Tags

, , , , ,

Image result for  cold to one runny nose to another one cartoon

ఎం కోటేశ్వరరావు

    రష్యాలో వాన పడితే భారత్‌లో గొడుగులు పడతారని గతంలో కమ్యూనిస్టుల మీద ఒక ఆరోపణ వుండేది. కమ్యూనిస్టులు అంతర్జాతీయ వాదులు కనుక సోవియట్‌ సోషలిజాన్ని దెబ్బతీసేందుకు జరిగే ప్రతి ప్రయత్నాన్ని విమర్శించేవారు కనుక కమ్యూనిస్టు వ్యతిరేకులు అలా వ్యాఖ్యానించే వారు. పోనీయండి ఇప్పుడా సోవియట్‌ లేదు, కమ్యూనిస్టులు ఎవరికీ గొడుగులు పట్టటం లేదు. నిజానికి బ్రిటీష్‌ రాణి కుటుంబంలో ఎవరైనా సమర్తాడితే మన దేశంలో బంతులు పెట్టిన వారి వారసులే అలాంటి విమర&శలు చేశారు. ఇప్పుడా బ్రిటీష్‌ వారూ పోయారు గనుక దాన్నీ వదిలేద్దాం. అమెరికన్లకు జలుబు చేస్తే మన దేశంలో ముక్కులు తుడుకుంటున్నవారి గురించి ఇప్పుడు మన ఆలోచించాలి.గొడుగులు పట్టినా,సమర్త బంతులు పెట్టినా మరొకరికి పెద్దగా హాని వుండదు. కానీ జలుబు అంటే అదొక అంటు వ్యాధి ఒక పట్టాన వదలదు, ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుందని తెలిసిందే. అందుకే అమెరికా జలుబుకు ఇక్కడ ముక్కులు చీదుతున్నవారి గురించి జర జాగ్రత్త !

      అమెరికాలో గాడిద పార్టీ (డెమోక్రాట్స్‌ )తరఫున హిల్లరీ క్లింటన్‌, ఏనుగు (రిపబ్లికన్‌ ) పార్టీ తరఫున డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరూ ఇద్దరే నవంబరు వారు వరకు ఒక రోజు హిల్లరీ గెలుస్తుందని వార్తలు వస్తాయి, మరొక రోజు ట్రంప్‌ గెలుస్తాడని వార్తలు రాస్తారు, సోమవారం నాడు ట్రంప్‌ది పైచేయిగా వుందన్న వార్తలు రావటంతో చూసి మన దేశంతో సహా ప్రపంచంలో బంగారం ధరలు తగ్గాయని, స్టాక్‌ మార్కెట్ల సూచీలు పడిపోయాయని, చమరు ధరలు పెరిగాయని వార్తలు వచ్చాయి.ఓకే ట్రంప్‌ పచ్చి మితవాది కనుక అతగాడు వైట్‌ హౌస్‌లో అడుగుపెడితే తమకు కలసి రాదని అమెరికన్లు అనుకుంటే అక్కడి వ్యాపారాలపై దాని ప్రభావం పడాలి. డెమోక్రాట్ల నేత ఒబామా గత ఎనిమిది సంవత్సరాలుగా చేసిన మంచేమిటి ? ఏమీ లేకపోబట్టే కదా అమెరికన్లు ట్రంప్‌కు ఓటేస్తే ఏమిటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు .ఎక్కడో 14వేల కిలోమీటర్ల దూరంలో వున్న మన మీద దాని ప్రభావం పడటం ఏమిటి ? ఆకాశంలో తిరుగుతూ నిత్యం మనల్ని కాపాడుతున్న మన దేవతలు ఏం చేస్తున్నట్లు ? పోనీ మన ప్రధాని నరేంద్రమోడీ విదేశాల్లో తిరుగుతూ ఇక్కడి వ్యవహారాలను విస్మరిస్తున్నారా ? మన సమాచార, ప్రసార, ప్రచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడి నోటి వెంట ఎప్పుడూ మంచి వార్తలే వినిపిస్తున్నాయి, మంచి రోజులనే చూపుతున్నారు కదా !

     మన రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్ల సవరణ గురించి ఆలోచిస్తున్నదంటే మన కంపెనీల స్టాక్‌ రేట్లపై ప్రభావం పడుతున్నదంటే అర్దం వుంది. అమెరికా రిజర్వుబ్యాంకు(ఫెడరల్‌ రిజర్వు) సమీక్షించబోతున్నది అనగానే మన స్టాక్‌ మార్కెట్‌లన్నీ రెండు మూడు రోజులు గందరగోళపడిపోతాయి. మన రూపాయి పాపాయి లబలబలాడి పోతుంది. ఏమిటీ దానికీ మనకు వున్న బాదరాయణ సంబంధం, ఆ లంకెను తెగగొట్టటానికి గతంలో వున్న కాంగ్రెస్‌ పాలకులు ప్రయత్నించలేదు, లేదా వారికి చేతకాలేదు అనుకుందాం సమర్ధ ప్రధాని నరేంద్రమోడీ పాలనలో కూడా ఈ పరిస్థితి ఏమిటి ? అమెరికాతో లంకె మనకు లాభం చేస్తున్నదా నష్టం తెస్తున్నదా ? నరేంద్రమోడీ అధికారానికి వచ్చినప్పటి నుంచి మన రూపాయి పతనమైనా మన ఎగుమతులు పెరగలేదు, పరిశ్రమలు పూర్తిగా వుత్పత్తి చేయటం లేదు. మేకిన్‌ ఇండియా పిలుపు మేరకు ఎన్ని పరిశ్రమలు మన దేశానికి వచ్చి వస్తూత్పత్తి చేసి ఎంత మేరకు ఎగుమతులు చేస్తున్నాయో ఎవరూ చెప్పరు.రెండున్నర సంవత్సరాలు కావస్తోంది, మంచి రోజులంటే ఇంకెన్నాళ్లు ? అమెరికా ఎన్నికలు మనల్ని మరికొద్ది వారాల పాటు నిదురపోనివ్వన్నమాట. ప్రతివారం ఏదో ఒక దేశం పర్యటించి మన ప్రధాని నరేంద్రమోడీ మనకు పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తున్నట్లు చెబుతున్నారు కదా. మన పరిశ్రమలు, మన వ్యాపారాలు బాగుంటే మన కంపెనీల వాటాలు పడిపోవటం ఏమిటి? మనల్ని అమెరికన్లకు తోకలుగా మార్చారా ? లేకపోతే అక్కడేదో జరిగితే ఇక్కడ తోకలు వూగటం ఏమిటి ?

