Tags

, , , ,

నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి.

ఎం కోటేశ్వరరావు

     ప్రతిపక్ష వైసిపి సభ్యులు నిశ్శబ్దంగా కూర్చుంటే ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు శాసనసభలో పదే పదే ప్రకటించటాన్ని యావత్‌ తెలుగు ప్రజలూ గమనించారు. రెండు సంవత్సరాలకు పైగా రాజకీయ పార్టీలు, జనం నోర్మూసుకుని కూర్చున్నా ఎన్నడూ దాని గురించి సూటిగా మాట్లాడని చంద్రబాబు ప్రత్యేక హోదా, పాకేజీ కూడా ఇచ్చేది లేదని ఒకవైపు కేంద్రం తేట తెల్లంగా ప్రకటించిన తరువాత దాని గురించి తాను ప్రకటన చేస్తానని చెప్పటమే రాజకీయ జాణతనం. తెలుగుదేశం పార్టీ ఎంతగా ఆత్మరక్షణలో పడిపోయిందంటే వైసిపి సభ్యులు అసెంబ్లీ కార్యకలాపాలు సాగకుండా నినాదాలతో అడ్డుకుంటుంటే తెలుగు దేశం సభ్యులు ముఖాలు వేలాడవేసుకొని నిస్సహాయంగా కూర్చుండి పోయారు. అదే మిగతా సందర్బాలలో గతంలో వారెన్నడూ అంత వినమ్రతతో కూర్చోలేదు. బహుశా ప్రస్తుత అసెంబ్లీలో అధికారపక్షం ఇలా నీరుగారి పోయి వుండటం ఇదే మొదటిసారి.

    నాడు పార్లమెంట్‌ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు కూడా లేదని తేలిపోయింది. ప్రత్యేక పాకేజీ లేకుండా ప్రత్యేక సాయం అని అది కూడా 2015 నుంచి 2020 వరకు మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసింది. పోనీ దాని వివరాలు ఏమిటి అంటే రేపు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పెడతాం చూసుకోమని విలేకర్లకు చెప్పి పంపారు.ఈ మాత్రం చెప్పటానికి అర్దరాత్రి ప్రత్యేకంగా పత్రికా గోష్టి పెట్టటం అవసరమా ?

    తాము రాజకీయంగా నిండా మునిగి జనాన్ని ముఖ్యంగా యువత భవిష్యత్‌ను అంధకారంలో ముంచిన పెద్దలు ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో వెంటనే తేల్చివేశారు. ఇక తేల్చు కోవలసింది జనమే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం చేసేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని కేంద్ర మంత్రులు ప్రకటించినపుడే అది వట్టిస్తరి మంచినీళ్లని తేలిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్లు పెద్ద వూదరగొడుతున్నారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచే ఆ డిమాండ్‌ వుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏ సాగునీరు, విద్యుత్‌ ప్రాజెక్టుకైనా ఆ సూత్రాలు వర్తిస్తే కేంద్ర ప్రభుత్వం వాటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించి 90శాతం నిధులు అంద చేస్తుంది.ఇప్పటికే అలాంటి 14 ప్రాజెక్టుల జాబితాను ఈ చిరునామాలో చూడవచ్చు.http://wrmin.nic.in/writereaddata/Guidelines/NProjects572133778.pdf పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టటం ద్వారా ఆ మేరకు రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుంది. అలాంటి హోదా ఇవ్వటానికి రాష్ట్రాన్ని విభజించటానికి సంబంధం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కారణంగా వెసులు బాటు కోసం ఆహోదా ఇచ్చినట్లు చెప్పటం మోసం చేయటమే. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక హోదాను కల్పించటాన్ని మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించినపుడు, జాతీయ ప్రాజెక్టు హోదా తమ పధకాలకు సైతం ఎందుకు కల్పించరని కేంద్రాన్ని ఇతర రాష్ట్రాలు అడగకుండా వుంటాయా ? ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించినందుకు పరిహారంగా ఇస్తే ఆమేరకు నిబంధనలను కూడా సవరించకుండా ఎలా సాధ్యం. ఒక రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వటానికి మిగతా రాష్ట్రాలు ఎలా అంగీకరిస్తాయి ?

