Tags

, , , , ,

dsc02087

ఎం కోటేశ్వరరావు

    మడిసన్నాక కాసింత కలా పోసనుండాలయ్యా అంటూ రావు గోపాలరావు చేత పలికించిన ముళ్లపూడి వెంకటరమణ మాటలు బాపు ముత్యాల ముగ్గులో చాలా మంది చూసే వుంటారు.వుత్తినే తిని తొంగుంటే మనిసికి గొడ్డుకు తేడా ఏటుంటది అందుకే ఓ నాలుగు రోజుల పాటు అలా బయటకు వెళ్లి వచ్చాం. చరిత్రలో నేటి కర్ణాటక ప్రాంతం ఎందరో రాజులు, రాజ్యాలు, వుద్ధాన, పతనాలను చవి చూసింది. దక్షిణ భారత దేశంలో అక్కడ వున్నన్ని చారిత్రక ప్రదేశాలు మరొక రాష్ట్రంలో ఎక్కడా లేవు. అందువలన ఒక యాత్రలో వాటన్నింటినీ చూడలేము. అక్టోబరు రెండు నుంచి ఐదు వరకు రెండు రోజులు కర్ణాటకలోని విజయనగర సామ్రాజ్య కేంద్రమైన హంపి, చాళుక్యుల పాలనా కేంద్రమైన బాదామి, మరో రెండు రోజుల పాటు గోవా సందర్శించాము.ఒక రోజు, రెండు రోజులు చూస్తే తనివి తీరలేదే నా మనసు ఆగలేదే అనిపించి మరోసారి తీరికగా చూసేందుకు రావాలనిపించటంలో దేనికదే సాటిగా వున్నాయి. అందువలన ఎవరైనా కూసింత కలాపోసన చేయాలనుకుంటే ఒక్కొక్క ప్రాంతం, పరిసరాలను రెండు మూడు రోజులైనా చూసేందుకు ఏర్పాట్లు చేసుకోవటం మంచిది.

     హోస్పేట స్టేషన్‌లో దిగగానే పాకేజ్‌లో భాగంగా వచ్చిన వాహనం ఎక్కి కృష్ణా పాలెస్‌ హోటల్‌లో వుపాహారం తిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి 13 కిలోమీటర్ల దూరంలోని హంపి వెళ్లాము. పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక గైడు సాయంతో ముఖ్యమైన కట్టడాలను సందర్శించాము. సూరీడు పెద్దగా తన ప్రతాపాన్ని ప్రదర్శించకుండా మామీద కరుణ చూపించాడు. హంపి అనగానే ‘మంచి మనసులు’ సినిమాలో అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ అంటూ విజయనగర వైభవాన్ని అంధురాలైన తన భార్యకు కళ్లకు కట్టినట్లు చూపిన దృశ్యాన్ని సినిమాలో చూసిన వారందరికీ ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తామా అన్న ఆతురత సహజంగానే వుంటుంది. అయితే నాలోని జర్నలిస్టు దాని కంటే వేరే ఇంకొక దాని కోసం వెతికాడు.

Image result for krishnadevaraya fort,hampi

    విజయనగర సామ్రాజ్యం అనగానే రాయల భువన విజయం, అష్టదిగ్గజాలు గుర్తుకు రాని తెలుగు వారెరుంటారు. ఎంతో వుత్సుకతో, వుగ్గపట్టుకొని తుంగభద్రా నదీ తీరంలో వున్న హింపిలో అడుగు పెట్టగానే అదెక్కడుంది అని గైడ్‌ను అడిగి వచ్చిన సమాధానంతో నీరుగారి పోయా. ప్రారంభంలోనే ఇదేమిటి అనుకోకండి. కృష్ణ దేవరాయ కోట ఇదిగో ఇక్కడ వుండి వుండేది అని ఒక పునాదులున్న ప్రాంతాన్ని మాత్రమే మనం చూడగలం. అది కూడా నిర్ధారితంగా పురావస్తు శాఖ కూడా ప్రకటించలేదు. దానికి అనేక కారణాలు మనకు చెబుతారు. అనేక చారిత్రక కట్టడ ప్రాంతాలలో అక్రమ తవ్వకాల గురించి అనేక వార్తలు చదివిన కారణంగా అవి కూడా నిజమే అనిపించింది. రాయల పాలనలో రతనాలను రాసులుగా పోసి అమ్మినపుడు రాయల వారి కోటలో ఎన్ని నిక్షిప్తమై వుంటాయో అన్న ఆశతో వున్న శిధిలాలను కూడా భావి తరాలకు లేకుండా చేసే అక్రమార్కుల నుంచి రక్షణ కోసం భువన విజయ ప్రాంతాన్ని నిర్ధారించలేదు అన్నది ఒక కారణం. బహుమనీ సుల్తానులు, మొఘలులు సర్వనాశనం చేశారన్నది మరొకటి. అందువలన మనకు ఇప్పుడు అక్కడ ప్రధానంగా కనిపించేది కృష్ణ దేవరాయ తుళువ వంశానికి ముందు పాలించిన సాళువ వంశస్తులు, తుళువ వంశస్తులు నిర్మించిన దేవాలయాలు, ఇతర కట్టడాలు మాత్రమే. వాటిని చూడటం కూడా ఒక మరపురాని అనుభవమే.కుట్రలు, కూహకాలతో రాజ్యాలను చేజిక్కించుకున్న రాజులు చివరకు వాటికే బలైపోయి విజయనగర సామ్రాజ్య పతనానికి దారి తీసిన విషయం చరిత్రలో చదువుకున్నదే.