    మన దేశానికి ఆహార ధాన్యాల కొరత లేదు, ఇప్పటికే గోదాముల్లో బియ్యం, గోధుమల నిల్వలు పెరిగాయి, వాటిని అమ్మి వేస్తామని బిజెపి వారు చెప్పారు. కొనేందుకు డబ్బు లేక మన దేశంలో ఆహారధాన్యాలు నిల్వ వుండిపోతున్నాయి తప్ప ఎక్కువై కాదన్నది సత్యం. ఇప్పటికే రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ స్థితిలో విదేశాల నుంచి చౌకగా వచ్చే ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటే ఇక్కడి రైతుల పరిస్థితి ఏమిటో బిజెపి సర్కార్‌ ఆలోచిస్తోందా ? అనుమానమే ! ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి మన వ్యాపారులు 25వేల టన్నుల గోధుమలు దిగుమతికి కొనుగోళ్లు చేశారన్నది నేటి వార్త. ఎందుకట ! ఇప్పటి వరకు వున్న దిగుమతి పన్ను 25శాతాన్ని గత శుక్రవారం నాడు పదిశాతానికి తగ్గించారు. విదేశీ గోధుమలను దిగుమతి చేసుకుంటే మన దేశంలో గోధుమలను పండించే రైతులేం కావాలి. వారి వుత్పత్తులకు ధరలు పడిపోవా ? అదే జరిగితే నరేంద్రమోడీ వాగ్దానం చేసినట్లు 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు ఎలా అవుతాయి ? ఎవరైనా గట్టిగా అడిగితే వారు దేశ భక్తులా కాదా అని పోలీసులు రికార్డులు తిరగేస్తారు, సంఘపరివార్‌ సంస్ధల వారు దాడులకు పూనుకుంటారు?రోజూ భయంతో చస్తూ బతికే కంటే ఒక రోజు ధైర్యంతో పోతేనే జనం గుర్తు పెట్టుకుంటారు.గోధుమల దిగుమతి అవసరం మనకు వుందా ? జూన్‌ 16వ తేదీన మన కేంద్రమంత్రి పాశ్వాన్‌ గారు మన దేశంలో నిల్వలు పెరిగిపోతున్నాయని, చౌక దిగుమతులను అరికట్టేందుకు 25శాతం పన్ను విధింపును పొడిగిస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. అంత పన్ను వున్నప్పటికీ అపర దేశ భక్తులైన మన వ్యాపారులు వినియోగదారుల సేవకోసం అప్పటికే ఈ ఏడాదిలో పదిలక్షల టన్నులకు పైగా దిగుమతి చేసుకున్నారు. జూలై ఒకటి నాటికి ఎన్ని గోధుమలు నిల్వ వుండాలో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దానికి మించి కోటీ ఇరవై లక్షల టన్నులు అదనంగా వున్నాయని, మొత్తం నిల్వలు 4కోట్ల టన్నులకు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరి సెప్టెంబరు కూడా పూర్తి గాక ముందే పన్ను శాతాన్ని పదికి ఎందుకు తగ్గించినట్లు ? నిల్వలు తగ్గిపోయాయా ? జనానికి అదనంగా అందచేయాలని సర్కార్‌ నిర్ణయించిందా ? అలాంటి ప్రకటనలేమీ లేవు. అసలు విషయం ఏమంటే గోధుమలు పండే వుత్తరాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి దక్షిణాది రాష్ట్రాల పిండి మిల్లులకు తరలించే గోధుమల ధర కంటే కొన్నివేల మైళ్ల దూరాన వున్న ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల నుంచి ఓడల్లో దిగుమతులు చేసుకోవటం చౌకగా వుండటమే. అయితే దానికి మన దేశంలోని గోధుమలలో ప్రొటీన్లు తక్కువగా వుంటాయని, పీజాలు, పాస్టాలు తయారు చేయటానికి పనికి రావని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు.ఈ దిగుమతులు పదేళ్ల నాటి రికార్డును అధిగమిస్తాయని ఒక కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఘనత రికార్డును కూడా నరేంద్రమోడీ ఖాతాలోనే వేయాలి మరి. పన్ను తగ్గింపు వెనుక ఏమైనా జాతీయ-అంతర్జాతీయ గోధుమ వ్యాపారుల ముడుపులు వుండి వుంటాయా ? ఏమో ! గత ఎన్నికలలో పెట్టిన పెట్టుబడి మీద అసలు, లాభం సంపాదించుకోవాలి, వచ్చే ఎన్నికలకు పెట్టుబడులు సమకూర్చుకోవాలి కదా ! ఏడాది కేడాది ఓట్ల ధరలు మండిపోతున్న రోజులివి. దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, రైతులు ఎలా పోతేనేం !