Tags

, , , , ,

కార్టూన్‌ హిందూ పత్రిక సౌజన్యంతో

ప్రధాని కబుర్లు 21వ శతాబ్దానివి, ప్రభుత్వ ఆచరణ వేద కాలానిది

ఎంకెఆర్‌

    పందొమ్మిదవ శతాబ్దపు యంత్రాంగ వ్యవస్ధ ద్వారా మనం 21వ శతాబ్దంలోకి పయనించజాలమని వర్తమాన భారత దార్శనికుడు ప్రధాని నరేంద్రమోడీ నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన ‘మారుతున్న భారత్‌ ‘ వుపన్యాసాల ప్రారంభసభలో చెప్పారు. అందుకు గాను చట్టాలతో పాటు, కాలయాపన పద్దతులను మార్చుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కోరారు. మార్పు విసురుతున్న సవాలును దేశం అధిగమించాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కితే చాలదు, పూర్తి రూపాంతరం చెందాలని కూడా చెప్పారు. దేశం వేగంగా మారాలి, అయితే ఆ అది ప్రభుత్వంలో మార్పు రాకుండా జరగదు, ఆలోచనా ధోరణిలో మార్పు రాకుండా ప్రభుత్వ తీరు మారదు, ఆలోచనా ధోరణిలో మార్పు రావాలంటే పరివర్తన ఆలోచనలు వుండాలని ప్రధాని చెప్పారు. ఇంకా ఇలాంటివే చాలా విషయాలను ప్రధాని తన వుపన్యాసంలో వుద్భోదించారు.

  మోడీ సర్కార్‌పై చేసే విమర్శలన్నీ దేశద్రోహం లేదా జాతి వ్యతిరేకం అని ఆయన భక్తులు ప్రకటించేయకుండా కాస్త నిదానించి వుపన్యాసాలలో ప్రబోధిస్తున్న అంశాలకు అనుగుణంగా ఆయన పాలన నడుస్తున్నదా అన్నది ఆలోచించుకోవాలి. నీతి అయోగ్‌ ఏర్పాటు చేసిన మారుతున్న భారత్‌ వుపన్యాస పరంపరలో తొలి వుపన్యాసం చేసిన సింగపూర్‌ వుప ప్రధాని షణ్ముగం చేసిన వ్యాఖ్యలు వింటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్ధితి.ఆయన చేసిన విమర్శలు గత పాలకుల పుణ్యమే అనటంలో ఎలాంటి సందేహం లేదు, కానీ నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో దానిని మార్చేందుకు చేసిందేమిటి అన్నదే కోటి రూకల లేదా మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అన్నం వుడికిందో లేదో చూడటానికి కుండలోని మెతుకులన్నింటినీ చూడనవసరం లేదు. నరేంద్రమోడీ అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ అమలు ఎంత హాస్యాస్పదంగా మారిందో చూశాము. ఆ పేరుతో వసూలు చేస్తున్న పన్ను ఏమౌతోందో తెలియదు, తొలి రోజుల్లో వీధులూడ్చిన అధికార పార్టీ, వివిధ రంగాల ప్రముఖులు రకరకాల ఫోజులతో తీయించుకున్న ఫొటోలు గోడలకు అలంకార ప్రాయంగా వేలాడటం తప్ప ఎక్కడా కనిపించటం లేదు. సింగపూర్‌ వుప ప్రధాని మాట్లాడుతూ పాఠశాల విద్య విషయంలో తూర్పు ఆసియా-భారత్‌ మధ్య చాలా పెద్ద అంతరం వుందని, నిజానికిదొక సంక్షోభం ఇదేమాత్రం సమర్ధనీయం కాదు, సమస్యను నిర్ధారించ వచ్చు, అయితే నిరంతరం బడ్జెట్లు పెంచుకుంటూ పోవటం ద్వారా కాకుండా మెరుగైన వ్యవస్ధ, సంస్కృతిని మనస్సులలో పట్టేట్లు చేయటం ద్వారా పరిష్కరించవచ్చన్నారు. ఇలాంటి విషయాలలో శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎంతగానో వుపయోగించుకోవచ్చు. మన దౌర్భాగ్యం ఏమంటే ఘనత వహించిన నరేంద్రమోడీగారి పాలనలో రెండు సంవత్సరాలుగా శాస్త్రీయ సలహా మండలి మూత పడిందంటే ఎన్ని కబుర్లు చెబితే మాత్రం వుపయోగం ఏముంది? దేశ ప్రగతి గురించి ఒంటరిగా తన నివాసంలో ప్రధాని ఒక్కరే కలలు కంటే సరిపోదు. మన ప్రధాని మంచి శాస్త్రీయ సలహాదారులను నియమించుకోవాలని ఈ ఏడాది జనవరిలో ప్రముఖ శాస్త్రవేత్త, భారత రత్న సిఎన్‌ఆర్‌ రావు సూచించారు. నరేంద్రమోడీకి ముందు మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వుండగా శాస్త్రీయ సలహా మండలి అధిపతిగా ఆయన పని చేశారు.http://indianexpress.com/article/india/india-news-india/pm-modi-needs-good-scientific-advisers-cnr-rao/ మన జిడిపిలో కనీసం రెండు శాతం మొత్తాలను శాస్త్ర పరిశోధనలకు కేటాయించాలని ప్రధానులు సైన్స్‌ కాంగ్రెస్‌లలో చెప్పటం తప్ప 0.8 లేదా 0.9శాతానికి మించి కేటాయింపులు వుండటం లేదని రావు వేరే సందర్భంగా విమర్శించారు. నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ద్రవ్యోల్బణ రేటుకంటే తక్కువగానే కేటాయింపులను పెంచారు. ఆంటే నిజ విలువలో అంతకు ముందు కేటాయించిన మొత్తాలకంటే తగ్గిపోయాయి.

