Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

     కౌరవ సభలో ద్రౌపదిని అవమానించవద్దన్న విదురుని నీతి వాక్యాలు పని చేసి వుంటే మహాభారత యుద్దమే వుండేది కాదన్నది కొందరి అభిప్రాయం. యుద్ధ చరిత్రలను చూసినపుడు దానిని అంగీకరించలేము. పాండవులకు రాజ్యభాగాన్ని ఇవ్వకుండా వుండేందుకు కౌరవులు మరొక సాకును వెతికి వుండేవారన్నది స్పష్టం. మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. అందువలన ఎవరైనా తమంతట తాముగా లేదా ఎవరి తరఫున అయినా యుద్ధం లేదా దానికి సమానమైన వుగ్రవాద దాడులు చేయాలనుకుంటే వారికి ద్రౌపదితో పని లేదు తోడేలు న్యాయం ఎలాగూ వుంటుంది. తెరవెనుక వున్న అమెరికా వైఖరిలో మార్పు వచ్చేంత వరకు ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాపితంగా వుగ్రవాదులు పుడుతూనే వుంటారు, లేదా అమెరికన్లు వారికి తొత్తులుగా వుండే పాకిస్తాన్‌ వంటి దేశాలు వుగ్రవాదులను తయారు చేస్తూనే వుంటాయి. మన దేశంపైకి వుసి కొల్పుతూనే వుంటారు. మనం నిరంతరం జాగరూకులుగా వుండాలి. దొరికినపుడు చావు దెబ్బతీయాలి.

  పొరుగు దేశం జరిపే ప్రత్యక్ష దాడులను ఎదుర్కోవటానికి, పొరుగుదేశం తయారు చేసిన వుగ్రవాదులను ఎదుర్కొనటానికి వున్న తేడాను అర్ధం చేసుకోవాలి. యురి వుదంతం తరువాత మన దేశంలో సహజంగానే వుగ్రవాద, పాకిస్తాన్‌ వ్యతిరేకత బాగా పెరిగింది.మన ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాలనే వైఖరితో వున్నట్లు చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.ఈ దశలో ప్రతీకార చర్యల గురించి ఎవరైనా భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తే అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించే పరిస్థితి కూడా వుంది. మనోభావాలు, ప్రతీకారేఛ్చ ఎక్కువగా వుండటం సహజం. అయితే వుద్రేకం, ఆగ్రహంలో వివేచనను మరచి పోకూడదు. ఎవరైనా తమ మనోభావాలకు భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తే వారి మీద ఆగ్రహించితే ప్రయోజనం లేదు. ఏడుగురు అంధులు-ఏనుగు వర్ణణ కథ తెలిసిందే. దాని నీతి ఏమిటి ఎవరి స్పర్శ, అనుభవంలోకి వచ్చిన దానిని బట్టి వారు ఏనుగెలా వుంటుందో వర్ణించారు. అలాగే సమాజంలో వున్న భిన్న వ్యక్తులు తమ అనుభవాలు, అధ్యయనంలో కలిగిన భావాలకు అనుగుణంగా పరిష్కార మార్గాలను సూచించవచ్చు,పరిష్కారాలు చెప్పవచ్చు. అంత మాత్రాన వారిపై ఆగ్రహం చూపకూడదు.

    వస్తాదుల మాదిరి వుగ్రవాదులను తయారు చేసినపుడు వారికి పని కల్పించకపోయినా, ఏకారణంతో అయినా వారికి ఎదురు చెప్పినా శిక్షణ ఇచ్చిన వారి మీదే తారసిల్లుతారు. మనకు పక్కనే వున్న శ్రీలంకలోని తమిళ వుగ్రవాదులకు మన దేశంలో శిక్షణ శిబిరాలు నిర్వహించి, ఆయుధాలు, డబ్బు సమకూర్చిన విషయం బహిరంగ రహస్యం. అలాంటి వారిని అణచివేసేందుకు మన కేంద్రమే సైన్యాన్ని పంపిన కారణంగా ఆ తీవ్రవాదులే మన ప్రధాని రాజీవ్‌ గాంధీని బలిగొన్న విషయం కూడా విదితమే. అలాగే పంజాబ్‌లో అకాలీదళ్‌ స్ధానే కాంగ్రెస్‌ను బలపరచాలనే లక్ష్యంతో ఖలిస్తాన్‌ తీవ్రవాది భింద్రన్‌ వాలేను పెంచి పోషించిన ఇందిరా గాంధీ ఆ సిక్కు తీవ్రవాదానికే బలి అయిన విషయమూ తెలిసిందే.