     ఒకప్పుడు పెద్ద నగరంగా వున్న హంపి ఇప్పుడు ఒక చిన్న గ్రామ పంచాయతీ మాత్రమే. అక్కడ ముందుగా మనకు దర్శనమిచ్చేది పెద్ద వినాయక విగ్రహం.ఆ విగ్రహ వెనుక భాగాన్ని చూస్తే పార్వతీదేవీ బిడ్డను ఒడిలో కూర్చో పెట్టుకున్నట్లు చెక్కారు. ఇక్కడ భక్తి కంటే కళా నైపుణ్యమే ప్రధానం. ఆ నాటికి వున్న కథలన్నీ దేవుళ్ల చుట్టూ తిరిగాయి కనుక శిల్పులు కూడా వాటినే తమ కళా ప్రదర్శనకు వినియోగించుకున్నారని భావించవచ్చు. ఆ రెండు బొమ్మలు దిగువ చూడండి.

dsc02094

dsc02095

    హంపిలో లేదా మరొక రాజ్య కేంద్రాలలో గానీ రాజులు అనుసరించిన లేదా ప్రభావితులైన మతాలకు చెందిన దేవాలయాలను శిల్పకళా చాతుర్యంతో నిర్మింప చేశారు. అందువలన మత అంశాన్ని పక్కన పెట్టి చారిత్రక, శిల్పకళా నైపుణ్యాలను చూడాలి. విజయనగర రాజ్యంలో ఇప్పటికీ శిధిల రూపంలో వున్న జైన మందిరాలు కనిపిస్తాయి. శైవమతానికి ప్రాధాన్యత కనిపిస్తుంది. ఇదే సమయంలో శైవాలయాలలో, వైష్ణవ మత చిహ్నాలు కూడా కనిపించటం హంపి దేవాలయాల ప్రత్యేకత. బౌద్ధ, జైన మతాలను నాశనం చేసిన వీర శైవులు, శైవులు, వైష్ణవులు పరస్పరం దెబ్బలాడుకోవటంతో పాటు వారివురూ రాజీపడినట్లు హంపిదేవాలయాల నిర్మాణం, వాటిలోని అంశాలు వెల్లడిస్తాయి. కృష్ణ దేవరాయలు ఒక మతానికి మాత్రమే పరిమితమైనట్లు మనకు కనిపించదు. అన్ని మతాల వారితో సఖ్యత, ఆదరణ కనిపిస్తుంది. పల్లవ, చోళ రాజుల కాలంలో నిర్మితమైన తిరుమల వెంకటేశ్వర దేవాలయానికి శ్రీకృష్ఱ దేవరాయలు ఎంతో బంగారం, వజ్రాలు, ఇతరంగా దేవాలయ అభివృద్ధికి చేసిన కృషి గురించి తెలిసిందే. అదే దేవరాయలు శ్రీశైలంలోని మల్లన్న శివాలయ నిర్మాణానికి కూడా చేయూత నిచ్చాడు. కర్ణాటక ప్రాంతంలో శివాలయాలు విపరీతంగా కనిపిస్తే అదే రాజ్య పాలనలోని తెలుగు ప్రాంతాలలో అంతగా శివాయాలు, శైవమత ప్రాబల్యం కనపడదు. శ్రీ మహావిష్ణువు తనకు కలలో కనిపించి ఆముక్త మాల్యద రాయమన్నట్లు కృష్ఱ దేవరాయలు చెప్పుకున్నాడు. తన రాజ్య విస్తరణ, సుస్థిరత తప్ప మతోన్మాదం, భాషోదాన్మాదం రాయలలో కనిపించదు.

