Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ అనుభవం నుంచి తీసుకోవాల్సిన గుణ పాఠాలు ఏమిటి ?

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం

నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

     అన్న శ్రీశ్రీ ఇప్పుడు బతికి వుంటే ప్రజాస్వామ్య కుట్ర గురించి చక్కటి కవిత అందించి వుండేవారు. వీరేశలింగం బ్రతికి వుంటే తాను రాసిన ప్రహసనాలకు ప్రజాస్వామ్యం గురించి కూడా రాసి జత చేసి వుండే వారు. లోకంలో దయామయుడైన భూస్వామి, మంచి పెట్టుబడిదారుడు, లోక కల్యాణం కోరుకొనే సామ్రాజ్యవాదీ వుండరు. ప్రజాస్వామ్యం కూడా నేతి బీరలో నెయ్యి వంటిదేనని ప్రతి తరానికి దానిని ప్రహసప్రాయంగా మార్చేవారు తెలియ చేస్తున్నారు. ఇప్పుడు బ్రెజిల్‌లో అదే జరిగింది, దోపిడీ శక్తులకు ఏ మాత్రం ప్రతిఘటన లేదా ప్రత్యామ్నాయాన్ని చూపినా వారు సహించరని స్పష్టం చేస్తూనే వున్నారు. పూలు, రంగుల పూసలు, నూలు దారాల స్థానంలో సింథటిక్‌ దారమో మరొకటో తప్ప దండ కూర్పులో ఎలాంటి మార్పు లేదు. మోటుగా వుండేవి, నాజూకుగా మారుతున్నాయి అంతే తేడా, పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు సేమ్‌ సేమ్‌ టు సేమ్‌. మేక పిల్లను తిన దలచుచున్న తోడేలు కథ మాదిరి సామ్రాజ్యవాదుల చర్యలు వున్నాయి. అందువలన వారి చర్యల చట్టబద్దత, న్యాయ సూత్రాల గురించి తర్కించటం వృధా ప్రయాస.

    ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన బ్రెజిల్‌ వామపక్ష అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ ప్రజాస్వామ్య బద్దంగా పని చేయకపోవటమనే ఒక నేరాన్ని ఆపాదించి అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించారు. ప్రపంచంలో, లాటిన్‌ అమెరికా పరిణామాలలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది.మిలిటరీ కుట్ర, మరొక కుట్ర గురించి చరిత్రలో వుందిగానీ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య, మీడియా కుట్ర ‘ తోడు కావటం ఈ పరిణామంలో గమనించాల్సిన అంశం. అధ్యక్షురాలిపై ఎలాంటి అవినీతి, అక్రమాల కేసులు లేవు. అయినప్పటికీ అక్కడి మీడియా ఆమెను అవినీతిపరురాలిగా చిత్రించి జనాన్ని నమ్మేట్లు చేసింది. అభిమానించిన జనమే అనుమానించేట్లు చేయటాన్ని చూసి శకుని సైతం సిగ్గు పడేట్లు, తనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని తలపట్టుకునేట్లు చేసింది. ఎన్నికలను తొత్తడాన్ని చూశాము, ఎన్నికైన ప్రభుత్వాలను ఎంత సులభంగా కూలదోయవచ్చో చూస్తున్నాము. బ్రెజిల్‌ అధ్యక్షురాలిపై బాధ్యతా నిర్వహణలో వైఫల్యమనే నేరాన్ని ఆరోపించి పదవి నుంచి తొలగించటం ప్రజాస్వామ్యం, ప్రజాతీర్పును పరిహసించటమే. పార్లమెంట్‌ అనుమతి లేకుండా దిల్మా రౌసెఫ్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాలలో అలా ఖర్చు చేయటం తరువాత పార్లమెంట్‌ ఆమోదం పొందటం అన్నది అన్ని చోట్లా జరిగినట్లే అక్కడా జరిగింది. అటువంటి పద్దతులను నివారించాలంటే అవసరమైన నిబంధనలను సవరించుకోవచ్చు, రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. అసలు లక్ష్యం వామపక్ష అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించటం కనుక ఏదో ఒక సాకుతో ఆపని చేశారు. దొంగే దొంగ అని అరచి నట్లుగా అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్నవారే అధ్యక్షురాలిపై కుట్ర చేసి పార్లమెంట్‌, కోర్టులను వుపయోగించుకొని పదవి నుంచి తొలగించారు.ఈ క్రమం ప్రారంభమైనపుడే అనేక మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిశంసనకు ఎలాంటి ఆధారమూ లేదని ప్రకటించారు. అయినా జరిగిపోయింది.

   లాటిన్‌ అమెరికాలో తన అజెండాను అమలు జరిపేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి వేసేందుకు సైనిక నియంతలను గద్దెపై కూర్చుండబెట్టింది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ద్వారా రూపొందించిన నయా వుదారవాద విధానాలకు ఆ ప్రాంతాన్ని ప్రయోగశాలగా వుపయోగించింది. అది వికటించి సైనిక నియంతలు, అమెరికా తొత్తు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వుద్యమించారు. దాంతో నియంతల స్ధానంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిపేందుకు అనివార్యంగా పాలకవర్గాలు దిగిరావాల్సి వచ్చింది. నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరులో పురోగామి వైఖరులు కలిగిన క్రైస్తవ మతాధికారులతో సహా అనేక శక్తులు ఏకం కావటం, ఎన్నికలలో నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరు సల్పిన శక్తులకు జనం పట్టం కట్టటంతో అనేక దేశాలలో వామపక్ష శక్తులు అధికారానికి వచ్చి ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపాయి. వాటికి ఎన్నిపరిమితులు వున్నప్పటికీ నయా వుదారవాద విధానాలతో సర్వం కోల్పోయిన జనానికి తక్షణ వుపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో సామాన్యజనం వాటికి మద్దతుగా నిలిచినందున బ్రెజిల్‌, వెనెజులా,బొలీవియా వంటి చోట్ల గతదశాబ్దన్నర కాలంలో జరిగిన ఎన్నికలన్నింటిలోనూ వామపక్ష శక్తులు విజయం సాధిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో సామ్రాజ్యవాదులు ఆ ప్రాంత దేశాలలో సరికొత్త కుట్రలకు తెరతీశారు. దానిలో భాగమే బ్రెజిల్‌ పరిణామాలు. దీని గురించి ఇంకా లోతుగా పరిశీలించాల్సి వుంది. అ క్రమంలో పలువురు విశ్లేషకులు తమ వైఖరుల నుంచి వెలిబుచ్చిన కొన్ని అంశాల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రయత్నించవచ్చు.

    సామ్రాజ్యవాదులు, వారి కనుసన్నలలో పని చేసే మీడియా స్వభావం గురించి తెలిసిన వారికి మీడియా నిరంతర కుట్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొద్ది మంది మేథావులు, పరిశీలకులు మాత్రమే వాటిని అర్ధం చేసుకుంటే చాలదు. సామాన్యుల వరకు తీసుకుపోవాల్సి వుంది.సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా మీడియా,చర్చి ఎలా పని చేసిందీ చూశాము, ఆ వ్యవస్ధలు దశాబ్దాల తరబడి కొనసాగి కూల్చివేతకు గురైన పూర్వరంగంలో లాటిన్‌ అమెరికా పరిణామాలను కూడా చూడాల్సి వుంది. సోషలిస్టు వ్యవస్ధలను కుట్రతో కూల్చివేయటం ఒకటైతే అందుకు అవకాశం ఇచ్చిన ఆ వ్యవస్ధలను నడిపిన కమ్యూనిస్టుపార్టీల లోపం కూడా అందుకు అవకాశం ఇచ్చిందన్నది వాస్తవం. ఇప్పుడు లాటిన్‌ అమెరికాలో కూడా అధికారానికి వచ్చిన వామపక్ష శక్తులు అదే పొరపాటు చేశాయా ?

    సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన తరువాతే లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారానికి రావటంతో కాడి పారేసిన అనేక మంది వామపక్ష కార్యకర్తలకు తిరిగి వూతం వచ్చింది. తమ కళ్ల ముందు సోషలిస్టు వ్యవస్థలను దెబ్బతీసిన శక్తులు తమను సహిస్తాయనే భ్రమలకు లోనయ్యాయా అన్నది కూడా పరిశీలించాల్సిన అంశమే. దోపిడీ శక్తులు నిరంతర కుట్రలు చేసి తమ వ్యతిరేకులను దెబ్బతీస్తారన్నది బహిరంగ రహస్యమైనప్పటికీ లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు దానిని పట్టించుకోలేదా ? జనాన్ని చైతన్య పరచలేదా ? వారేమైనా పొరపాట్లు చేశారా అన్నది ఆలోచించాల్సిన అంశమే. ఈ సందర్భంగా నిర్ధారణలకు రాకుండా కొన్ని పరిణామాలు, ధోరణులను చర్చ, పరిశీలనకు వీలుగా ఈ వ్యాసంలో అందించటం జరుగుతున్నది.పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం వున్న వారికి ‘పార్లమెంటరీ కుట్ర’ అన్న పదమే వింతగా అనిపించవచ్చు. నమ్మక పోవచ్చు కూడా, కానీ ఇది నిజం. బ్రెజిల్‌లో అదెలా జరిగిందో చూడబోయే ముందు హొండూరాస్‌, పరాగ్వేలో ఆ ప్రహసనం ఎలా జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకోవటం అవసరం.

హొండురాస్‌ అధ్యక్షుడిని పక్కదేశం కోస్టారికాలో పడేశారు

     హొండూరాస్‌లో జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ దేశాధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యాడు. మితవాద వేదిక నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొని లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. మితవాద కూటమి నుంచి వామపక్ష వైఖరి తీసుకోవటం హొండురాస్‌ మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. విదేశాంగ విధానంతో పాటు అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. ఇంతకంటే ప్రజాస్వామిక ప్రతిపాదన మరొకటి వుండదు. కానీ జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుంటే అధ్యక్షుడు రాజ్యాంగాన్ని సవరించటానికి వీలుంది. రెండవది అధ్యక్షపదవికి ఎన్నిక జరిపే సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించటానికి జనం ఆమోదం కోసం ఓటింగ్‌ జరపాలని పెట్టినందున ఆ ఎన్నికలో ఓడిపోతే ఇంటికి పోవాలి, గెలిస్తే కొనసాగవచ్చు, రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగే సమస్యే అక్కడ తలెత్తలేదు.

     రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి అ ధిక్కరించటంతో జెలయా అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత జెలయా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు.

Image result for parliamentary coup in paraguay

పరాగ్వేలో పేదల పక్షాన పనిచేయటమే తప్పిదమైంది

      రోమన్‌ కాథలిక్‌ బిషప్‌గా పని చేసిన ఫెర్నాండో అరిమిందో ల్యూగో మెండెజ్‌ పరాగ్వే అధ్యక్షుడిగా 2008-12 సంవత్సరాలలో పని చేశారు. చిన్నతనంలో రోడ్లపై తినుబండారాలను విక్రయించిన ల్యూగో కుటుంబానికి నియంతలను ఎదిరించిన చరిత్ర వుంది. ఆయన తండ్రిని ఇరవై సార్లు జైలులో పెట్టారు. దాంతో ల్యూగో సాధారణ విద్యనభ్యసించి ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్‌గా పని చేశారు. ఆ సందర్భంగా వచ్చిన అనుభవంతో ఆయన క్రైస్తవ ఫాదర్‌గా మారారు. ల్యూగోను ఈక్వెడార్‌లో పనిచేయటానికి పంపారు. అక్కడ పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పేదల విముక్తి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. అది గమనించిన పరాగ్వే పోలీసులు 1982లో స్వదేశానికి తిరిగి వచ్చిన ల్యూగోను దేశం నుంచి వెలుపలికి పంపి వేయాలని చర్చి అధికారులపై వత్తిడి తెచ్చారు. దాంతో ఐదు సంవత్సరాల పాటు రోమ్‌లో చదువుకోసం పంపారు. 1994లో బిషప్‌గా బాధ్మతలు స్వీకరించారు. ఎన్నికలలో పోటీ చేయటానికి వీలుగా తనను మతాధికారి బాధ్యతల నుంచి విడుదల చేసి కొంత కాలం సెలవు ఇవ్వాలని 2005లో కోరారు. చర్చి నిరాకరించింది. తరువాత పోటీ చేసి గెలిచిన తరువాత సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ఆయన భూ పోరాటాలను బలపరిచారు. అప్పటికే పేదల బిషప్పుగా పేరు తెచ్చుకున్న ల్యూగోను అంతం చేస్తామని బెదిరించినప్పటికీ లొంగలేదు. ఆయన తండ్రి నిరంకుశ పాలకులను ఎదిరించి 20 సార్లు జైలుకు వెళ్లటాన్ని ఆయన చూసి వున్నాడు. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.తాను వేతనం తీసుకోనని ప్రకటించాడు.తొలిసారిగా గిరిజన తెగల నుంచి ఒకరిని వారి వ్యవహారాల మంత్రిగా నియమించారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మాదిరి అవినీతి నిరోధం, భూ సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టారు.

    పేదలకు మద్దతు ఇచ్చి భూసంస్కరణలకు పూనుకున్న ల్యూగోను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరిగింది. దానిలో భాగంగా భూ ఆక్రమణ చేసిన పేదలను తొలగించేందుకు పోలీసులు కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్నారు.ఈ వుదంతం దేశంలో అభద్రతకు చిహ్నం అని ప్రచారం ప్రారంభించిన పార్లమెంట్‌ సభ్యులు ప్రజలకు భద్రత కల్పించాలంటే దేశాధ్యక్షుడిని తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. వారం రోజుల్లో పార్లమెంట్‌ వుభయ సభల్లో తీర్మానాలు చేసి తొలగించారు. వున్నత న్యాయ స్ధానం కూడా దానిని సమర్ధించింది.

   పరాగ్వే, హొండూరాస్‌లలో జరిగిన కుట్రలను ఎదుర్కోవటంలో వైఫల్యం, వామపక్ష శక్తుల బలహీనతలను గమనించిన సామ్రాజ్యవాదులు, మితవాద శక్తులు లాటిన్‌ అమెరికాలో పెద్దదైన బ్రెజిల్‌లో తమ కుట్రను జయప్రదంగా అమలు జరిపారు. చైనా, రష్యా, భారత్‌, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ ఆర్ధిక కూటమిని ఏర్పాటు చేయటంలో బ్రెజిల్‌ ప్రధాన పాత్ర వహించటం కూడా ఈ కుట్రకు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

     మూడు దేశాలలో జరిగిన పరిణామాల వెనుక అమెరికా,అంతర్జాతీయ కార్పొరేట్ల హస్తం వుంది. గతంలో మితవాద శక్తుల మధ్య వైరుధ్యాల కారణంగా చీలి వుండేవారు. ఇప్పుడు తమ వునికికే ముప్పు రావటంతో అన్ని రకాల మితవాదులు ఒకేతాటిపైకి వచ్చి వామపక్షాలను అధికారం నుంచి తొలగించటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి చట్ట సభలనే వేదికలుగా చేసుకున్నారు. ఇలాంటి కుట్రలను ఎక్కడైనా అమలు జరిపే అవకాశం వుంది. లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు ఈ కుట్రల గురించి తెలిసి వుండీ వాటిని ఎదుర్కోవటంలో ఎందుకు విఫలమయ్యాయన్నదే సమస్య. లాటిన్‌ అమెరికాలో అధికారంలోకి వచ్చిన వామపక్ష శక్తులందరూ క్యూబా మాదిరి కమ్యూనిస్టులు కాదు. వారందరి మధ్య అన్ని విషయాలలోనూ ఏకీభావం వున్నవారు కాదు. పార్టీల నిర్మాణం కూడా కమ్యూనిస్టు లేదా సంఘటిత పద్దతులలో జరగలేదు.కుట్రలను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్దత లేదు. బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ తీరుతెన్నులను ఒక్కసారి చూద్దాం. బ్రెజిల్‌తో సహా వామపక్ష శక్తులు గెలిచిన మెజారిటీ దేశాల పార్లమెంట్లలో మితవాద పార్టీలు లేదా వామపక్షాలను వ్యతిరేకించే శక్తులు మెజారిటీ కలిగి వుండటం ఈ కుట్రలు అమలు జరగటానికి అనువైన అవకాశాలు కల్పించింది. దీనితో పాటు వర్కర్స్‌పార్టీ చేసిన తప్పిదాలు కూడా మితవాద శక్తులు, మీడియాకు అవకాశాలనిచ్చాయి.

     పదమూడు సంవత్సరాల వర్కర్స్‌ పార్టీ (పిటి) పాలనలో 30శాతం మంది జనాన్ని దారిద్య్ర రేఖ దిగువ నుంచి వెలుపలికి తెచ్చింది. నలభైశాతం మందిని మధ్య తరగతి స్దాయికి పెంచింది. ఇది మామూలు విషయం కాదు, అయినా జనం ఎందుకు మితవాద శక్తులకు వ్యతిరేకంగా ఎందుకు వీధులలోకి రావటం లేదు ? కుట్రలను గ్రహించలేకపోయారా లేక మీడియా, మితవాద శక్తుల ప్రచారాన్ని నమ్మి ఇతర పార్టీలు మెరుగైన పాలనను అందిస్తాయని ఆశపడుతున్నారా ? అవినీతి వ్యతిరేక పోరాట ఛాంపియన్‌గా ఒక నాడు జనం ముందున్న పార్టీ నేడు అవినీతికి నిలయమైందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. స్వతంత్ర కార్మిక సంఘాలు, విముక్తి సిద్ధాంతంతో స్పూర్తి పొందిన పురోగామి కాధలిక్‌ క్రైస్తవమతాధికారులు, నూతన వామపక్షం పేరుతో ముందుకు వచ్చిన యువతరం, భూమిలేని పేదల వుద్యమం కలయిక వర్కర్స్‌ పార్టీ విజయానికి బాటలు వేసింది. కమ్యూనిస్టు పార్టీ మాదిరి ఒకే కార్యక్రమం, ఆలోచనా ధోరణి కాకుండా బడా పెట్టుబడిదారులు కాకుండా భిన్న వైఖరులు కలిగిన, భిన్న తరగతుల వారి వేదికగా పిటి వుంది. సావోపోలో ఫోరం పేరుతో విడుదల చేసి ప్రకటనపై 46 పార్టీలు సంతకాలు చేశాయి. వాటి లక్ష్యం నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకత. దాని కొనసాగింపుగా సామాజిక వేదికల సమావేశాలు జరిగాయి. ఒకే వేదికపై భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు అవకాశం ఇవ్వటంతో అన్ని తరగతులను అకర్షించాయి.

    లాటిన్‌ అమెరికాలో సంపూర్ణంగా కాకపోయినా వర్గదృక్పధం, నయా వుదారవాద వ్యతిరేక విధానాలతో ముందుకు వచ్చిన శక్తులు అధికారానికి వచ్చాయి. తరువాత అవి వ్యవహరించిన తీరు అంతకు ముందు వాటి పోరాట లక్ష్యాలకు భిన్నంగా వుండటం కూడా సామ్రాజ్యవాదుల కుట్రలు, జనం నిర్లిప్తత, వ్యతిరేకతలకు తావిచ్చి వుండాలి. బ్రెజిల్‌లో 2002లో లూలా నాయకత్వంలో పిటి విజయం సాధించినప్పటికీ పార్లమెంట్‌ వుభయ సభలలో 17, 18శాతం స్దానాలు మాత్రమే దానికి వచ్చాయి. ఎన్నికలలో వాగ్దానం చేసిన మాదిరి పేదలకు అనుకూలమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపాలంటే అందుకు బడ్జెట్‌, పధకాలకు పార్లమెంట్‌ ఆమోదం అవసరం. తగినంత బలం లేని పిటి పార్టీ ఇతర పార్టీల ఎంపీలకు లంచాల రూపంలో ప్రతిఫలం చెల్లించి మద్దతు కూడగట్టింది. ఒక నాడు అవినీతి వ్యతిరేక ఛాంపియన్‌గా వున్న పార్టీ అటువంటి పనులకు పాల్పడటంద్వారా విమర్శలపాలైంది. లూలా, దిల్మా వంటి నేతలు అవినీతికి పాల్పడకపోయినప్పటికీ ఎంపీలకు ముడుపులు చెల్లించటాన్ని అనుమతించారు. దాని కొనసాగింపుగా అవినీతి ముద్రపడిన వారిని కూడా కొంతమందిని అభ్యర్ధులుగా నిలిపారు. కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు దిగువ స్ధాయి నుంచి శాఖల నిర్వహణ నిర్మాణంలో ఒక ప్రధాన అంశం. అలాంటిది 2005 నుంచి పిటీ శాఖల నిర్వహణను వదలివేసింది. దాంతో సైద్దాంతిక, రాజకీయ చర్చలు, ప్రాధమిక సభ్యుల భాగస్వామ్యం లేకుండా పోయాయి. దీనికి అనుగుణ్యంగానే సామాజిక వుద్యమాలు కూడా వెనుక పట్టు పట్టి అధికారం వుంది కనుక తమ మిలిటెన్సీని కోల్పోయాయి. భూ పోరాట వుద్యమాలు ప్రభుత్వంవైపు చూడటం మొదలు పెట్టాయి. పార్లమెంట్‌లో మెజారిటీ లేదు కనుక ప్రభుత్వం కూడా భూ సంస్కరణల గురించి అంతగా శ్రద్ధ చూపలేదు. వామపక్ష విశ్లేషకుడు పెరీ ఆండర్సన్‌ అభిప్రాయం మేరకు దారిద్య్ర నిర్మూలన పధకాలతో కూడిన మితవాద ఆర్ధిక విధానాలు, విదేశీ పెట్టుబడులకు అనుకూల వైఖరిని లూలా ప్రభుత్వం అనుసరించింది. నగదు బదిలి, స్కూలు పిల్లలకు వైద్య పరీక్షలు,ఇతర దారిద్య్రనిర్మూలన పధకాల అమలు వలన లూలా ఎంతో పేరు ప్రతిష్టలు గడించారు. పేదలు 50 నుంచి 30 మిలియన్లకు తగ్గారు. ఇదే సమయంలో సాధించిన అభివృద్ధి అందరికీ చేరేలా సంపదల పున:పంపిణీకి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. లూలా పాలనా కాలంలో వస్తువులకు డిమాండ్‌ వున్న రీత్యా ఎగుమతులు బాగా జరిగిక అనేక తరగతుల ఆదాయాలు కూడా పెరిగాయి. దాంతో 2008లో ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్య ప్రభావం బ్రెజిల్‌పై పెద్దగా పడలేదు.కానీ 2011 నుంచి దాని ప్రభావం మొదలైంది. అప్పటి నుంచి మితవాద శక్తులు వామపక్ష పాలనపై ధ్వజమెత్తటం ప్రారంభించాయి. దానికి తోడు ప్రజల అవసరాలకు తగినట్లుగా రవాణా, వైద్య సౌకర్యాలు మెరుగుపడకపోవటం, ఆర్ధిక మాంద్యం కారణంగా అభివృద్ధి రేటు పడిపోవటం ఇదే సమయంలో ప్రపంచ కప్‌, రియో ఒలింపిక్స్‌ భారం, వాటి ఏర్పాట్లకు గాను కొన్ని చోట్ల పేదలను ఖాళీ చేయించటం, కొన్ని ప్రాజెక్టుల అమలులో అవినీతి ఆరోపణలు మొత్తం మీద దిల్మా రౌసెఫ్‌ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సమయానికి చుట్టుముట్టాయి.

    సామాజిక, వామపక్ష వుద్యమ నిర్మాణాలు వెనుక పట్టుపట్టటం, గతంలో పిటికి మద్దతు ఇచ్చిన అనేక తరగతులు దూరం కావటం, ఆ స్ధానాన్ని మిత, మతవాద శక్తులు ఆక్రమించాయి. 2000-2010 సంవత్సరాల మధ్య చర్చ్‌లలో సభ్యులుగా చేరిన వారి సంఖ్య 61శాతం పెరిగింది. చట్ట సభలలో కూడా అదే మాదిరి ఈ శక్తుల ప్రాతినిధ్యం పెరిగింది. పురోగామి అస్తిత్వ వుద్యమాల స్ధానంలో మితవాద, మతవాద ధోరణులు బాగా పెరిగాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు లూలా, దిల్మాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ వారు అధినేతలుగా వున్నారు కనుక, కొందరు అధికార పార్టీ నేతలు దానిలో దొరకటం, అవినీతి సొమ్ము అధికార పార్టీ ఎన్నికల ఖర్చులకు, ఇతర అక్రమాలకు వినియోగించారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనికి మీడియా ప్రధాన పాత్ర వహించింది. అవకతవకలు జరిగిన సమయంలో దిల్మా ఆ సంస్ధ చైర్‌పర్సన్‌గా, సంబంధిత శాఖ మంత్రిగా వున్నారు. ఆ కుంభకోణం ఆమె రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత బయటకు రావటంతో మితవాద శక్తులు, మీడియా జనం ముందు ఆమెను దోషిగా నిలిపాయి. దానికి తోడు లోటు బడ్జెట్‌, ముందే చెప్పుకున్నట్లు పార్లమెంట్‌ అనుమతి లేకుండా పధకాలకు ఖర్చు చేయటం వంటి వాటిని అన్నింటినీ కలిపి ఆమెపై అభిశంసనకు కుట్ర చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తటంతో మధ్యతరగతిలో అసంతృప్తి, దూరం కావటం, ఇదే సమయంలో అభివృద్ధి రేటు పడిపోవటం, ఒలింపిక్స్‌కు మోయలేని భారం ఆర్ధిక వ్యవస్థపై పడటం, సామాజిక సేవలు, వుపాధి పధకాలపై కోత విధించటం వంటి చర్యలతో మధ్యతరగతితో పాటు పేదలలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. దాని ఫలితమే 2014 ఎన్నికలలో దిల్మా కొద్ది మెజారిటీతో ఎన్నికయ్యారు.

    రెండవ సారి ఎన్నికైన తరువాత వెంటనే తీసుకున్న నిర్ణయాలు కూడా దిల్మాను మరింతగా జనానికి దూరం చేశాయని పరిశీలకులు చెబుతున్నారు. అభివృద్ధి పెంపుదల, నిరుద్యోగాన్ని తగ్గిస్తారని ఆశలు పెట్టుకున్న యువతపై ఎన్నికలు జరిగిన మూడురోజుల్లోనే వడ్డీ రేట్ల పెంపుదల, ప్రజానుకూల సామాజిక పధకాల ‘కోతల రాయుడి ‘గా పేరు మోసిన మితవాది లెవీని అర్ధిక మంత్రిగా, భూసంస్కరణల వ్యతిరేకిగా, పర్యావరణ రక్షణను గాలికి వదలి భూస్వాముల ప్రయోజనాలకు కొమ్ముకాయటంలో సుపరిచితమైన కతియా అబెరును వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించటం వంటి చర్యలతో దిల్మా ప్రతిష్ట మరింతగా మసకబారింది. బ్రెజిల్‌ ఎదుర్కొంటున్న మాంద్యం సమస్యను పరిష్కరించటానికి నయావుదారవాద విధానాలే మార్గమనే వైఖరిని వీరి నియామకాల ద్వారా దిల్మా ప్రదర్శించినట్లు విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయాలపై పిటీ పార్టీలో చర్చ కూడా జరగలేదు.

    ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన వర్కర్స్‌ పార్టీ ప్రారంభంలో ఆ విధానాలతోనే పురోగతి సాధించి చివరకు ఆ ప్రపంచీకరణ విధానాల కారణంగానే ఇబ్బందులలో కూరుకుపోయింది.దీనికి కారణం పేదలకు సంక్షేమ పధకాలు, పేదరిక నిర్మూలన పధకాలు అమలు జరపటం తప్ప ఆర్ధిక వ్యవస్ధను మెజారిటీ పౌరులకు అనుకూలంగా మార్పు చేసే విధానాలను ప్రవేశపెట్టటంపై శ్రద్ద చూపలేదు. బడా బూర్జువా, కార్పొరేట్‌ భూస్వామ్య లేదా వ్యవసాయ కంపెనీల పునాదులు అలాగే వున్నాయి. 2011 నుంచి ఆర్ధిక మాంద్యం బ్రెజిల్‌ను క్రమంగా కుంగదీస్తూ వుండటంతో లూలా హయాంలో 4-5శాతం మధ్య వున్న వృద్ధి రేటు గత నాలుగు సంవత్సరాలలో 1.3శాతానికి పడిపోయింది. ప్రస్తుతం మాంద్యలో వుంది. పన్నెండు సంవత్సరాల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం ఈ ఏడాది నమోదైంది. నిరుద్యోగం బాగా పెరిగింది.ఇవన్నీ కూడా మితవాదుల చేతికి అస్త్రాలుగా మారాయి. ఎవరైతే పెట్రోలియం కంపెనీలో అక్రమాలకు పాల్పడ్డారో వారే దిల్మాపై అభిశంసనకు నాయకత్వం వహించినప్పటికీ జనంలో పెద్దగా స్పందన లేదంటే వర్కర్స్‌ పార్టీ జనానికి ఎంతగా దూరమైందో అర్ధం చేసుకోవచ్చు.

   బ్రెజిల్‌లో మితవాద శక్తులకు ఇంక ఎదురు వుండదా ? ఇది వూహాజనిత ప్రశ్న. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇంకా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూనే వుంది. నాయత్వం వహిస్తున్న అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఎలా బయట పడాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటువంటి స్థితిలో బ్రెజిల్‌లో తిష్టవేసిన మితవాద శక్తులు జనాన్ని మభ్య పెట్టేందుకు అనేక ఆశలు కల్పించటం సహజం. ఆచరణలో కార్పొరేట్‌ శక్తులకు మరింతగా దోచి పెట్టేందుకు ఇప్పటి వరకు అమలు జరిపిన సంక్షేమ చర్యలకు కోతపెట్టటం తప్ప మెరుగుపరిచే అవకాశం లేదు. నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంలో ముందున్న బ్రెజిల్‌ కార్మికవర్గం వాటిని సహిస్తుందా ? తగిన గుణపాఠాలను తీసుకొని తిరిగి పోరుబాట పట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోవటానికి ప్రయత్నిస్తుంది. తిరిగి సామాజిక శక్తులు మేలుకుంటాయి.కొత్త శక్తులు రంగంలోకి వస్తాయి, తమ ఆయుధాలకు మరింతగా పదును పెట్టుకుంటాయి. కొత్త వాటిని సమకూర్చుకుంటాయి. ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన ఎవరూ ప్రయాణాన్ని విరమించుకోరు, తగిలిన దెబ్బ తీవ్రతను బట్టి కొంత సేపు ఆగి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ప్రజా రధమైనా అంతే !