Tags

, , , , ,

Image result for Telugu desam started offensive against people

ఎం కోటేశ్వరరావు

     మహానటుడు నందమూరి తారకరామారావు సినిమాలలో చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు ఆనందాన్ని పంచితే సినిమా పరిభాషలో చెప్పాలంటే కొంతమంది దృష్టిలో అయినా ‘తోడు దొంగలు ‘ గా కనిపిస్తూ, ఎన్‌టిఆర్‌ అసలు సిసలు వారసులం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, మితృపక్షం బిజెపి నాయకులు నిజజీవితంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరుల ముందు నటిస్తున్నారు. ఎన్‌టిఆర్‌ సినిమాలు చివరకు సుఖాంతంగా ముగిశాయి. ప్రత్యేక తరహా హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కలిగే ప్రత్యేక సాయం అనే వీరి నటన ఎలా ముగుస్తుందన్నది ఆసక్తికరం. ఎందుకంటే రియాలిటీ షో కదా ! ఇలాంటి షోలు ఫలానా విధంగా మాత్రమే నిర్వహించాలనే , ఫలానా విధంగా ముగించాలనే నిబంధనేమీ లేదు. వ్యాపారం కనుక వారికి అనుకూలమైన రీతిలో వాటిని రూపొందిస్తారు.ఈ రియాలిటీ షోలో రాని ప్రత్యేక హోదా , దాని కంటే ఎలా మెరుగో తెలియని లేదా వారైనా చెప్పని ప్రత్యేక సాయంపై జనంపై ఎదురు దాడికి దిగారు. త్వరలో ఈ సాయానికి కేంద్ర కాబినెట్‌ ఆమోద ముద్ర వేసిన తరువాత అదింకా పెరగవచ్చు లేదా జనంలో ప్రతికూలత వ్యక్తమైతే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గ వచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం తమ ఆత్మరక్షణ, సమర్ధనకు వూరూరా ఎదురుదాడి చేయాలనే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Image result for venkaiah naidu

దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి ‘పంచాంగ ‘ వెంకయ్య

      రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇక రాదు అన్నది సుస్పష్టం. దీనికి జనాన్ని మానసికంగా సిద్ధం చేయటానికి 27నెలల పాటు కసరత్తు చేయాల్సి వచ్చిందంటే ఈ విషయంలో తెలుగుదేశం, బిజెపిలు ఎంత భయపడ్డాయో, ఆందోళనకు గురయ్యాయో చెప్పకనే చెప్పినట్లయింది. ఎంతైనా బిజెపివారి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలు, తెలుగుదేశం వారి సినిమా దర్శకత్వాలతో పార్లమెంటరీ చర్చల ట్విస్టులమీద ట్విస్టులు, అసెంబ్లీ తీర్మానాల ప్రహసనాలు, అనుకూల, సానుకూల పత్రికలు, టీవీలలో లీకుల వార్తల వడ్డన, వుత్తుత్తి బెదిరింపులు, అలకలు , పిట్టకథలు అబ్చో ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేశారు. జనానికి ఎంతో వినోదం కలిగించారు. ఇప్పుడు చెబుతున్న ఆసాధ్యాలు, సుసాధ్యాల గురించి వుభయ పార్టీల పెద్దలు పార్లమెంట్‌, అసెంబ్లీ చర్చలలో ఎందుకు చెప్పలేదని ఎవరైనా అడిగితే అది రాష్ట్ర ద్రోహం అవుతుంది. కనీసం ఎప్పుడు జ్ఞానోదయం అయిందో అదైనా చెప్పాలి. దొంగను దొంగంటే నువ్వు దొంగ, నీ కుటుంబం అంతా దొంగలే అని ఎదురుదాడి చేస్తారు. తెలుగుదేశం,బిజెపిలు ఇపుడు ఎదురుదాడికి దిగాయి. పార్లమెంట్‌లో తానొక్కడినే మాట్లాడానని,కమ్యూనిస్టులుగానీ మిగతా వారు ఎందుకు మాట్లాడలేదని వెంకయ్య నాయుడు, పాకేజి కంటే ఇంకా మెరుగైనదేమిటో చెబితే తాను పోరాడతానని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. వెంకయ్య నాయుడి వ్యవహారం దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా వుంది. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి తానొక్కడినే పట్టుబట్టినట్లు ఒక ఘనతగా చెప్పుకున్నారు. తీరా తామే దానికి మొండిచేయి చూపాల్సి వచ్చేసరికి తానసలు అంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాదని అయినా దానికోసం ఎంతో చేస్తే విమర్శిస్తారా అంటున్నారు. గత రెండున్నర సంవత్సరాలలో ఎన్నడూ ఈ మాట ఎక్కడా ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పలేదు ? కావమ్మ మొగుడని మీరంతా అంటే కామోసు కామోసనుకొని ఇంతకాలం కాపురం చేశా, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే వెళ్లి పోతా అన్నాడట వెనుకటి కెవడో ! ‘పంచాంగ’ నాయుడిగారి తీరు అలాగే వుంది.

