Tags

, ,

Image result for pulses

ఎం కోటేశ్వరరావు

   గత 28 నెలల పాలనా కాలంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక ‘ విజయాలు ‘ సాధించింది. తెలుగువారి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాకు మించి ‘ప్రత్యేక సాయం ‘ కూడా వాటిలో ఒకటి కనుకనే చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీకి నీరాజనాలు పలుకుతున్నారు. వెంకయ్య నాయుడు తాను ఆంధ్రప్రదేశ్‌కు ప్రతినిధిని కాదంటూనే ఏపికి ప్రత్యేక సాయం సాధించిన పేరుతో సన్మానాలు చేయించుకోవటం చూస్తున్నాము. మోడీ పాలనా విజయాల విషయానికి వస్తే అన్ని రకాల పప్పుల ధరలు రికార్డు స్ధాయికి పెరిగి ఒక చరిత్రనే సృష్టించాయి. దానిని నరేంద్రమోడీ తప్ప మరొకరు అధిగమించే సూచనలు కనిపించటం లేదు. స్వంత డబ్బులతో పప్పులను కొనుగోలు చేసే వారు షాక్‌ తిన్నారు. కిలో కోడి మాంసం కంటే కిలో పప్పుల ధర ఎక్కువగా వుండటంతో అనేక మంది శాకాహారులు, మాంసాహారులుగా మారటంతో వాటి ధరలు కూడా పెరిగిపోయాయని జోకులు పేలిన విషయమూ తెలిసిందే.

    నరేంద్రమోడీ వూరూ వాడా తిరిగి ‘అచ్చే దిన్‌ ‘(మంచి రోజులు) తెస్తానని చేసిన వాగ్దానంపై గంపెడు ఆశలు పెట్టుకున్న జనం మంచి రోజులు వచ్చేటపుడు పప్పులు, వుప్పుల ధరలు పెరిగితేనేం అన్నట్లు పెరిగిన ధరలకు అలవాటు పడి అసలు ధరల గురించే మరచిపోయిన మత్తులో వున్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఈనెల 15వ తేదీన ఢిల్లీలో పప్పుల సరఫరా, ధరల గురించి ఒక ‘సూక్ష్మ సమీక్ష ‘ నిర్వహించినట్లు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=149832

   దాని ప్రకారం మనకు చెప్పిందేమిటంటే గత నెల రోజులుగా క్రమంగా పప్పుల ధరలు పడిపోతున్నాయి. అసాధారణ రీతిలో గతేడాది పప్పుల ధరలు పెరగటానికి సట్టా వ్యాపారం (స్పెక్యులేషన్‌), దొంగ నిల్వలే కారణమని సమీక్షకు హజరైన పలు పప్పుల వాణిజ్య అసోసియేషన్ల వారు నోట మాట లేకుండా అంగీకరించారట. గతేడాది సెప్టెంబరులో ఈ ఏడాది సెప్టెంబరులో కూడా దేశీయంగా వుత్పత్తి, దిగుమతులు,అందుబాటు ఒకే విధంగా వున్నాయట.పప్పుల లోటు, అవసరం-సరఫరాల విషయంలో దిగుమతిదారులు పారదర్శకంగా వుండాలని, ప్రభుత్వమూ, వ్యాపారులూ మరింత సన్నిహితంగా పని చేసి వాస్తవంగా ఎన్ని పప్పులు అవసరమో తెలుసుకొని ముందుగానే దిగుమతులకు ప్రణాళిక వేసుకోవాలని పాశ్వాన్‌ గారు వాణిజ్య వేత్తలకు వుద్బోధించారు. తమ దిగుమతుల గురించి ముందుగానే ప్రభుత్వానికి సమాచారం అందచేస్తామని వ్యాపారులు హామీ ఇచ్చారు. ఇక ముందు నెలనెలా సమావేశమై సమీక్ష జరపాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల ప్రభుత్వాలతో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందాల గురించి వివరించిన మంత్రి వాటిని ఆధారం చేసుకొని పప్పుల దిగుమతిదారులు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని కోరారు. పప్పుల వుత్పత్తి గురించి తమకు ప్రభుత్వం సరిఅయిన సమాచారం ఇవ్వాలని వ్యాపారులు కోరారు.

