Tags

, , , , , ,

Image result for parliamentary and media coup against elected governments

సత్య

     గత కొద్ది వారాలుగా వివిధ ఖండాలలోని కొన్ని దేశాలలో జరిగిన పరిణామాలను పరిశీలించినపుడు పార్లమెంటరీ వ్యవస్ధలు, మీడియా సంస్ధలు, వ్యక్తుల పాత్రలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలు పరిహాసం పాలౌతున్నాయి, కుట్రలకు నిలయాలుగా మారుతున్నాయి. మీడియా ‘స్వతంత్ర’ సూచిక వేగంగా పడిపోతున్నది. ఏదో ఒక పక్షాన చేరి తారసిల్లటానికే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. చాలా కాలంగా కప్పుకున్న మేకతోళ్లను తీసి అవతల పడవేస్తున్నాయి. అందుకే గతంలో పత్రికలు పెట్టుబడిదారులకు పుట్టిన విష పుత్రికలు అని వర్ణించినపుడు విపరీత వ్యాఖ్యానంగా భావించిన వారు మీడియా పోకడలను చూసి ఇప్పుడు నిజమే అన్న నిర్ధారణలకు వస్తున్నారు. వర్గ సమాజంలో అటో ఇటో చేరకుండా తటస్థంగా వుండటం అసాధ్యమని, అదొక ముసుగు మాత్రమే అని కమ్యూనిస్టులు ఎప్పుడో చెప్పారు. ఎవరైనా తాము అటూ ఇటూ కాదు అని చెప్పారంటే మార్పును వ్యతిరేకించి వున్న వ్యవస్ధను వున్నట్లుగా వుంచాలని చెప్పటమే. పర్యవసానం ఆ వ్యవస్ధను కాపాడాలని కోరుకొనే వారికి మద్దతు ఇవ్వటమే. ముందే కూసిన కోయిల కూతలను పరిగణనలోకి తీసుకోనట్లే ఆ కమ్యూనిస్టులు అన్నీ ఇలాగే చెబుతారు అని తోసిపుచ్చిన వారు ఇప్పుడేమంటారో తెలియదు. ఏమన్నా అనకున్నా వాస్తవాలను ఎల్లకాలం దాయటం కష్టం.

      జూలై 15న ఐరోపాలోని టర్కీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు మిలిటరీలోని ఒక వర్గం విఫల తిరుగుబాటు చేసింది. కుట్రలో జర్నలిస్టులు కూడా వున్నట్లు తేలటంతో టర్కీ ప్రభుత్వం అనేక మంది ఇతర కుట్రదారులతో పాటు వంద మంది జర్నలిస్టులను కూడా అరెస్టు చేసింది. అమెరికాలో తిష్టవేసిన టర్కీ ముస్లిం ఇమాం ఫతుల్లా గులెన్‌ సిఐఏతో కలసి రూపొందించిన కుట్ర మేరకు సైనికాధికారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారన్న విషయం తెలిసిందే. కుట్రను విఫలం చేసిన తరువాత గులెన్‌కు మద్దతు ఇస్తున్న 130 మీడియా సంస్ధలు మూతపడ్డాయి. వందమంది వరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు. కొందరు విదేశాలకు పారిపోయారు. ఆగస్టు నెలాఖరులో బ్రెజిల్‌ పార్లమెంట్‌ అభిశంసన తీర్మానం ద్వారా ఆ దేశపు వామపక్ష వర్కర్స్‌ పార్టీ (పిటి)నేత అయిన దిల్మా రౌసెఫ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీన్ని ప్రజాస్వామిక కుట్రగా కొంత మంది వర్ణించారు. కుట్రల జాబితాలోకి కొత్త పదం చేరింది. ఈ ప్రజాస్వామిక కుట్రలో స్వతంత్ర పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొనే మీడియా ఒక ముఖ్యపాత్ర వహించిందన్న విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి. దీంతో ప్రభుత్వాల కూల్చివేత కుట్రదారుల్లో మీడియా అధిపతులు కూడా వుంటారని చేర్చాల్సి వుంది. ఈ వార్తలు చదువుతున్న సమయంలోనే బంగ్లాదేశ్‌లో వంగ బంధు ముజబుర్‌ రహ్మాన్‌ హత్య, ప్రభుత్వ కూల్చివేతలో భాగస్వామి అయ్యారనే నేరారోపణపై విచారణకు గురై వురి శిక్ష పడిన ఒక మీడియా అధిపతి మీర్‌ ఖాసిం అలీని 1971లో చేసిన నేరాలకు గాను సెప్టెంబరు మొదటి వారంలో వురి తీశారు. నేరం చేసి సమయంలో పాకిస్థాన్‌ అనుకూల విద్యార్ధి సంఘనేతగా వున్నప్పటికీ తరువాత కాలంలో ఒక పెద్ద వాణిజ్య, మీడియా అధిపతిగా ఎదిగాడు.