     రాష్ట్ర విభజన ఒక రాజకీయ నిర్ణయం. దానిలో భాగస్వాములు కానిది ఒక్క సిపిఎం మాత్రమే. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు మిగతా పార్టీలన్నీ ఎంతో కొంత దానిలో భాగస్వాములే. ఒక వైపు రెండు కళ్ల సిద్ధాంతం చెబుతూ చంద్రబాబు నాయుడు తన పాత్రను చక్కగా పోషించారు. విభజన చట్టంలోని అంశాల గురించి ఏం మాట్లాడితే జనం ఏమనుకుంటారో, రాజకీయంగా నష్టమా లాభమా అని ఆలోచించి విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సమయంలో విభజన సరిగా లేదంటూ తెలుగుదేశం పార్టీ గోడమీది పిల్లివాటం ప్రదర్శించింది. భాషా ప్రయ్తు రాష్ట్రాలను విడదీయకూడదన్న తమ సూత్రబద్ద వైఖరికి సిపిఎం కట్టుబడి వుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా విభజితమయ్యే రెండు రాష్ట్రాలలోనూ తమ పలుకుబడి పెంచుకోవచ్చన్న దురాశతో బిజెపి నేతలు కాంగ్రెస్‌ నిర్ణయానికి వంతపాడారన్నది నగ్నసత్యం. అందుకే వెంకయ్య నాయుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు తప్ప నిజానికి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కాదు. ఆ పెద్దమ్మనే (సోనియా గాంధీ) కాదు, ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండని సుష్మాస్వరాజ్‌ తెలంగాణా వాసులను, కాంగ్రెస్‌ ఐదంటే కాదు పది అని పట్టుబట్టి ప్రత్యేక హోదాకు ఒప్పించింది తామే అని బిజెపివారు ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకున్న విషయాన్ని కాదంటారా ? అప్పుడు ఏ పార్టీ వారు కూడా పాకేజి గురించి మాట్లాడలేదు. మాట తప్పింది, ద్రోహం చేసింది బిజెపి . అందువలన హోదా గురించి మాట్లాడింది మీరే కనుక ఆ ఖ్యాతిని కూడా గుండుగుత్తగా వుంచుకోండి , ప్రత్యేక హోదాను తప్ప అందుకు వచ్చే ఖ్యాతిలో వాటా ఇమ్మ ని ఎవరైనా అడిగితే వెంకయ్యకు కోపం వస్తే అర్ధం వుంది. ఎవరూ అడగటం లేదే ! ఒక రాజకీయ పార్టీ మీద మరొక పార్టీ ఎదురుదాడి చేస్తే కొంత వరకు అర్ధం చేసుకుంటారు, కానీ మొత్తం జనం మీదే ఎదురుదాడికి దిగి లబ్ది పొందిన రాజకీయ పార్టీ మనకు ఎక్కడా కనపడదు. ఇపుడు కొన్ని రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని బిజెపి,తెలుగుదేశం పార్టీలు ప్రశ్నించిన జనం మీదే తుపాకులు ఎక్కుపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాకపోయినా నన్నే తిడతారా అంటూ వెంకయ్య నాయుడి రుసరుసలు.ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి కాకపోయినా రాష్ట్రానికి ఎంతో చేశారంటూ ఆ పెద్దమనిషికి బిజెపి నేతలు సన్మానాల మీద సన్మానాలు చేస్తున్నారు. రెండు పార్టీలకు చట్ట సభల్లో సరిపడా తగిన మద్దతు వుంది,కావాలనుకుంటే ఎదుటి పార్టీల ప్రతినిధులను ఆకర్షించగలిగే అధికారం వుంది, నీతి నియమాలను ఎప్పుడో గాలికి వదిలి నిరంతరం ఎక్కడ అధికారమనే పంచదార వుంటే అక్కడికి చేరే చీమల మాదిరి పార్టీలు మారటానికి సిద్ధంగా వున్న జనం వున్నారు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ఎదురు దాడి ప్రారంభించిన చంద్రబాబు

