Tags

, , ,

Image result for stop attacks on journalists in india

ఎం కోటేశ్వరరావు

     మీరు ఎవరినైనా మట్టు పెట్టదలచుకున్నారా ? మన దేశంలో చాలా సులభం ! ఎలాంటి శిక్షలు వుండవు !! వాణిజ్య ప్రకటనలలో షరతులు వర్తిసాయని నక్షత్ర గుర్తులు వేసినట్లే దీనికి కూడా ఒక షరతు వుంది. అదేమంటే అలాంటి వారు మీడియా వ్యక్తులై వుండాలి. ఈ రోజుల్లో వారు దొరకటం చాలా సులభం. పత్రికలు, టీవీలు, రేడియో, అంతర్జాతల మీడియాలో చాలీ చాలని లేదా అసలు వేతనం లేకుండా పని చేసే వారే కాదు, ఎలాంటి జీతం, భత్యాలు, పగలనకా, రాత్రనకా తేడా లేకుండా పని చేస్తూ , యజమానులకు విపరీత లాభాలు సమకూర్చి పెడుతున్న సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. అనుమానమా ? అక్కర లేదు మీ పోస్టులను సాక్ష్యంగా చూపి ఎవరైనా నా మనోభావాన్ని దెబ్బతీశారు అని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్నారు. సాంప్రదాయ మీడియాలో పని చేసే వారి మీద కూడా అలాంటి కేసులే పెట్ట వచ్చు. కానీ అలా చేయటం లేదే, భౌతికంగా మట్టు పెడుతున్నారు. అలాంటి పరిస్థితి రేపు సామాజిక మీడియా జర్నలిస్టులకు ఎదురు కాదని ఎవరైనా చెప్పగలరా ?

     చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నది అధికారంలో వున్న పెద్దల వువాచలలో ఒకటి. వంద మంది నేరగాళ్లు తప్పించుకుపోవచ్చుగాని ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదన్నది న్యాయ సూక్తి. అంతర్జాతీయ సంస్ధ జర్నలిస్టుల రక్షణ కమిటి( కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌-సిపిజె) తాజా నివేదిక ప్రకారం 1992 నుంచి 2016 జూలై వరకు 27 మంది జర్నలిస్టుల హత్య కేసులలో ఒక్కటంటే ఒక్క దానిలో కూడా నేరగాళ్లకు శిక్ష పడలేదు. నిజంగా చట్టం తనపని తాను చేస్తే ఇలాగే జరుగుతుందా ? ఒక్క కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడలేదంటే నిందితులందరూ నిరపరాధులేనా ?అనేక మంది చెబుతున్నట్లు, వాటిని అనేక మంది నమ్ముతున్నట్లు మనది ప్రపంచంలో ఎంతో బాగా పనిచేస్తున్న అతి పెద్ద ప్రజాస్వామిక సంస్ధ, దర్యాప్తు చేయాల్సిన పోలీసులూ సమర్ధులే, విచారించాల్సిన న్యాయమూర్తులనూ తప్పు పట్టలేము. తిమ్మినిబమ్మిని చేసే న్యాయవాదులూ తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వరిస్తున్నట్లే. మనది బూటపు ప్రజాస్వామ్యమా లేక ప్రజాస్వామ్యాన్ని బూటకంగా మార్చివేశారా ? లేక వ్యవస్ధలోనే లోపమున్నదా ? ఎవరు దీనికి బాధ్యులు ? ఎందుకిలా జరుగుతోంది? ఏం జరిగినా అన్నీ మన మంచికే అన్నట్లుగా అన్నింటినీ గుడ్లప్పగించి చూస్తున్న సమాజం ? ఏమిటీ వైపరీత్యం, ఎంతకాలమిలా ? వీటన్నింటిని చూసి అరుదుగా వున్న సున్నిత మనస్కులలో ఏ ఒక్కరైనా ఈ ప్రజాస్వామ్యం, ఈ వ్యవస్ధ మీద నమ్మకం కోల్పోయినట్లు ప్రకటిస్తే ఆ ఘోరానికి బాధ్యులెవరు ?

