Tags

, , ,

ఎంకెఆర్‌

     ఈ నెల పద్దెనిమిదవ తేదీన రష్యా పార్లమెంట్‌ డ్యూమా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారంటే ప్రస్తుతం అధికారంలో వున్న పుతిన్‌ నాయకత్వంలోని ఐక్య రష్యా(యునైటెడ్‌ రష్యా) పార్టీ అని దాదాపు మీడియా ఏకగ్రీవంగా చెబుతున్నది, అదే వాస్తవం అవుతుంది. ఎందుకంటే రెండవ పెద్ద పక్షంగా వున్న కమ్యూనిస్టు పార్టీకి అధికార పక్షానికి మధ్య తేడా చాలా వుంది. అయినప్పటికీ రష్యన్‌ ఎన్నికలు ఆసక్తిని కలిగించేవే. అనేక తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన పాతిక సంవత్సరాల తరువాత కూడా అక్కడ కమ్యూనిస్టులపై వేట సాగుతున్నది. కమ్యూనిస్టుల పాలనా కాలంలో సాగించిన నేరాల పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను తీవ్రంగా రెచ్చగొడుతున్నారు. రష్యాలో పరిస్థితి దానికి భిన్నంగా వున్నది. మిగతా తూర్పు ఐరోపా దేశాలలో అత్యధిక చోట్ల కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగయ్యాయి. రష్యాలో రెండవ పెద్ద పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టులే వున్నారు.

   ఇక 450 స్థానాలున్న పార్లమెంట్‌లో సగం స్ధానాలకు దామాషా ప్రాతినిధ్య పద్దతిలో, మిగిలినవి నియోజకవర్గ ప్రాతిపదికన జరుగుతాయి. ఏ పక్షమైనా ప్రభుత్వ ఏర్పాటుకు 226 సీట్లు సాధించాల్సి వుంది. రద్దయిన పార్లమెంట్‌లో ఐక్య రష్యాకు 238, ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీకి 92, ఫెయిర్‌ రష్యాకు 64, కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి 56 స్ధానాలున్నాయి. ఈ ఎన్నికలలో ఈ నాలుగుతోపాటు ఏదో ఒక ప్రాంతీయ శాసనసభలో ప్రాతినిధ్యం కలిగి వున్న కారణంగా పోటీకి అర్హత సాధించిన మరో పది పార్టీలు పోటీలో వున్నాయి. కనీసంగా ఐదుశాతం ఓట్లు సాధించిన పార్టీలకే దామాషా పద్దతిలో సీట్లను కేటాయిస్తారు. కమ్యూనిస్టు వ్యతిరేక పార్టీలుగా ప్రకటించుకున్నవాటితో పాటు వివిధ కమ్యూనిస్టు, సోషలిస్టు భావజాలం వున్న చిన్న పార్టీలు కూడా ఈ పధ్నాలుగులో వున్నాయి. గత ఎన్నికలలో కేవలం నాలుగు పార్టీలు మాత్రమే పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం పొందాయి. ఈ సారి ఫలితాలు ఎలా వుండేది ఆసక్తి కరం.