    వెంకయ్య నాయుడి మాటలలో చెప్పాలంటే ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండానే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకున్నారు. పదేళ్లలో చేయాల్సిందానిని రెండు సంవత్సరాలలోనే కేంద్రం ఎన్నో చేసిందని వెంకయ్య నాయుడు టాం టాం వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దీనికి కృతజ్ఞతల మీద కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరూ వాడా ప్రచారం చేసింది, అశలు కల్పించింది మీరు. ఎప్పుడూ పాకేజి గురించి చెప్పలేదు. ఇప్పుడు పాకేజి కంటే మెరుగైనదేమిటో చెప్పమని చంద్రబాబు, తెలుగుదేశ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అది కూడా చెప్పాల్సింది మీరే. పద్నాలుగవ ఆర్ధిక సంఘం కొత్తగా ప్రత్యేక హోదాను ఇవ్వకూడదని సిఫార్సు చేసిందని ఒక మాట, ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతావన్నీ తమకూ అడుగుతాయి,ఇవ్వకపోతే ఎన్‌డిసిలో వ్యతిరేకిస్తాయి అని మరోమాట, ఇప్పటికే వున్న రాష్ట్రాలకు కూడా రద్దు చేయబోతున్నాం అని ఇంకోమాట. ఏదో ఒక మాట మీద కట్టుబడి వుండాలి కదా !

    ప్రత్యేక హోదాకు ఇన్ని ఆటంకాలు చెప్పిన పెద్ద మనుషులు ప్రత్యేక పాకేజీ కూడా లేకుండా ప్రత్యేక సాయం అని పేరు పెట్టి ఒక ప్రకటన చేశారు. ఓకే ఆంధ్రప్రదేశ్‌ పట్ల జాలి, దయ, కరుణతో ఈ సాయం చేస్తున్నారని అనుకుందాం. అది నిబంధనలకు అనుగుణంగానా, లేక పక్కన పెట్టారా ? అనుగుణ్యంగానే అయితే దానిలో ప్రత్యేకత ఏమున్నట్లు. వుదాహరణకు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన ఆదాయలోటు రు.22,113 కోట్ల మొత్తాన్ని ఐదు సంవత్సరాలలో కేంద్రం చెల్లిస్తుంది. దీన్ని ప్రత్యేక సాయం అంటున్నారు, అది ఎలా అవుతుంది ? రాష్ట్రాన్ని విడగొట్టకపోయినా ఆ మొత్తం వచ్చేదే. ఎందుకంటే మన రాష్ట్ర విభజనతో నిమిత్తం లేని పధ్నాలుగవ ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్‌తో పాటు పదకొండు రాష్ట్రాలకు రు.1,94,821 కోట్ల రూపాయలను ఐదు సంవత్సరాల కాలంలో చెల్లించాలని సిఫార్సు చేసింది. విశాఖ పట్టణం నగరం కంటే తక్కువ జనాభా వున్న నాగాలాండ్‌ రాష్ట్రానికి రు.18,475, జమ్ము కాశ్మీర్‌కు 60, హిమచల ప్రదేశ్‌కు 40వేల కోట్లు ఇవ్వనున్నారు. దీన్ని గురించి ఏమంటారు ?http://ficci.in/SPdocument/20563/Highlights_14thFinance_Commission_Report.pdf

