Tags

, , , , , ,

విశ్వసనీయత సమస్య ఎదుర్కొంటున్న పవర్‌ స్టార్‌

ఎంకెఆర్‌

    సినిమా వాళ్లు ఏది చేసినా నాటకీయంగా వుంటుంది.అది లేకపోతే జనానికి కిక్కు వుండదు. ప్రేక్షకులకు కిక్కు ఎక్కితేనే పోనీలెమ్మని సినిమాలు చూసిపెట్టి నాలుగు డబ్బులు నిర్మాతల మొహాన వేస్తారు. సినిమా కధ వూహించని మలుపులు తిరిగి వీక్షకులకు వుత్కంఠ కలగ చేసినట్లుగా ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనే డాక్యుమెంటరీ కూడా ఆసక్తికలిగిస్తోంది. దీనిలో నటులు, పాత్రలు కాకుండా నిజమైన వ్యక్తులే నటిస్తున్నారు గనుక డాక్యుమెంటరీ అనాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకస్మికంగా పవర్‌ స్టార్‌ పవర్‌ కల్యాణ్‌ తిరుపతిలో ఒక సభ జరిపి ఏకపాత్రాభినయంతో ప్రత్యేక హోదా గురించి పోరు ప్రకటన చేశారు. అనేక మందికి ముఖ్యంగా అధికారంలో వున్న తెలుగుదేశం-బిజెపి కూటమికి ఇష్టం లేని మాటలలో ప్రత్యేక హోదా ఒకటి.ఎందుకంటే అది గుర్తుకు వచ్చినపుడల్లా ఆంధ్రప్రదేశ్‌ జనం ఇంకా దాని కోసం ఎదురు చూస్తున్నారేమో అనే చిన్న అనుమానంతో కొద్ది క్షణాలే అయినా వారి మనసంతా వికలం అవుతుంటుంది.

     అన్నట్లు నాటకీయం అంటే తిరుపతి సభకు వారం రోజుల ముందు హైదరాబాదులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి ప్రత్యేకంగా వచ్చి పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఆ సమయంలో వారు మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి సినిమా విడుదల సందర్భంగా పవన్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని కుమారస్వామి చెప్పారు. కానీ అంతకు ముందే రాబోయే ఎన్నికలలో పవన్‌ కల్యాణ్‌ మద్దతును కుమారస్వామి కోరుతున్నట్లు దాని గురించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అటు న్యూఢిల్లీలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక హోదా గురించి తీవ్ర చర్చ, బంద్‌ జరిగిన సమయంలో పవన్‌ కల్యాణ్‌ మౌనంగా వున్నారు. ఈ పూర్వరంగంలో కుమార స్వామితో కలసి మీడియా ముందుకు వచ్చినపుడు పవర్‌ స్టార్‌ ఎంతో ప్రశాంతంగా, స్ధిత ప్రజ్ఞుడి మాదిరి ప్రత్యేక హోదా ఇవ్వను అని ఇంకా కేంద్రం స్పష్టంగా చెప్పలేదు, అయినా ఇది సున్నితమయిన అంశం కనుక ఇపుడే మీ మాట్లాడను తగు సమయంలో స్పందిస్తా అని చెప్పి ఎంతో సంయమనం పాటించారంటూ కొందరు విలేకర్లు వ్యాఖ్యానించారు.మరి అలాంటి వ్యక్తికి వారం రోజుల్లో ఏం మార్పులు కనిపించాయి, అదనంగా వచ్చిన స్పష్టత ఏమిటి, సున్నితాంశం కాస్తా తక్షణాంశంగా దాని స్వభావం ఎలా మార్చుకుంది, అసలు ప్రత్యేక హోదా గురించి రాజకీయ పార్టీలు, జనం కూడా మరిచి పోతున్న తరుణంలో పవన్‌ కల్యాణ్‌కు గుర్తుకు వచ్చి ఎందుకు ఆగ్రహం వచ్చింది అని అనేక మంది పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు. చీకట్లో ఏదైనా చెట్టు తొక్కాడా లేక తెలియకుండా ఎక్కడైనా బోధి వృక్షం కింద కూర్చొని వచ్చారా ? పవన్‌ కల్యాణే స్వయంగా చెబితే తప్ప తెలియదు, అప్పటి వరకు పది మంది నానా రకాలుగా అనుకుంటూనే వుంటారు.

