Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

   పోనీయండి వదిలేద్దాం ! రాజకీయ నాయకులన్న తరువాత జనం ముందు చెప్పేదొకటి, అధికారానికి వచ్చాక చేసేదొకటి . అందరూ అంతే . అది కాంగ్రెస్‌ అయినా బిజెపి, తెలుగు దేశం లేదా టిఆర్‌ఎస్‌ ఎవరైతేనేం అందరూ మహానుభావులే . ఇంక చూడాల్సింది కమ్యూనిస్టులనే ! వారెలా వుంటారో తెలియదు, ఇలాంటి మాటలు ఏదో ఒక సందర్భంలో వినే వుంటారు కదా ! మీరూ వదిలేసే వుండి వుంటారు. ఎందుకంటే ఎవరి పాపాన వారు పోతారని కదా మన ముందు తరాల వారు మనకు నేర్పింది. మాతాత, మానాన్న వారు స్వర్గంలో వున్నారో, నరకంలో వున్నారో అసలు ఎక్కడికైనా ఇంకా చేరారో లేదో తెలియదు. ఎందుకంటే వారి దగ్గర నుంచి స్వర్గానికి పోతే రంభ, వూర్వశి, తిలోత్తమలు కనిపించారని గానీ, లేక పాపం చేసి నరకానికి పోయి సలసలా కాగే నూనెలో పడి బొబ్బలెక్కినట్లు గానీ ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ మెయిల్‌ వర్తమానం ఏదీ ఇంతవరకు రాలేదు. మా తాత పోయినపుడు ఆయనకు ఫోన్‌ అనేది ఒకటుందని మాత్రమే తెలుసు.అక్కడకు వెళ్లిన తరువాత మిగతావన్నీ తెలుసుకొని వుండాలి. ఎందుకంటే స్వర్గం, నరకంలో అంతా వేద విజ్ఞానంతో అందరి కంటే టెక్నాలజీలో ముందు వుండి వుంటారు కదా ! ఇంతకీ ఇంత వుపోధ్ఘాతం ఎందుకంటారా ?

    అధికారంలో వున్న వారిని విమర్శించటమే నేరం, దేశ ద్రోహంగా పరిగణించి కేసులు పెడుతున్న రోజులివి. కొంత మంది గురించి తాతగారి నాన్నగారి భావాలకు దాసులు అని ఒకప్పుడు ఒక కవి చెప్పాడు .అయితే మాటకు కట్టుబడి వుండకపోతే ఎవరినైనా నిలదీయాల్సిందేనని మాతాత, మానాన్న కూడా చెప్పారు.నాటి జాతీయ వాదులను నేడు దేశానికి హాని చేసిన వారిగా, నాడు బ్రిటీష్‌ వారి అడుగులకు మడుగులొత్తిన వారిని అపర దేశభక్తులుగా చూపుతున్న స్దితి. అందువలన నిలదీయాలన్న మా తాతగారి నాన్న గారి భావాలు తిరోగమనం కాదు, అందువలన నన్ను దేనికి ప్రతినిధిగా చూస్తారో మీ ఇష్టం. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలను అమలు జరపటం లేదు గనుక నిలదీయాల్సిందే మరి. కొద్ది రోజుల క్రితం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని అనేక అంశాలపై మాట్లాడుతూ దళితుల గురించి కూడా మాట్లాడారు. సామాజిక అసమానతల గురించి అడిగిన అంశంపై మోడీ ఇలా చెప్పారు.’ కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి వాటిని ఖండించాల్సిన అవసరం వుంది.నాగరిక సమాజంలో వాటికి చోటు లేదు. శాంతి భద్రతల సమస్య రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కొంత మంది కొన్ని సమస్యలను ఎంపిక చేసుకొని మోడీ వాటికి కారకుడంటున్నారు. దీని వలన ఏ ప్రయోజనం నెరవేరుతుందో నాకు తెలియదు, కానీ ఇది దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఇది ఎంతో లోతుగా వేళ్లూనుకున్న సామాజిక సమస్య. సామాజిక అసమానతల మీద రాజకీయం చేయటం సమాజానికి అపకారం చేయటమే. తర తరాలుగా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఈ రోజు చూస్తే బిజెపిలో గిరిజన ఎంపీలు, ఎంఎల్‌ఏలు గణనీయ సంఖ్యలో వున్నారు. నేను బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జన్మదినాన్ని వుత్సవంగా జరిపినప్పటి నుంచి ఆయన జన్మదినాన్ని ఐక్యరాజ్య సమితి , అలాగే 102 దేశాలు పాటించిన తరువాత, రెండు రోజుల పాటు ఆయన జీవితం, చేసిన కృషి గురించి పార్లమెంట్‌లో చర్చించిన తరువాత మోడీ అంబేద్కర్‌ భక్తుడా అనే ఆలోచనతో అనేక మందికి ఒక సమస్య ఏర్పడింది. తమకు తామే సంరక్షకులుగా ప్రకటించుకున్న కొందరు వుద్రిక్తతను సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారు. మోడీ దళితులతో వుండటం, స్వయంగా గిరిజనులకోసం అంకితం కావటాన్ని వారు ఇష్టపడటం లేదు. అణచివేతకు, అణగారిన, అవకాశాలు రాని దళితులందరి అభివృద్ధి కోసం కోసం నేను అంకిత మయ్యాను.’ ఇంకా కొన్ని విషయాలు చెప్పారు, గానీ ఇప్పటికే చాలా ఎక్కువైంది.