     తాలిబాన్లను పెంచి పోషించిన ఇప్పుడు అమెరికా,పాకిస్థాన్ల పరిస్థితి కూడా అలాగే వుంది. అందుకు మనమేమీ వారి మీద జాలి చూపాల్సిన అవసరం లేదు. తాము తయారు చేసిన ఐఎస్‌, తాలిబాన్లు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తారో తెలియక అవి కొట్టుమిట్డాడుతున్నాయి. తాలిబాన్లపై యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్తాన్‌కు సైన్యాలను నడిపిన అమెరికా 2001నుంచి ఇప్పటి వరకు సాధించిందేమిటి ? తాలిబాన్లపై దాడి చేయటానికి ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు అనేక దేశాల నుంచి సైన్యాన్ని రప్పించారు. జరిగిందేమిటి. తాలిబాన్ల సంఖ్య తామర తంపరగా పెరుగుతూనే వుంది. అప్పటి వరకు ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌కే పరిమితంగా వున్న వారు ప్రపంచ వ్యాపితంగా విస్తరించారు.

     పదమూడు సంవత్సరాల రెండు నెలల 21 రోజుల యుద్ధంలో అమెరికా నాయకత్వంలో అంతర్జాతీయ దేశాల కూటమి జరిపిన దాడులలో ఎందరు తాలిబాన్లు మరణించారు, ఎన్ని శిబిరాలను ధ్వంసం చేశారో ఇప్పటికీ ఇదమిద్దంగా తెలియదంటే నమ్మక తప్పదు.http://www.voanews.com/a/despite-massive-taliban-death-toll-no-drop-in-insurgency/1866009.html  సగటున రోజుకు  12 మంది తాలిబాన్లను మట్టు పెట్టినట్లు ఆఫ్ఘన్‌ పోలీసులు, మిలిటరీ చెప్పింది. ఆ లెక్కన 4,830 రోజులలో 57,960 మంది తాలిబాన్లను అంతం చేసినట్లు. ఇంత జరిగాక కూడా అప్పటికి ఇంకా 60 వేల మంది తాలిబాన్లు వున్నట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో వార్తలో పేర్కొన్నారు. ఇదే సమయంలో తాలిబాన్ల చేతులలో హతమైన వారు లేరా ? వారెందరు ? ఆప్ఘన్‌ సైనికులు 21,950,అమెరికా సైనికులు 2,356 మందితో సహా మిగతా దేశాల సైనికులు 3,456 కిరాయి సైనికులు( కాంట్ట్రార్లు )1500, గాయపడిన వారు ఆఫ్ఘన్‌ సైనికులెందరో తెలియదు, అమెరికన్లు 19,950 మందితో సహా విదేశీ సైనికులు 22,773, కిరాయి సైనికులు 15000 మంది వున్నారు. వుభయుల చేతిలో మరణించిన సామాన్య పౌరులు మరికొన్ని వేల మంది వున్నారు. ఇంత చేసి సాధించిందేమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు యధాతధంగా వున్నారు, అక్కడి అమెరికా తొత్తు ప్రభుత్వం, వారికి మద్దతుగా కొనసాగుతున్న పరిమిత సంఖ్యలో వున్న అమెరికా సైనికులు, పక్కనే వున్న పాకిస్థాన్‌పై తాలిబాన్లు నిరంతరం దాడులు జరుపుతూనే వున్నారు.