     పుష్కరాల సందర్బంగా తాను స్వయంగా మునిగి జనాన్ని కృష్ణ నీటిలో మునకలు వేయించి ఎంతో పుణ్యం జనం ఖాతాలలో ఎంతో పుణ్యం జమ చేయించిన చంద్రబాబు, ఆయన పరివారం తమకు వచ్చిన ప్రచార కండూతి, ఇతర పుష్కర లాభాల గురించి లెక్కించుకుంటుండగా పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం, బిజెపి పార్టీని కూడా విమర్శించి కాస్త ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజి వస్తుందనీ చెప్పలేరు, రాదనీ చెప్పలేని స్ధితిలో వారు వున్నారు. పవన్‌ కల్యాణ్‌ మాటల్లో చెప్పాలంటే మేడమ్‌ ఎలాగూ లేరు కనుక బిజెపి వారు సార్‌తో భైంటక్‌( సమావేశం) ఏర్పాటు చేయిస్తామని మాత్రమే చెప్పగలరు. వారి దగ్గర అంతకంటే మాటలు లేవు.

   రాజకీయాల్లోకి రావాలని, చక్రం తిప్పాలని, నాలుగు డబ్బులు చేసుకోవాలని అనేక మంది కోరుకుంటున్నపుడు పవన్‌ కల్యాణ్‌ కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎన్‌టి రామారావు జనం కోసం సినిమాలను వదులుకొని ఎంతో త్యాగం చేశానని చెప్పుకున్నారు, కానీ ముందు జాగ్రత్తగా వవన్‌ కల్యాణ్‌ రాజకీయ, సినిమా నటన రెండూ చేస్తానని చెప్పారు. ఎందుకంటే పెద్ద కుటుంబం కదా ! గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రంగంలోకి వచ్చి చివరిదాకా నిలబడినట్లుగా తిరుపతి సభలో ఆ జాబితాలో బిజెపి, తెలుగుదేశం పార్టీలను కూడా జమ చేశారు, ఆ పార్టీలను ఎంత గట్టిగా విమర్శించారు, ఏకి పారేశారు అని కాదు, వాటికి అనుగుణంగా కట్టుబడి వుంటారా లేదా ఆ డైలాగులను పెట్టుబడిగా పెట్టి లబ్ది పొందుతారా అన్నదే సమస్య. రాజకీయాలలో విస్వసనీయతను ఏడు నిలువుల లోతున పాతరేసిన పార్టీలలో బిజెపి, తెలుగుదేశం తక్కువేమీ తినలేదు. వాటినేమీ పట్టించుకోకుండా, తెలిసినా తెలియనట్లు గా గత ఎన్నికలలో వాటి కొమ్ముకాశారు. ఎందుకైనా మంచిది అన్నట్లు స్వంతంగా జనసేన అనే స్వంత పార్టీని ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో కొన్ని డైలాగులు తప్ప ఇంతవరకు తెలుగుదేశం, బిజెపిలను విమర్శించలేదు. అవి చెప్పిన మాటలను ఇంతకాలం గాఢంగా నమ్మటానికి దారితీసిన పరిస్థితులేమిటి ? ఇప్పుడు జ్ఞానోదయం కావటానికి కారణాలేమిటి అన్నది జనానికి సూటిగా చెప్పాలి. అప్పుడే తాను ప్రారంభిస్తానంటున్న ప్రత్యేక హోదా ఆందోళన వెనుక జనం చేరే అవకాశం వుంటుంది. గత ఎన్నికల నాటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటంటే విస్వసనీయతలేని రాజకీయ నాయకుల సరసన పవన్‌ కల్యాణ్‌ కూడా చోటు సంపాదించుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా పాకేజి కుదుర్చుకున్నారని విమర్శలు ఎదుర్కొన్న పవన్‌ కల్యాణ్‌ మరోసారి అలాంటిదానికి పూనుకోరన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న వుండనే వుంది.

