Tags

, , , , , ,

Image result for stupid funny comments

ఎం కోటేశ్వరరావు

     మీడియా అంటే జనాలకు నమ్మకం పోతోంది. రాబోయే రోజుల్లో అదింకా వేగం పుంజుకోనుంది. ఎందుకంటే ఎవరి అజెండాను వారు అమలు జరుపుతూ నిజాలను ఏడు నిలువుల లోతున పాతరేస్తున్నారు. కత్తిపీటను కనుగొన్న వారి లక్ష్యం గొంతులు కోయటం కాదు. వంటగదిలో మహిళల పనిని సులభం చేయటానికో, ఇతర అలాంటి వుపయోగం కోసమో వాటిని రూపొందించారు. కానీ కొందరు గొంతులు కోయటానికి వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్‌, దానిలో సామాజిక మాధ్యమంగా పరిగణించబడే ఫేస్‌బుక్‌ వంటి వాటిని కూడా అలాగే దుర్వినియోగం చేస్తున్నారు. తాజా వుదంతం విషయానికి వస్తే కేరళకు చెందిన మళయాల సినీ దర్శకుడు సనల్‌ కుమార్‌ శశిధరన్‌ ఒలింపిక్‌ రజత పతక గ్రహీత పివి సింధుపై చేసిన ఒక వ్యంగ్య వ్యాఖ్యపై చెలరేగిన దుమారం.http://www.opindia.com/  ఈ వెబ్‌సైట్‌లో వచ్చే సమాచారం అంతా కమ్యూనిస్టు, వామపక్ష వ్యతిరేకత, బురద చల్లుడు, బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివార్‌కు అనుకూలమైన రాతలు రాసి జనానికి వడ్డించటం. ఇటీవలి కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేయించిన అనేక వెబ్‌సైట్లలో ఇదొకటి. దీనిలో సనల్‌ కుమార్‌ శశిధరన్‌ వ్యాఖ్యపై వెబ్‌సైట్‌ సిబ్బంది వండి వార్చిన ఒక వంటకానికి Left leaning filmmaker says he will like to spit on PV Sindhu అని పేరు పెట్టారు. దీని అర్ధం ఏమంటే ‘ పివి సింధుపై వుమ్మటాన్ని తాను ఇష్టపడతానని వామపక్ష భావజాలం వున్న సినిమా దర్శకుడు చెబుతున్నాడు ‘. కాళిదాసు కవిత్వానికి తమ వామపక్ష వ్యతిరేక పైత్యం జోడించి మొత్తం వామపక్షంపై తప్పుడు అభిప్రాయం కలిగించటానికి, రాళ్లేయటానికి చేస్తున్న నిరంతర యత్నాలలో ఇదొకటి. ఇంకే ముంది కాషాయ దురద అంటించుకున్నవారు దీన్ని చూసి మరింతగా గోక్కోవటం మొదలు పెట్టి వామపక్ష భావజాలం, వామపక్ష వాదులపై రాళ్లు వేయటం ప్రారంభించారు. ఇలాంటి బాపతుకు వాస్తవం తెలుసుకొనే శ్రద్ధ వుండదు, ఒక వ్యాఖ్య, విమర్శ చేయబోయే ముందు తమకూ ఒక బాధ్యత వుంటుందని భావించరు. వాస్తవం తెలిసిన తరువాత పోనీ దానిని సవరించుకుంటారా అంటే అదీ వుండదు. వారి సాఫ్ట్‌వేర్‌ అలాంటిది.

     సనల్‌ కుమార్‌ శశిధరన్‌ తాను వామపక్ష వాదిని అని చెప్పుకున్నట్లు ఎక్కడా మనకు గూగులమ్మ దేవత వెతుకులాటలో కనిపించదు. అతనొక సినిమా దర్శకుడు మాత్రమే. ఆ పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యపై దుమారం చెలరేగటంతో తట్టుకోలేక తన ముఖపుస్తకం (ఫేస్‌బుక్‌ ఖాతాలో పెద్ద వివరణ ఇచ్చుకున్నాడు. సంఘపరివార్‌ను నిత్యం మోసే జీ న్యూస్‌ కూడా చివరికి దాని పూర్తి పాఠం ప్రచురించి అసలు శశిధరన్‌ ఏమి వ్యాఖ్యానించాడు అంటూ ఒక వార్తను ఇచ్చింది. దాని లింక్‌http://zeenews.india.com/sports/rio-olympics-2016/did-sanal-sasidharan-actually-try-to-humiliate-pv-sindhu-with-spit-remark-heres-the-truth_1921757.html దాని పూర్తి పాఠం ఇలా వుంది.’ మనం చాలా కష్టకాలంలో జీవిస్తున్నాం. వ్యంగ్యాన్ని, హాస్యాన్ని కనీసంగా కూడా అర్ధం చేసుకోలేని జనం మీడియాను ఏలుతున్నారు. సంచలనాత్మక వార్తల కోసం వారు మొహం వాచిపోయి వున్నారు. ఒలింపిక్స్‌లో పివి సింధు విజయాన్ని న్యూనత పరచాలని ఎవరైతే చూస్తున్నారో ఆ నకిలీ మేథావులు నేను చేసిన వ్యాఖ్యను విమర్శించటాన్ని చూడటం భయం కొల్పేదిగా వుంది. కొన్ని జాతీయ మీడియాలు కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవటం, తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పి నాకు వ్యతిరేకంగా వుపయోగిస్తున్నాయి. ఇదంతా కైరాలీ జనం టీవీ ఒక అవాంఛనీయ స్క్రోలింగ్‌ వేయటంతో ప్రారంభం కావటం విచారకరం. దాన్నొక వామపక్ష మీడియా అని పిలుస్తారు. ఇప్పుడు సంచలనాత్మక మీడియా నన్నొక వామపక్ష భావజాల సినిమా దర్శకుడిగా చెబుతూ ఈ వార్తను నాకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నది.నేను చేసిన వ్యాఖ్య ఏమిటో స్పష్టత కలిగి వుండటం, దానికి కట్టుబడి వున్న కారణంగా నా వైఖరిని స్పష్టం చేయాలని నేను అనుకోలేదు. నేనేమి చెప్పానో, దాని అర్ధం ఏమిటో నన్ను అనుసరించే వారికి బాగా అర్ధం అవుతుంది. ఇప్పుడు కొంత మంది స్నేహితులు కూడా నా వ్యాఖ్యలను దుర్వినియోగం చేసిన వారి పాటనే పాడటం విచారకరం.ఇది భయానకమైన పరిస్థితి. వాస్తవంగా నేను ఏం చెప్పానో అర్ధం చేసుకోవటానికి కొన్ని క్షణాలు కూడా ఖర్చు చేయకుండా కేవలం నామీద దాడి చేయటానికి, దుర్వినియోగం చేయటం మాత్రమే కోరుకుంటున్న పిచ్చి గుంపుకు వివరించటం వలన ప్రయోజనం లేదు.నేను ఒకటే విషయం చెప్పదలచుకున్నాను, అదేమిటంటే మన పితృస్వామ్య దేశంలో మొత్తం మహిళా సమాజంలో పోరాడి పతకం సాధించిన మహిళను న్యూనత పరిచే వున్మాదిని కాదు నేను. శతాబ్దాల తరబడి మహిళల అణచివేతతో బాధపడుతున్న ఒక దేశం నుంచి ఆమె పోరాడి ఒలింపిక్స్‌లో గొప్ప విజయం సాధించటం ఒక గొప్ప విషయం.అత్యాచారాలు, అవమానాలకు గురయ్యే యువతుల వేషధారణ గురించి చర్చించటానికి తొలి ప్రాధాన్యత ఇచ్చే దేశం మనది. గర్భంలోనే ఆడశిశువుల ప్రాణాలు తీస్తున్న సిగ్గుమాలిన వుదంతాలు ఇప్పటికీ జరుగుతున్న దేశం మనది. తోటి పౌరులారా నేను ఇలా చెబుతున్నందుకు మీరు నన్ను దేశ ద్రోహి అని పిలవటం ప్రారంభిస్తారని నాకు తెలుసు, నేను దానికి సిద్ధమే, ఎందుకంటే నా దేశభక్తిని ఎవరి ముందూ నిరూపించుకోవటానికి సిద్దంగా లేను. కానీ నేను పివి సింధు గురించి మాట్లాడిన దానిని పూర్తిగా దుర్వినియోగ పరచిన వార్తలను వ్యాపింప చేయవద్దు. ఇది నిరాధారమైన, పూర్తిగా వాస్తవ విరుద్ధమైది.’

   ఈ వివరణ చదివిన తరువాత ఈ దేశంలోని వామపక్షాలు పివి సింధు విజయాన్ని కించపరుస్తాయని మెదడు అరికాల్లో వుంటే తప్ప తలమీద వున్నవారెవరూ అనుకోరు. శశిధరన్‌ రాజకీయ భావాలేమిటి అన్నదికాదు, ఆయన వ్యాఖ్యలను ఆధారం చేసుకొని వామపక్ష భావజాలంపై దాడి చేయటం గర్హనీయం. వామపక్ష సిద్దాంతాలు, రాజకీయాలను విమర్శించదలచుకుంటే అందుకు వేదికలు వున్నాయి, వాటిపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపని చేయవచ్చు. ఇలాంటి సందర్బాలను దాడికి వుపయోగించుకోవటం నీచాతి నీచం.