     ప్రస్తుతం తాలిబాన్లపై మూడున్నర లక్షల మంది ఆఫ్ఘన్‌ సైనికులు, 9,800 మంది అమెరికన్లతో సహా 40దేశాలకు చెందిన 13,000 మంది సైనికులు, దాదాపు 26వేల మంది కిరాయి సైనికులు దాడులు జరుపుతున్నారు. అయినప్పటికీ 30 నుంచి 60వేల మంది తాలిబాన్లు, వెయ్యి నుంచి మూడువేల మంది ఐఎస్‌ వుగ్రవాదులు, వారి మద్దతుదార్లు మరో పదివేల మంది వున్నారని అంచనా.తాలిబాన్లు ప్రస్తుతం తమ దేశంలో వున్న అమెరికా, తమ సైన్యం, జనం మీదనే గాక గతంలో నారు వేసి నీరు పోసిన పాకిస్థాన్‌పై నిరంతరం దాడులు జరుపుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు పాకిస్థాన్‌లో జరిపిన దాడులలో 262 మంది సామాన్యులు మరణించారు.ఈ పూర్వరంగంలో సర్జికల్‌ దాడులకు బదులు సరిహద్దులలోని వుగ్రవాద శిబిరాలపై ప్రత్యక్ష దాడులే జరిపిందనుకుందాం వుగ్రవాదులు, వుగ్రవాదం పూర్తిగా అంతం అవుతుందా ? మన కంటే ఎన్నో రెట్లు బలమైన అమెరికన్లు ఎందుకు విఫలమయ్యారు. ఇప్పుడు సిరియాలో ఐఎస్‌ తీవ్రవాదులను అంతం చేసేందుకు అటు సిరియా సైన్యం, రష్యన్‌ వైమానిక దళం ఎంతగా శ్రమిస్తున్నదో చూస్తున్నాం. ఇరాక్‌లో ఐఎస్‌ తీవ్రవాదులు కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అందువలన వివేచనతో ఆలోచించాలి. వుగ్రవాద అంతానికి కొత్త మార్గాలను కనుగొనాలి. పిచ్చి మొక్కలు మొలకెత్త కుండా వుండాలంటే పొలాన్ని నిరంతరం సాగు చేస్తుండాలి. ఎయిడ్స్‌ వ్యాధిని నిరోధించటానికి ప్రయత్నిస్తూనే చికిత్స చేయటానికి అవసరమైన ఔషధాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితులలో వుగ్రవాదం కూడా అలాంటిదే. వుగ్రవాదులను అంత మొందించేందుకు ఎంతగా ప్రయత్నించాలో వారు తయారు కాకుండా చూసేందుకు అంతకంటే ఎక్కువగా ప్రయత్నించాలి. దానికి అనేక మంది అనేక మార్గాలు చెబుతున్నారు. నూరు పూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలు వికసించనివ్వండి అన్నట్లు వాటిని స్వాగతించండి. ప్రతి ఒక్కరూ ఇతరులతో ఆలోచనలు పంచుకోండి. అంతే కాని మరోమాట వినం అనే స్థితికి పోవద్దని మనవి.

   ఈ పూర్వరంగంలో మన సైన్యం సర్జికల్‌ దాడులు జరిపి మన సత్తా ఏమిటో పాకిస్థాన్‌కు, వుగ్రవాదులకు చూపటం అభినందనీయం. ఇదే సమయంలో మన దేశంలో సరిహద్దులలోని పది కిలోమీటర్ల లోపు జనం గ్రామాలను వదలి వెళ్లిపోతున్నారని వార్తలు వచ్చాయి. నాలుగు రోజులు హైదరబాదులోని లోతట్టు ప్రాంతాలు, వాటిలో కట్టిన అపార్ట్‌మెంట్లు వర్షాలకు మునిగితే ఖాళీ చేయటానికి పడిన, పదిరోజుల తరువాత కూడా పడుతున్న ఇబ్బందుల గురించి మీడియా కథనాలను చూస్తున్నాము. అందువలన యుద్ధం అంటే ప్రాణాలకు తెగించాల్సింది వీర జవాన్లు, సరిహద్దులలోని లక్షల మంది సామాన్య జనం. ధనికులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతారు.సామాన్యులకు ఎలాంటి సౌకర్యాలు వుండని స్కూళ్లు, ప్రభుత్వ భవనాలే గతి. అందువలన ఎవరైనా యుద్ధం మినహా ఇతర పరిష్కార మార్గాలను చూడమని చెబితే వారిని దేశద్రోహులుగా చూడాల్సిన అవసరం లేదు. వారేమీ పాకిస్తాన్‌ మీద, వుగ్రవాదుల మీద ప్రతీకారం తీర్చుకోవద్దని చెప్పటం లేదు.