   అధికార రాజకీయాలు- ప్రభుత్వాలపై మీడియా అధిపతులు లేదా సంస్ధల ప్రమేయం లేదా పెత్తనం, ప్రభావం ఎలాంటిదో తెలుగువారికి చెప్పనవసరం లేదు. ఒక పార్టీకి వ్యతిరేకంగానో అనుకూలంగానో మాత్రమే కాదు, పార్టీ అంతర్గత విబేధాలలో కూడా జోక్యం చేసుకోవటాన్ని ఎన్‌టిరామారావుపై తెలుగుదేశంలో తిరుగుబాటు సందర్భంగా అందరూ చూశారు. కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండు పత్రికలపై బహిరంగంగానే విమర్శలు చేయగా తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఒక పత్రిక, ఛానల్‌ విలేకర్లను తమ పార్టీ సమావేశాలకు రావద్దని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక నేత లేదా పార్టీని కొన్ని పత్రికలు ఎలా పెంచి పెద్ద చేయవచ్చో, నచ్చనపుడు సదరు నేతను వ్యతిరేకించి ఎలా బదనాం చేయవచ్చో, అదే పార్టీలో అంతకంటే ఎక్కువగా తమకు వుపయోగపడతారనుకున్నపుడు ఇతర నేతలు, పార్టీలను ఎలా ప్రోత్సహిస్తారో ప్రత్యక్షంగా చూశారు, చూస్తున్నారు, భవిష్యత్‌లో కూడా చూస్తారు. మీడియా ఏకపక్షంగా వ్యవహరించినా లేక ఒక పక్షం వహించిందని జనం భావించినా ఏం జరుగుతుందో కాశ్మీర్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు, అక్కడి పరిస్థితిని జాతీయ మీడియా సంస్ధలు వక్రీకరిస్తున్నాయి లేదా వాస్తవాల ప్రాతిపదికన వార్తలను అందించటం లేదన్న విమర్శలు ఇటీవలికాలంలో పెరిగిపోయాయి. పార్లమెంటరీ అఖిలపక్ష బృందం పర్యటన సందర్భంగా కాశ్మీర్‌లోయలో కర్ప్యూను సడలించారు. ఆ సమయంలో ప్రెస్‌ అని స్టిక్కర్‌ పెట్టుకున్న వాహదారులపై అక్కడి నిరసనకారులు దాడులకు పాల్పడిన ఘటనలు జరిగాయి. కొంత మంది విలేకర్లు తాము జాతీయ మీడియాకు చెందినవారం కాదు, స్దానిక సంస్ధలలో పని చేస్తున్నామని చెప్పినా జర్నలిస్టులంటే జర్నలిస్టులే తప్పుడు రాతలు రాస్తారు, తప్పుడు దృశ్యాలను చూపుతారు అంటూ వరసపెట్టి దాడి చేసిన వుదంతాలు వున్నాయి. ఇది కాశ్మీర్‌కే పరిమితం కాదు, కొన్ని ఛానల్స్‌ లేదా పత్రికలకే పరిమితం కాబోదు. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆ సంస్థలలో పని చేసే జర్నలిస్టులకు రాబోయే రోజుల్లో తలెత్తనున్న ముప్పును ఇవి సూచిస్తున్నాయి.