    ఈ ఎన్నికలలో ఎంపీలతో పాటు మన ముఖ్యమంత్రుల స్ధాయిలో వుండే ప్రాంతాల గవర్నర్లు, స్థానిక శాసనసభలు, మున్సిపల్‌ ప్రతినిధులను కూడా ఎన్నుకుంటారు.తొలిసారిగా ఒకే రోజు అన్ని ఎన్నికలు జరగనున్నాయి. నియోజకవర్గాల వారీ ఎన్నికలు జరిగే 225 సీట్లలో పోటీ చేసే పార్టీలు కనీసంగా మూడు శాతం ఓట్లు, లేదా పన్నెండు సీట్లు సాధిస్తే అవి ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వం నుంచి నిధులు పొందటానికి అర్హత సాధిస్తాయి. పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల దామాషా ప్రాతికన చెల్లించాల్సిన మొత్తాన్ని విడతలవారీ వచ్చే ఎన్నికల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏ పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్ధి అయినా కొత్తగా ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే నిర్ణీత సంఖ్యలో ఓటర్ల సంతకాలు సేకరించి ఎన్నికల కమిషన్‌కు అందచేసిన తరువాత నిబంధనల మేరకు వుంటే అనుమతిస్తారు. ఒక పార్టీ దేశంలోని 29 ప్రాంతాలు లేదా రాష్ట్రాల నుంచి రెండులక్షలు, ఒక అభ్యర్ది తన నియోజకవర్గంలోని మూడుశాతం ఓటర్ల సంతకాలను సేకరించాలి. గత పార్లమెంట్‌ ఎన్నికలలో కనీసంగా మూడు శాతం ఓట్లు లేదా ఏదేని ఒక ప్రాంతీయ శాసనసభలో ఒక్కరైనా ప్రాతినిధ్యం కలిగి వున్న పార్టీలకు సంతకాలతో పని లేదు. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి ఫిరాయించి దానిలో కొనసాగిన వారికి కూడా ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. గత ఎన్నికల నాటికి ఏడు పార్టీలు వుంటే ప్రస్తుతం 74కు పెరిగింది.

   కమ్యూనిస్టుల పాలనా కాలంలో ఎన్నికలపై జనంలో పెద్ద ఆసక్తి వుండేది కాదని కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా దుమ్మెత్తి పోసేది. అది పాక్షిక సత్యం మాత్రమే. ఎందుకంటే మనకు మాదిరి డబ్బు,అక్రమాల వంటి ప్రలోభాలు వుండేవి కాదు కనుక సహజంగానే ఆసక్తి కలిగించవు. ఆదివారం నాడు జరగబోయే ఎన్నికల ఫలితం ముందే తెలిసినప్పటికీ, విసుగు పుట్టించేవని, పార్లమెంట్‌ అంటే రబ్బరు స్టాంపు తప్ప మరొకటి కాదని అనేక మంది వర్ణించినప్పటికీ ఓటు వేసేందుకు ఒక మహిళ ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందని, ప్రజాస్వామ్యం పట్ల అక్కడి వారిలో వున్న విశ్వాసానికి నిదర్శనమని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.ఆర్ధికంగా అనేక సమస్యలు తీవ్రంగా వున్నప్పటికీ వుక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని రష్యాలో విలీనం చేసిన 2014 నుంచి అధ్యక్షుడు పుతిన్‌ పలుకుబడి పెరిగిందని పరిశీలకులు చెబుతున్నారు.ఎన్నికల ప్రచారానికి అధికార పార్టీకే ఎక్కువ సమయం కేటాయించారనే విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో అధికార ఐక్య రష్యా పార్టీ చౌకబారు జిమ్మిక్కులకు పాల్పడిందని రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ (సిఆర్‌పిఎఫ్‌) విమర్శించింది. కమ్యూనిస్టు పార్టీ పేరుతో నకిలీ న్యూస్‌ పేపర్లను తయారు చేయటం, ప్రత్యర్ధుల అవకాశాలను దెబ్బతీసేందుకు డబ్బులిచ్చి కొందరు అభ్యర్ధులను రంగంలోకి దించటం వంటి అక్రమాలకు పాల్పడిందని పేర్కొన్నది. అనుమతించిన సంఖ్యకంటే తక్కువగా ఎన్నికల పర్యవేక్షకులను ఎన్నికల అధికారులు నియమించటం, జర్నలిస్టులకు ప్రవేశాలను పరిమితం చేయటం వంటి చర్యలకు కూడా పాల్పడ్డారని తెలిపింది. ప్రయివేటీకరించిన ప్రభుత్వ రంగ సంస్ధలు, సేవలను తిరిగి జాతీయం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ జవాబుదారీ తనం పెరగాలని, విద్య, ఆరోగ్యం, గృహాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయింపులు పెంచటం ద్వారా రష్యన్‌ కార్మికుల జీవితాలను మెరుగుపరచాలనే నినాదాలతో కూడిన పది అంశాల ప్రణాళికతో తాము పోటీ చేస్తున్నట్లు తెలిపింది.

