Tags

, , , , ,

 

Image result for State Duma Building

ఎంకెఆర్‌

    గత ఆదివారం నాడు (సెప్టెంబరు 18న) రష్యన్‌ పార్లమెంట్‌ డ్యూమా ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీతో సహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ సగానికిపైగా సీట్లను కోల్పోగా అధికార పార్టీ స్వల్పంగా ఓట్ల శాతాన్ని పెంచుకొని మూడింట రెండువంతులకు సీట్లు పొందింది. అనేక మంది ఎందుకిలా జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. మొత్తం 450 స్ధానాలకు గాను 225 నియోజకవర్గ ప్రాతిపదిన, మిగిలిన 225 దామాషా ఓటింగ్‌ ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో గత పాతిక సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ శాతం ఓటింగ్‌ నమోదు కావటం ఒక కొత్త రికార్డు అయితే అధికార పక్షం ఐక్య రష్యా పార్టీ అంతకు ముందున్న 238 ను 343కు పెంచుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విధంగా విజయం సాధించటానికి మారిన ఎన్నికల పద్దతి, ఎన్నికలలో అక్రమాలే ప్రధాన కారణం అని ఫలితాల అనంతరం వెలువడుతున్న వార్తలు, విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికలలో అన్ని స్ధానాలూ దామాషా ప్రాతిపదికన పార్టీలకు కేటాయించారు. ఈ సారి సగం మాత్రమే వుండటం, అనేక మంది పోటీ పడిన కారణంగా మైనారిటీ ఓట్లతోనే అధికారపక్షం ప్రత్యక్ష ఎన్నికల విభాగంలో అత్యధిక సీట్లను గెలుచుకోవటం సాధ్యమైంది. సాధారణంగా ఓటింగు డిసెంబరులో జరుగుతుంది, అటువంటి దానిని అధికార పార్టీ పట్టుబట్టి సెప్టెంబరుకు మార్పించింది. తక్కువ ఓట్లు పోలు కావటానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. దీని కంటే ఎన్నికలు ఒక ప్రహసనమని భావించిన మెజారిటీ ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకత వున్నప్పటికీ ప్రతిపక్షాల మీద విశ్వాసం లేకపోవటం కూడా తోడై ఓటింగ్‌కు దూరంగా వున్నారు. మన దేశంలో మాదిరి ఓట్ల అమ్మకం, కొనుగోలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు కొద్ది వారాల ముందు లెవడా అనే ఏజన్సీ నిర్వహించిన ఒక సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు తమ ఓటును 5000 రూబుళ్లకు అమ్మేందుకు సుముఖంగా వున్నట్లు తేలింది. రష్యా జనాభాలో 2.3 కోట్ల మంది లేక 16శాతం దారిద్య్రరేఖ ప్రమాణం నెలకు 174 డాలర్ల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నవారు వున్నారు. గత ఎన్నికల మాదిరే ఈ ఎన్నికలలో కూడా అధికార పక్షం పాల్పడిన అక్రమాలు, అవినీతి గురించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓటర్ల కంటే బ్యాలట్‌ బాక్సులలో పడిన ఓట్లు ఎక్కువగా వున్నట్లు , కొన్ని చోట్ల అసలు ఓటర్లు లేకుండానే సిబ్బందే ఓట్లతో బాక్సులను నింపినట్లు తేలటం, మరికొన్ని చోట్ల దొంగ ఓట్లు వేసినట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ శాతాలను కూడా ప్రకటించటం వంటి అ క్రమాలు చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ ఫలితాలను రద్దు చేసినట్లు స్వయంగా రష్యా వార్తా సంస్ధ ఇటార్‌ -టాస్‌ పేర్కొన్నది. నిజానికి అవి సముద్రంలో కాకి రెట్ట వంటివి. ఈ సారి పార్లమెంట్‌కు ప్రజాస్వామిక సంస్కరణలకు వ్యతిరేకులైన పచ్చి మితవాదులు పాలక పక్షం నుంచి గణనీయంగా ఎన్నికైనట్లు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

    గత ఎన్నికల్లో పాల్పడిన అవినీతి కారణంగా ప్రపంచవ్యాపితంగా నగుబాట్ల పాలైన అధ్యక్షుడు పుతిన్‌ ఎన్నికలను పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా జరిపేందుంటూ ఎన్నికలకు ముందు మానవహక్కుల న్యాయవాదిగా గౌరవ మన్ననలను పొందిన ఎలా పాం ఫిలోవాను నియమించారు. అయినప్పటికీ దిగువ యంత్రాంగం మొత్తం అధికార పక్ష కనుసన్నలలో పనిచేసేదిగా వుండటంతో సైంటిఫిక్‌ రిగ్గింగ్‌ జరిపి అధికారపక్షం మెజారిటీ సీట్లను తెచ్చుకున్నది. అక్రమాల గురించి సామాజిక మీడియాలో కుప్పలు తెప్పలుగా వెల్లడిస్తున్నారు. తొమ్మిది ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అనేక పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలను రద్దు చేసినట్లు పాం ఫిలోవా గురువారం నాడు ప్రకటించారు. దర్యాప్తులో ఇంకా మరిన్ని అక్రమాలు వెల్లడయ్యే అవకాశం కూడా వుందన్నారు. పరిశీలక సంస్ధలలో ఒకటైన ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓయిసిడి) కూడా ఎన్నికలు సక్రమంగా జరగలేదని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వలేదని పేర్కొన్నది.

