Image result for BJP election poster in Muzaffarnagar

ఎంకెఆర్‌

    దేశంలో ఏం జరుగుతోందసలు ? కొన్ని రాజకీయ పార్టీల, సంస్ధల ప్రమాదకర పోకడలు ఎటువంటి పర్యవసానాలకు నాంది కాబోతున్నాయి ? అనే ప్రశ్నలు జనాన్ని వుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జనానికి గతంలో జరిగిన పరిణామాలు అంతగా గుర్తుండవనే గట్టి నమ్మకంతోనే అధికారమే పరమార్ధంగా భావించే రాజకీయ వ్యాపారులు ఇలా రెచ్చి పోతున్నారా ? జనానికీ విచక్షణా జ్ఞానం వుంటుంది. తగు సమయంలో తగిన తీర్పు ఇస్తారనే హెచ్చరికను మరిచి పోతున్నారా లేక ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి రాజకీయల లబ్ది పొందే పని గడుపుకు పోదామనే తెలివి తేటలను ప్రదర్శిస్తున్నారా ? ఏం జరుగుతోందసలు ?

     యురి సైనిక కేంద్రంపై దొంగదాడి చేసి 19 మంది నిద్రపోతున్న సైనికుల ప్రాణాలు తీసిన పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులపై దెబ్బకు దెబ్బ తీయాలన్న ఆకాంక్ష దేశంలో డొక్క శుద్ధి వుందనుకున్న ప్రతివారిలో కలిగింది. అందుకు ఏ చర్య తీసుకోవటానికైనా సైన్యానికి కేంద్ర పాలకులు అనుమతిచ్చారన్న వార్తలు వచ్చాయి. ఆ వెంటనే సరిహద్దు కావల వేచి వున్న వుగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామని, అనేక మంది వుగ్రవాదులను మట్టుపెట్టామని స్వయంగా సైనికాధికారులు మీడియా గోష్టి ఏర్పాటు చేసి ప్రకటించారు. దేశమంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చింది. అంతవరకు బాగానే వుంది. ఆ తరువాత నుంచి జరుగుతున్న ఖండన మండనలను చూస్తుంటే ? ఏ జరుగుతోందసలు ?

    తన రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు తద్వారా ప్రకటనలను ఆకర్షించి సొమ్ము చేసుకొనేందుకు టీవీ ఛానల్స్‌ చేయని తప్పుడు పనులు లేవన్నది ఈ పాటికి చాలా మందికి ఏదో ఒక సందర్భంలో అర్ధం అయింది. దానిలో భాగంగానే ప్రతిదాన్ని, ఏమీ లేకపోతే ఏదో ఒక వూహాజనిత అంశాన్ని సంచలనాత్మకంగా మలచి వీక్షకులను ఆకట్టుకొనేందుకు చేస్తున్న సర్కస్‌ ఫీట్ల మాదిరి రాజకీయ పార్టీలు కూడా సైనికుల శవాల నుంచి లబ్ది పొంద చూస్తున్నాయా ? మిగతా పార్టీల కంటే తమది భిన్నమైనది అని చెప్పుకొనే బిజెపి పాలనా కాలంలోనే ఇలా జరగటం ఏమిటి? తమ ‘ఆదర్శం’తో ఇతరులను వేలెత్తి చూపాల్సిన పార్టీ కూడా టీవీ ఛానల్స్‌ మాదిరి త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ఓటర్లలో తన రేటింగ్‌ను పెంచుకొనేందుకు ఇలా ప్రవర్తిస్తోందా ? ఏం జరుగుతోందసలు ?

    ప్రతి పార్టీకి వీర భక్తులు వుంటారన్నది కాదనలేని నిజం. అవి విధానాలను మార్చుకోవచ్చు గాని ఆ భక్తులు మాత్రం మారరు. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అలాంటిదే జనసంఘం నుంచి జనతా పార్టీకి అక్కడి నుంచి బిజెపికి మారటానికి తన కార్యకర్తలకు అనుమతి ఇచ్చింది. ప్రతి సందర్భంలోనూ ఆ పార్టీలకు సంఘటిత శక్తిగా వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ యంత్రాంగం అండగా వుంది, ఏం జరిగినా వెంటనే తన యంత్రాంగాన్ని రంగంలోకి దించుతుంది అన్నది కూడా వాస్తవమే. అలాంటి యంత్రాంగం లేని పార్టీలు సహజంగానే ‘ప్రతి అంశాన్ని రాజకీయంగా వుపయోగించుకోవటంలో ‘ వెనుక పడతాయన్నది కూడా అంగీకరించే అంశమే. అదే ప్రస్తుతం సర్జికల్‌ దాడుల వీడియోల గురించి తలెత్తిన వివాదానికి కారణమా ? ఏం జరుగుతోందసలు ?

   గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని తన రాజకీయ ప్రచారానికి వినియోగించుకొని తరువాత జరిగిన ఎన్నికలలో బిజెపి లబ్ది పొందిందనే అపఖ్యాతి ఇప్పటికే దాని ఖాతాలో వుంది. ఆ కార్గిల్‌ యుద్ధంలో మరణించిన వీర సైనికుల శవాలను తరలించేందుకు అవసరమైన శవపేటికల దిగుమతిలో నాటి ఎన్‌డిఏ మంత్రులు, పార్టీలు గబ్బుపట్టిన విషయం కూడా గుర్తుకు రాక మానదు. ఆ తరువాత దీనితో పాటు గుజరాత్‌ మారణకాండ కూడా తోడై కార్గిల్‌ విజయం ఆవిరై 2004 ఎన్నికలలో బిజెపిని ఇంటి దారి పట్టించిన విషయం తెలిసిందే ఈ పూర్వరంగాన్ని గమనంలో వుంచుకుంటేనే ఎవరికైనా కలిగే సందేహం ఏమిటంటే ఇప్పుడేం జరుగుతోందసలు ?

    1999లో వాజ్‌పేయి ఆపద్ధర్మ ప్రధానిగా వుండగా కార్గిల్‌ యుద్ధం జరిగింది. ఆ తరువాత జనరల్‌ ఎన్నిలు జరిగాయి. కార్గిల్‌ యుద్ధానికి, నేటి సర్జికల్‌ దాడులకు- ఎన్నికలకు లంకె ఏమిటి అని ఎవరైనా అమాయకంగా అడగవచ్చు. కార్గిల్‌ యుద్ధ సమయంలో మన సైనిక దళాల ప్రధాన అధికారిగా జనరల్‌ విపి మాలిక్‌ వున్నారు. పదవీ విరమణ తరువాత కార్గిల్‌: సర్‌ప్రయిజ్‌ టు విక్టరీ( కార్గిల్‌: ఆశ్చర్యం నుంచి విజయం వరకు ) అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. దానిలో పేర్కొన్న అంశాలను బిజెపి ఖండించినట్లు ఎక్కడా నేను చదవలేదు. 1999 ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ తన ఎన్నికల పోస్టర్లలో ముగ్గురు సైనిక దళాల ప్రధాన అధికారుల ఫొటోలను ప్రచురించింది. దీని గురించి వాజ్‌పేయికి ఫిర్యాదు చేయగా మరోసారి జరగకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు మాలిక్‌ తన పుస్తకంలో రాశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు ముఖ్యపాత్రధారులుగా ఏర్పాటు చేసిన సంస్ధలలో ఒకటిగా పరిగణించబడే విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధులు 1999 ఆగస్టు 23న పెద్ద సంఖ్యలో పార్టీ (సంస్ధ కావచ్చు ఆంగ్లంలో పార్టీ అని వుంది) పతాకాలు, మత చిహ్నాలు ధరించి కార్గిల్‌లోని సైనికుల కోసం 20వేల రాఖీలు తీసుకొని సైనికదళాల ప్రధాన కార్యాలయానికి వచ్చారు. వారితో పాటు అరడజను మంది ఫొటో గ్రాఫర్లను కూడా తీసుకువచ్చారు. ఆప్పుడు సైనిక దళాల ప్రధాన అధికారిగా వున్న నన్ను కలవాలని వారు వత్తిడి చేశారు. అనుమతి నిరాకరించటంతో వారు బలవంతంగా మీడియా విభాగ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందికి రాఖీలు అందించి ఆ దృశ్యాలను టీవీ కెమెరాలలో వచ్చేట్లు చూశారు. తరువాత రోజు నుంచి సైనిక దళాల ప్రధాన కార్యాలయంలోకి రాకపోకలను మరింత కట్టుదిట్టం చేశాము.’ అని కూడా మాలిక్‌ రాశారు. అంతే కాదు ఆయనింకా ఇలా రాశారు.’ తక్షణ ఎన్నికల ప్రయోజనాల కోసం యుద్ధాన్ని రాజకీయం చేసేందుకు ఎలాంటి దాపరికం లేకుండా చేసిన ప్రయత్నంలో తమను ఎన్నికల రాజకీయంలోకి లాగటం పట్ల సైనిక దళాలు బాధపడ్డాయి. ఒక దశలో నిరాశతో ‘ మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మమ్మల్ని ఒంటరిగా వుండనివ్వండంటూ’ మీడియా ద్వారా అందరికీ ఒక బలమైన సందేశం పంపాల్సి వచ్చింది’ అని కూడా పేర్కొన్నారు. గత అనుభవాన్ని వర్తమానానికి వర్తింప చేయకుండా ఏ పార్టీ అయినా ఎలా వుంటుంది ? ఈ పూర్వరంగంలో ఇప్పుడేం జరుగుతోందసలు ?

