Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

   మన దేశంలో అతివలపై అత్యాచారాలు జరగటానికి పశ్చిమ దేశాల వస్త్రధారణే కారణమని అందువల్లనే పట్టణాలలోనే ఎక్కువగా జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలలో లేవని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ఢిల్లీ నిర్భయ అత్యాచార వుదంతం సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఫాసిస్టు గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకొని సంఘపరివార్‌ నేతలు పనిగట్టుకొని ప్రచారం చేసే అసంఖ్యాక పచ్చి అబద్దాలలో ఇదొకటి. అసలు వెలుగులోకి రాని వుదంతాలే అత్యధికం కాగా పోలీసు రికార్డులకు ఎక్కిన వాటిలో 75శాతం గ్రామీణ ప్రాంతాలలో జరిగినవే అని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన మృణాల్‌ సతీష్‌ అధికారిక లెక్కలను విశ్లేషించి తేల్చారు. మోహన్‌ భగవత్‌ వంటి వారు చెప్పే పాశ్చాత్య వస్త్రధారణకు పెట్టింది పేరు ఫ్రాన్స్‌. అలాంటి దేశంలో ముఖం తప్ప ఒంటి నిండా బురిఖిని వేసుకొని సముద్ర తీరాలకు వచ్చే ముస్లిం మహిళల చేత బలవంతంగా వందలాది మంది ముందు విప్పించిన ఫ్రెంచి పోలీసుల నిర్వాకం తాజాగా చర్చనీయాంశం అయింది.దీని గురించి నిక్కర్‌ వాలాలేమంటారో తెలియదు.

Today’s cartoon.

    ప్రపంచంలో తాలిబాన్లను, తాజాగా రంగంలోకి వచ్చిన ఐఎస్‌ తీవ్రవాదులను పెంచి పోషించటంలో అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రెంచి పాలకుల వాటా ఎక్కువన్నది అందరికీ తెలిసిందే. పాముకు పాలుపోసి పెంచి నంత మాత్రాన కాటు వేసే దాని సహజలక్షణం ఎక్కడికి పోతుంది. వుగ్రవాదం కూడా అలాంటిదే. పెంచి పోషించిన వారిపైనే తిరగబడుతుందని చరిత్రలో అనేక వుదంతాలు నిరూపించాయి. అదే విధంగా ఇప్పుడు ఈ ధనిక దేశాలు కూడా అనుభవిస్తున్నాయి.కొద్ది మంది వుగ్రవాదులను పట్టుకోవటం చేతగాని పాలకులు మొత్తం ముస్లింలందరూ వుగ్రవాదులే అని తప్పుడు ప్రచారం, వ్యతిరేక వున్మాదాన్ని రెచ్చగొట్టటంతో పాటు వుగ్రవాదంపై పోరులో భాగంగా బురిఖీ, బురఖాలపై దాడులకు దిగారు. (ముస్లిం మహిళలు విధిగా బురఖా వేసుకోవాలనే ఛాందస వాదాన్ని నేను బలపరచను, సామాజిక చైతన్యం, వ్యక్తిగత ఇష్టంపై వేషధారణ అధారపడి వుంటుందని, సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో దేనిని బలవంతంగా రుద్ద కూడదు అని భావించేవ్యక్తిని. అలా రుద్దితే ఈ దేశంలోని బ్రాహ్మలెవరూ షర్టూ పాంట్లూ వేసుకోకూడదు, వుద్యోగాలు చేయకూడదు, బిచ్చమెత్తుకొని జీవించాలి.మనువు నిర్ధేశించిన విధంగా మిగతా కులాల వారు కూడా ఇక్ష్వాకుల ముందు కాలం నాటికి పోవాల్సి వుంటుంది. అందువలన అలాంటి వాటికి వ్యతిరేకం అని ముందుగా స్పష్టం చేయదలచుకున్నాను.)

ఇటీవలనే ముగిసిన రియో ఒలింపిక్స్‌లో దుస్తుల నిబంధనలను పక్కప పెట్టి బీచ్‌ వాలీబాల్‌ పోటీలో బురఖాతో పాల్గొన్న ఈజిప్టు క్రీడాకారిణి దోవా ఎలఘోబాషి

    ఫ్రాన్స్‌ విషయానికి వస్తే బురిఖినిలపై నిషేధాన్ని సమర్ధించుకొనేందుకు నానా పాట్లు పడుతోంది. అక్కడి న్యాయవ్యవస్ధ కూడా పాలకవర్గానికి వంతపాడుతోంది. గతవారంలో ఒక బీచ్‌కు తన పిల్లలతో వచ్చిన ఒక ముస్లిం యువతిని ఆకస్మికంగా నలుగురు పోలీసులు చుట్టుముట్టారు. ఇసుకలో కూర్చుని వున్న ఆమెకు ఏం జరుగుతోందో తెలియలేదు.పోలీసులను చూడగానే భయంతో పిల్లలు ఏడవటం మొదలు పెట్టారు. నాలుగు వైపులా పోలీసులు నిల్చోవటంతో ఆమె ఎటూ తప్పుకొనే అవకాశం కూడా లేదు. తాను చేసిన తప్పేమిటో కూడా ఆమెకు తెలియలేదు. పోలీసులు ఎక్కడైనా ఒకటే కనుక లే ముందు బట్టలు విప్పు అన్నారు. నివ్వెర పోయింది, అదే వేసుకున్న బుర్ఖినీ విప్పు అన్నారు. (బికినీ,బుర్కాను కలిపి సముద్ర స్నానాలు చేసే సమయంలో ఒంటిని పూర్తిగా ప్పుతూ ధరించేందుకు రూపొందించిన ఈత వస్త్రం) చుట్టుపక్కల వారు పోలీసుల ఆదేశాలకు హర్షం వెలిబుచ్చుతూ చప్పట్లతో మరింతగా ప్రోత్సహిస్తున్నారు. అవమాన భారంతో బుర్కినీ విప్పటంతో పాటు అది వేసుకున్నందుకు జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. ఐరోపా అంటే స్వేచ్ఛా ప్రపంచం అనుకొనే వారికి దిమ్మదిరిగే వుదంతమిది. సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి తాలిబాన్ల దేశంలో బుర్ఖాలు వేసుకోకపోతే శిక్షిస్తారు, దాన్ని విమర్శించే ఫ్రాన్స్‌లో వేసుకున్నందుకు శిక్షిస్తారు.అంటే రెండు చోట్లా మహిళకు స్వాతంత్య్రం పూజ్యం అన్నమాట. ఒక వేళ నిషేధాన్ని వుల్లంఘిస్తే జరిమానా, హెచ్చరికతో సరిపెట్టవచ్చు, లేదా ఆ ప్రాంతం నుంచి పంపి వేయవచ్చు, అందుకు భిన్నంగా దుస్తులు విప్పించి, జరిమానా వేయటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