Image result for hampi jain temple

     దేశంలో అనేక ప్రాంతాలలో మత శక్తులు విజృంభిస్తున్న వర్తమాన పరిస్దితులకు చరిత్రను కూడా జోడించి చూస్తే పరమత సహనం అవసరం గురించి హంపి శిధిలాలు మనకు చెప్పకనే చెబుతాయి. అయితే అక్కడి గైడ్లు చెప్పే అంశాలకే మనం చెవులప్పగిస్తే హిందూ రాజుల విజయనగర రాజ్యాన్ని ముస్లిం బహుమనీసుల్తానులు, మొఘల్స్‌ నాశనం చేసినట్లు మాత్రమే మనకు కనిపిస్తుంది. విజయనగర రాజ్య పతనంలో కృష్ణదేవరాయల అల్లుళ్ల రాజ్య కాంక్ష, ద్రోహం, సుల్తానులతో చేతులు కలిపిన చరిత్రను అంతగా మనకు చెప్పరు. కృష్ణ దేవరాయలు మరణించిన తరువాత అధికారానికి వచ్చిన తమ్ముడు అచ్యుత దేవరాయల మరణం తరువాత ఆయన కుమారుడైన వెంకటరాయలను ఆరునెలల్లోపే హత్య చేస్తారు. తరువాత అచ్యుత రాయల మేనల్లుడు సదాశివరాయలు మైనర్‌ కావటంలో కృష్ట దేవరాయల మేనళ్లుడు ఆరవీడు ఆలియ రామరాయలు, తిరుమల రాయలు అనధికార రాజులుగా చెలామణి అయి సుల్తానులతో చేతులు కలిపి విజయనగర రాజ్య పతనానికి కారకులయ్యారు. అందువల్లనే వారిని కొందరు చరిత్రకారులు విజయనగర పాలకులుగా పరిగణించరు.

    విజయనగర రాజ్యంలో తిరుమలదేవి, చిన్నాదేవి రాణులు నివశించిన కట్టడాల పునాదులు మాత్రమే మనకు దర్శనమిస్తాయి. వాటిపై భవనాలను చెక్కలతో నిర్మించిన కారణంగా శత్రురాజులు దండెత్తినపుడు వాటిని కాల్చివేశారని చెబుతున్నారు. చెక్కలతో కట్టడాలు టిప్పుసుల్తాన్‌ పాలనలో నిర్మించినవి ఇప్పటికీ వున్నందున ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. వారి భవన పునాదులతో పాటు వేసవిలో చల్లదనం కలిగే విధంగా నిర్మించిన లోటస్‌ మహల్‌గా అతిధిగృహంగా చెబుతున్న ఒక భవనం మాత్రం మనకు అలాగే కనిపిస్తుంది. దాని నిర్మాణంలో అరబ్బు శైలి వుండటంతో సుల్తానులు దాన్ని నాశనం చేయకుండా వదలి పెట్టారన్నది ఒక కధనం. ఆ చిత్రాలను దిగువ చూడండి.

Image result for krishnadevaraya ,hampi

    దిగువ కనిపిస్తున్న రధాన్ని చాలా మంది చదువుకోవటం లేదా ప్రచారం కారణంగా ఏకశిలా రధంగా వర్ణిస్తారు. నిజానికి అది అనేక శిలల కూర్పుతో తయారు చేసిన రాతి రధం. దానికి తిరిగే చక్రాలు వున్నాయి. వాటిని తిప్పాలని నేను, తిప్పనివ్వనని మా శ్రీమతి ఎలా ప్రయత్నించామో చూడండి. అదంతా ఫొటో కోసం లెండి.అత్యుత్సాహవంతులైన మా వంటి యాత్రీకులు వద్దన్నా తిప్పటంతో అవి అరిగిపోయి మొదటికే ముప్పు వచ్చే ప్రమాదం తలెత్తటంతో వాటిని సిమెంట్‌తో తిరగకుండా చేశారు.

dsc02174

dsc02180

    విజయనగర రాజ్యాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల వారితో పాటు అరేబియన్లు, పోర్చుగీసు వారు కూడా సందర్శించారు. వారు ఇక్కడ దొరికిన వస్తువులను కొనుగోలు చేయటంతో పాటు, తమ దేశాల నుంచి తెచ్చిన గుర్రాలు, ఇతర వస్తువులను కూడా విక్రయించారు. అందుకే విజయనగర రాజ్యంలో పలు మార్కెట్ల నిర్మాణం జరిగింది. అవన్నీ ఇప్పుడు శిధిలాలుగా కనిపిస్తాయి. ఆ రోజుల్లో అక్కడికి ఎవరెవరు వచ్చిందీ తెలుసుకోవాలంటే అక్కడి దేవాలయాలపై చెక్కిన వారి బొమ్మలే మనకు సజీవ సాక్ష్యాలు. ఈ దిగువ బొమ్మలలో అరబ్బులు, పోర్చుగీసువారు,చైనీయులు, కేరళీయుల చిత్రాలను శిల్పులు చెక్కారు.

dsc02145

     విజయనగరం సంగీత, సాహిత్యాలకే కాదు కోలాటం వంటి గ్రామీణ క్రీడలకు సైతం నిలయంగా వుండేదని దిగువ శిల్ప చిత్రాలు మనకు చెబుతున్నాయి చూడండి.

dsc02152