Tags

, , , , ,

పాక్‌ వుగ్రవాద శిబిరాలపై భారత సర్జికల్‌ దాడి పర్యవసానం

ఎంకెఆర్‌

    సరిహద్దు దాటేందుకు ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతంలో తిష్ట వేసిన వుగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు భారత సైన్యం గత అర్ధరాత్రి దాటిన తరువాత దాడులు చేసిందని వారి గుడారాలను కొన్నింటిని ధ్వంసం చేసి అనేక మందిని మట్టు పెట్టి తెల్లవారే సరికి మన సైన్యం పక్కాగా తిరిగివచ్చిందని సైనిక అధికారులు ప్రకటించారు. అయితే పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఒక ప్రకటన చేస్తూ అలాంటి దాడులేమీ జరగలేదని, సరిహద్దులలో ఎప్పుడూ జరిపే మాదిరి భారత సైన్యం కాల్పులు జరిపిందని ఇద్దరు తమ సైనికులు మరణించారు, ఇతరులు తొమ్మిది మంది గాయపడ్డారు తప్ప వేరే ఏమీ జరగలేదని, భారత్‌వి కట్టుకథలని ప్రకటించారు. మన సైన్యం జరిపిన చర్యను సర్జికల్‌ దాడి అని పేర్కొన్నారు.ఈ దాడిలో ఎంత మంది మరణించారు, ఎన్ని శిబిరాలను ధ్వంసం చేశారన్నది అధికారికంగా ఎవరూ చెప్పటం లేదు. నిర్దిష్ట సమాచారం వుంది కనుక ఈ దాడులు చేశాం పని అయిపోయింది కనుక వెనక్కు తిరిగి వచ్చాం అంతే తప్ప నిరంతరం కొనసాగించే పధకాలేవీ లేవని కూడా మన సైనిక ప్రతినిధులు ప్రకటించారు.

    ఈ దాడితో స్టాక్‌ మార్కెట్లలో కంపెనీల వాటాల ధరలు పతనమై మదుపర్లు నష్టపోయారు. మన సైన్యం చేసిన ప్రకటనను పక్కాగా నమ్మి బెంబేలెత్తిన వాటాల విక్రయదారులు అమ్మకాలకు పూనుకోవటంతో బుధవారం నాటితో పోల్చితే గురువారం నాడు బొంబాయి స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచిక 465 పాయింట్లు లేదా 1.64 శాతం పతనమైంది. అదే విధంగా భారత సైన్యం దాడులేమీ జరపలేదు, ఎప్పటి మాదిరే సరిహద్దుల్లో కాల్పులు జరపటం తప్ప మరొకటేమీ జరగలేదన్న పాక్‌ ప్రభుత్వ ప్రకటనను అక్కడి విక్రయదారులు కూడా గట్టిగా విశ్వసించటంతో కరాచీ స్టాక్‌ సూచిలో కేవలం 59.5 పాయింట్లు లేదా 0.15 శాతమే పతనమైంది. అంటే అక్కడి విక్రయదారులు, మదుపర్లు తాపీగా వున్నారన్నది స్పష్టం.దాడులు జరిపినప్పటికీ వాస్తవాధీన రేఖ వెంబడి జరిగే వ్యాపార లావాదేవీలు యురి వద్ద (మన సైనికులను చంపిన సైనిక కేంద్రం వున్న ప్రాంతం) గురువారం నాడు యధావిధిగా జరిగాయి. మన దేశం నుంచి 26 ట్రక్కులు అవతలకు వెళితే అవతల నుంచి పది ట్రక్కులు మన వైపు వచ్చాయి.

   మన సైన్యం జరిపిన దాడిలో ఏం జరిగింది అన్నది చూద్దాం . సైనికాధికారులు చేసిన బహిరంగ ప్రకటనలో గణనీయంగా వుగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారు మరణించి వుంటారు అన్నారు తప్ప సంఖ్యను పేర్కొనలేదు.సర్జికల్‌ దాడులు, సైనిక వర్గాల కథనాలను బట్టి వచ్చిన వార్తల ప్రకారం పాక్‌ ఆక్రమిత ప్రాంతంలోకి 500 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు చొరబడి కాల్బలం, హెలికాప్టర్ల కమాండోలు వుమ్మడిగా దాడి చేసి తెల్లవారక ముందే తిరిగి వచ్చారు.కాల్బలం భూమి మీద వెళితే వారికి రక్షణగా ఎంఐ 17 హెలికాప్టర్లు కాపలా కాశాయి. దాడులు చేయటాన్ని డ్రోన్ల ద్వారా వీడియోలు కూడా తీశారు. వాటిని తగు సమయంలో బయట పెడతామని అధికారులు చెప్పారు.గత రెండు నెలల కాలంలో 19 సార్లు వుగ్రవాదులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు.