   సెప్టెంబరు 28న జరిపిన సర్జికల్‌ దాడులకు సంబంధించిన వీడియోలను బహిరంగ పరచకూడదని ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగతంగా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు కూడా అదే చెప్పారు. వీడియోలను విడుదల చేయాలని కోరటం దేశ ద్రోహం అన్నట్లుగా మాట్లాడుతున్నారు.ఒక వైపున సర్జికల్‌ దాడుల పర్యవసానంగా అవతలి వైపు నుంచి పాకిస్థాన్‌ దాడులకు తెగబడుతుందేమోనన్న ముందు జాగ్రత్త చర్యగా మన సరిహద్దు గ్రామాలలోని జనాన్ని ఖాళీ చేయించింది కేంద్ర ప్రభుత్వం. వారం రోజుల తరువాత తిరిగి వెనక్కి వెళ్లి పొమ్మని చెప్పిందనుకోండి. మరోవైపున మరోసారి సర్జికల్‌ దాడులు జరిపే ఆలోచనేమీ లేదని మన సైన్యం పాకిస్థాన్‌ సైన్యానికి తెలిపింది. వుత్తర ప్రదేశ్‌లో బిజెపి వేసిన పోస్టర్లలో ప్రధాన మంత్రి, ఇతర బిజెపి నేతల చిత్రాలతో పాటు తుపాకి ధరించిన సైనికుడి బొమ్మ ముద్రించారు. దానిలో ఇలా రాశారు.’ మేము మిమ్మల్ని కచ్చితంగా అంతమొందిస్తాము. అయితే తుపాకి, బుల్లెట్‌, సమయాన్ని మేము నిర్ణయిస్తాము, కేవలం స్ధలం మాత్రమే మీది’ అని పేర్కొన్నారు.బిజెపి, దాని అనుబంధ సంస్ధలు పాకిస్తాన్‌పై కాలుదువ్వటం మాని ప్రత్యర్ధి పార్టీలపై దాడులను ప్రారంభించాయి. ఎందుకిలా జరుగుతోందసలు ?