   టర్కీలో కుట్ర నుంచి తప్పించుకున్న ఎర్డోగన్‌కు గతంలో మద్దతు ఇచ్చిన శక్తులే వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ మాదిరి టర్కీ, ఇరాక్‌, సిరియా తదితర దేశాలను చీల్చి ఆ ప్రాంతంలో కుర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలన్న పధకాన్ని అమలు జరిపేందుకు అమెరికా పూనుకుందన్న వార్తలతో రష్యన్లు ముందుగానే టర్కీని హెచ్చరించటంతో కుట్రను జయప్రదంగా తిప్పి కొట్టగలిగినట్లు చెబుతున్నారు. కుట్రకు పాల్పడిన వారిలో సైనికాధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులను టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసి రానున్న రోజుల్లో విచారణ జరిపి శిక్షలు విధించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అందువలన మీడియా పాత్ర ఏమిటనే చర్చ రాబోయే రోజుల్లో పెద్దగా జరగటం అనివార్యం.

   ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవటమా లేదా అన్న సమస్యపై జరిగిన ప్రజాభి ప్రాయసేకరణలో మీడియా ఎలా వ్యవహరించిందో చూశాము. చివరకు ప్రభుత్వ నిధులతో నడిచే బిబిసి కూడా ఒకవైపు మొగ్గింది. నిజానికి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో వర్గ సమస్య లేదు. కార్పొరేట్‌ శక్తుల లాభనష్టాల విషయంలో తలెత్తిన విభేధాలతో కొన్ని సంస్ధలు విడిపోవటానికి అనుకూలిస్తే మరికొన్ని వ్యతిరేకించాయి. నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీల అభ్యర్ధుల ఎన్నిక ప్రక్రియలో మీడియా సంస్ధలు ఎలా జోక్యం చేసుకున్నాయో, ఇప్పుడు అభ్యర్ధులు ఖరారైన తరువాత మొత్తంగా మీడియా రెండు శిబిరాలుగా చీలిపోవటాన్ని చూడవచ్చు. అసలు ఆ ఎన్నికలే కొంత మంది దృష్టిలో పెద్ద ప్రహసనం అయితే దానిలో మీడియా జోక్యం చేసుకొని తిమ్మినిబమ్మిని చేయటం, ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయటం కనిపిస్తుంది. లాటిన్‌ అమెరికాలో జరిగిన పరిణామాలలో మీడియా పాత్రను మరింత అధ్యయనం చేయాల్సి వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలలో అనేక మంది నియంతలను రంగంలోకి తెచ్చి తమ కార్పొరేట్‌ అనుకూల వ్యవస్ధలను ఏర్పాటు చేశారు. లాటిన్‌ అమెరికాలో దాదాపు ప్రతి దేశం సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలనలో మగ్గటమే గాక ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధల విధానాలైన నయావుదారవాద ప్రయోగశాలగా మార్చి వేశారు. ఈ క్రమాన్ని అక్కడి మీడియా మొత్తంగా బలపరచటమేగాక, నియంతలు, అభివృద్ధి నిరోధకులను సోపానాలుగా చేసుకొని ప్రతి దేశంలో మీడియా రంగంలో గుత్తాధిపతులు తయారయ్యారు. నీకిది నాకది అన్నట్లుగా నియంతలు, కార్పొరేట్లు, మీడియా అధిపతులు కుమ్మక్కై పంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారందరూ ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకొనేందుకు ఏకం అవుతారని కూడా వేరే చెప్పనవసరం లేదు.