    రాజకీయాలలో ముందురోజు పొద్దు పోయే వరకు ఎదుటి పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన వారు తెల్లవారే సరికి అదే పార్టీలోకి ఫిరాయిస్తున్నారు, అంతకు ముందు వరకు తాను వున్న పార్టీని అంతకంటే ఎక్కువగా వుతికి పారేస్తున్నారు. ఏమిటీ ఈ విపరీతం అంటే ఈ రోజుల్లో మీకు తెలియందేముంది మాకు ఇష్టం వున్నా లేకపోయినా అధినాయత్వ చెప్పినట్లు చేయాలి కదా అని ఎలాంటి సిగ్గు ఎగ్గూ లేకుండా సమర్ధించుకుంటున్నారు. ఇటువంటి స్ధితిలో గత ఎన్నికల తరువాత ఏడాదికి ఒకసారి వచ్చే సైబీరియా పక్షుల మాదిరి ఇలా వచ్చి అలా ఒక ప్రకటన చేసి పోతున్నారని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ సారి కూడా అలాగే చేస్తారా అని అనుమానిస్తున్నవారు లేకపోలేదు. ఆర్ధికంగా ఇబ్బందులలో వున్న పవన్‌ కల్యాణ్‌ ఈమధ్య తాను ఎంతో అభిమానించే ఒక వాహనాన్ని కూడా అమ్ముకున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి.అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఒక పార్టీని స్ధాపించటం అంటే వందల కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చిన సొమ్మయినా వుండాలి లేదా ఎన్నికలలో అభ్యర్ధిగా నిలబెడతానని చెప్పి సీట్లు అమ్ముకొని అయినా ఆమేరకు పోగెయ్యాలి. పవన్‌ కల్యాణ్‌ దగ్గర అంత సొమ్ము వుందని ఎవరూ అనుకోరు, పోనీ సీట్లు అమ్ముకోవటానికి ఇంతవరకు పార్టీ లేదు, కార్యకలాపాలు లేవు, అన్నింటికీ మించి అప్పుడే ఎన్నికలు లేవు, అధికారానికి వస్తారనే వాతావరణమూ లేదు. బద్దశత్రువులు అనుకుంటున్నవారే జనం కోసం అనే పేరుతో చేతులు కలిపిన విపరీత పోకడల మన కళ్ల ముందే వున్నాయి. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే తెలుగుదేశం అధికారానికి వస్తే, అధికారానికి వచ్చిన తరువాత జనతా పార్టీ ఏర్పడిన చరిత్రా మన దేశంలో వుంది. అందువలన జనం తలచుకుంటే ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. సినిమాలు మారినపుడు డైలాగులు కూడా మారతాయి, ఒక నటుడు ఒకే డైలాగులతో రెండు సినిమాలలో నటిస్తే జనం చూడరని తెలిసిందే. అందువలన బిజెపి, తెలుగుదేశం పార్టీలను విమర్శించినప్పటికీ రాజకీయ చాణక్యంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ను ఆకస్మికంగా వారే ప్రయోగించారన్న ప్రచారాలు వున్నాయి.

   ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు కల్పిస్తే ఏ ఏ రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయో వెంకయ్య నాయుడు వంటి వారు వారికి పదే పదే గుర్తు చేస్తారు. ఏపికి కల్పిస్తే మోడీని మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయని మరో మంత్రి చెబుతారు.తాను 21 సార్లు ప్రధానిని కలిశానని, 31 సార్లు కలిశానని మరోసారి అవసరమైతే ఇంకా ఎన్నిసార్లయినా కలుస్తానని, వత్తిడి పెంచుతానని చంద్రబాబు చెబుతూనే వుంటారు. పాకేజీల ప్రహసనమూ తెలిసిందే. బీహార్‌ ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ వేల కోట్ల రూపాయల పాకేజీ ప్రకటించారు. దానిని అమలు జరిపిందీ లేనిదీ తెలియదు.టీ కప్పులో తుఫాను మాదిరి కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లుపై చర్చ తరువాత దానిని శీతల గిడ్డంగిలో పెట్టారు. ఒక రోజు బంద్‌ చేసి జనం కూడా తరువాత మౌనంగా వున్నారు. దీనికి విశ్లేషకులు కొందరు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి ప్రత్యేక హోదా వస్తే పెద్దగా ఒరిగేదేమీ వుండదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా చెప్పారు. దాని కంటే భారీ పాకేజ్‌ మెరుగు అని వారితో పాటు వారికి నిత్యం సలహాలు చెప్పే జిగిని లేదా జిగురు జర్నలిస్టులు కూడా సందర్భం వచ్చినపుడు జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

    జనంలో ఇంకా ఏదో మూలన ప్రత్యేక హోదా గురించి మోజు వుందని, దాన్ని తాము తీర్చని కారణంగా ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్‌ వుపయోగించుకుంటాయామో, దాన్ని అడ్డుకోవాలంటే రాణీగారి అధికారపక్షం మాదిరి రాణీగారి ప్రతిపక్షాన్ని కూడా తామే ఏర్పాటు చేసుకోవాలనే ఎత్తుగడలో భాగంగా తెలుగుదేశం స్క్రిప్టు రాసి, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందన్నది ప్రచారంలో వున్న ఒక విశ్లేషణ. అయితే తెలుగుదేశం వారు కొందరు పవన్‌ కల్యాణ్‌ విమర్శలపై ఘాటుగా ఎందుకు స్పందిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒక బాణాన్ని వదిలిన తరువాత అది తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందో లేదో తెలియదు. కనుక ఒక జేబులో అనుకూల మరో జేబులో ప్రతికూల ప్రకటనలు, వివిధ పార్టీల జండాలు బొడ్డు చుట్టూ కట్టుకొని తిరుగుతూ ఏది వాటంగా వుంటే దాన్ని బయటకు తీసే రోజులివి. అందువలన కొందరు నేతలు పవన్‌ ప్రకటనను ఆహ్వానిస్తే ఎంతైనా వ్యాపార వేత్త గనుక దేనికి మార్కెట్‌లో డిమాండ్‌ వుంటుందో తెలిసిన వ్యక్తి కనుక టిజి వెంకటేష్‌ వంటి వారు కాస్త మసాలా దట్టించి డైలాగులు వదులుతున్నారు. గడ్డం పెంచి గడ్డం గీసుకున్నంత సులభం కాదు రాజకీయాలంటే అన్న గడ్డం భాష ఒకటి. దానికి కొద్ది నెలల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎంత ఖర్చు చేసిందీ బహుశా గుర్తుకు వచ్చి వుంటుంది.