     వుత్తర ప్రదేశ్‌, వుత్తరా ఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌లలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సర్జికల్‌ దాడుల నేపధ్యంలో తుపాకి ధరించిన సైనికుడి బొమ్మను వుపయోగించి పోస్టర్లు వేయటాన్ని బిజెపి అగ్రనేత వాజ్‌పేయి మాట్లాడగలిగిన స్ధితిలో వుంటే సమర్ధించేవారా ? ఇది ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాదా? 1999 ఎన్నికల సందర్భంగా జరిగిన దానిని మరోసారి పునరావృతం కానివ్వం అని వాజ్‌పేయి చెప్పిన విషయాన్ని రాసిన మాలిక్‌ పుస్తకాన్ని బిజెపి, దాని మాతృసంస్ధ సంఘపరివార్‌ నేతలు చదవలేదా ? వారికెవరికీ తెలియకుండానే పోస్టర్లు వెలిశాయా? గత అనుభవాన్ని చూసిన ఇతర పార్టీలు ఈ పోస్టర్లను ప్రశ్నించటాన్ని, వీడియోల బహిర్గతాన్ని అడగటం రాజకీయమా ? సైన్యాన్ని కించపరచటం అవుతుందా ? అంతే కాదు, సర్జికల్‌ దాడుల గురించి రొమ్ము విరుచుకొని మాట్లాడాల్సిన అవసరం లేదంటూ మంత్రులతో ప్రధాని చెప్పారని అనధికార వార్తలు. వీడియోలను తగుసమయంలో బయటపెడతామని చెప్పిన సమాచార శాఖ మంత్రి వెంకయ్య మరుసటి రోజు మాట మార్చి దాడులకు సంబంధించి రుజువులు చూపమని అడగటం, దాని గురించి చర్చ పొడిగించటం సైన్యానికి అవమానమని, అసలు వాటికి స్పందించాల్సిన అవసరం లేదని తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ మరొకడుగు ముందుకు వేసి ఎలాంటి కోతలు లేని వీడియోలను అక్టోబరు ఒకటవ తేదీన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తనకు చూపించారని, మరుసటి రోజు ఎడిట్‌ చేసిన టేపులను మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ తనకు చూపారని, వాటిని చూసిన తరువాత తాను సంతృప్తి చెందానని, వాటిని బహిరంగ పరచాల్సిన అవసరం లేదని తాను భావించినట్లు ప్రధాన మంత్రికి తెలిపానని వెల్లడించారు. ఆ టేపులపై ఇంత రాద్ధాంతం జరిగినందున కనీసం ప్రతిపక్ష నాయకులకు అయినా చూపి వారిని ఎందుకు సంతృప్తి పరచలేదు ? వారిని విశ్వాసంలోకి తీసుకోవటం లేదా ? జనంలో తలెత్తిన అనుమానాలను ఎలా నివృత్తి చేస్తారు? కేంద్ర మంత్రి కూడా ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకుడే , ఆయనకున్న విశ్వసనీయత, దేశ భక్తి ప్రతిపక్ష నేతలకు లేదనుకుంటున్నారా ? ఏం జరుగుతోందసలు ?

   గమనించాల్సిన, ఆందోళనకరమైన అంశం ఏమంటే సైనికుడి బొమ్మతో ఒక రాజకీయ పార్టీ పోస్టర్‌ వేయటాన్ని ఇంతవరకు సైన్యాధికారులు అభ్యంతర పెట్టలేదు. వివాదం తలెత్తిన తరువాత వాటిని వుపసంహరించుకుంటున్నట్లు బిజెపి కూడా ప్రకటించలేదు. ఎందుకిలా జరుగుతోంది?

   వీర భక్తులకు అసలు భిన్నమైన దృష్టే వుండదు, కనుక వారు ఆ పారవశ్యంలోనే మునిగి వుంటారు, కనుక వారి మానాన వారిని వదిలి వేద్దాం. ఆలోచనా పరులను, ఇదేమిటి ఇలా జరుగుతోంది అనే వారిని దేశద్రోహులుగా ముద్రవేసి నోరు మూయించేందుకు గిల్లితే మాత్రం వారిని సహించనవసరం లేదు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌పై మన సైన్యం జరిపిన సర్జికల్‌ దాడుల సాక్ష్యాల గురించి తలెత్తిన వివాదంతో అసలు సమస్య మరుగున పడిపోయింది. ఎక్కడైనా యుద్ధం లేదా రెండు దేశాల సరిహద్దులలో ఏ కారణం చేతైనా వుద్రిక్త పరిస్థితులు ఏర్పడితే ముందుగా బలయ్యేది సత్యం. అందుకు భారత్‌ -పాకిస్తాన్‌లు మినహాయింపు కాదు. అన్ని దేశాల మిలిటరీలు అనేక ఎత్తుగడలు అనుసరించి ఎదుటి వారిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాయి. అందుకు ఎప్పుడూ యుద్ధాలే చేయనవసరం లేదు. సరిహద్దుల నుంచి వుగ్రవాదులు ప్రవేశించకుండా మరో పఠాన్‌కోట్‌, మరో యురి వుదంతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి జనానికి చెబుతారనుకుంటే చర్చ మరోవైపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ నేతల వాదనలు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఆ పార్టీ నేతలు ప్రారంభించిన వాల్‌ పోస్టర్ల ప్రచారం, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సందేహ నివృత్తి కంటే కొత్తవి తలెత్తుతున్నాయి.

     మిలిటరీ ఎత్తుగడలలో సర్జికల్‌ దాడులు ఒక భాగం. గతనెలాఖరులో జరిగింది మొదటి దాడా, కానే కాదు. గతంలో మన మిలిటరీ అనేక సార్లు వాటిని జరిపింది. గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే తాజా దాడికి స్వయంగా సైనికాధికారులు, అధికార పార్టీ ఎక్కడలేని ప్రచారమిచ్చి దేశ ప్రజలను మొత్తంగా అటువైపు తిప్పింది.http://indianexpress.com/article/india/india-others/army-crossed-border-to-target-militants-in-the-past-too/ గతేడాది మణిపూర్‌లో మయన్మార్‌ కేంద్రంగా వున్న తీవ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది సైనికులు మరణించారు. అప్పుడు ఇంత ప్రచారం లేదు. మరి ఇప్పుడెందుకు ఇంత ప్రచారం ఇచ్చారు ? ఎందుకిలా జరిగింది ?

    అనేక సందర్భాలలో చేసిన సర్జికల్‌ దాడులను సైన్యం అవుననిగానీ కాదని గానీ చెప్పలేదు. యురి దాడికి ప్రతిగా ఆక్రమిత కాశ్మీర్‌లోని కొన్ని వుగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, చొరబాటుకు సిద్ధంగా వున్న అనేక మంది మరణించి వుంటారని తప్ప మన సైన్యాధికారులు నిర్దిష్టంగా చెప్పలేదు.దాడులు, విధ్వంసాన్ని వీడియోలలో చిత్రీకరించామని, అందుకు కొన్ని డ్రోన్‌లను కూడా వుపయోగించామని స్పష్టంగా చెప్పారు. రహస్యంగా చేసిన దాడులకు, బహిరంగంగా చేసిన దాడులకు తేడా వుంటుందని, అందువలన రహస్యంగా చేసిన దాడుల వివరాలను బయట పెడితే మన రహస్యాలు, మన పద్దతులు వెల్లడవుతాయని చెబుతున్నారు. మరి అలాంటపుడు దాడుల గురించి మాత్రమే కాక వీడియోలు తీసినట్లు ఎందుకు చెప్పారు . ఏం జరుగుతోందసలు ?

   సర్జికల్‌ దాడి కూడా రహస్య తరగతికి చెందినదే. ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆ దాడుల గురించి వివరించినపుడు ఎవరూ సాక్ష్యాలు చూపమని అడగలేదు. సర్జికల్‌ దాడులు అవాస్తవమని కేవలం ప్రచారం కోసం భారత్‌ అలా చెబుతున్నదని పాకిస్థాన్‌ ప్రకటించటంతో అసలు సమస్య మొదలైంది. నిత్యం సరిహద్దులలో అనేకం జరుగుతుంటాయి, మిలిటరీలో నిత్యం ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఎవరైనా తప్పు చేసినా వారిపై రహస్య విచారణ జరుగుతుంది తప్ప బహిరంగం కాదు. వాటిని ఎప్పుడూ మీడియాకు వెల్లడించరు. కనుక ఎవరూ ప్రశ్నించరు. పాకిస్తాన్‌ నుంచి వచ్చిన తీవ్రవాదులైనా మయన్మార్‌ లేదా బంగ్లాదేశ్‌, శ్రీలంక నుంచి వచ్చిన తీవ్రవాదులైనా మన సైన్యం, జనంపై దాడి చేస్తే మన స్పందన ఒకే విధంగా వుండాలి. పాక్‌ మినహా మిగతా దేశాలలో తలదాచుకుంటూ దాడులు చేసే వారు మిత్ర వుగ్రవాదులు కాదని గమనించాలి.

    ఈ ఏడాది ఆగస్టు మూడవ వారంలో నాగా తీవ్రవాదులను ఏరి వేయటానికి మన సైన్యం మయన్మార్‌ సరిహద్దులలో ఆవల వున్న వుగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వెనక్కు తిరిగి వచ్చిందన్న వార్తలను సైన్యం నిర్ధారించలేదు. అంగీకరిస్తే మయన్మార్‌తో పేచీ వస్తుంది కనుక సరిహద్దులలోని కొంత మంది తీవ్రవాదులను హతమార్చామని మిగతావారు మయన్మార్‌లోకి పారిపోయారని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.http://www.indiatimes.com/news/india/indian-army-carried-out-a-surgical-strike-against-nscn-militants-reportedly-inside-myanmar-260297.html