   నయావుదారవాద విధానాలు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతి దేశంలోనూ సాయుధ, ప్రజా పోరాటాలు చెలరేగాయి. దాంతో నియంతలతో ఎల్లకాలం జనాన్ని అణచలేమని గ్రహించిన సామ్రాజ్యవాదం విధిలేని పరిస్థితుల్లో నియంతల స్ధానంలో ప్రజాస్వామ్య వ్యవస్ధల పునరుద్ధరణకు తలవంచక తప్పలేదు. దాంతో దాదాపు ప్రతి దేశంలోనూ ఎన్నికలు స్వేచ్చగా జరిగిన చోట నియంతలను వ్యతిరేకించిన, పోరాడిన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటిలో కొన్ని చోట్ల వామపక్ష శక్తులున్నాయి. క్రమంగా అనేక దేశాలలో అవి ఎన్నికల విజయాలు సాధించటం, పౌరులకు వుపశమనం కలిగించే చర్యలు తీసుకొని ఒకటికి రెండు సార్లు వరుసగా అధికారానికి వస్తుండటం, రాజకీయంగా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకోవటం, తమలో తాము సంఘటితం కావటానికి ప్రయత్నించటం వంటి పరిణామాలు అమెరికన్లకు నచ్చలేదు. దీంతో తిరిగి కుట్రలకు తెరలేపింది. గతంలో లేని విధంగా పార్లమెంటరీ కుట్ర, ప్రజాస్వామ్య ఖూనీలకు పాల్పడింది. వాటికి మీడియా సంస్ధలు వెన్నుదన్నుగా కత్తి చేయలేని పనిని కలంతో పూర్తి చేస్తున్నాయి.

Image result for parliamentary and media coup against elected manual zelaya

హొండురాస్‌ అధ్యక్షుడిని పక్కదేశం కోస్టారికాలో పడేశారు

     హొండూరాస్‌లో జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ దేశాధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యాడు. మితవాద వేదిక నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొని లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. మితవాద కూటమి నుంచి వామపక్ష వైఖరి తీసుకోవటం హొండురాస్‌ మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. విదేశాంగ విధానంతో పాటు అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. ఇంతకంటే ప్రజాస్వామిక ప్రతిపాదన మరొకటి వుండదు. కానీ జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుంటే అధ్యక్షుడు రాజ్యాంగాన్ని సవరించటానికి వీలుంది. రెండవది అధ్యక్షపదవికి ఎన్నిక జరిపే సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించటానికి జనం ఆమోదం కోసం ఓటింగ్‌ జరపాలని పెట్టినందున ఆ ఎన్నికలో ఓడిపోతే ఇంటికి పోవాలి, గెలిస్తే కొనసాగవచ్చు, రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగే సమస్యే అక్కడ తలెత్తలేదు.

    రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి ధిక్కరించటంతో జెలయా అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత జెలయా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని మీడియా బయటపెట్టకపోగా సక్రమమే అని చిత్రించి మద్దతు ఇచ్చాంది.

Image result for parliamentary  coup against elected governments

పరాగ్వేలో పేదల పక్షాన పనిచేయటమే తప్పిదమైంది

      రోమన్‌ కాథలిక్‌ బిషప్‌గా పని చేసిన ఫెర్నాండో అరిమిందో ల్యూగో మెండెజ్‌ పరాగ్వే అధ్యక్షుడిగా 2008-12 సంవత్సరాలలో పని చేశారు. చిన్నతనంలో రోడ్లపై తినుబండారాలను విక్రయించిన ల్యూగో కుటుంబానికి నియంతలను ఎదిరించిన చరిత్ర వుంది. దాంతో ల్యూగో సాధారణ విద్యనభ్యసించి ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్‌గా పని చేశారు. ఆ సందర్భంగా వచ్చిన అనుభవంతో ఆయన క్రైస్తవ ఫాదర్‌గా మారారు. ల్యూగోను ఈక్వెడార్‌లో పనిచేయటానికి పంపారు. అక్కడ పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పేదల విముక్తి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. అది గమనించిన పరాగ్వే పోలీసులు 1982లో స్వదేశానికి తిరిగి వచ్చిన ల్యూగోను దేశం నుంచి వెలుపలికి పంపి వేయాలని చర్చి అధికారులపై వత్తిడి తెచ్చారు. దాంతో ఐదు సంవత్సరాల పాటు రోమ్‌లో చదువుకోసం పంపారు. 1994లో బిషప్‌గా బాధ్మతలు స్వీకరించారు. ఎన్నికలలో పోటీ చేయటానికి వీలుగా తనను మతాధికారి బాధ్యతల నుంచి విడుదల చేసి కొంత కాలం సెలవు ఇవ్వాలని 2005లో కోరారు. చర్చి నిరాకరించింది, తరువాత పోటీ చేసి గెలిచిన తరువాత సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ఆయన భూ పోరాటాలను బలపరిచారు. అప్పటికే పేదల బిషప్పుగా పేరు తెచ్చుకున్న ల్యూగోను అంతం చేస్తామని బెదిరించినప్పటికీ లొంగలేదు. ఆయన తండ్రి నిరంకుశ పాలకులను ఎదిరించి 20 సార్లు జైలుకు వెళ్లటాన్ని ఆయన చూసి వున్నాడు. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.తాను వేతనం తీసుకోనని ప్రకటించాడు.తొలిసారిగా గిరిజన తెగల నుంచి ఒకరిని వారి వ్యవహారాల మంత్రిగా నియమించారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మాదిరి అవినీతి నిరోధం, భూ సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టారు.