    సర్జికల్‌ దాడులలో నిర్ధిష్ట లక్ష్యాలు మాత్రమే నాశనం అవుతాయి. వాటి పరిసరాలలో నష్టం జరిగినా అది పెద్దగా వుండదు. పాకిస్థాన్‌ను పూర్తి స్థాయిలో ఆశ్చర్య పరచటంలో సఫలీ కృతమయ్యామని, మన వైపు నుంచి ఎవరూ మరణించలేదని సైనిక వర్గాలు తెలిపాయి.దాడులు జరిపిన ప్రాంతంలో కొండలు, అడవులు, పర్వతాలు వున్నాయి. దాడులు జరిపిన ప్రాంతంలో ఏడు వుగ్రవాద శిబిరాలు లేదా గుడారాలు వున్నాయి. ప్రతి శిబిరంలో 30లేదా 40 మంది , మరొక 20 మంది వుగ్రవాదులు పరిసరాలలో వుంటారు. ప్రతి చోట దారి చూపే వారు, మద్దతుదారులు వుంటారు. వాటిపై గత వారం రోజులుగా మన సైన్యం కన్నువేసి వుంచింది. మన కమాండోలను హెలికాప్టర్ల ద్వారా రాత్రి 12.30 – తెల్లవారు ఝామున 4.30 వుగ్రవాద శిబిరాలు వున్న ప్రాంతాలలో దాడులు చేయించి సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చారు. అయితే అధికారులు చెప్పిన వివరాలను సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ తోసిపుచ్చారు.అసలు హెలికాప్టర్లు సరిహద్దు రేఖను దాటలేదని, దాడిలో పాల్గొనలేదని చెప్పారు.(హిందూ పత్రిక ప్రతినిధి)

    దాడులు చేసిన మన సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. పాక్‌ ప్రకటనలో కూడా తమ సైనికులు ఇద్దరు మరణించారని తప్ప ఇతరంగా చెప్పలేదు. అడవులు, కొండలు,ఎత్తయిన పర్వత ప్రాంతాలలో వున్న గుడారాలపై దాడులు జరపటం తప్ప వాటిలో వున్న ఎందరు మరణించారన్నది లెక్కలు తేల్చటం అందునా చీకటిలో లెక్కించటం సాధ్యం కాదు, అంచనాలను మాత్రమే అనధికారికంగా చెప్పిన అంశాలు మీడియాలో వస్తున్నాయి.

    యురి సైనిక శిబిరంపై పాక్‌ వుగ్రవాదులు దాడులు చేసినపుడు మన సైన్యం నిద్రపోతున్నదని, డ్యూటీలు మారటాన్ని అవకాశంగా తీసుకొని శిబిరం పరిసరాలలో పెరిగిపోయిన గడ్డిలో దాక్కొని వచ్చారని చెప్పిన విషయం తెలిసినదే. బుధవారం రాత్రి జరిపిన దాడి సమయాన్ని బట్టి, మన కేమీ నష్టం జరగలేదనటాన్ని చూస్తే ఆ సమయంలో సరిహద్దులలో వున్న పాక్‌ సైన్యం, వుగ్రవాదులు కూడా గాఢ నిద్రలో వుండి వుంటారా ? ఏ క్షణంలో అయినా దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామన్న భారత ప్రకటనలను తేలికగా తీసుకున్నారా అన్న సందేహాలు కలగటం సహజం. సర్జికల్‌ దాడులు జరపటం భారత సైన్యానికి కొత్త కాదు, గతేడాది మయన్మార్‌ సరిహద్దులలోని వుగ్రవాద శిబిరాలపై కూడా ఇలాంటి దాడులే జరిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసినదే. వుగ్రవాద నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలకు సైన్యం ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చ స్చేఛ్చను ప్రభుత్వం ఇచ్చిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.