    ప్రత్యేక హోదాకు,పరిశ్రమల రాయితీలకు సంబంధం లేదని ఒక మాట. విభజన చట్టంలోనే హోదా గురించి అప్పుడు కాంగ్రెసే పెట్టి వుంటే పోయేది, ఆ పని చేయకుండా అన్యాయం చేసిందని ఒక విమర్శ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే పరిశ్రమలన్నీ అక్కడికే తరలి పోతాయని తమిళనాడు అభ్యంతరం చెబుతున్నదని వెల్లడించింది ఎవరు ? హోదాకు రాయితీలకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ జనాల మెదళ్లకు ఎక్కించేందుకు కష్టపడకపోతే అదేదో అభ్యంతరాలు పెట్టే రాష్ట్రాలకు ఎందుకు నచ్చచెప్పలేకపోయినట్లు ? రాని హోదా గురించే పట్టుబట్టి ఇచ్చే రాయితీలసు కూడా వద్దందామా అని మరొక ఎదురుదాడి.ఈ కాలంలో వెంకయ్య నాయుడి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమిటో, హోదాతో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చేసిందేమిటో ఒక శ్వేతపత్రం ప్రకటించి వివరిస్తే తప్ప జనానికి వాస్తవం అర్ధం కాదు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ప్రధాని అలా మనవి చేసుకుంటారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ?

      అన్నింటికీ కొత్త అర్ధాలు చెబుతున్న మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశానికి కూడా కొత్త భాష్యం చెప్పినట్లు ఒక అస్మదీయ పత్రిక వార్తలను బట్టి తెలిసింది. ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్‌ భేటీ అయ్యారని 40 నిమిషాలలో సగం పాకేజి,ఆంధ్రప్రదేశ్‌ గురించే మాట్లాడారని లీకుల కధనం. ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు ప్రధానో లేక గవర్నరో అస్మదీయ పత్రికల విలేకర్లను పిలిచి చెవిలో వూది వుండాలి. లేకపోతే వారి ప్రతినిధులు కల్పించిన కధనమైనా అయి వుండాలి. తామేం చేసినా, చెప్పినా నోరు మూసుకొని వినాలి, పడి వుండాలన్న బరితెగింపు కాకపోతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే సమస్య మరింత జఠిలం అవుతుందని ప్రధాని మోడీ అభిప్రాయ పడినట్లు ఆ కధనంలో వుంది.అలాంటపుడు మజ్లిస్‌ పార్టీ ప్రతినిధితో సహా అఖిల పక్ష బృందాన్ని కాశ్మీర్‌కు ఎందుకు పంపినట్లు ? సమస్యను మరింత జఠిలం చేయటానికా ? ఇక ముందు ఎలాంటి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయరని భావించాలా ? అభివృద్ధి కావాలనుకున్నవారు ప్యాకేజీని స్వాగతిస్తారని, సమస్యను సాగదీసి రావణకాష్టం చేయాలనుకున్నవారు మాత్రమే విమర్శలు చేస్తారని ప్రతిపక్షాలపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్యాకేజికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందట. కొన్ని ప్రాంతాలలో ఇలాంటి వాటిని పోసుకోలు కబుర్లు అంటారు. హోదా బదులు వట్టిస్తరి మంచినీళ్ల వంటి పాకేజీకి జనాన్ని ఒప్పించటానికి పడుతున్న పాట్లు తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. పాకేజి పట్ల 60శాతం జనం సంతృప్తిగా వున్నారని ప్రతిపక్షాలు మాత్రం హోదా వల్ల అమిత ప్రయోజనాలు కలుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నాయని గవర్నర్‌ ప్రధానితో చెప్పినట్లుగా వుంది. ఒక గవర్నర్‌ ప్రధానితో కలిసినపుడు ఒక వేళ చెప్పాల్సి వస్తే ఏ పార్టీ వైఖరి ఏమిటో చెబుతారు తప్ప దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఒక రాజకీయ నేత మాదిరి ఫిర్యాదు చేస్తారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ? ప్రతిపక్షాలపై తాము చేయదలచుకున్న ఆరోపణలను గవర్నర్‌కు ఆపాదించి వాటికి విశ్వసనీయత కల్పించ చూసే అతి తెలివి తప్ప మరొకటి కాదు . అంతకంటే పెద్ద తెలివి తక్కువ పదజాలం చూడండి. ‘ ఇంకొన్ని అంశాలలో ఏపీకి సాయం అవసరమనే విషయం మేమూ గుర్తించాం. వాటిని కూడా అందించటానికి ప్రణాళిక రూపొందించుకుంటాం ‘ అని ప్రధాని పేర్కొన్నారట. ప్రణాళికను రూపొందించుకుంటాం అని ప్రధాని అన్నట్లుగా రాయటం చంద్రబాబు మెప్పు పొందటానికి తప్ప మరొకటి కాదు. ఒక కింది స్ధాయి అధికారి పెద్ద అధికారితో ‘మనవి’ చేసుకున్నట్లుగా వుంది తప్ప ఒక ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్య మంత్రితో మాట్లాడినదిగా లేదు. అయితే ఇక్కడ ఒకటి జరిగి వుండటానికి ఆస్కారం వుంది. ఆంగ్ల భాషలో ప్రధాని అంత పండితుడు కానట్లే హిందీలో కూడా చంద్రబాబు అంతే. అందువలన ఒకరు హిందీలో మరొకరు ఆంగ్లంలో ఫోన్లో మాట్లాడి నపుడు సదరు వార్త రాసిన విలేకరి పక్కనే వుండి విని రాసుకోవటం లేదా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడిన దానిని తర్జుమా చేయటంలో వచ్చిన ఇబ్బంది కానీ అయి వుండాలి.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