    యురి సైనిక స్ధావరంపై జరిగిన దాడిలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవటంతో సహజంగానే దేశ ప్రజలలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అలాంటి తరుణంలో దెబ్బకు దెబ్బ తీయలేదనే భావన కూడా తలెత్తింది. ప్రధానిగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చి తొలి విజయోత్సవాలు జరుపుకున్న తరువాత 2015 జూన్‌ నాలుగవ తేదీన నాగా తీవ్రవాదులు మణిపూర్‌లో సైన్యంపై దాడి చేసి 18 మందిని చంపివేశారు. దానికి ప్రతిగా మన సైన్యం మయన్మార్‌లో ప్రవేశించి నలభై నిమిషాల పాటు చేసిన దాడులలో 38 మంది తీవ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు.http://www.thehindu.com/news/national/myanmar-operation-70-commandos-finish-task-in-40-minutes/article7302348.ece పాక్‌ సరిహద్దులలో వున్న మన సైనికుల మాదిరే ఈశాన్య ప్రాంతంలో వున్న వారు కూడా మన సైనికులే, వారివి కూడా విలువైన ప్రాణాలే, కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ మీడియాలో గాని ఇంత పెద్ద స్పందన రాలేదు. ఈ సందర్భాలలో కూడా దాడుల గురించి మన సైన్యం మయన్మార్‌ సైన్యానికి తెలియ చేసింది. ఎందుకిలా జరుగుతోంది?

    అందువలన సర్జికల్‌ దాడులు మనకు కొత్త కాదు, ఇప్పుడే కనుగొన్నవి అసలే కాదు. ప్రతి దేశ సైన్యానికి వీటి గురించి తెలుసు. ఆఫ్ఘనిస్తాన్‌లో తిష్టవేసిన తాలిబాన్లు నిత్యం పాక్‌ గడ్డపై దాడులు చేయటం తెలిసిందే. తాలిబాన్లను ఎదుర్కొనేందుకు అఫ్ఘనిస్తాన్‌లో తిష్ట వేసిన అమెరికా సైన్యం, పాక్‌ భద్రతా దళాలు తరచూ ఆఫ్ఘన్‌ గడ్డపై సర్జికల్‌ దాడులు జరుపుతూనే వున్నాయి. మన సైన్యం అధికారికంగా చేసిన ప్రకటనలో కూడా పాక్‌ గడ్డపై తిష్ట వేసిన తీవ్రవాదులపై చేసిన దాడులు తప్ప సైన్యం మీద చేసినవని చెప్పలేదు. వుగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారికి కూడా కొంత నష్టం జరిగే అవకాశం వుందని పేర్కొన్నారు. సెప్టెంబరు 29 ప్రకటన తప్ప మరొక అధికారిక ప్రకటన లేదు. నిత్యం ట్వీట్ల మీద ట్వీట్లు చేసే ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు దీని గురించి, చివరికి సైన్యాన్ని అభినందిస్తూ ఒక్క ట్వీట్‌ కూడా చేయలేదని పరిశీలకులు పేర్కొన్నారు.http://www.firstpost.com/india/surgical-strikes-what-exactly-have-the-modi-govt-and-bjp-done-wrong-3038798.html చివరగా ఒక్క మాట. మహాభారత వుత్తర గోగ్రహణం సందర్భంగా గోరక్షణకు బయలు దేరిన వుత్తర కుమారుడిని శత్రువుల తలపాగల కుచ్చులు తెచ్చి పెడితే తన బొమ్మలకు అలంకరించుకుంటానని చెల్లెలు వుత్తర ఒక కోరిక కోరుతుంది. పూర్వం శత్రువులపై సాధించిన విజయానికి సూచికలు లేదా సాక్ష్యాలుగా ఇలాంటి బహుమతులు తెచ్చి ఇచ్చేవారు. కనీసం ప్రతిపక్ష నాయకులకైనా ఎడిట్‌ చేసిన టేపులనైనా చూపి ప్రస్తుతం కొనసాగుతున్న వివాదానికి స్వస్తి పలకటం సమయోచితంగా వుంటుంది. లేకుంటే అది నిత్యం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంటుంది.అలాగే ఏ పక్షమూ కూడా ఈ వుదంతాలను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకోకుండా, సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగకుండా చూడటం ఆరోగ్యకరం.కార్గిల్‌ యుద్ధాన్ని తన ఎన్నికల ప్రయోజనం కోసం వుపయోగించుకున్న చరిత్ర కలిగిన బిజెపి ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేయటం లేదని ప్రతిపక్షాలను కాకపోయినా ప్రజలను నమ్మించేందుకు చర్యలు తీసుకుంటుందా ?