   పాక్‌ వుగ్రవాద ప్రోత్సాహం ఈ నాటిది కాదు, దశాబ్దాల తరబడి సాగుతున్నది, మన దేశం ఎంతో నష్ట పోయింది. అలాంటి పాకిస్థాన్‌ను దెబ్బతీయటానికి సింధు నది మీద మన దేశంలో ప్రాజెక్టులు కట్టి ప్రతీకారం తీర్చుకోవచ్చన్న సూచనలు వచ్చాయి. అలాంటి వాటిని నిర్మించమనండి దేశ ప్రజలందరూ అవసరమైతే ఒక రోజు శ్రమదానం చేయటానికి సిద్ధంగా వున్నారు. లేదూ యురి సైనిక శిబిరంలో గడ్డి పెరిగి పోయిన కారణంగా వుగ్రవాదులు నది దాటి వచ్చి గడ్డిలో దాక్కొని దాడి చేశారని చెప్పారు. గడ్డి తొలగించటానికి కావాలంటే ఎంత విరాళం కావాలంటే అంత ఇచ్చేందుకు జనం సిద్దంగా వుంటారు. లేదూ పీకమంటే రావటానికి సిద్ధం. అలాగే నది గట్లపై ముళ్ల కంచెలు వేసి వుగ్రవాదులు, శత్రు సైనికులు చొరబడకుండా చూడమనండి అందరూ తలా ఒక చేయి వేస్తారు.

    యుద్ధం అంటే ముందుగా నిజం సమాధి అవుతుంది. అనేక కట్టుకధలు ప్రచారంలోకి వస్తాయి. అనేక మంది సామాజిక మీడియాలో తాజా పరిస్థితిలో రాజకీయాలు వద్దని చెబుతున్నారు. వారి అభిప్రాయం సరైనదే. కానీ రాజకీయాలు చేస్తున్నది ఎవరు ? సర్జికల్‌ దాడుల ఖ్యాతి ఆయనకు పూర్తిగా కట్టపెట్టటానికి ప్రతిపక్షాలు ముందుకు రావటం లేదు అని ఒక పత్రిక రాసింది. ఒకవైపు మరణించి సైనికుల కుటుంబాలు ఇంకా ఆవేదన నుంచి బయటకు రాలేదు. అప్పుడే ఖ్యాతి కట్టబెట్టటం గురించి మీడియాలో వ్యాఖ్యలు చేసే వారు నిజమైన దేశద్రోహులు అనాల్సి వుంటుంది. అదంతా సైన్యం గొప్పతనమే అన్నట్లు గా ప్రతిపక్షాల వారు వ్యాఖ్యానిస్తున్నారట. గతంలో కార్గిల్‌ యుద్ధం కారణంగా బిజెపి విజయం సాధించినట్లే ఇప్పుడు సర్జికల్‌ దాడుల కారణంగా వుత్తర ప్రదేశ ఎన్నికలలో బిజెపి విజయం సాధించనున్నదని పరిశీలకులు భావిస్తున్నారట. అంటే ఒక వైపు సైన్యం అప్రమత్తంగా వుంది, మరోవైపు దాడులు జరిగితే ప్రాణాలు కాపాడుకోవాలని సరిహద్దు పౌరులు సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని దేశమంతా వుగ్గపట్టుకొని కూర్చున్నది. ఈ స్థితిలో రాజకీయ పరిశీలకుల పేరుతో ఎన్నికల లాభాల గురించి పత్రికలు రాయటాన్ని ఏమనాలి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకునే వారికంటే నీచమిది.ఇలాంటి వ్యాఖ్యల కారణంగా రాబోయే గుజరాత్‌, వుత్తర ప్రదేశ్‌ మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల కోసమే మోడీ నాయకత్వం సర్జికల్‌ దాడులకు తెరతీసింది అనుకోవాలా ? నిజంగా వుగ్రవాద నిర్మూలన కోరుకునే వారు చేయాల్సిన పనేనా ఇది ?