    తాజాగా ఇండియా స్పెండ్‌ అనే వెబ్‌సైట్‌ నిఖిల్‌ ఎం బాబు అనే ఒక జర్నలిస్టు రాసిన విశ్లేషణకు ‘దళితులు, గిరిజనులకు కేటాయించి ఖర్చు పెట్టని మొత్తం వ్యవసాయ బడ్జెట్‌కు ఎనిమిది రెట్లు ‘ అనే శీర్షికను పెట్టారు.ఈ విషయంలో కాంగ్రెస్‌, మరొక పార్టీ అన్న తేడా లేదు. వారి అభివృద్ధికి తాను అంకితమైనట్లు చెప్పుకున్న నరేంద్రమోడీ హయాంలో మిగతావారితో పోల్చితే ఖర్చు పెట్టని మొత్తం హిమాలయాల్లా పెరిగి పోతున్నట్లు వెల్లడైంది. కొత్త బిచ్చగాడికి లేదా దొంగ భక్తుడికి పంగనామాలెక్కువుంటాయని పెద్దలు వూరికే చెప్పారా ! ఆ వెబ్‌ సైట్‌ నిర్వాహకులు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు గత మూడున్నర దశాబ్దాల కాలంలో దళితులు, గిరిజనులకు కేటాయించి ఖర్చు పెట్టని సొమ్ము అక్షరాలా రెండు లక్షల 80వేల కోట్లు. వారికోసం కేటాయించిన రిజర్వుడు వుద్యోగాలు తగిన అభ్యర్ధులు లేని కారణంగా కొన్నాళ్లు వాటిని ఖాళీలుగా చూపి తరువాత ఇతరులతో నింపివేయటం మనం చూస్తున్నదే. అయితే వుప ప్రణాళికల కింద కేటాయించిన సొమ్ము ఫలాన్ని అందుకొనేందుకు తగినంత సంఖ్యలో ఆ నిర్భాగ్యులు కూడా లేరా ? మరోవైపు ఇంత మొత్తం కేటాయించినా ఆ తరగతులు ఇంకా అభివృద్ధి చెందలేదంటే అదంతా వృధా అయిందని తాత్పర్యాలు చెప్పే పండితులు కూడా లేకపోలేదు.

     ప్రణాళికా సంఘం నూతన అవతారం లేదా ఎన్‌డిఏ ప్రభుత్వ నూతన సృష్టి నీతి అయోగ్‌ సిఇఓ అమితాబ్‌ కాంత్‌ ఏమంటారంటే రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలు ఏం చేస్తున్నాయో పర్యవేక్షించటం తప్ప మరింతగా ఖర్చు చేయాల్సిన బాధ్యత వాటిదే. ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నది అన్నారు. ఖర్చు చేయని మొత్తాలను తిరిగి కేంద్రానికి పంపాల్సి వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. అలా వెనక్కు ఇచ్చిన మొత్తం వ్యవసాయ బడ్జెట్‌ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ లేదా వచ్చే పది హేను సంవత్సరాలలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సరిపడే మొత్తం, లేదా నేపాల్‌, సెర్బియ, జోర్డాన్‌ దేశాల స్థూల జాతీయాదాయం కంటే ఎక్కువట. ఈ మొత్తం 2.8లక్షల కోట్లరూపాయలను దేశంలోని పాతిక కోట్ల దళితులు, గిరిజనులకు పంచితే తలా రు.11,289 రూపాయలు వస్తాయట.

     కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ సూత్రాల ప్రకారం జనాభాలో దళితులు, గిరిజనుల దామాషా ప్రాతిపదిక 16.6,8.6 శాతం చొప్పున వారి అభివృద్ధి వుప ప్రణాళికలకు బడ్జెట్లలో కేటాయింపులు జరపాలి. 2006లో ప్రణాళికా సంఘం జారీ చేసిన నిబంధనల ప్రకారం సకాలంలో ఖర్చు చేయని నిధులు మురిగి పోతాయి. అలా మురగబెట్టటంలో దళితుల నిధుల విషయంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌, వుత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, గిరిజన నిధులకు సంబంధించి ఝార్కండ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ మొదటి మూడు స్ధానాలలో వున్నాయి. తెలంగాణా కొత్త రాష్ట్రం, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, భూములు ఇస్తామని చెప్పిన పెద్దల పాలనలో వున్న చోట 2014-15లో ఖర్చు చేయని నిధులు 61శాతం లేదా 4,643 కోట్లరూపాయలని విశ్లేషించారు.

    నరేంద్రమోడీ సర్కార్‌ను ఎందుకు తప్పు పట్టాల్సి వస్తున్నదంటే బిజెపి లేదా దాని మాతృసంస్ధ సంఘపరివార్‌ నేతలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలను నిత్యం విమర్శిస్తున్నారు. అందుకు వారిని తప్పుపట్టటం లేదు, ఆ విధానాలు దేశాన్ని సర్వనాశనం చేశాయన్నది వాస్తవం. వారి స్ధానంలో అధికారానికి వచ్చిన బిజెపి తెచ్చిన మార్పులేమిటన్నది ప్రశ్న. ఒక రోజు వేసుకున్న చొక్కా మరుసటి రోజు మార్చినట్లుగా కాంగ్రెస్‌ స్ధానంలో బిజెపి వచ్చింది తప్ప విధానాలు మారలేదు. దళిత, గిరిజన వుప ప్రణాళికల నిధుల ఖర్చుకు సంబంధించి అవి అమలులోకి వచ్చిన 35 సంవత్సరాల నుంచి ఏ విధానాలను అనుసరిస్తున్నారో వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆ తరగతులకు అంకితమైనట్లు చెప్పుకున్న పెద్ద మనిషి హయాంలో కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి కేంద్రానికి చేరుతున్నాయి. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అంటే ఇదేనా ?

      కర్ణాటకలో వున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్ధిక సంవత్సరం ముగియటానికి మూడునెలల ముందు ఈ ఏడాది జనవరిలో అక్కడి ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సమీక్షిస్తూ నిధులలో కేవలం 0.87శాతమే ఖర్చు చేసినందుకు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. 2005-14 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి వుప ప్రణాళిక నిధులు రు.19,367 కోట్లు, గిరిజన వుప ప్రణాళిక నిధులు రు.6,922 కోట్లు ఖర్చు చేయలేదు. కాంగ్రెస్‌-బిజెపి ఏదో ఒక పార్టీ లేదా వాటితో సంబంధం వున్న వారే అందునా గిరిజనులే ముఖ్యమంత్రులుగా వున్న ఝార్కండ్‌లో ఇదే కాలంలో రు.17,107 కోట్ల గిరిజన నిధులు ఖర్చు చేయలేదట. నరేంద్రమోడీ ప్రభుత్వ విజయాల గురించి మన తెలుగోడు వెంకయ్య నాయుడు ప్రతి ఏటా ఒకసారి వూరూ వాడా తిరిగి గొప్పగా ప్రచారం చేసి వెళ్లారు. దళితులు, గిరిజనులకు తమ తొలి ఏడాది పాలనా కాలంలోనే అంతకు ముందుతో పోల్చితే 25శాతం బడ్జెట్‌ పెంచామని చెప్పారు. నిజమే, అయితే అది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చూడండి.

    కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సంబంధించి షెడ్యూల్డు కులాల, తెగల వుప ప్రణాళికల నిధుల తీరు తెన్నులు ఎలా వున్నాయో చూడండి. (కటాయింపులు, ఖర్చు కోట్ల రూపాయలలో, ఖ.చే.పె ఖర్చు చేయని మొత్తం పెరుగుదల )

ఏడాది         కేటాయింపు       ఖర్చు           ఖర్చుచేయనిది      కే.పెరుగుదల     ఖ.చే.పె

2012-13     58,823.14    53,345.04       5,478.1 — —

2013-14     66,159.52    56,761.17       9,398.35                   12               72

2014-15      82,935.00   49,955.79      32,979.21                  25              251

నరేంద్రమోడీ ఏలుబడి మొదటి సంవత్సరంలో కేటాయింపు పెరుగుదల 25శాతం అయితే ఖర్చు పెట్టని మొత్తం పెరుగుదల 251 శాతం వుంది. ఇదేమిటని నిలదీయాలా వద్దా ? పాపం తగిలిపోతారని వదిలేద్దామా ?