     తెలుగుదేశం అనే మర్రి చెట్టు నీడలో తాము ఎదగటం కష్టమనే విషయం బిజెపి నాయకత్వంలో మొదలైందని, తగినంత మెజారిటీ రాదనే కారణంతో ఎన్నికలకు ముందు కలసి నప్పటికీ ఇప్పుడు స్వంతంగా ఎదగాల్సిన అవసరం ఏర్పడిందన్నది ఆ పార్టీలో బహిరంగ చర్చ. అయితే ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ మాదిరే బిజెపి కూడా మోసం చేసిందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కారణంగా గతంలో వున్న మోజు చాలా మందికి తీరింది. తాము నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేనందున పవన్‌ కల్యాణ్‌ అనే బాణాన్ని బిజెపి వారే ప్రయోగించారన్న అభిప్రాయమూ వుంది. దీని వలన తెలుగుదేశాన్ని దెబ్బతీయటం, వైసిపి, కాంగ్రెస్‌లకు నోరు లేకుండా చేయవచ్చన్న ఎత్తుగడవుంది.రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఏదో విధంగా ప్రత్యేక హోదా సమస్యను సాగదీసి చంద్రబాబు వలన దాన్ని సాధించటం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని కలగచేయటం ద్వారా తెలుగుదేశాన్ని దెబ్బతీయటం ఒకటి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వుత్తుత్తి పాకేజ్‌లు ప్రకటించి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన విధంగా అజాగళ స్ధనం మాదిరి పేరుకు ఏదో ఒక హోదా ప్రకటన చేసి దాన్ని పవన్‌ కల్యాణ్‌ ఖాతాలో వేసి ఇచ్చింది బిజెపి, తెచ్చింది జనసేన అనే పేరుతో మిగతావారిని పక్కకు పెట్టి తాము రాజకీయ లబ్ది పొందటంగా బిజెపి ఎత్తుగడ వుందన్నది ఒక అభిప్రాయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ సంస్ధలను ఏర్పాటు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అందెవేసిన చేయి. వాటిలో తమ అదుపులో వుండేవారిని ప్రవేశపెట్టి అవసరమైన సందర్భాలలో వుపయోగించుకుంటుంది. తిరుపతి సభలో విమర్శలు చేసినప్పటికీ బిజెపి, తెలుగుదేశం పార్టీలపై గతంలో కాంగ్రెస్‌ మాదిరి విరుచుకుపడలేదు. ఒకవేళ రానున్న రోజుల్లో విరుచుకుపడినా అది లాలూచీ కుస్తీ మాత్రమే అనే అభిప్రాయమూ వుంది. పవన్‌ కల్యాణ్‌కు కుల తత్వం వుందా లేదా అన్నది సమస్య కాదు, ఆయన చేసుకున్న వివాహాలను బట్టి కులతత్వాన్ని అంటకట్టలేరు. కానీ ఆయన వెనుక చేరుతున్న వారిలో కులశక్తులు వున్న వాస్తవాన్ని మాత్రం కాదనలేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాలలో కులం ప్రాధాన్యం వహిస్తున్న కారణంగా అలాంటి విమర్శలు లేదా ఆరోపణలు రావటం సహజం. అధికారం కోసం కులాలు, మతాలను, మూఢనమ్మకాలను పూర్తి స్ధాయిలో వుపయోగించుకుంటున్న రోజులివి.అందువల్లనే అది ఏ రాజకీయ పార్టీ లేదా నేత అయినా ఇప్పుడు విస్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ అందుకు మినహాయింపు కాదు.

    నేను సింహం లాంటోడ్ని అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అదే తేడా మిగతావన్నీ సేమ్‌ సేమ్‌టు సేమ్‌ అన్న డైలాగ్‌తో జనాన్ని ఆకట్టుకున్న పవన్‌ కల్యాణ్‌ తన విశ్వసనీయతను రుజువు చేసుకుంటారా లేక సేమ్‌ టు సేమ్‌ అన్నట్లు మిగతా రాజకీయ నేతల మాదిరి తానూ ఒకటే అని నిర్ధారిస్తారా ?ఎటు సాగదీస్తే అటు సాగే మాదిరి గబ్బర్‌ సింగ్‌ కాదు రబ్బరు సింగ్‌ అన్న విమర్శను నిజం చేస్తారా ?