    ప్రత్యేక హోదా విషయమై ఒకే నోటితో రెండు మాటలు మాట్లాడుతూ అనేక అనుమానాలకు తావిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిపిస్తే మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయి కనుక రాజకీయంగా సమస్యలు తలెత్తే అవకాశం వుంది కనుక కొత్తగా ఏ రాష్ట్రానికీ ఇవ్వదలచలేదు. ఒక వేళ ఇచ్చినా రాయితీలను గణనీయంగా తగ్గించిన కారణంగా పెద్దగా ప్రయోజనం వుండదు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు కూడా పెద్దగా లబ్డి పొందింది లేదు. ఇప్పుడు ఇన్ని విషయాలు చెబుతున్న పెద్దలకు ఈ విషయాలన్నీ రెండు సంవత్సరాలకు ముందు ఎన్నికల సందర్భంగా, లేదా గత రెండు సంవత్సరాలుగా తెలియవా ? వేదికల మీద వాగ్దానాలు కురిపించిన పెద్దలు రాజ్యాంగం, నిబంధనలు తెలియని అజ్ఞానులు కాదే ! కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా 32 నుంచి 42 శాతానికి పెంచారు. అయితే కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకున్నట్లుగా కేంద్రం అమలు జరుపుతున్న అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించారు. ఫలితంగా పది శాతం నిధులతో పాటు అంత కంటే ఎక్కువే భారం మోపారు. రెండవది రాష్ట్రాలకు వాటా లేని సెస్సుల వంటి వాటిని ఇటీవలి కాలంలో విపరీతంగా పెంచారు. దాని వలన జనం జేబుల నుంచి కేంద్రానికి వెళ్లేది కూడా పెరిగింది.

     ప్రత్యేక హోదా రాయితీలకు అవకాశం వున్న రాష్ట్రాలలో ఇప్పటికే అనేక మంది వాటిని నమ్ముకొని పరిశ్రమలు పెట్టారు. ఇప్పుడు జిఎస్‌టి వచ్చింది కనుక ఆ రాయితీలను మధ్యలో నిలిపివేస్తారా ? అదే మాదిరి జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగ బద్దంగానే ప్రత్యేక ప్రతిపత్తి వుంది. మరి అక్కడ ఎలా అమలు జరుపుతారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు పార్లమెంట్‌లో , వెలుపలా వాగ్దానం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే మిగతా రాష్ట్రాలకు అమలు జరిగినంత కాలం అమలు జరుగుతాయి. మిగతావాటికి ఆగిపోతే ఆంధ్రప్రదేశ్‌కూ నిలిచిపోతాయి, నలుగురితో నారాయణ ! పేచీ వుండదు, బిజెపి మోసం చేసిందనే విమర్శలూ వుండవు. అలాంటపుడు వాగ్దానం చేసిన మేరకు ప్రకటించటానికి ఇబ్బంది ఏమిటి ? ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకొని యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు పని చేయటం అవసరం. కేంద్రం తన విధానాలు మార్చుకొని ఆంధ్రప్రదేశ్‌లో తగినన్ని పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించాలి. కడపలో మరో వుక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరు, వివిధ రంగాలలో ి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగాలైన పెట్రోలియం, రక్షణ వంటి రంగాలకు అవసరమైన వుత్పత్తుల తయారీకి మరో ఇసిఐఎల్‌, మరో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ,అణ ఇంధన కాంప్లెక్స్‌, వంటివి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టటానికి ఆటంకం ఏమిటి ? ఐడిపిఎల్‌ వంటి వాటిని స్ధాపించి యువతకు వుపాధితో పాటు జనానికి చౌకగా ఔషధాలు అందించటానికి వున్న ఇబ్బంది ఏమిటి ?

   ఇప్పుడున్నపరిస్థితుల్లో ఎవరైనా ఇప్పటికే మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌ వున్న ప్రాంతాలలోనే పరిశ్రమలు పెడతారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే చైనాలోనే ప్రయివేటు రంగం పరిశ్రమలన్నీ ఆ విధంగా కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే కేంద్రీకృతమయ్యాయి. అభివృద్ధి కొత్త సమస్యలను సృష్టించింది. దాంతో పరిశ్రమలు లేని ప్రాంతాలలో పెట్టుబడులకు కేంద్రీకరించింది. గతంలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన విధానం కూడా కొన్ని అసమానతలను సృష్టించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, పలు సంస్థలను హైదరాబాదులోనే కేంద్రీకరించటంతో అటు తెలంగాణాలో మిగిలిన జిల్లాలు, ఇటు ఆంధ్రప్రాంతంలో కొంతమేరకు విశాఖ మినహా మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడిపోయాయి. మన దేశంలో కూడా వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకుండా ప్రయివేటు వారి వచ్చి ఒరగపెడతారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు.అందువలన ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని డిమాండ్‌ చేయటం ఎంతో సముచితం.