   మంత్రి వున్నదేమో వినియోగదారుల వ్యవహారాలు చూడటానికి కానీ ఆ సమావేశంలో వ్యాపారుల ప్రతినిధులు తప్ప వినియోగదారుల ప్రతినిధులు పాల్గొన్నట్లు ఎక్కడా లేదు. అందువలన ఈ ప్రకటనలోని అంశాలను చూసిన తరువాత మోడీ సర్కార్‌ పప్పుల ధరలను తగ్గించటానికి గాక దిగుమతిదారులకు కల్పించే సౌకర్యాల గురించి వివరించటానికి ఏర్పాటు చేసినట్లుగా అనిపించింది. చిత్రం ఏమిటంటే అంతకు ఒక రోజు ముందే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలో టోకు ధరలు రెండు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇక చిల్లర ధరలు ముఖ్యంగా రోజువారీ పేద వినియోగదారులు కొనుగోలు చేసే దుకాణాలలోని ధరల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఆగస్టు నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 3.74 శాతానికి చేరి రెండు సంవత్సరాల నాటి రికార్డును సమం చేసింది. దీనికి పప్పుల ధరలతో పాటు పారిశ్రామిక వస్తువుల ధరల పెరుగుదల కారణాలలో ఒకటి. 2014 నవంబరు నుంచి 2016 మార్చి నెల వరకు టోకు ధరల ద్రవ్యోల్బణం ప్రతికూల ధోరణిలో నమోదు కావటం తమ ఘనతగా మోడీ సర్కార్‌ ప్రచారం చేసుకుంది. గతేడాది ఆగస్టులో టోకు ధరల పెరుగుదల రేటు లేదా ద్రవ్యోల్బణం మైనస్‌ 5.06 శాతం వుంది. టోకు ధరల సూచిక మైనస్‌కు పడిపోయినపుడే చిల్లర ధరలు విపరీతంగా పెరిగాయి, ఇప్పుడు టోకు ధరలు కూడా పెరగటం అంటే చిల్లర ధరలు మరింతగా మండుతున్నట్లే . మంచి రోజులంటే ఇవా ? గతంలో వుల్లి ధరలు వినియోగదారులకు కళ్లనీళ్లు తెప్పిస్తే ఇప్పుడు రైతులకు తెప్పిస్తున్నాయి. ఈ రెండు సందర్భాలలోనూ బాగుపడుతున్నది బడా వ్యాపారులే. పెసల వంటి కొన్ని పప్పుల పంట మార్కెట్‌కు వచ్చే తరుణంలో ధరలు తగ్గటం అంటే రైతాంగం నుంచి తక్కువ ధరకు కొట్టేసే వ్యాపారుల ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.

   పప్పులు, వుల్లి ధరలు ఆసాధారణ రీతిలో పెరగటానికి సట్టా వ్యాపారం, దొంగ నిల్వలే కారణమని ప్రతిపక్ష పార్టీలు, మీడియా, జనమూ నెత్తీనోరూ కొట్టుకున్నా గత రెండు సంవత్సరాలుగా అటు కేంద్రానికి, ఇటు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ పట్టలేదు.ఈ లోగా కొన్ని వేల కోట్ల రూపాయలను వ్యాపారులు పోగేసుకున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరిపైనా చర్య తీసుకోని సర్కార్‌ రెండు సంవత్సరాల తరువాత ప్రతినెలా సమీక్ష జరపాలని నిర్ణయించటం అంతర్జాతీయ పప్పుల సంవత్సరంలో నవ్వురాని జోకు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ తమకు అనుకూలమైన ప్రభుత్వాలు వున్నాయన్న ధీమా తప్ప దొంగ వ్యాపారులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినట్లు ?

    నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి అధికారానికి రావటానికి అవసరమైన పెట్టుబడులు పెట్టిన వారిలో పారిశ్రామిక, వాణిజ్యవేత్త అదానీ గ్రూపు కంపెనీలన్నది జగమెరిగిన సత్యం. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం సదరు అదానీ 2014లో సింగపూర్‌కు చెందిన వెల్మర్‌ కంపెనీతో కలసి ఒక సంయుక్త కంపెనీని ఏర్పాటు చేశాడు. పప్పుధాన్యాలు పండే ప్రాంతాల రైతుల నుంచి వాటిని కొనుగోలు చేయటం దీని లక్ష్యం. అయితే పేరుకు సేకరణ, గరిష్ట నిల్వలపై పరిమితులు వున్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో అనుకూల ప్రభుత్వాలు వున్న కారణంగా వాటిని తుంగలో తొక్కి దాదాపు 100లక్షల టన్నులు నిల్వచేసినట్లు అంచనా. రైతుల దగ్గరి నుంచి లేదా దిగుమతులు చేసుకొని గానీ ఈ మొత్తాన్ని సగటున కిలో 30రూపాయలకు కొని 220 వంతున అమ్మగా లక్షా 90వేల కోట్ల రూపాయలు ఈ కాలంలో అదానీ కంపెనీ సంపాదించినట్లు వచ్చిన వార్తలను అటు అదానీ కంపెనీ లేదా ఇటు ప్రభుత్వం గానీ ఇంతవరకు ఖండించలేదు.

    నరేంద్రమోడీ వేలం వెర్రిగా ఇప్పటికీ విదేశీ పర్యటనలు జరుపుతూనే వున్నారు. ఆయన పర్యటనలో అదానీ కంపెనీల యజమాని గౌతమ్‌ అదానీ లేకుండా ప్రధాని విమానం కదలదంటే అతిశయోక్తి కాదు.అప్పటికే పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న అదానీ కంపెనీలకు నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ఒక్క ఎస్‌బిఐ అధికారులే ఒక బిలియన్‌ డాలర్ల మేర అప్పులిచ్చినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ కాలంలో టెలికాం స్కాం కారణంగా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు దక్కకుండా కంపెనీ యజమానులకు కట్టపెట్టారు. నరేంద్రమోడీ రెండు సంవత్సరాల పాలనా కాలంలోనే వుల్లిపాయలు, పప్పుల బ్లాక్‌ మార్కెటింగ్‌, సట్టా వ్యాపారం ద్వారా యావత్‌ జనం జేబుల నుంచి అంతకంటే ఎక్కువ మొత్తాన్నే వాణిజ్య సంస్ధల యజమానులు కొట్టేశారు. ఆ దోపిడీ ఇంకా సాగుతూనే వుంది.