చంద్రబాబు చక్రం తిప్పటంపై జనంలో ఇంకా ఆశలు

    తెలుగుదేశ నాయకత్వ ఆరోపణలను వారి మాటల్లో చెప్పాలంటే వారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు జనాన్ని రెచ్చగొడుతున్నాయి. జనం రెచ్చిపోయిన సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. అంతా శాంతియుతంగా వుంది. కనుక తెలుగుదేశమే ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్నది అనుకోవాలేమో ! ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక హోదా రాష్ట్రం అంటే ఏమిటో జనానికి ఒక బ్రహ్మ పదార్ధంగా తయారైంది. అది రాదని తెలిసిన తెలుగుదేశం, బిజెపిలు , వాటికి కొమ్ముకాసే మీడియా దాని వలన కలిగే ప్రయోజనాలను జనానికి వివరించి చైతన్య పరచటం, ఆశలు కలిగించటం తమకు నష్టమని భావించాయన్నది కొందరి అభిప్రాయం. కర్ణుడి రధం నడుపుతూనే అతనిని దెబ్బతీయటానికి ప్రయత్నించిన సారధి శల్యుడి మాదిరి అస్మదీయ మీడియా జనం పక్షం అని చెపుతూనే ప్రత్యేక హోదా పట్ల జనంలో ఆసక్తి సన్నగిల్లి పోవటానికి శల్యసారధ్యం చేస్తున్నదా ? ఆ మేరకు జయప్రదమైనట్లే కనిపిస్తున్నది. ప్రత్యేక హోదా రాదన్న నిరాశ, నమ్మిన వారే మోసం చేశారన్న ఆశక్తత జనంలో కనిపిస్తోందన్నది ఒక అభిప్రాయం. రెండో వైపు ప్రతిపక్షంపై విస్వసనీయత లేకపోవటంతో నిజం చెప్పినా నమ్మని స్ధితి, వామపక్షాలు నామమాత్రంగా మారటం. మూడో అభిప్రాయం కూడా వుంది అదేమంటే తిమ్మిని బమ్మిని చేయగల చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఐటి రంగంలో అమరావతిని మరో హైదరాబాదుగా మారుస్తారనే గుడ్డి విశ్వాసం బలంగా వుండబట్టే హోదా లేకపోయినా ఇచ్చిందాంతో సంతృప్తి చెందుదామనే భావనకు లోనయ్యారనే అభిప్రాయమూ వుంది.

  ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న శతకకారుడిని బిజెపి-తెలుగుదేశం పార్టీలు ఆశ్రయించినట్లు ఇప్పుడు వారి మాటలను బట్టి చెప్పవచ్చు. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి జనాన్ని భ్రమ పెడితే ఇప్పుడు ప్రత్యేక హోదా లేకపోయినా రాయితీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తారని బాబొస్తే జాబొస్తుందన్న పాత నినాదాన్ని తిరిగి జనానికి గుర్తు చేశారు. ఇది మరొక ఆశాభంగానికి నాంది అవుతుందా ?