     పోటీ చేస్తున్న పార్టీలలో అధికార ఐక్య రష్యా గత పాతిక సంవత్సరాలలో ఇంతవరకు ఒక్క సారి కూడా తన సభ్యుల సంఖ్యను వెల్లడించలేదు. ఎప్పటికప్పుడు సంఖ్య మారిపోతూ వుంటుందనే పేరుతో తప్పించుకుంటోంది. అనధికార అంచనా.పార్టీలో సభ్యులు కాని వారు కూడా ఆ పార్టీ అభ్యర్ధులుగా ఎన్నికలలో పోటీ చేయవచ్చు.అక్కడి రాజ్యాంగం ప్రకారం పార్టీ సభ్యులు కాని వారు యాభైశాతం కంటే లోపు పార్టీయేతరులను ఏ పార్టీ అయినా ఎన్నికలలో నిలవవచ్చు. అధికార పార్టీ ఎంపీలుగా ఇలాంటి వారు చాలా మంది వున్నారు.కమ్యూనిస్టు పార్టీ చైర్మన్‌గా వున్న గెన్నడీ జుగనోవ్‌ పూర్వపు సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. పచ్చిమితవాది జిరినోవస్కీ లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వున్న మరో పార్టీ ఫెయిర్‌ రష్యా అధికార ఐక్య రష్యాకు మద్దతుదారుగా వుంటుంది. దానితో రాజకీయంగా ఎలాంటి విబేధాలు లేవు. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న వాటిలో రష్యా కమ్యూనిస్టులు అనే పార్టీ ఒకటి. ఇది జుగనోవ్‌ నాయకత్వంలోని రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ నుంచి 2012లో చీలిన వారితో ఏర్పడింది. తాము మరింత మిలిటెంట్‌ పద్దతులలో పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించుకుంది. అంతకు ముందు ఆ పార్టీలోని కొందరు ఒక ప్రభుత్వేతర సంస్ధను నిర్వహించారు. మ్యూనిస్టు పార్టీ గురించి ఓటర్లలో గందర గోళం కలిగించేందుకు, ఓట్లను చీల్చేందుకు ఏర్పరచిన ఒక నకిలీ పార్టీ ఇదని రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ విమర్శించింది.

   మీడియాలో వస్తున్న వార్తలను బట్టి గత ఎన్నికలలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లడి కావటం, గతకొద్ది సంవత్సరాలుగా ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందులలో పడటం వంటి కారణాలతో పాటు అనేక మంది అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు పడటం వంటి కారణాలతో అధికార పక్షం అక్రమాలకు పాల్పడకుండానే క్రిమియాను రష్యాలో కలపటం వంటి కొన్ని చర్యలను చూపి ఓట్లు సాధించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. రెండవది దాని అధికారాన్ని సవాలు చేసే పార్టీ లేనందున అక్రమాలకు పాల్పడి చెడ్డపేరు ఎందుకు తెచ్చుకోవాలన్నది కూడా ఒక కారణంగా వినిపిస్తున్నది.

    ఎన్నికల విషయానికి వస్తే దామాషా విభాగంలో జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు 225 మందితో కూడిన అభ్యర్ధుల జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందచేయాల్సి వుంటుంది. నియోజకవర్గాల వారీ జరిగే ఎన్నికలలోఅధికార ఐక్య రష్యా 225 నియోజకవర్గాలకు గాను 18చోట్ల పోటీలో లేదు. మిగతా పార్టీల వివరాలు అందుబాటులో లేవు. ఫలితాలపై వస్తున్న వూహాగానాల ప్రకారం కమ్యూనిస్టులు గత పార్లమెంట్‌లో వున్న బలాన్ని నిలుపుకోవచ్చు, మిగతా రెండు పార్టీలు కోల్పోయే సీట్లను అధికార ఐక్య రష్యా కైవసం చేసుకొని తన బలాన్ని పెంచుకోవచ్చు లేదా ఇప్పుడున్న స్ధితిలోనే వుండవచ్చు.