    పేదలకు మద్దతు ఇచ్చి భూసంస్కరణలకు పూనుకున్న ల్యూగోను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరిగింది. దానిలో భాగంగా భూ ఆక్రమణ చేసిన పేదలను తొలగించేందుకు పోలీసులు కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్నారు.ఈ వుదంతం దేశంలో అభద్రతకు చిహ్నం అని ప్రచారం ప్రారంభించిన పార్లమెంట్‌ సభ్యులు ప్రజలకు భద్రత కల్పించాలంటే దేశాధ్యక్షుడిని తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. వారం రోజుల్లో పార్లమెంట్‌ వుభయ సభల్లో తీర్మానాలు చేసి తొలగించారు. వున్నత న్యాయ స్ధానం కూడా దానిని సమర్ధించింది. అక్కడి మీడియాకు దీనిలో ఎలాంటి తప్పు కనిపించలేదు.

   ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన బ్రెజిల్‌ వామపక్ష అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ ప్రజాస్వామ్య బద్దంగా పని చేయకపోవటమనే ఒక నేరాన్ని ఆపాదించి అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించారు. ప్రపంచంలో, లాటిన్‌ అమెరికా పరిణామాలలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది.మిలిటరీ కుట్ర, మరొక కుట్ర గురించి చరిత్రలో వుందిగానీ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య, మీడియా కుట్ర ‘ తోడు కావటం ఈ పరిణామంలో గమనించాల్సిన అంశం. అధ్యక్షురాలిపై ఎలాంటి అవినీతి, అక్రమాల కేసులు లేవు. అయినప్పటికీ అక్కడి మీడియా ఆమెను అవినీతిపరురాలిగా చిత్రించి జనాన్ని నమ్మేట్లు చేసింది. అభిమానించిన జనమే అనుమానించేట్లు చేయటాన్ని చూసి శకుని సైతం సిగ్గు పడేట్లు, తనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని తలపట్టుకునేట్లు చేసింది. ఎన్నికలను తొత్తడాన్ని చూశాము, ఎన్నికైన ప్రభుత్వాలను ఎంత సులభంగా కూలదోయవచ్చో చూస్తున్నాము. బ్రెజిల్‌ అధ్యక్షురాలిపై బాధ్యతా నిర్వహణలో వైఫల్యమనే నేరాన్ని ఆరోపించి పదవి నుంచి తొలగించటం ప్రజాస్వామ్యం, ప్రజాతీర్పును పరిహసించటమే. పార్లమెంట్‌ అనుమతి లేకుండా దిల్మా రౌసెఫ్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాలలో అలా ఖర్చు చేయటం తరువాత పార్లమెంట్‌ ఆమోదం పొందటం అన్నది అన్ని చోట్లా జరిగినట్లే అక్కడా జరిగింది. అటువంటి పద్దతులను నివారించాలంటే అవసరమైన నిబంధనలను సవరించుకోవచ్చు, రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. అసలు లక్ష్యం వామపక్ష అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించటం కనుక ఏదో ఒక సాకుతో ఆపని చేశారు. దొంగే దొంగ అని అరచి నట్లుగా అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్నవారే అధ్యక్షురాలిపై కుట్ర చేసి పార్లమెంట్‌, కోర్టులను వుపయోగించుకొని పదవి నుంచి తొలగించారు.ఈ క్రమం ప్రారంభమైనపుడే అనేక మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిశంసనకు ఎలాంటి ఆధారమూ లేదని ప్రకటించారు. అయినా జరిగిపోయింది.పాండవ పక్షపాతి కృష్ణుడికి ముందుగా వచ్చిన ధుర్యోదనుడిని తప్పించుకోవటానికి ముందుగ వచ్చితీవు, మున్ముందుకు అర్జును జూచితి అన్నట్లుగా దిల్మా రౌసెఫ్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన వారందరూ దాదాపు ఏదో ఒక అవినీతి కుంభకోణం కేసులలో వున్నవారే అయినా మీడియాకు అదేమీ కనిపించలేదు.