    గతంలో 2007 ఎన్నికలలో అధికార ఐక్య రష్యా గరిష్టంగా 315 సీట్లు , తరువాత కనిష్టంగా 2011లో 238 సీట్లు, తాజాగా 343 సీట్లు తెచ్చుకుంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1993లో జరిగిన తొలి ఎన్నికలలో నమోదైన 54.8శాతంమే ఇప్పటి వరకు కనిష్టంగా వుంది. అలాంటిది తాజా ఎన్నికలలో 48శాతానికి పడిపోయింది.అయితే ఇది కూడా ముందే చెప్పుకున్నట్లు ఓటర్ల కంటే ఎక్కువగా పడిన బ్యాలట్లను కూడా లెక్కిస్తే వచ్చిన సంఖ్య. అందువలన అంతకంటే తక్కువ మందే ఓటర్లు పాల్గొన్నట్లు చెబుతున్నవారు కూడా లేకపోలేదు. రాజధాని మాస్కో, మరో పెద్ద నగరమైన సెంట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 35, 33 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైనట్లు ప్రకటించారు.

    నాలుగు వందల యాభై స్ధానాలకు గాను అధికారపక్షం 343 పొందగా రెండవ పార్టీగా రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ 42, మూడవ పార్టీగా పచ్చిమితవాద పక్షం ఎల్‌డిపిఆర్‌ 39, న్యాయమైన రష్యా పార్టీ 23 గెలుచుకుంది. మరో రెండు పార్టీలు ఒక్కొక్క స్ధానం, నేరగాడిగా గతంలో ఇంటర్‌ పోల్‌ వెతికిన వ్యక్తి ఏకైక స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 225 సీట్లలో అధికారపక్షం 203 గెలుచు కుంది. ఒక పరిశీలకుడు సెర్గీ షిఫిలికిన్‌ చెప్పిన దాని ప్రకారం అధికార పక్షానికి వచ్చినట్లు చెబుతున్న ఓట్లలో 45శాతం లేదా కోటీ 20 లక్షల ఓట్లు బోగస్‌. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు 37శాతానికి మించి లేరు, ఈ లెక్కన పోలైన ఓట్లలో అధికారపక్షానికి వచ్చినట్లు చెబుతున్న 54 శాతం కాకుండా 40శాతమే వాస్తవ ఓట్లు అయి వుండాలి.

    గత మూడు ఎన్నికలలో వరుసగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం , సీట్లు ఎలా వున్నాయో దిగువ పట్టికలో చూస్తే అధికార పార్టీ ఎన్నికల విధానంలో ఎందుకు మార్పు తెచ్చిందో దాని కారణంగా ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడిందో అవగతం అవుతుంది.

ఏడాది        ఐక్య రష్యా       కమ్యూనిస్టు       ఎల్‌పిడిఆర్‌       జస్ట్‌ రష్యా

2007        64.30-315      11.57-57         8.14-40        7.74-38

2011        49.32-238      19.19-92        11.67-56      13.24-64

2016        54.19-343       13.34-42       13.16-39        6.23-23

         గత ఎన్నికలతో పోల్చితే కమ్యూనిస్టు పార్టీ , జస్ట్‌ రష్యా ఓట్ల శాతం తగ్గిందన్నది స్పష్టం. ఆ మేరకు అధికార పార్టీకి పెద్దగా పెరగపోయినా సీట్లు గణనీయంగా పెరగటానికి ఎన్నికల విధానంలో చేసిన మార్పే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దామాషా ప్రాతిపదికన కేటాయించిన 225 సీట్లలో ఐక్య రష్యాకు 140, కమ్యూనిస్టుపార్టీకి 35,ఎల్‌పిడిఆర్‌కు 34, జస్ట్‌ రష్యాకు 16 వచ్చాయి. నియోజకవర్గాలలో వరుసగా ఈ పార్టీలకు 203, ఏడు, ఏడు, ఐదు, మరో రెండు చిన్న పార్టీలకు ఒక్కొక్కటి దక్కాయి.ఒక స్వతంత్ర అభ్యర్ధి గెలిచాడు.