    ఫ్రాన్స్‌లో బుర్ఖినీ వేసుకోవటంపై ఇటీవల నిషేధం విధించారు. దానికి చూపుతున్న కారణాలు హాస్యాస్పదంగా వున్నాయి. బలవంతంగా బుర్ఖినీ విప్పించిన వుదంతం నైస్‌ పట్టణంలో జరిగింది.మరో 30 పట్టణాలలో ఇలాంటి నిషేధం విధించారు, దానిని కోర్టులు సమర్ధించాయి.తాజా వుదంతంపై తీవ్ర విమర్శలు చెలరేగటం, హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయటంతో వున్నత న్యాయ స్థానం నిషేధంపై సమీక్ష జరపాలని నిర్ణయించింది. ఫ్రెంచి చట్టాల ప్రకారం మహిళలు ధరించకూడని వాటిలో బుర్ఖినీ లేదు. గౌరవ ప్రదం కాని దుస్తులపై ఫ్రాన్స్‌లో నిషేధాలేమీ లేవు. నిబంధనలు స్పష్టంగా లేకపోవటాన్ని అవకాశంగా తీసుకొని ముస్లిం మహిళలను వేధించేందుకు ఫ్రెంచి పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. బుర్ఖినీ ధరించకపోయినా ఒంటి నిండా దుస్తులు, తలకు స్కార్ఫ్‌ చుట్టుకున్నందుకు పోలీసులు తనను అడ్డుకున్నారని మరో మహిళ తెలిపింది. దేశ ‘లౌకికత్వాన్ని’ కాపాడటంలో భాగంగా ఈ నిషేధం అన్నది ప్రభుత్వం చెప్పిన కారణాలలో ఒకటి. బుర్ఖినీ ధరించటం బానిసత్వానికి చిహ్నమని ప్రధాని మాన్యువల్‌ వాల్స్‌ వర్ణించారు. దేశం ‘సంస్కృతుల యుద్ధం’ (బ్యాటిల్‌ ఆఫ్‌ కల్చర్స్‌)లో చిక్కుకు పోయిందన్నారు.ఐఫోప్‌ అనే సంస్ధ నిర్వహించిన ఒక సర్వేలో 64శాతం మంది నిషేధాన్ని సమర్ధించారు. శరీరాన్ని పూర్తిగా కప్పి వేసే ఈత దుస్తులు ధరించటమంటే తీవ్రవాద ఇస్లామ్‌కు మద్దతు ఇచ్చే రెచ్చగొట్టుడు చర్యగా మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజీ వర్ణించాడు. కొన్ని పట్టణాలు పరిశుభ్రతా కారణంతో నిషేధించినట్లు పేర్కొన్నాయి. కోర్టులకు వివిధ నగరాలు సమర్పించిన సమర్ధింపు వాదనలలో బుర్ఖినీ ఈత దుస్తులు ప్రజా భద్రతకు ముప్పుగా పరిణమించినట్లు పేర్కొన్నాయి. అయితే అందుకు తగిన ఆధారాలను చూపకుండా భయాన్ని, అనుమానాలను వ్యక్తం చేశాయి.పూర్తిగా శరీరాన్ని కప్పే ఈత దుస్తులు ప్రజా భద్రతకు భంగం కలిగించినపుడు క్రైస్తవ సన్యాసినులు, సన్యాసులు పూర్తి శరీరాన్ని కప్పుతూ ధరించే దుస్తులతో ముప్పు రాదా అన్న ప్రశ్నకు సమాధానం లేదు.

    వేషధారణపై ఆంక్షలు, నిషేధాలు ఒక్క ఫ్రాన్స్‌కే పరిమితం కాదు. స్కూళ్లు, కాలేజీలలో, వాహనాలు నడిపేటపుడు ముఖాలకు మేలిముసుగులు ధరించటాన్ని జర్మనీ ప్రభుత్వం నిషేధించింది. కెనడాలో బురఖాల నిషేధం ఎన్నికల ప్రచార సమస్యగా ముందుకు వచ్చింది. లిబరల్‌ పార్టీ గెలవటంతో ఆప్రతిపాదనకు స్వస్తి పలికారు. జర్మనీ, ఫ్రాన్స్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో అక్కడి మితవాద పార్టీలు ముస్లిం,బురఖా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న పూర్వరంగంలో అధికారంలో వున్న పార్టీలు తాము కూడా అలాంటి చర్యలే తీసుకుంటున్నట్లు ఓటర్లను సంతుష్టపరిచేందుకు ఇలాంటి తిరోగామి చర్యలకు పాల్పడుతున్నాయి.