   కొన్ని సందర్భాలలో అమ్మా అన్నా కూడా బూతుగా చిత్రించే దౌర్భాగ్య స్ధితిలో మనం వున్నామన్నది నగ్నసత్యం. హ్యాస్యం, వ్యంగ్యాన్ని భరించే, సహించగలిగే స్ధితికి, అర్దం చేసుకోగల స్ధాయికి మన సమాజం ఎదగలేదు. అసలు అలాంటి ప్రయోగాలు వున్నవనే విషయమే చాలా మందికి తెలియదు. శశిధరన్‌ చెప్పినట్లు కైరాలీ టీవీ తొలుత ఆయనను తప్పు పట్టింది. దానిని ప్రసారం చేసిన బాధ్యుడికి సైతం ఆ వ్యంగ్యం, హాస్యం తెలిసి వుండకపోవచ్చు. దానిని ఒక వామపక్ష వాది విమర్శగా ప్రసారం చేసే అవకాశమే లేదు. అంతేకాదు శశిధరన్‌ నిజంగా వామపక్ష వాది అయి వుంటే దానిని ప్రసారం చేయబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వుండేవారన్నది గ్రహించాలి. శశిధరన్‌ తన సినిమాలలో మహిళల పట్ల పురోగామి వైఖరిని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. బహుశా ఆ కారణంగా ఆయను వామపక్ష శిబిరంవైపు నెట్టి దాడికి ఆయుధంగా చేసుకున్నారా ? పురోగామి భావాలు వామపక్షాల సొత్తేమీ కాదు, మానవత్వం వున్నవారెవరైనా కలిగి వుంటారు. మొరటోడికి మల్లె పూవు ఇస్తే ఏం జరుగుతుందో తెలిసిందే కదా ! అందువలన శశిధరన్‌ చెప్పినట్లు ఆయన గురించి తెలిసిన స్నేహితులే అపార్ధం చేసుకున్నారు కనుక సమాజం, తోటి వారు అర్ధం చేసుకోగలిగిన వ్యంగ్యం, హాస్యం మాత్రమే వుపయోగించాలని కూడా తెలుసుకోవటం అవసరం.

    ఇక సామాజిక మాధ్యమంలో ఇష్టపడటాలు(లైకులు) పంచుకోవటాలు(షేర్‌) వ్యాఖ్యలు చేయటానికి http://www.opindia.com/ వ్యాఖ్యానం అటూ ఇటూ తిరుగుతున్నది. ఇంకా ఇతర వార్తలున్నాయోమో నా దృష్టికి రాలేదు. ఈ వెబ్‌ సైట్‌ను ఏర్పాటు చేసింది ఒక సంఘపరివార్‌ భక్తుడు. కిరాయి రాతగాడు కూడా అయి వుండాలి.అతగాడి పేరు రాహుల్‌ రాజ్‌. సంఘపరివార్‌ను కాపు కాసే, తాను మితవాద స్వరాన్ని అని కాలర్‌ ఎగరేసి చెప్పుకొనే స్వరాజ్య అనే పత్రికhttp://swarajyamag.com/culture/interview-rahul-raj-co-founder-of-opindia-com సరిగ్గా ఏడాది క్రితం ఇంటర్వూ చేసింది. దానిలో రాహుల్‌ రాజ్‌ చెప్పిన ఒక ఆణిముత్యం ఎలా వుందో చూడండి.’ 2013లో ఢిల్లీలో అన్నా హజారే ఆందోళన జరిగిన సమయంలో దానిలో భాగస్వామిని, ఆమ్‌ ఆద్మీ పార్టీతో వుండాలని నేను అనుకున్నాను.ఆ తరువాత నేను రాజకీయాల గురించి రాయటం ప్రారంభించాను. కానీ కొంత కాలం గడిచాక అరె నేను వుండాల్సింది వారితో కాదని అర్ధం చేసుకున్నాను, అప్పటి నుంచి బిజెపి అనుకూల రాతలు రాయటం ప్రారంభించాను.’ అలాంటి పెద్ద మనిషి సారధ్యంలో నడిచే వెబ్‌ సైట్‌లో వామపక్ష భావజాలంపై రాళ్లు వేయించటం, నాలుగు రాళ్లు సంపాదించుకోవటం అతని వృత్తి. అలాంటి వారి వెబ్‌ సైట్‌ నుంచి వార్తలను చదివి బుర్రను వుపయోగించుకుండా తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిని ఏమనాలి ?