    భారత రాజ్యాంగం ఆర్టికల్‌ పందొమ్మిది ప్రకారం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే నేరాలకు పాల్పడుతున్న వారి నుంచి జర్నలిస్టులను కాపాడేందుకు జాతీయ స్ధాయిలో అవసరమైన ఒక యంత్రాంగాన్ని, పద్దతిని రూపొందించేందుకు అవసరమైన ముసాయితా ప్రతిపాదనలను తయారు చేసేందుకు అనుభవమున్న న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పండితులు, భావ ప్రకటనా స్వేచ్చ విషయాలలో నిపుణులైన ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సిపిజె తన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

    ఈ నివేదికను సిపిజె ఆసియా కార్యక్రమ సీనియర్‌ పరిశోధకులు సుమిత్‌ గల్‌హోత్రా,స్వతంత్ర పాత్రికేయులు రక్షా కుమార్‌ సిపిజె తరఫున ఈ నివేదికను తయారు చేశారు. మీడియా తీరుతెన్నులను వీక్షించే వెబ్‌సైట్‌ ది హూట్‌ సలహా సంపాదకురాలు ముంబైకి చెందిన గీతా శేషు కేసుల వివరాలను అందచేయగా దేశంలోని పరిస్థితుల గురించి స్వతంత్ర జర్నలిస్టు ఆయుష్‌ సోనీ రాశారు.(గీతా శేషు సేకరించిన కొన్ని వివరాలను వర్కింగ్‌ జర్నలిస్టు జూన్‌ సంచికలో ఇచ్చాము). ఈ నివేదిక ముందు మాటను ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌ రాశారు. నివేదిక పూర్తి పాఠం కావాల్సిన వారు దిగువ లింక్‌లో పొంద వచ్చు.https://cpj.org/reports/2016/08/dangerous-pursuit-india-corruption-journalists-killed-impunity.php పెద్ద పట్టణాలలో వున్నవారి కంటే గ్రామీణ, చిన్న పట్టణాలలో వున్న జర్నలిస్టులకు తాము రాసిన రాతలపై దాడులు జరిగే ముప్పు ఎక్కువగా వుందని అయితే ఈ నివేదికను పరిశీలించిన తరువాత దానికి తోడు జర్నలిస్టు పని చేస్తున్న స్థలం, సంస్ధ, వృత్తిలో స్థాయి, సామాజిక పూర్వరంగం కూడా ఆ ముప్పుకు అదనంగా తోడవుతున్నట్లు వెల్లడైందని శాయినాధ్‌ చెప్పారు. ప్రాంతీయ భాషలలో వార్తలు రాసే వారికి ముఖ్యంగా ఆ రాసింది శక్తివంతులైన వారిని సవాలు చేసేదిగా వుంటే విలేకర్లకు ముప్పు ఇంకా ఎక్కువగా వుంటుందని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాలో పని చేసేవారు ఇలాంటి ఘోరమైన దాడుల నుంచి తప్పించుకుంటున్నారని కారణం జాతీయ మీడియాలోని వున్నత తరగతులు, ప్రత్యేకించి ఆంగ్ల మీడియా సంస్ధలలో వున్నవారికి మెరుగైన రక్షణ కలిగి వున్నారని, పలుకబడి కలిగిన జాతీయ మీడియా సంస్ధలు ప్రభుత్వానికి అందుబాటులో వుండటంతో వాటిలో పనిచేసే వారికి అంతర్గతంగానే వ్యవస్ధా పరరక్షణ వుంటుందని శాయినాధ్‌ పేర్కొన్నారు.