   పందొమ్మిదవ శతాబ్ది వ్యవస్ధ ద్వారా 21వ శతాబ్దంలోకి పయనించజాలమని మోడీ ఎంతో సముచితంగా చెప్పారు. అన్నీ వేదాల్లోనే వున్నాయష అనే కాలానికి చెందిన భావజాలానికి ప్రధానిగా మోడీ తొలిసారి మద్దతు ఇచ్చారు. ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా గణేషుడికి ఏనుగు తలను అతికించారని, తల్లి గర్బంతో నిమిత్తం లేకుండా కర్ణుడు పుట్టటాన్ని బట్టి వైద్యశాస్త్రం ఆ కాలంలోనే అంతగా అభివృద్ధి చెందినందుకు మనం గర్వపడాలని మోడీ చెప్పారు. అంతకు ముందు ముఖ్యమంత్రిగా వుండగా రాముడు తొలి విమానంలో ప్రయాణించాడని, మనకు పురాతన కాలంలోనే కణ శాస్త్రం తెలుసని స్కూలు పుస్తకాలకు రాసిన ముందుమాటలో రాశారు.

    ముంబైలో జరిగిన సైన్సు కాంగ్రెస్‌లో సంస్కృతంలో పురాతన శాస్త్ర విజ్ఞానం పేరుతో ఒక పూట మహారుషి భరద్వాజ వైమానిక శాస్త్రం గురించి, రైట్‌ సోదరుల కంటే ముందే మన పూర్వీకులు దేశ సరిహద్దులకు, ఖండాంతరాలకు ఎలా విమానాలు నడిపారు అనేదాని గురించి చర్చలు జరిపి కొంత మంది తమ జబ్బలను తామే చరుచుకున్నారు. పూర్వకాలంలో 40 ఇంజన్లున్న ఖండాంతర విమానాలను మన వారు నడిపారని, వేద కాలంలోనే వుపగ్రహాన్ని మన దేశం నుంచి నడిపారని, ఆ సమయంలో అక్కడ వదలి వచ్చిన ఒక హెల్మెట్‌ ఇప్పటికీ అక్కడే వున్నదని, అమెరికాలోని నాసా పరిశోధనలు కూడా దీనిని నిర్ధారించాయని, స్టార్‌ వార్స్‌ మన దేశంలో ఎప్పుడో జరిగాయని, శవాలు నీటిలో రోజుల తరబడి తేలియాడేవని, అవి వుబ్బిన తీరును బట్టి మరణించిన వారికి ఏం జరిగిందో కచ్చితంగా పూర్వీకులు చెప్పగలిగారని, అగస్త్య సంహితలో ఎలక్ట్రిక్‌ బ్యాటరీలను ఎలా తయారు చేసేవారో ప్రస్తావించారని వాటిని వేద బ్యాటరీలుగా పిలిచారని, ఆవు మూత్రంలో కొన్ని గింజలు, వేర్లను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని కాళ్లకు రాసుకొని తిరిగితే భూ గర్బ జలాలు ఎక్కడున్నాయో తెలిసేవని, రూపార్‌కాన రహస్య పేరుతో వున్న పరిజ్ఞానంతో రాడార్‌లు తయారు చేసేవారని, ఆహారాన్ని బంగారంగా మార్చే బాక్టీరియా గురించి తెలుసని, గణేషుడికి ఏనుగు తలను కుట్టటానికి బదులు పంచదార చల్లి అతికించారని ఇలాంటి అంశాలన్నింటినీ సైన్సు పేరుతో ముంబై సమావేశంలో నమ్మింప చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దాని కొనసాగింపుగా ఈ ఏడాది మైసూరులో జరిగిన సైన్సు కాంగ్రెస్‌లో మఢ్య ప్రదేశ్‌లో ప్రయివేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ కమిషన్‌ అధ్యక్షుడు అఖిలేష్‌ కె పాండే కైలాస పర్వతం మీద నుంచి శివుడు తన శక్తితో మానవాళికి స్వచ్ఛమైన నీటిని ఎలా సరఫరా చేస్తున్నారో చెబుతూ ఒక పత్రాన్ని సమర్పించారు. పర్యావరణ పరిరక్షణకు మన పూర్వీకులు ఎంతో కృషి చేశారని, దేవుడు శివుడి కుటుంబ సభ్యులు నెమలి, ఎలుక, ఎద్దులను ఎలా వాహనాలుగా వుపయోగించారో, వాటితో ఎలా సహజీవనం చేశారో నేటి తరాలకు వివరించే పయత్నం చేశారు.