  వామపక్ష శక్తులు శక్తివంతమైన మీడియాతో ప్రారంభం నుంచి సర్దుకు పోయేందుకు ప్రయత్నించాయి. దాంతో తొలి రోజుల్లో ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా వున్న పత్రికలు అవకాశం దొరికనపుడల్లా వామపక్షాలపై ఒకరాయి విసురుతూ పని చేశాయి. లాటిన్‌ అమెరికాలోని కార్పొరేట్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదులు వామపక్ష శక్తులను అదికారం నుంచి తొలగించాలనుకున్నతరువాత మీడియా పూర్తిగా వాటితో చేతులు కలిపింది.మచ్చుకు బ్రెజిల్‌ మీడియా సంస్ధల నేపధ్యాన్ని చూస్తే అవి వామపక్షాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలోని మీడియా సంస్ధలన్నీ దాదాపు కుటుంబ సంస్థలే. బ్రెజిల్‌లోని రెడె గ్లోబో మీడియా సంస్ధ రాబర్ట్‌ మారినిహో కుటుంబం చేతుల్లో వుంది. 1980 దశకం నాటికే అధికారంలో వున్న మిలిటరీ నియంతల ప్రాపకంతో 75శాతం వీక్షకులు, చదువరులపై ఆధిపత్యం సాధించింది. నియంతల పాలన అంతరించిన తరువాత 1989లో జరిగిన తొలి ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలో పిటి పార్టీ నేత లూలా డిసిల్వాను ఓడించిన ఫెర్నాండో కాలర్‌కు ఈ సంస్ధకు చెందిన టీవీ గ్లోబో బహిరంగంగా మద్దతు ఇచ్చింది. 1990దశకంలో కొత్త సంస్ధలకు అవకాశ ం ఇచ్చినప్పటికీ దాని పట్టు తగ్గలేదు. వామపక్ష పిటి పార్టీ అధికారానికి వచ్చిన తరువాత కూడా 2005లో బ్రెజిల్‌ ప్రకటనల బడ్జెట్‌లో సగం మొత్తం దానికే వెళ్లింది. అయినప్పటికీ మీడియా తన కార్పొరేట్‌, సామ్రాజ్యవాద అనుకూల వైఖరులను ప్రదర్శించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ పూర్వరంగంలో మీడియా రంగాన్ని ప్రజాస్వామీకరించాలన్న అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చుతుండగా, గుత్త సంస్ధలుగా ఎదగకుండా ఆంక్షలు విధించాలని మరికొందరు చెబుతున్నారు. వర్గ వ్యవస్ధలో దోపిడీదారులకు ఒక ఆయుధంగా మీడియా వుపయోగపడుతున్నందున ప్రత్యామ్నాయ మీడియాను కూడా రూపొందించాలనే అభిప్రాయం కూడా వెల్లడి అవుతోంది. అయితే ఈ ప్రతిపాదనలేవీ నిర్ధిష్ట రూపం తీసుకోవటం లేదు.

గమనిక ఈ వ్యాసం ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి ‘ మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది.