Tags

, , , , ,

ఎంకెఆర్‌

    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చివరికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజి కూడా లేకుండా ప్రత్యేక సాయం పేరుతో దిగువ గురువారం సాయంత్రం ఆర్ధిక మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఒక వివరణాత్మక నోట్‌ను వుంచింది. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

   పద్నాలుగవ ఆర్ధిక సంఘం నివేదికలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక లోటు మొత్తం రు.22,113 కోట్లు.ఈ మొత్తాన్ని ఐదు సంవత్సరాల వ్యవధిలో కేంద్రం చెల్లిస్తుంది.

    రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన ఆర్ధికలోటు పూడ్చటంలో భాగంగా ఇప్పటికే రు.3,979.5 కోట్లను కేంద్రం ఇచ్చింది, మిగలిన మొత్తాన్ని వార్షిక వాయిదాలలో చెల్లిస్తుంది.

    రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణ నిమిత్తం ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు చెల్లించింది. మిగిలిన వెయ్యి కోట్ల రూపాయలను తగు సమయంలో చెల్లిస్తుంది.

   వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక పాకేజి కింద ఇప్పటికే రు.1050 కోట్లు చెల్లించింది, మరో 1050 కోట్లను వచ్చే సంవత్సరాలలో అందచేస్తుంది.

   పోలవరం ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్‌ వుత్పత్తి, 7.2లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది, ఎనభై టిఎంసిల నీటిని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లించే విధంగా రూపొందించారు. 2005-06 ధరలలో ఈ ప్రాజెక్టుకు రు 10,152.04 కోట్ల మేరకు ప్రణాళికా సంఘం అనుమతించింది. తరువాత కేంద్ర జలవనరుల సలహా సంఘం సిఫార్సుల మేరకు 2010-11 ధరలలో రు.16,010..45 కోట్లకు పెంచింది. దీనిలో రు.2,868 కోట్ల విద్యుత్‌, మంచి నీటి పధకాల మొత్తం కలసి వుంది.ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్ట ఆమోదం పొందక ముందు కేంద్ర ప్రభుత్వ ఏఐబిపి సాయంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి 2014 మార్చి 31వరకు రు.5,135.87 కోట్లు ఖర్చు చేసింది. దీనిలో కేంద్రసాయం రు.562.469 కోట్లు వుంది. దిగువ పద్దతిలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సాయం ఇలా వుంటుంది.

    2014 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ప్రాజెక్టులో సాగునీటి అవసరాలకు అయ్యే ఖర్చులో మిగిలిన మొత్తాన్ని నూరుశాతం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రాజెక్టు నిర్మాణానికి తమను అనుమతించాలన్న ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్ధనను కేంద్రం అంగీకరించింది.

   అర్హత కలిగిన వెనుకబడిన ప్రాంతాలను నోటిఫై చేసినప్పటి నుంచి నగదు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది.

  విద్యా సంస్థల ఏర్పాటు విషయానికి వస్తే పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించారు.తాత్కాలిక ప్రాంగణంలో ఐఐటి పని చేయటం ప్రారంభమైంది. ప్రధాన ప్రాంగణ నిర్మాణం జరగాల్సి వుంది. కర్నూలులో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సెంటర్‌ తాత్కాలిక భవనాలలో ప్రారంభమైంది. ప్రధాన కాంపస్‌ నిర్మాణం జరగాల్సి వుంది. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్ధలాన్ని ఇప్పటికే ఎంపిక చేశారు. తిరుపతిలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ మరియు పరిశోధనా సంస్ధను, విశాఖలో ఐఐఎంను ఏర్పాటు చేశారు. గుంటూరులో ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపి, స్ధలాన్ని కూడా తీసుకున్నారు. గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థల ఎంపిక కమిటీ ఇప్పటికే స్థలాన్ని ఆమోదించింది. జాతీయ విపత్తు యాజమాన్య సంస్ధ ఏర్పాటకు అవసరమైన స్ధలాన్ని తీసుకోవలసి వుంది.

  ఆచరణ సాధ్యతకు లోబడి దుగ్గరాజపట్నంలో పిపిపి పద్దతిలో ప్రధాన రేవు ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆర్ధిక వ్యవహారాల మంత్రి వుపసంఘం అంగీకరించింది. వుక్కు, ఆయిల్‌ కార్పొరేషన్‌ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించాల్సి వుంది.

   విమానాశ్రయాలకు సంబంధించి విశాఖలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. తదుపరి విస్తరణకు భోగాపురంలో స్ధలాన్ని గుర్తించారు. దానిని ఎయిర్‌పోర్ట్‌ అధారిటీకి అప్పగించాల్సి వుంది. దానిని ఆ సంస్ధ లేదా పిపిపి పద్దతిలో అభివృద్ధి చేయవచ్చు. సాంకేతిక, ఇర్ధిక సాధ్యత నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాల్సి వుంది. విజయవాడ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 698 ఎకరాలను సేకరించాల్సి వుంది. తిరుపతి విమానాశ్రయంలో నూతన టెర్నినల్‌ను గతేడాది అక్టోబరు 22న ప్రధాని ప్రారంభించారు. మూడు విమానాలను పార్కింగ్‌ చేయటానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వున్న సౌకర్యాలు అంతర్జాతీయ విమానాలు దిగటానికి సరిపోతాయి. మరో నాలుగు విమానాల పార్కింగ్‌కు వున్న స్ధలంలోనే ఏర్పాట్లు చేస్తారు.

   జాతీయ రహదారుల ఏర్పాటు జాతీయ రహదారుల సంస్ధ అనేక చర్యలు తీసుకుంది. ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానితో హైదరాబాదు, ఆ ప్రాంతంలోని ఇతర పట్టణాలకు వేగంగా ప్రయాణించేందుకు అవసరమైన చర్యలు పరిశీలనలో వున్నాయి. విశాఖ, విజయవాడ-గుంటూరు-తెనాలి పట్టణ ప్రాంతాలలో మెట్రో రైళ్ల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలను చురుకుగా పరిశీలించటం జరుగుతున్నది.

   పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి పూర్తిగా చెల్లించటం జరుగుతున్నది. ఫలితంగా 2014-15తో పోల్చితే 2015-16లో 55శాతం పెరిగి అదనంగా రు.7787 కోట్లు వచ్చాయి. మరుసటి ఏడాదికి కూడా అలాగే చెల్లించటం జరుగుతున్నది.