     అవినీతి గురించి రాసిన కారణంగానే జర్నలిస్టులు హత్యకు గురైనట్లు నివేదికలోని 27 వుదంతాలు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఏ ఒక్క కేసులోనూ ఎవరికీ శిక్షలు పడలేదు. ఈ పరిస్థితి మీడియాకు ఒక సవాలు వంటి పరిస్థితిని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా చిన్న పట్టణాలలోని జర్నలిస్టులు అవినీతిని గురించి నివేదించినపుడు వారు ఎక్కువగా బెదిరింపులు, హత్యలకు గురవుతున్నారని సిపిజె నివేదిక తెలిపింది. జర్నలిస్టులు ఏమాత్రం రక్షణలేని స్ధితిలో పని చేస్తున్నారని, మీడియా సౌహార్ద్రతలేమి, న్యాయ వ్యవస్ధలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి వుందని, మరణించిన తరువాత బాధితులను అప్రతిష్టపాలు చేస్తున్నారని పేర్కొన్నది. 2015లో తీవ్ర కాలిన గాయాలతో మరణవాగ్ఞూలం ఇచ్చిన స్వతంత్ర జర్నలిస్టు జోగేంద్ర సింగ్‌ ఒక పోలీసు అధికారే తనను సజీవ దహనం చేసేందుకు మంటల్లోకి నెట్టారని చెప్పాడు. అతను చెప్పిన దానిని తిరస్కరించిన స్దానిక పోలీసులు అసలు అతను జర్నలిస్టే కాదని బుకాయించారు. ఒక ఏడాది గడిచినప్పటికీ రాష్ట్ర స్ధాయిలో ఇంకా దర్యాప్తు సాగుతూనే వుంది, అరెస్టులు లేవు. 2011 జనవరిలో తన ఇంటి ముందే కాల్పుల్లో హత్యకు గురైన నయా దునియా హిందీ పత్రిక జర్నలిస్టు రాజపుట్‌ కేసులో దర్యాప్తును సాగదీసి కీలక సాక్ష్యాలను కనుమరుగు చేసే యత్నం చేశారు. చివరికి ఇప్పుడు ఆ కేసును సిబిఐకి అప్పగించారు. భారత్‌లోని అతి పెద్ద కుంభకోణాలలో ఒకదానిపై పరిశోధనలో భాగంగా ఒక ఇంటర్వ్యూ సమయంలో అనుమానాస్పద స్ధితిలో మరణించి ఇండియా టుడే గ్రూప్‌ పత్రికలకు చెందిన అక్షయ్‌ సింగ్‌ కేసు మిగతా కేసులతో పోల్చితే త్వరగా సిబిఐకి అప్పగించారంటే దానికి కారణం ఒక పెద్ద సంస్థలో పని చేస్తూ వుండటమే అని నివేదిక పేర్కొన్నది.

     పైన పేర్కొన్న మూడు వుదంతాల గురించి ఈ ఏడాది మార్చినెలలో సిపిజె బృందం పరిశోధనలో భాగంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, న్యాయవాదులు, జర్నలిస్టులను కలసి వారి అభిప్రాయాలను సేకరించింది. స్వతంత్ర జర్నలిస్టు జగేంద్ర సింగ్‌ పోలీసుల చేతిలో కాలిన గాయాలతో మరణించాడని విమర్శలు వచ్చాయి. వుత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి భూ కబ్జా, అత్యాచారాల గురించి వార్తలు రాయటమే అతను చేసిన నేరం.ఒక రాజకీయనేత కుమారుడు అక్రమంగా జూదం నిర్వహణలో వున్నట్లు రాసిన వుమేష్‌ రాజపుట్‌ను ఇంటి ముందే కాల్చి చంపారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంగా ప్రసిద్ధి చెందిన అవినీతి అక్రమాలపై శోధన చేస్తుండగా అక్షయ సింగ్‌ ఆకస్మికంగా మరణించాడు. ఇలాంటి పరిశోధనలను అధికార యంత్రాంగం సహించటం లేదు.దాడులు, హత్యలు జరిగిన వుదంతాలలో పోలీసులు సరిగా దర్యాప్తు జరిపి దోషులను గుర్తించటం,అరెస్టు చేయటం జరగటంలేదు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, 2జి స్కామ్‌ వంటి వాటిలో జరిగిన అక్రమాల గురించి సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి తేవటంలో కార్యకర్తలు, జర్నలిస్టులు ఎంతో ముందున్నారు.గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అవినీతిని ఒక కేంద్రీయ అంశంగా చేసిన నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిపై చర్యలు తీసుకోకపోవటంతో పాటు వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులకు తగిన రక్షణ చర్యలు తీసుకోవటం లేదు. భారత్‌లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పత్రికా స్వేచ్చ గురించి తీవ్రంగా పట్టించుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారంలో వున్న కాంగ్రెస్‌,బిజెపి లేదా ప్రాంతీయ పార్టీలుగానీ ఎవరున్నా మౌనం వహిస్తున్నారు. శిక్షలు లేని సంస్కృతిని మాత్రమే పెంచి పోషిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.