   ఇదే సభలో కాన్పూరుకు చెందిన రాజీవ్‌ శర్మ ఒక పత్రం సమర్పించి శంఖువు వూదటం ద్వారా మానసిక, శారీరక రుగ్మతలను ఎలా నివారించ వచ్చో చూడండని చెప్పారు. ఇలాంటి పత్రాలన్నింటినీ సైన్సు కాంగ్రెస్‌ నిర్వాహకులు చర్చకు ఆమోదించటాన్ని బట్టి యథారాజా తధా అధికారగణ అన్నట్లుగా తయారైందని వేరే చెప్పనవసరం లేదు. సైన్సు కాంగ్రెస్‌ల ప్రహసనాన్ని చూసిన తరువాత నోబెల్‌ బహుమతి గ్రహీత వెంకట్రామన్‌ రామకృష్ణన్‌ మాట్లాడుతూ గతంలో జరిగిన సభలో ఒక రోజు నేను పాల్గొన్నాను, సైన్సు గురించి చాలా తక్కువగా మాట్లాడారు, అదంతా ఒక సర్కస్‌లా వుంది, మరోసారి నేను సైన్సు సభలకు రాను అని చెప్పారంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత సైన్సుకు పట్టిన గతేమిటో సుస్పష్టం. ఈ పూర్వరంగంలో శాస్త్ర పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించటం అనూహ్యం.

     గతంలోనే జ్యోతిష్యాన్ని ఒక కోర్సుగా ప్రవేశపెట్టారు, ఇప్పుడు వేదకాలంలో సైన్సు పేరుతో జనాన్ని నమ్మింప చూసే వారికి పెద్ద పీట వేస్తూ సంస్కృతంలో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ విశ్వవిద్యాలయాలను ముందుకు నడుపుతోంది. సంస్కృత గ్రంధాలు, పురాణాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా చరిత్రను తయారు చేసేందుకు సంఘపరివార్‌ కార్యకర్త యల్లా ప్రగడ సుదర్శనరావు నేతృత్వంలోని భారతీయ చరిత్ర పరిశోధన మండలి నిర్ణయించింది.ఒకవైపు ఇలాంటి తిరోగమన చర్యలకు శ్రీకారం చుట్టి మరోవైపు భవిష్యత్‌ గురించి మాట్లాడటం ఆత్మవంచన, పరవంచన తప్ప మరొకటి కాదు. అన్నీ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో వుంటే ఇతర దేశాలతో సాంకేతిక పరిజ్ఞానం గురించి ఒప్పందాలు చేసుకోవటమెందుకు ? ఆ టెక్నాలజీ వుపయోగించి పెద్ద ఎత్తున మేకిన్‌ ఇండియా కార్యక్రమం కింద తయారు చేసి అలా కనుమూసి ఇలా కనుతెరిచే లోపల పెట్రోలు, పైలెట్లు అవసరం లేని, ఎంత సరకు వేసి మరో టన్నుకు ఖాళీ వుండే వేద విమానాలలో ఖండాంతర దేశాలకు , పట్టణాలకు ఎక్కడకు కావాలంటే అక్కడకు వుచిత రవాణా చేసి మొత్తం ప్రపంచ మార్కెట్‌ను కొల్ల గొట్టకుండా ప్రధాని విదేశాలు తిరిగి పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టండి,ఎగుమతులు చేసుకోండి అని విదేశీయులను దేబిరించటమెందుకు ? ఇలా చేయటం మన ప్రాచీన భారత చరిత్ర, ఘనతకు అవమానమేమో ?