా కమిషన్‌ సిఫార్సు చేయగా ఆ సమయంలో పది మంది వుండగా ప్రస్తుతం మన దేశంలో 13 మంది వున్నారు. అమెరికాలో 1980 దశకంలోనే 107, బ్రిటన్‌లో 51, కెనడాలో 75 మంది చొప్పున న్యాయమూర్తులున్నారు.

   సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాని ప్రసంగంలో న్యాయమూర్తుల నియామకం గురించి ప్రస్తావన లేకపోవటాన్ని ప్రశ్నించటంతో అనేక మంది స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు వున్నవారి కోసం వెతుకుతున్న కారణంగానే కొలిజియం సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని ఆలశ్యం చేస్తున్నదని విమర్శించారు.

  న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించకుండా తనకు దాసులుగా వుండాలని ప్రధాని కోరుకుంటున్న కారణంగానే నియామకాలు జరపటం లేదని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు.. న్యాయమూర్తులు ప్రధాని ప్రసంగాలపై వ్యాఖ్యలు చేయకూడదని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్‌ నారాయణ్‌ వ్యాఖ్యానించారు. న్యాయం ఎంత త్వరగా అందచేయాలో అని ఆలోచించాల్సిన న్యాయమూర్తులు దానికి బదులు ఎంత త్వరగా న్యాయమూర్తులను నియమిస్తారా అని చూడకూడదని, న్యాయమూర్తుల నియామకంతోనే న్యాయం జరగదని నరేంద్రమోడీని సమర్ధించే మితవాద పత్రిక స్వరాజ్య వ్యాఖ్యాత జగన్నాధన్‌ పేర్కొన్నారు.