    సిపిజె ఇంతవరకు విధులలో భాగంగా హత్యలు జరిగిన 27 కేసులను పరిశీలించగా ఒక్కదానిలో కూడా శిక్షలు పడలేదని తేలింది. మరో 25 అనుమానిత మరణాలను కూడా ఏ కారణంతో జరిగాయనే విషయమై దర్యాప్తు జరుపుతోంది.

    ఒక జర్నలిస్టుపై దాడి లేదా హత్య జరిగిందనే ఫిర్యాదు చేయగానే పోలీసులు ముందుగా అతను జర్నలిస్టు కాదు, ఆ ఘటనకు జర్నలిజానికి సంబంధం లేదంటున్నారని గీతా శేషు పేర్కొన్నారు.దర్యాప్తులో కూడా అదే ప్రతిబింబిస్తోంది. ‘ దేశంలో గట్టి ప్రజాస్వామిక సంస్ధలు, చురుకుగా వుండే స్వతంత్ర న్యాయవ్యవస్ధ వున్నప్పటికీ జర్నలిస్టులను హత్యలు చేసిన వారు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది, అది దేశంలోని ప్రజాస్వామిక సంస్ధల పనితీరుపై ప్రభావం చూపుతుందని’ 2015లో ప్రెస్‌ కౌన్సిల్‌ పేర్కొన్న అంశాన్ని సిపిజె నివేదిక వుటంకించింది.

     నాణానికి ఒకవైపు బొమ్మ ఇదైతే రెండోవైపు బొరుసు గురించి కూడా సిపిజె నివేదిక పేర్కొన్నది. భౌతికంగా అదే విధంగా సామాజిక మాధ్యమాలలో మొత్తం జర్నలిస్టు సమాజం దాడులకు గురవుతుంటే దాడులు, హత్యలకు గురైనా మీడియాలోని తోటి జర్నలిస్టులలో, మొత్తం మీద సమాజంలో నిరసన వ్యక్తం కావటం లేదని కూడా సిపిజె ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి గురైన జర్నలిస్టు ఎవరా అన్నదానితో నిమిత్తం లేకుండా మీడియాపై దాడులకు సంబంధించిన అంశాలపై మెరుగ్గా శోధించి వెలుగులోకి తీసుకురావాలని భారత మీడియా సంస్ధలను సిపిజె కోరింది. జర్నలిస్టులు ప్రతికూల పరిస్ధితులలో వున్న వెలుగులో సిపిజె నివేదిక అనేక సిఫార్సులు చేసింది. జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు ఇతర దేశాలలో వున్న వుత్తమ ఆచరణలను అధ్యయనం చేసి జాతీయ స్ధాయిలో ఒక యంగ్రాంగాన్ని ఏర్పాటు చేయటం అందులో ఒకటి.మీడియాపై దాడులు చేసి శిక్షలు పడకుండా తప్పించుకున్న వుదంతాలపై పార్లమెంటరీ కమిటీ విచారణ నిర్వహించి న్యాయం చేసేందుకు, శిక్షలు వేయటానికి ఎదురువుతున్న సవాళ్లను గుర్తించాలి. దాడులు, హత్యలు జరిగినపుడల్లా నిర్ద్వంద్వంగా బహిరంగ ప్రకటనలు చేసి కేంద్రం వాటిని ఖండించి గట్టి సందేశం పంపాలి. సిబిఐ తన దర్యాప్తులో వున్న కేసులను త్వరగా పూర్తి చేయాలని, చత్తీస్‌ఘర్‌ ప్రభుత్వం జర్నలిస్టులపై పోలీసుల వేధింపులను ఆపాలని, ఇతర సంస్ధలను కూడా నిరోధించాలని, జైళ్లలో వున్నవారిని విడుదల చేయాలని కోరింది.